
అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
బహదూర్‌ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు.
కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు.