వేసవి ఎండల తీవ్రతతో అడవుల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు
ఈ సీజన్లో ఇప్పటికే 1,500కు పైగా ప్రమాదాలు
నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం
సాక్షి, హైదరాబాద్ : అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 1,500లకు పైగా అగ్నిప్రమాదాలు రిపోర్ట్ కాగా నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
♦ రాష్ట్రంలోని మూడోవంతు దాకా అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు /ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో (ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా) మూడో వంతు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అగ్ని ప్రమాదా లకు సంబంధించి పదిహేను ఏళ్లుగా సేకరించిన సమాచారం, డేటా ఆధారంగా చేసిన విశ్లేషణల్లో వివిధ అంశాలు వెల్లడయ్యాయి.
♦ తెలంగాణవ్యాప్తంగా మూడువేలకు పైగా ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ప్రతీ ఫారెస్ట్ బీట్‌లో ఫైర్‌బ్లోయర్లు, రేక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్లు వంటివి అందుబాటులో ఉండాలి. అయితే ప్రస్తుతం 550 ఫైర్‌బ్లోయర్లు ఉండగా వాటిలో పదిశాతం వరకు మరమ్మతులు చేయాల్సి ఉందని సమచారం.
♦ వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశమున్న రోజులలో (పీక్ సీజన్‌లో) కేవలం 95 ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిని బట్టి అడవుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు సంబంధించి అధికా రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అటవీశాఖ అధికారులు ఏకీభవించడం లేదు.
♦ ములుగు, అమ్రాబాద్, ఇతర అటవీ ప్రాంతాల్లో కావాలనే అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్న వారిని గురించి వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వాటికి పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు
అత్యధికంగా మానవ తప్పిదాలతోనే ఈ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అయితే ఇవి చిన్న చిన్నవే కావడంతో ఎక్కువ నష్టం జరగకుండా ఆర్పేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ‘ఫారెస్ట్‌ఫైర్స్’ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోందని, ఈ మంటల అదుపునకు వెంటనే చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 21,739 కి.మీ పరిధిలో ఫైర్‌లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకుని 11వేల కి.మీలలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరణ్యభవన్‌లో రాష్ట్రస్థాయిలో ఫైర్ మానిటరింగ్, కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షిస్తూ ,ఫైర్ అలర్ట్స్ కోసం టోల్‌ఫ్రీ నంబరు, వాట్సాప్‌నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అగ్గి ప్రమాదాలకు అవకాశం ఇలా..
♦ రాష్ట్రంలో మొత్తం 53 అటవీ డివజన్లు ఉండగా, వాటిలో 23 దాకా హై–ఫైర్ ప్రోన్‌గా గుర్తించారు
♦ 1,208 ఫారెస్ట్ రేంజ్‌లకు గాను 45 రేంజ్‌లలో హై–ప్రోన్ రేంజేస్‌గా ఉన్నాయి
♦ పదివేల ఫారెస్ట్ కంపార్ట్ మెంట్లు (ఒక్కోటి 250 నుంచి 500 హెక్టార్లు కవర్ చేస్తుంది) ఉన్నాయి
♦ వీటిలో 1,120 కంపార్ట్‌మెంట్ల (హై–ఫైర్ ప్రోన్) దాకా పెద్ద అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు
♦ 1,700లదాకా మధ్యంతరంగా (మీడియం–ఫైర్‌ప్రోన్) అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు
♦ 4,260 దాకా అటవీ సమీప గ్రామాల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం
♦ వీటిలో 1,250లకుపైగానివాస ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చాన్స్.
Comments
Please login to add a commentAdd a comment