సాక్షి, అమరావతి: అడవుల్లో చెలరేగుతున్న మంటలను వెంటనే నియంత్రించడానికి రాష్ట్ర అటవీశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పలుచోట్ల మంటలు చెలరేగాయి. వాటిని అటవీ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన నియంత్రించింది. చిన్న మంటలుగా ఉండగానే పసిగట్టి వాటిని ఆర్పేయడం ద్వారా అటవీ ప్రాంతాలను రక్షించగలిగారు.
సాధారణంగా నవంబర్ నుంచి జూన్ వరకూ అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయి. డిసెంబర్ నుంచి నెమ్మదిగా పెరుగుతూ మార్చి నుంచి మే నెల వరకు ఎక్కువగా అడవులు తగలబడతాయి. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే రాయలసీమ ప్రాంతాలు, నల్లమల అడవుల్లో ఎక్కువగా మంటలను గుర్తించారు. గత నెలలో 5,972 చోట్ల మంటల్ని గుర్తించి ఆర్పేశారు. వైఎస్సార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అత్యధికంగా 1,013 పాయింట్లలో మంటలను నియంత్రించారు.
మంటలకు కారణాలు
వర్షాకాలంలో అడవుల్లో గడ్డి బాగా పెరిగి వేసవి నాటికి అది ఎండిపోతుంది.
ఎండల వల్ల, లేదా అడవుల్లో సంచరించే వ్యక్తులు కాల్చిపడేసే చుట్టలు, బీడీల వల్ల మంటలు చెలరేగుతాయి.
ఇలాంటి మంటలను నియంత్రించడానికి అటవీ శాఖ ఫైర్ లైన్ ఏర్పాటు చేస్తుంది. తద్వారా మంటలు విస్తరించకుండా చూస్తారు.
ఫైర్ ఫైటింగ్ పరికరాల ద్వారా మంటల్ని ఆర్పుతారు.
అడవుల్లో మంటలు చెలరేగకుండా ఉండేందుకు సమీప గ్రామాల్లో అవగాహన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటి వరకు 6,229 ప్రాంతాల్లో మంటలు ఏర్పడినా వెంటనే ఆర్పేశారు.
2022లో 14,452 పాయింట్లలో ఏర్పడిన మంటలను వెంటనే ఆర్పేసి అటవీ ప్రాంతాన్ని రక్షించగలిగారు.
సమాచారం ఇలా..
అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం క్షుణ్ణంగా పరిశీలించే ఎస్‌ఎన్‌పీపీ, మోడిస్ శాటిలైట్లు మంటల పాయింట్లను గుర్తించడానికి సహాయపడుతున్నాయి.
అక్షాంశ, రేఖాంశాలతో సహా మంటల
సమాచారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానిటరింగ్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర అటవీ శాఖకు చేరుతుంది.
మంటల సమాచారం అటవీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఫోన్‌లకు మెసేజ్‌ల రూపంలో వస్తుంది.
రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఫైర్ మానిటరింగ్ సెల్ ఈ సమాచారాన్ని డీఎఫ్‌వోలకు పంపుతుంది.
ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా ఫిబ్రవరిలో మంటలను నియంత్రించగలిగారు.
ఎక్కువ పాయింట్లలో వచ్చినా వెంటనే ఆర్పేశాం
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎక్కువ పాయింట్లలో మంటలు వ్యాపించినా మా సిబ్బంది ద్వారా వెంటనే అదుపు చేశాం. ఆదివారం ఒక్కరోజే 825 పాయింట్లలో మంటలు ఏర్పడినట్లు శాటిలైట్ల నుంచి సమాచారం వచ్చింది. మా శాఖ వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పేసింది. ప్రతి సంవత్సరం పక్కా ప్రణాళికతో అడవుల్లో మంటలు వ్యాపించినా వెంటనే ఆర్పడం ద్వారా అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నాం.
– ఎం రవిశంకర శర్మ, నోడల్ అధికారి, ఫైర్ మానిటరింగ్ సెల్, అటవీ శాఖ
Comments
Please login to add a commentAdd a comment