20 నుంచి 30 ఎకరాల్లో కాలిబూడిదైన వృక్ష సంపద
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎఫ్‌ఓ, నేవీ అధికారులు
పూడూరు: వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయనున్న దామగుండం అటవీ ప్రాంతంలో గురువారంరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 నుంచి 30 ఎకరాల మేర అడవి కాలి బూడిదైంది. ఇది ప్రమాదామా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూడూరు మండల పరిధిలో 2,900 ఎకరాల మేర దామగుండం అటవీ ప్రాంతం ఉంది. ఈ స్థలాన్ని ప్రభుత్వం నేవీ రాడార్ ఏర్పాటుకు కేటాయించగా, ఇటీవల భూమి పూజ చేశారు.
అడవి చుట్టూ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా రాత్రి అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. అడవి సరిహద్దులోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే వందూరుతండా సమీపంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో అగి్నమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చేలోపల దాదాపు 20 నుంచి 30 ఎకరాల అడవి కాలిపోయింది. ఈ ప్రాంతంలో చుట్టు పక్కల రైతులు, కాపరులు తమ పశువులను మేపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా కావాలనే అడవికి నిప్పు పెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాడార్ స్టేషన్ కోసం భూమి పూజ చేసిన స్థలానికి ఎదురుగా వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థల సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వీడియోలను స్థానికంగా ఉండే సత్యానందస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎఫ్‌ఆర్‌ఓ శ్యాంమ్‌కుమార్, నేవీ అధికారి మల్లికార్జునరావు, పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, చన్గోముల్ ఎస్‌ఐ ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. సత్యానందస్వామి ఉంటున్న ఆశ్రమానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment