ములుగు అటవీ ప్రాంతంలో విధ్వంసంపై పరిశీలన షురూ
204 హెక్టార్లలో దాదాపు 70 వేల చెట్లకు నష్టం జరిగినట్టు ప్రాథమిక నివేదిక
బీభత్సానికి కారణంపై వాతావరణ శాఖ, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల ద్వారా విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడంపై అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా.. రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (204కుపైగా హెక్టార్లు)లో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్టుగా ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
ఇందులో నల్లమద్ది, ఏరుమద్ది, తెల్లమద్ది, గుప్పెన, తునికి, టేకు, ఎగిశా, నేరేడు, మారేడు. గుంపెన, బొజ్జ, బూరుగ తదితర 50, 60 రకాల చెట్లు ఉన్నట్టుగా వెల్లడించినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో అంచనా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్టు తెలిసింది. కూలిపోయిన వాటిలో 50 నుంచి 70 ఏళ్లపైబడినవి భారీ వృక్షాల నుంచి ఐదు, పదేళ్ల వయసున్న చిన్న చెట్ల దాకా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
పూర్తి స్థాయిలో చెట్ల లెక్కలు తీస్తూ..
ములుగు జిల్లా మేడారం అడవుల్లో కూలిన చెట్ల లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. 30 హెక్టార్లకు ఒక బృందం చొప్పున పది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉన్నారు.
వారు పూర్తిగా నేలకూలిన, సగానికి విరిగిన, కొమ్మలు విరిగిన చెట్లతోపాటు బాగున్నవాటిని కూడా గుర్తించి.. వాటి కొలతలు నమోదు చేస్తున్నారు. ఏయే రకాల చెట్లు ఎన్ని ఉన్నాయి, కూలినవి ఎన్ని అనేదీ లెక్కతీస్తున్నారు. రెండు రోజుల్లో సవివర నివేదికను సిద్ధం చేసి అటవీశాఖకు అందించనున్నట్టు తెలిసింది.
కారణమేమిటనే దానిపై ఆరా..
కేవలం గంట, అరగంటలోనే అంత పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడానికి కారణాలపై.. వాతావరణశాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ)లను అటవీశాఖ సంప్రదించింది. మెట్రోలాజికల్, శాటిలైట్ డేటాలను విశ్లేషించి.. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది గుర్తించేందుకు ప్రయత్నించనున్నారు.
మరోవైపు గురువారం అరణ్యభవన్ నుంచి జిల్లా అటవీ అధికారులతో పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు తరహాలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా చెట్లకు నష్టం జరిగిందా అన్నది పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
నష్టాన్ని అంచనా వేస్తున్నాం..
సుడిగాలుల కారణంగా అటవీ ప్రాంతానికి, చెట్లకు జరిగిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. దెబ్బతిన్న చోట అటవీ పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. ములుగులో అంత బీభత్సం జరగడానికి కారణాలు, ఇతర అంశాలపై లోతైన అధ్యయనం నిర్వహిస్తాం. – ఏలూసింగ్ మేరూ, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్)
Comments
Please login to add a commentAdd a comment