Forest land
-
టీడీపీ నేత భూమేతకు చెక్!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అటవీ భూములంటే ఆ టీడీపీ నేతకు సొంత ఆస్తి కింద లెక్క. సుమారు పదెకరాలకు పైగా ఆక్రమించేసి ఏకంగా జామాయిలు చెట్లును పెంచాడు. ఇదేమని అడిగిన ఆ శాఖ అధికారులను బెదిరించడం.. చట్టంలో ఉన్న లొసుగులను అనుకూలంగా మార్చుకుని అధికారులను కోర్టులు చుట్టూ తిప్పడం ఆ నేతకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడితని ఆగడాలకు చెక్‌పడడంతో కటకటాలపాలయ్యాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా డక్కిలి మండలం డీఉప్పరపల్లి (గొల్లపల్లి) గ్రామానికి చెందిన పావులూరు భాస్కర్‌నాయుడు టీడీపీ నేతగా చలామణి అవుతున్నాడు. గ్రామంలోని సర్వే నెంబరు 59లో సుమారు పదెకరాలకు పైగా అటవీ భూమిని అక్రమించాడు. అందులో జామాయిల్ మొక్కలను పెంచి ఒక దఫా కటింగ్ చేసి సొమ్ము చేసుకున్నాడు. మళ్లీ గత ఏడాది జూలైలో కటింగ్ చేసేందుకు ఆయన ప్రయత్నించగా అధికారులు అడ్డగించి నోటీసులిచ్చారు. అయితే, వాటిని తీసుకునేందుకు భాస్కర్‌నాయుడు నిరాకరించాడు. మరోవైపు.. ఇదే గ్రామంలో మరికొంతమందితో కలిసి అటవీభూమిని రాత్రిపూట ఆక్రమించి నిమ్మ మొక్కలను సాగుచేశాడు. దీంతో అటవీశాఖ అధికారులు అతనిపై భూ ఆక్రమణ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ, అటవీ శాఖాధికారులు ఈయన సాగుచేస్తున్న భూముల్లో ఇటీవల ఉమ్మడి సర్వే నిర్వహించారు. అవన్నీ అటవీశాఖ పరిధిలోకే వస్తాయని తేల్చి నివేదికను జిల్లా అధికారులకు సమాచారం అందించారు. అదుపులో భాస్కర్‌నాయుడు..దీంతో.. తిరుపతి జిల్లా డీఎఫ్ఓ వికాస్, సబ్ డీఎఫ్ఓ నాగభూషణం ఆదేశాలు మేరకు వెంకటగిరి ఇన్చార్జి రేంజ్ లోకేష్, బాలాయపల్లి డీఆర్వో సుభాషిణి ఆధ్వర్యంలో వెంకటగిరి రేంజ్, టాస్క్‌ఫోర్స్‌కు చెందిన సుమారు 25 మంది శుక్రవారం రాత్రి డీ.ఉప్పరపల్లిలో ఉన్న భాస్కర్‌నాయుడును అదుపులోకి తీసుకుని వెంకటగిరిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతనిపై అటవీశాఖకు సంబంధించిన కేసులు నమోదై ఉండడంతో ప్రస్తుతం అటవీశాఖ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేశారు.2007లోనే అటవీ భూములను రిజిస్ట్రేషన్..నిజానికి.. భాస్కర్‌నాయుడుకు ముందునుంచి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడం.. ఆ భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. 2007లో డీ.ఉప్పరపల్లిలోని 32 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఆ భూములకు సంబంధించి ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు సృష్టించాడు. వాటిని నెల్లూరుకు చెందిన పామూరు నిరంజన్‌రెడ్డి, కృష్ణపట్నం సులోచనలకు తన కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరుతో విక్రయించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది. అంతేగాక.. ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు, తహసీల్దార్ పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫోర్జరీ వంటి విషయాలు వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు డక్కిలి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసు..ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పావులూరు భాస్కర్‌నాయుడు అటవీ భూముల్లో జామాయిల్ చెట్లను నరికి అక్రమంగా తరలించగా.. ఇప్పుడా పార్టీ అధికారంలోకి రాగానే డీ.ఉప్పరపల్లికే చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు బొల్లినేని భాస్కర్‌నాయుడే చెట్లు నరికినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో డక్కిలి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. -
అటవీ భూమిని దున్నేస్తారా.. రెండొందల మొక్కలు నాటండి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ హైదరాబాద్: రెండు ఎకరాల్లో చెట్ల నష్టానికి బాధ్యుడైన పిటిషనర్‌కు హైకోర్టు అరుదైన(బాధ్యతాయుత) శిక్ష విధించింది. ఎకరానికి 100 చొప్పున రెండు ఎకరాల్లో 200 మొక్కలు నాటాలని ఆదేశించింది. ఈ మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సూర్యా పేట డీఎఫ్‌ఓకు స్పష్టం చేసింది. ఆర్డర్ కాపీ అందిన నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పిటిషనర్‌కు తెలి్చచెప్పింది. మొక్కలు నాటేందుకు న్యాయస్థానం విధించిన ఆదేశాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.అయితే, చెట్ల నష్టం కలిగిందని చెబుతున్న కంపార్ట్మెంట్ నం.441ని గుర్తించేందుకు పిటిషనర్‌కు సాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని కోరగా.. అందుకు కోర్టు సమ్మతించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని అటవీ అధికారులను ఆదేశిస్తూ, విచారణ సెపె్టంబర్ 6కు వాయిదా వేసింది. మంచిర్యాలజిల్లా నెన్నెల మండలం నాగారానికి చెందిన మాదె మల్లేశ్ వ్యవసాయదారుడు.కుశెనపల్లి రేంజ్ కంపార్ట్మెంట్ నంబర్ 441లోని అటవీప్రాంతంలో అక్రమంగా ట్రాక్టర్‌తో భూమిని దున్ని చెట్లు తొలగించారన్న లింగాల సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు 2024, జూలై 1న మల్లేశ్, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. మధ్యవర్తి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అధికారులు అదే రోజు ట్రాక్టర్‌ను సీజ్ చేసి బెల్లంపల్లిలోని కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు.అటవీ భూమి ఆక్రమణకు యత్నించారుసీజ్ చేసిన తన ట్రాక్టర్‌ను తిరిగి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదె మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పిటిషనర్ ఎలాంటి తప్పు చేయలేదని, భూమి దున్న డానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యవసాయ పనుల నిమి త్తం ట్రాక్టర్‌ను మరో ఇద్దరి(ఏ–1, ఏ–2)కి అద్దెకు మాత్రమే ఇచ్చారని మల్లేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అలవాటైన నేరస్తుడని, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని, వాటిపై ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోందని చెప్పారు. పిటిషనర్‌తోపాటు మరికొందరు బృందంగా ఏర్పడి తరచూ అటవీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రాక్టర్ విడుదలకు గతంలో ఇదే కోర్టు ఇచి్చన ఉత్తర్వులను పాటించాలన్నారు. రూ.50 వేల బాండ్‌తోపాటు ఇద్దరు పూచీకత్తు సమరి్పంచాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ ట్రాక్టర్‌ను అమ్మడంగాని, వేరొకరి పేరు మీదకు మార్చడంగాని చేయనని అఫిడవిట్ ఇవ్వాలని.. అధికారులు ఆదేశించినప్పుడు ట్రాక్టర్ వారి వద్దకు తీసుకురావాలని.. ఈ ఉత్తర్వుల కాపీ అందిన నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. అనంతరం ట్రాక్టర్‌ను విడుదల చేయాలని అధికారులకు చెప్పారు. చెట్లకు నష్టం కలిగించినందుకు.. అదే అటవీ ప్రాంతంలో 200 మొక్క లు నాటాలని పిటిషనర్‌కు తేలి్చచెప్పారు.కాగా, స్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప అటవీశాఖ మొక్కలు సరఫరా చేయదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మొక్కలు సరఫరా చేయాలని సూర్యాపేట డీఎఫ్ఓను ఆదేశించారు. నెలరోజుల్లో మొక్కలు నాటి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. పిటిషనర్ మాదె మల్లేశ్ కోర్టు తీర్పుపై ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎకరం భూమి దున్నితే రూ.2వేలు వస్తాయని కిరాయి(అద్దె)కి ట్రాక్టర్‌ను ఇస్తే, తనకు ఊహించని వి«ధంగా తీర్పు వచి్చందన్నారు. మరోవైపు జిల్లా అటవీ అధికారులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. -
పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏళ్ళుగా పోడు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ భరోసానిచ్చారు. అయితే చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆ«దీనంలోకి తీసుకున్నట్లయితే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచి్చన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమరి్పంచాలని అటవీశాఖ ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు. పోడు సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, దాడులకు దిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. పోడు సమస్యకు పరిష్కారం వెదకాలని సీతక్క పలుమార్లు చెప్పగా, అదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావిస్తూ ఏళ్ళుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశాన్ని ప్రాథమిక సమావేశంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.ఛత్తీస్‌గఢ్ నుంచి వలసలను నివారించండి ఛత్తీసగఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనికి మంత్రులు స్పందిస్తూ, ‘‘పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచి్చతమైన మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి’’అని అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనులు కొనసాగించండి: సీతక్క అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో... ఈ దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి పోడు భూముల సమస్యపై పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు.అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రయోజనాలను కలిగించాలని ఆమె కోరారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్ల సాగు వంటి చర్యల ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగించవచ్చని సురేఖ అధికారులకు సూచించారు. -
ఉదయగిరి దుర్గం: క్యాన్సర్‌ను సైతం నయం చేసే ఔషధ మొక్కలు!
రూపంలో శేషాచలం కొండలను పోలి ఉండే ఉదయగిరి దుర్గం ఆయుర్వేద వనమూలికలకు నిలయం. అపార ఆయుర్వేద సంపదకు నెలవైన ఈ దుర్గం ఎంతో ప్రాశస్త్యం పొందినది. నల్లమల, వెలిగొండ, శ్రీశైలం అడవుల్లో లభించని అరుదైన అనేక రకాల ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు ఆయుర్వేద పరిశోధకులు గుర్తించారు. ఈ వనమూలికలు ఆయుర్వేద వైద్యానికి ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయగిరి: సముద్ర మట్టానికి 938 మీటర్ల ఎత్తులో గల ఉదయగిరి దుర్గం సంజీవకొండగా ప్రసిద్ధి పొందినదని స్థానికులు చెబుతుంటారు. ఈ దుర్గంపై ఆయుర్వేద మొక్కలకు కొదువలేదు. ప్రాచీన వైద్యవిధానాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆయుర్వేద వైద్యంతో ఎన్నో రోగాలు నయమైనట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అందుకే రాజుల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు వైద్యులకు కూడా అంతుచిక్కని అనేక రోగాలు ఆయుర్వేద వైద్యం ద్వారా నయమవుతున్నాయి. ఈ వైద్యానికి అవసరమైన ఎంతో విలువైన వనమూలికలు ఉదయగిరి దుర్గంపై ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఈ వైద్యానికి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యమిస్తూ విలువైన ఆయుర్వేద మందులను తయారు చేస్తూ వైద్యశాలలకు సరఫరా చేస్తోంది. ఆయుర్వేద వైద్యశాలల్లో బెడ్లు కూడా ఏర్పాటు చేసి పసుర్లు, తైలాలతో ప్రాచీన వైద్యసేవలు అందిస్తోంది. దీంతో ఈ వైద్యానికి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయి. పరిశోధనలు ఆయుర్వేద సంస్థల ప్రతినిధులు 30 ఏళ్ల క్రితమే ఉదయగిరి దుర్గాన్ని సందర్శించి అనేక ఔషధ మొక్కలను సేకరించారు. అనేక వనమూలికా మొక్కలపై పరిశోధనలు చేశారు. కర్ణాటకకు చెందిన ఆయుర్వేద డాక్టర్ అయ్యంగార్, నెల్లూరుకు చెందిన పి.చెంచలరావు పంతులు ఇక్కడి అడవుల్లో మొక్కలు సేకరించి తమ ఆయుర్వేద చికిత్సాలయాల్లో వినియోగించారని తెలుస్తోంది. ఇప్పటికీ స్థానికంగా ఉన్న అనేక మంది ఆయుర్వేద వైద్యులు కొండల్లో లభించే వనమూలికలను వైద్యానికి ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే గుర్తింపు ఉదయగిరి అడవులు, కొండల్లో ఉండే ఔషధ సంపద బ్రిటిష్ పాలకులే గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వనమూలికలపై వారు అనేక పరిశోధనలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఉదయగిరిలో ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి వైద్యసేవలను కూడా అందించారు. మాదాల జానకిరామ్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయుర్వేద ఫార్మసీ ఏర్పాటుకు ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చలేదు. అటవీశాఖ ఆధ్వర్యంలో దుర్గంపల్లి పరిసర ప్రాంతాల్లో వనమూలికల మొక్కల సంరక్షణ కోసం కంచె కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితం లేదు. ఉదయగిరి దుర్గంలో ఉన్న అపారమైన వనమూలికా సంపదను సక్రమంగా వినియోగించుకోనేందుకు ఉదయగిరిలో ఆయుర్వేద కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అపార సంపద ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే వనమూలికలు ఉదయగిరి అడవుల్లో, కొండల్లో, దుర్గంపై అపారంగా ఉన్నాయని తెలుస్తోంది. వైఎస్సార్ కడప, ప్రకాశం, శ్రీపొటి శ్రీరాములు నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న ఉదయగిరి, సిద్ధేశ్వరం, భైరవకోన అడవులు, కొండలు, కోనలు, గుట్టల్లో 162 రకాలకు పైగా ఔషధ మొక్కలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉదరకోశ వ్యాధులు, పక్షవాతం, కామెర్లు, పైత్యం, పోలియో తదితర వ్యాధులను నయం చేసే వనమూలికలు ఈ ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. దీర్ఘకాలిక క్యాన్సర్‌ను సైతం నయం చేసే ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు పలువురు పరిశోధకులు పేర్కొన్నారు. -
అడవివరంలో 20 ఎకరాలపై కన్నేసిన కబ్జాదారులు
సాక్షి, విశాఖపట్నం : అది సింహాచలం దేవస్థానానికి చెందిన అటవీ ప్రాంతం.. తాము అక్కడ నివాసముంటున్నామని పలువురు.. ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చిన రిపోర్టుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అఫిడవిట్ చూసిన జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ నివాసం కాదు.. పూర్తి చెట్లతో నిండిన అడవి ఉందని గుర్తించారు. రూ.కోట్ల భూమిని కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడకు సహకరించిన ప్రభుత్వాధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో 20.39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించడంతో పాటు అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నేపథ్యంలో రెవెన్యూ రికార్డులో తమ పేరుతో మార్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని బి.మంగతల్లితో పాటు మరో ఆరుగురు హైకోర్టులో రిట్‌పిటిషన్ వేశారు. పిటిషనర్ దరఖాస్తుపై నెల రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశాఖ రూరల్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే విభాగం అధికారులు సదరు భూమికి సర్వే నిర్వహించారు. 1903 సేల్ ప్రకారం అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో ఉన్న 20.39 ఎకరాల భూమి మంగతల్లి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని, వారు పొజిషన్లు ఉన్నారని నిర్ధారిస్తూ నివేదిక సమర్పించారు. సర్వే అధికారుల నివేదిక ఆధారంగా ఆ భూమి తమదేనని, సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మరోసారి మంగతల్లి మరో ఆరుగురు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్టాటస్ కో ఇచ్చింది. సర్వే నివేదిక తప్పంటూ దేవస్థానం పిటిషన్ సర్వే విభాగం ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారులు 2021, అక్టోబర్ 20న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. సదరు నివేదిక సక్రమంగా లేదని, సర్వే నెంబర్ 275లో మొత్తం 5,279.57 ఎకరాల భూమి దేవస్థానం పరిధిలోనే ఉందని, ఈ సర్వే నంబర్‌కు సంబంధించి ఎలాంటి సబ్ డివిజన్లు లేవని పిటిషన్లో స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ విస్తీర్ణం మొత్తం 22ఏ జాబితాలో చేర్చడం జరిగిందని, ఆ భూమిలో దేవస్థానం కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా ఉందని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్.. జాయింట్ సర్వే బృందానికి, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అప్పుడే సర్వే బృందం అవకతవకలు బయటపడ్డాయి. స్వయంగా పరిశీలించిన జేసీ 2021లో సర్వే చేసిన విశాఖ రూరల్ మండలం అప్పటి సర్వేయర్, ప్రస్తుత గోపాలపట్నం సర్వేయర్ డి.జగదీశ్వరరావు, సింహాచలం దేవస్థానం అప్పటి సర్వేయర్ కె.హరీష్‌కుమార్, అప్పటి గోపాలపట్నం సర్వేయర్, ప్రస్తుతం యలమంచిలి సర్వేయర్ సత్యనారాయణ, డీఐవోఎస్ కె.వేణుగోపాల్‌ను అధికారులు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది మే 15న భీమిలి ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, సింహాచలం దేవస్థానం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఇతర అధికారులతో కలిసి జేసీ కేఎస్ విశ్వనాథన్ స్వయంగా ఆ భూమిని పరిశీలించి విస్తుపోయారు. పిటిషన్ వేసిన వారి భూ పత్రాల్లో సదరు భూమి గోపాలపట్నం మండలం మాధవధారలో ఉంది. కానీ వారు చూపిస్తున్న భూమి, వారి డాక్యుమెంట్లో ఉన్న భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. దీని ప్రకారం సర్వే నెంబర్ 275లో ఉన్న భూమి సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉందని గుర్తించారు. ఆ భూమిలోనే పొజిషన్లో ఉన్నట్లు సర్వేయర్లు ఇచ్చిన నివేదిక తప్పు అని బట్టబయలైంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న సర్వే ఏడీ విజయ్‌కుమార్, డీఐవోఎస్ వేణుగోపాల్, ముగ్గురు సర్వేయర్లపై క్రమశిక్షణ చర్యలకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిని సింహాచలం దేవస్థానానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
అటవీ సంరక్షణ ఇలాగేనా!
‘నేను అరణ్యంలో సంచరించివచ్చిన ప్రతిసారీ ఆ వృక్షాలకు మించి ఎంతో ఎత్తుకెదిగిన భావన నన్ను చుట్టుముడుతుంది’ అంటాడు అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు హెన్రీ డేవిడ్ థోరో. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, మన కళ్లముందే చిన్నబోతున్న పర్యావరణానికి జీవం పోయడానికి అడవులు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో అతి ముఖ్యమైన అటవీ సంరక్షణ (సవరణ) బిల్లు ఆమోదం పొందటం ఆందోళన కలిగి స్తుంది. నాలుగు దశాబ్దాల క్రితం...అంటే 1980లో ఆమోదం పొందిన అటవీ సంరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. బిల్లు ప్రారంభంలోని లక్ష్య ప్రకటన ఎంతో ఉదాత్తమైనది. భూమండలం వేడెక్కి, పర్యావరణం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్న వర్తమా నంలో అడవుల విస్తరణ అత్యవసరమని ఆ ప్రకటన తెలిపింది. 2030 నాటికల్లా అదనంగా దాదాపు మూడువందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని పారిస్ ఒడంబడికలో మన దేశం హామీ ఇచ్చిన సంగతిని కూడా ప్రస్తావించింది. ఇవి సాధించాలంటే అటవీ విస్తరణ, అడవులపై ఆధారపడిన వర్గాల జీవికను మెరుగుపరచటం అవసరమని బిల్లు సరిగానే గుర్తించింది. కానీ అటు తర్వాత ప్రతిపాదించిన సవరణలన్నీ అందుకనుగుణంగా లేవు. మణిపుర్లో దుండగులు సాగించిన అత్యంత అమానవీయ దురంతాలపై విపక్షాలు ఆగ్రహోదగ్రమై చర్చకు పట్టుబట్టిన పర్యవసానంగా పార్లమెంటు స్తంభించిపోవటంతో ఈ సవరణ బిల్లు బుధవారం మూజువాణి ఓటుతో గట్టెక్కింది. ఈమధ్యకాలంలో అత్యంత ప్రాధాన్యతగల ఫైనాన్స్ బిల్లులే ఆ దోవన ఆమోదం పొందిన సందర్భా లుంటున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది గనుక అది తప్పనిసరి కూడా కావొచ్చు. కానీ అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లుకు అంత తొందరేమొచ్చింది? దేశంలో 1980లో అటవీ సంరక్షణ చట్టం ఎందుకు తీసుకురావాల్సివచ్చిందో గుర్తుచేసుకోవాలి. అంతకుముందు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలు ఎడాపెడా అడవుల నరికివేతకు అనుమతి చ్చిన పర్యవసానంగా 42 లక్షల హెక్టార్ల అడవులు కోల్పోయామని గ్రహించిన తర్వాత ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. నిజానికి ఆ చట్టం తీసుకొచ్చేనాటికి పర్యావరణంపై ఇప్పుడున్నంత చైతన్యం లేదు. 1985 తర్వాతే అంతర్జాతీయంగా కూడా పర్యావరణ స్పృహ పెరిగింది. ఒకరకంగా అటవీ సంరక్షణ చట్టం అత్యంత కఠినమైనది. అందువల్లే ఆ చట్టం వచ్చాక ఈ నాలుగు దశాబ్దాల్లో కోల్పోయిన అటవీ భూములు 15 లక్షల హెక్టార్ల లోపే. మన భూభాగంలో కేవలం 21 శాతం మాత్రమే అడవులు న్నాయి. అందులో దట్టమైన అరణ్యాలున్న ప్రాంతం కేవలం 12.37 శాతం. ఈ దట్టమైన అడవులు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోనే ఉన్నాయి. వీటిని ప్రాణప్రదంగా కాపాడుకోవటం, వీలైనంతమేరకు విస్తరించటం ధ్యేయం కావలసిన సందర్భంలో తీసుకొచ్చిన సవరణ బిల్లు అందుకనుగుణంగా లేదు. ప్రభుత్వ రికార్డుల్లో అడవులుగా నమోదైన భూములన్నీ అటవీ భూములకిందికే వస్తాయని 1980 చట్టం చెబుతుండగా, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాన్ని మరింత విస్తరించింది. నిఘంటు అర్థాన్ని సంతుష్టి పరిచేలా ఉండే భూములు సైతం ఆ చట్టం పరిధిలోకొస్తాయని తెలిపింది. తాజా బిల్లు దాన్ని పూర్తిగా మారుస్తోంది. 1980 లేదా ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదైవున్న భూములకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని చెబుతోంది. నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో శతాబ్దాలుగా అడవులుగానే ఉంటున్నా ఇప్పటికీ ప్రభుత్వ రికార్డులకెక్కని భూములున్నాయి. ముఖ్యంగా గడ్డి భూములు, మడ అడవుల వంటి వాటికి అడవులుగా గుర్తింపులేదు. వాటికి అటవీ సంరక్షణ చట్టం వర్తించదని చెబితే ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు. దేశంలోని అటవీ భూముల్లో 15 శాతం ప్రాంతానికి ఈ సవరణ వల్ల కీడు జరుగుతుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. తాజా బిల్లు దేశభద్రతను ప్రస్తావించి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన అధీన రేఖ, వాస్తవాధీన రేఖ వంటి చోట్ల వంద కిలోమీటర్ల పరిధిలో అటవీభూములుంటే వ్యూహాత్మక అవసరాల కోసం ఆ భూములను ముందస్తు అనుమతి లేకుండానే తీసుకోవచ్చన్న సవరణను ప్రతిపాదించింది. అధీన రేఖ, వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంతాలు పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన హిమాలయ సానువుల్లో ఉన్నాయి. అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగితే అదెంత ప్రమాదమో వేరే చెప్పనవసరం లేదు. అలాగే తీవ్రవాద కార్యకలాపాల ప్రాంతాలకూ ఈ మాదిరి మినహాయింపే ఉంది. దేశ రక్షణ, భద్రత అత్యంత కీలకమైనవే. వాటినెవరూ కాదనరు. కానీ అందుకు పర్యావరణాన్ని పణంగా పెట్టడం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో మరిచిపోకూడదు. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పర్చటానికి అవరోధాలుంటున్న మాట వాస్తవం. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. కానీ పర్యావరణ హాని, అందువల్ల కలిగే విలయంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోనిది కాదు. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి పరిణామాలైనా, ప్రస్తుతం దేశమంతా ముంచెత్తుతున్న వరదలను చూసినా అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యత పరిరక్షణ ఎంత ప్రాణప్రదమో అర్థమవుతుంది. కనుక అవసరా లకూ, ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పుకూ మధ్య సమతూకం ఉండేలా మరింత మెరుగైన ప్రతి పాదనలుండాలి. పార్లమెంటు ఉభయ సభల్లో లోతైన చర్చలు జరిగితే ఇలాంటి సమస్యలు ప్రస్తావనకొచ్చి దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేకపోవటం విచారకరం. -
పులులు గర్జిస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: మన జాతీయ జంతువు పులిని సంరక్షించేందుకు ‘ప్రాజెక్టు టైగర్’ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. అంతరించిపోతున్న పులులను సంరక్షించేందుకు 1973 ఏప్రిల్ 1న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. 9 వేల చదరపు కిలోమీటర్లలో ఉన్న 9 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లతో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు 18 రాష్ట్రాల పరిధిలోని 75 వేల చదరపు కిలోమీటర్లలో 53 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లకు విస్తరించింది. 1973లో జరిగిన మొదటి పులుల గణనలో 1,827 పులులు ఉండగా.. 2018 గణన ప్రకారం ఆ సంఖ్య 2,967కి పెరిగింది. ప్రపంచంలోని ఉన్న మొత్తం పులుల సంఖ్యలో ఇప్పుడు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. టైగర్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. పూర్వం 2 లక్షల పైనే ఉండేవి జీవ వైవిధ్యంలో ఎంతో కీలకమైన పులుల జీవనానికి మన దేశం అత్యంత అనుకూలంగా ఉండేది. చాలా ఏళ్ల క్రితం దేశంలో 2 లక్షలకు పైగా పులులు ఉండేవి. కానీ.. చక్రవర్తులు, రాజులు పులుల్ని వేటాడటాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట అత్యంత క్రూరంగా సాగింది. ఒక్కో రాజు పదులు, వందల సంఖ్యలో పులుల్ని చంపి.. తాము గొప్ప వీరులమని ప్రచారం చేసుకునేవారు. బ్రిటిష్ హయాంలోనూ వాటి వేట ఇష్టారాజ్యంగా కొనసాగింది. బ్రిటీషర్ల కాలంలోనే సాగు భూమి కోసం అడవుల్ని ఆక్రమించడంతో పులుల సంఖ్య తగ్గిపోయింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 40 వేల పులులు మాత్రమే మిగిలినట్టు అంచనా. పులి అవయవాలన్నింటికీ డిమాండ్ ఉండటంతో ఆ తర్వాత కూడా వేట కొనసాగింది. ఫలితంగా క్రమేపీ అవి అంతరించే దశకు చేరుకున్నాయి. వన్యప్రాణుల చట్టం రక్షించింది 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టం రావడం.. పర్యావరణంలో పులుల పాత్ర చాలా ముఖ్యమని భావించడంతో వాటి సంరక్షణకు బీజం పడింది. ఆ నేపథ్యంలోనే 1973లో ప్రాజెక్టు టైగర్ ఏర్పాటైంది. 1990వ దశకంలో పులుల ఆవాసాల సంరక్షణ ఇబ్బందిగా మారింది. 1993 నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతచేసినా పులుల సంఖ్య పెరగలేదు. 2006 నాటికి దేశంలో పులులు సంఖ్య 1411కి పడిపోయింది. ఇలాగే వదిలేస్తే పులులు అంతరించే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్రం పులుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టడంతోపాటు సంరక్షణ విధానాన్ని కూడా మార్చింది. వాటి ఆవాసాలను సంరక్షించడంతోపాటు వేటను చాలావరకు నియంత్రించింది. ఫలితంగా అంతరిస్తున్న పులుల సంఖ్య నెమ్మదిగా పెరిగి కొన్నేళ్లుగా స్థిరంగా ఉంటోంది. 1973లో టైగర్ ప్రాజెక్టు బడ్జెట్ రూ.4 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.500 కోట్లు. ఇంతచేసినా రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వులో పులులు పూర్తిగా అంతరించిపోయాయి. కానీ.. మిగిలిన రిజర్వు ఫారెస్ట్‌లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2,967కి చేరింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ నెల 9న ప్రధాని మోదీ మైసూరులో 2022 పులుల గణన వివరాలను విడుదల చేయనున్నారు. ఈ గణనలో పులుల సంఖ్య పెరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి. (చదవండి: జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల) -
కార్చిచ్చుకు పక్కా స్పాట్
సాక్షి, అమరావతి: అడవుల్లో చెలరేగుతున్న మంటలను వెంటనే నియంత్రించడానికి రాష్ట్ర అటవీశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పలుచోట్ల మంటలు చెలరేగాయి. వాటిని అటవీ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన నియంత్రించింది. చిన్న మంటలుగా ఉండగానే పసిగట్టి వాటిని ఆర్పేయడం ద్వారా అటవీ ప్రాంతాలను రక్షించగలిగారు. సాధారణంగా నవంబర్ నుంచి జూన్ వరకూ అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయి. డిసెంబర్ నుంచి నెమ్మదిగా పెరుగుతూ మార్చి నుంచి మే నెల వరకు ఎక్కువగా అడవులు తగలబడతాయి. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే రాయలసీమ ప్రాంతాలు, నల్లమల అడవుల్లో ఎక్కువగా మంటలను గుర్తించారు. గత నెలలో 5,972 చోట్ల మంటల్ని గుర్తించి ఆర్పేశారు. వైఎస్సార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అత్యధికంగా 1,013 పాయింట్లలో మంటలను నియంత్రించారు. మంటలకు కారణాలు వర్షాకాలంలో అడవుల్లో గడ్డి బాగా పెరిగి వేసవి నాటికి అది ఎండిపోతుంది. ఎండల వల్ల, లేదా అడవుల్లో సంచరించే వ్యక్తులు కాల్చిపడేసే చుట్టలు, బీడీల వల్ల మంటలు చెలరేగుతాయి. ఇలాంటి మంటలను నియంత్రించడానికి అటవీ శాఖ ఫైర్ లైన్ ఏర్పాటు చేస్తుంది. తద్వారా మంటలు విస్తరించకుండా చూస్తారు. ఫైర్ ఫైటింగ్ పరికరాల ద్వారా మంటల్ని ఆర్పుతారు. అడవుల్లో మంటలు చెలరేగకుండా ఉండేందుకు సమీప గ్రామాల్లో అవగాహన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటి వరకు 6,229 ప్రాంతాల్లో మంటలు ఏర్పడినా వెంటనే ఆర్పేశారు. 2022లో 14,452 పాయింట్లలో ఏర్పడిన మంటలను వెంటనే ఆర్పేసి అటవీ ప్రాంతాన్ని రక్షించగలిగారు. సమాచారం ఇలా.. అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం క్షుణ్ణంగా పరిశీలించే ఎస్ఎన్పీపీ, మోడిస్ శాటిలైట్లు మంటల పాయింట్లను గుర్తించడానికి సహాయపడుతున్నాయి. అక్షాంశ, రేఖాంశాలతో సహా మంటల సమాచారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానిటరింగ్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర అటవీ శాఖకు చేరుతుంది. మంటల సమాచారం అటవీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఫోన్లకు మెసేజ్‌ల రూపంలో వస్తుంది. రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఫైర్ మానిటరింగ్ సెల్ ఈ సమాచారాన్ని డీఎఫ్‌వోలకు పంపుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా ఫిబ్రవరిలో మంటలను నియంత్రించగలిగారు. ఎక్కువ పాయింట్లలో వచ్చినా వెంటనే ఆర్పేశాం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎక్కువ పాయింట్లలో మంటలు వ్యాపించినా మా సిబ్బంది ద్వారా వెంటనే అదుపు చేశాం. ఆదివారం ఒక్కరోజే 825 పాయింట్లలో మంటలు ఏర్పడినట్లు శాటిలైట్ల నుంచి సమాచారం వచ్చింది. మా శాఖ వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పేసింది. ప్రతి సంవత్సరం పక్కా ప్రణాళికతో అడవుల్లో మంటలు వ్యాపించినా వెంటనే ఆర్పడం ద్వారా అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నాం. – ఎం రవిశంకర శర్మ, నోడల్ అధికారి, ఫైర్ మానిటరింగ్ సెల్, అటవీ శాఖ -
మనిషికి, మృగానికి మధ్య పెరుగుతున్న ఘర్షణలు
కంచర్ల యాదగిరిరెడ్డి దేశంలో ఒక పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. మరోపక్క పోడు వ్యవసాయం, ఇతరత్రా కారణాలతో అటవీ ప్రాంతం కుంచించుకుపోవడం కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మనిషికీ, వన్య మృగానికీ మధ్య ఘర్షణకు దారితీస్తోంది. పులులు అడవులను దాటి సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. పదేళ్లలో 100% పెరుగుదల దేశంలో గత పదేళ్ల కాలంలో చిరుతలు, పెద్ద పులుల సంఖ్య అనూహ్యంగా 100 శాతం పెరిగిందని తాజాగా చేపట్టిన గణన ద్వారా వెల్లడైంది. దాదాపు నాలుగు వేల మంది అటవీ శాఖ సిబ్బంది 54 టైగర్ రిజర్వు ప్రాంతాల్లోని 14,500 చదరపు కి.మీ. మేర అడవుల్ని గాలించి మరీ 4,500 పైచిలుకు పెద్ద పులులు, 2,300 చిరుతలు ఉన్నాయని లెక్క తేల్చారు. దేశంలో మిజోరం మినహా అన్ని రాష్ట్రాల్లో పులుల జాడ కనిపించడం విశేషం. వన్యమృగ సంరక్షణ చరిత్రలో ఇది గుర్తుంచుకోదగిన విశేషమని కజిరంగ నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రమేశ్ గగోయ్ అన్నారు. ప్రస్తుతం అక్కడ అనేక రకాల వందల కొద్దీ జంతువులతో పాటు 125కు పైగా పులులు ఉన్నాయి. పులుల సంఖ్య పెరగడం శుభసూచకమే అయినా మనుషులకు, మృగాలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణ దేశంలో కొన్నిచోట్ల రక్తసిక్తం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పులుల దాడుల నేపథ్యంలో వాటి నుంచి రక్షణ కోసం ఒకరకంగా యుద్ధమే చేయాల్సి వస్తోంది. గత ఏడాది మనుషులకు, వన్య మృగాలకు మధ్య ఘర్షణలకు సంబంధించిన ఘటనలు దాదాపు 500కు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 33,309 హెక్టార్లకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం పెద్ద పులులకు ఆవాసంగా మారింది. ఆ ప్రమాదకరమైన ప్రదేశాలకు ప్రజలను దూరంగా ఉంచడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో మనిషి రక్తం మరిగిన ఓ పులి మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో నెల వ్యవధిలోనే 8 మందిని చంపి తిని కనిపించకుండా పోయిన ఘటన ఆ రాష్ట్ర అధికారయంత్రాంగానికి నిద్ర లేకుండా చేసింది. మరో పులి చంద్రాపూర్ జిల్లాలో ఆరుగురిని బలితీసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఇటీవల పులి ఐదుగురిపై దాడి చేసిచంపింది. తాజాగా గురువారం కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ రైతుపై అతని ఇంటి వద్దనే దాడి చేసిన పులి తీవ్రంగా గాయపరచడం కలకలం రేపింది. ఆ తర్వాత అతను చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. గతేడాది మహారాష్ట్రలో 105 మంది పులుల చేతిలో హతమయ్యారని అటవీ శాఖ మంత్రి ఎం.సుధీర్ శాసనసభకు చెప్పారు. అంతకుముందు 2020–21లో 86 మంది, 2019–20లో 80 మంది, 2018–19లో 47 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. తెలంగాణలో వారం వ్యవధిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లా వాంకిడి ప్రాంతంలో సంచరి స్తున్న పులి వారం వ్యవధిలోనే ఇద్దరిని బలి తీసుకుంది. గతేడాది ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులులు 170 పశువులపై దాడి చేసి హతమార్చా యి. ‘మేము అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లకుండా ఉండలేము. ఎందుకంటే అక్కడ పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నాం. వెళితే ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదు..’అని కుమ్రంభీం జిల్లా దిగడ గ్రామానికి చెందిన కళావతి వాపోయారు. పులులు ఎక్కువ ఉన్న చోట్లే.. పులులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. తగ్గిపోతున్న అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి జనావాసాలకు రావడం అధికమైంది. ధ్వని కాలుష్యంతో పాటు దీపాల వెలుగులు, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల వాతావరణం వంటి అంశాల వల్ల ఏర్పడే గందరగోళంతోనే ఇతర జంతువుల లాగే పెద్ద పులులు భయాందోళనలతో దాడులు చేయడం, చంపడం వంటివి చేస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. పులులు ఉన్నాయని తెలిసినా మనుషులు పోడు వ్యవసాయం, ఇతరత్రా అవసరాల కోసం అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లక తప్పడం లేదు. గత ఏడాది నవంబర్ 15న కుమ్రంభీం జిల్లా వాంకిడి సమీపంలో పత్తి చేనుకు కాపలా కాస్తున్న సీడాం భీము (69)ని పెద్ద పులి దాడి చేసి చంపేసింది. అదే జిల్లా దహేగం మండలం దిగిడ గ్రామానికి చెందిన 19 ఏళ్ల విఘ్నేష్‌పై దాడి చేసి చంపింది. ఏటా 20 శాతంపెరుగుదల పులుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాల్లో సాధారణంగా ఈ పెరుగుదల ఏడాదికి 20% కంటే ఎక్కువగా ఉందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇటీవల పార్లమెంట్‌కు సమరి్పంచిన నివేదికలో తెలిపింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా 2020 వెల్లడించిన నివేదికను బట్టి చూస్తే 2016–20 మధ్య దేశవ్యాప్తంగా పులుల స్వా«దీనంలో ఉన్న ప్రదేశం 10 వేల చ.కి.మీ. మేర కుంచించుకుపోయింది. ఒక్క యూపీలోనే గత పదేళ్లలో అటవీ ప్రాంతం వంద చ.కి.మీ. మేర హరించుకుపోయిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. పులులు పెరుగుతున్న చోట అటవీ భూములు కుంచించుకుపోకుండా చూడాలని ఫారెస్ట్ సర్వే అఫ్ ఇండియా గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కాగా, పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్లు, రైల్వే ట్రాక్‌లపైకి చేరి చనిపోతున్నాయని ఎఫ్ఎస్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నుంచి 2020–21 మధ్య దేశవ్యాప్తంగా 63 వేల వన్యప్రాణులు రైళ్ల కింద పడి మరణించాయని, వాటిలో నాలుగు సింహాలు, 73 ఏనుగులు సహా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఉన్న జంతువులు ఉన్నట్లు కాగ్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో100 దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు తీసిపోని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య 100కు పెరిగింది. 2014లో వీటి సంఖ్య 46 మాత్రమే. తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఏపీలోని ఉభయగోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలే మొదటి నుంచి పెద్ద పులులకు ఆవాసాలుగా పేరొందాయి. పులుల సంఖ్య పెరుగుతున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం 1983లోనే ఉమ్మడి ఏపీ ఐదు జిల్లాల పరిధిలో పది వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. అయితే అడవుల్లోకి నక్సలైట్ల ప్రవేశంతో 2005 వరకూ పులుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చిది. ఆ తర్వాత నక్సలైట్ల ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో 2008 నుంచి పులుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్లలో పులుల సంచారం అధికమైంది. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పెద్ద పులుల అభయారణ్యంగా పేరుగాంచింది. ►దేశంలో పెద్ద పులులు 4,500 పైచిలుకు.. ►దేశంలో చిరుతలు 2,300 -
అడవుల్లోనూ ఆహార పంటలు
‘‘నేను నా రెండెకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందించిన రైతుభరోసా సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతోంది. రాయితీ విత్తనాలు కూడా అందించి అండగా నిలుస్తోంది. ఈ ఏడాది 1070 వరి రకాన్ని సాగుచేశా. మంచి దిగుబడులు సాధిస్తున్నా. అటవీ ఫలాలు సేకరణతోనే కుటుంబాన్ని పోషిస్తూ గతంలో అవస్థలుపడ్డ నేను ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో ఆహార పంటలూ పండిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాను.’’ – కుర్సం రాజు, మెరకగూడెం, బుట్టాయగూడెం మండలం, ఏలూరు జిల్లా సాక్షి, అమరావతి: నిన్న మొన్నటి వరకు కేవలం అటవీ ఫలాల సేకరణపైనే ఆధారపడ్డ గిరిపుత్రులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, సహకారంతో ఇతర అన్ని ప్రాంతాల్లోని రైతుల మాదిరిగానే ఆహార పంటలు పండిస్తూ వారితో సాగులో పోటీపడుతున్నారు. వీరికి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్వోఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూమిని పంపిణీ చేయడంతో అడవి బిడ్డలు ఇప్పుడు ఉద్యాన, వ్యవసాయ పంటల సాగువైపు మళ్లుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను అవలంబిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. పోడు వ్యవసాయం, వంతుల సాగు, టెర్రస్ సాగు, వర్షాధార సాగు, మిశ్రమ పంటలు వేయడం, అంతర్ పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం, జీరో బడ్జెట్ వ్యవసాయం వంటి విధానాలను ఆయా ప్రాంతాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. గిరిజనులు సాగుచేస్తున్న ప్రాంతాలివే.. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కోట రామచంద్రపురం, కృష్ణా, నెల్లూరు, శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లతోపాటు గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అనేక గిరిజన తెగలు వ్యవసాయ సాగులో రాణిస్తున్నాయి. సాగుతో రైతులుగా మారిన గిరిజన తెగలు.. సవర, కాపు సవర, జతాపు, సవర గదబ, భగత, వాల్మీకి, కొండదొర, కొండరెడ్డి, వాల్మీకి, కొండ కమ్మర, కోయనైకపాడు, కోయ, లంబాడీ, చెంచు, సుగాలి, యానాది, ఎరుకల, నక్కల తెగలు. గిరిజన తెగలు సాగుచేస్తున్న పంటలు.. వరి, రాగి, జొన్నలు, బాజ్రా, కందులు, వేరుశనగ, జీడిపప్పు, కాఫీ, మిరియాలు, మామిడి, అనాస (పైనాపిల్), సీతాఫలం, రామాఫలం, పనస, బొప్పాయి, అరటి, టమాటా, పసుపు, చింతపండు, నిమ్మ, అల్లం, మిరప, పత్తి, పొద్దుతిరుగుడు, పొగాకు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది నేను సొంతంగా రెండున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. ఏటా రైతుభరోసాతోపాటు రాయితీతో కూడిన విత్తనాలు అందిస్తున్నారు. కోతుల బెడద నుంచి రక్షణగా పొలం చుట్టూ గ్రీన్ కర్టెన్ ఏర్పాటుచేశాను. పంట బాగుంది. రూ.35వేల వరకు మిగిలే అవకాశముంది. – బంధం చిన్న వీరాస్వామి, ఐ.పోలవరం గ్రామం, రంపచోడవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా కాఫీ సాగుకు తోడ్పాటు అందుతోంది రెండెకరాల్లో కాఫీ తోట పెంచుతున్నాను. ఇందులో అంతర్ పంటగా మిరియాలు సాగుచేస్తున్నాను. కాఫీ సాగులో ప్రభుత్వ ప్రోత్సాహం, కాఫీ బోర్డు, ఐటీడీఏ సహకారం బాగుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొనుగోలుతో బయట మార్కెట్లోను పోటీ పెరిగి మంచి ధర దక్కుతోంది. ఈ ఏడాది రూ.3 లక్షలు ఆదాయం వస్తుంది. – తమర్భ వెంకటేశ్వరనాయుడు, ఇరడాపల్లి గ్రామం, పాడేరు మండలం గిరిజన రైతులకు భరోసా అందిస్తున్నాం గిరిజన రైతులకు ఏటా రూ.13, 500 చొప్పున వైఎస్సార్ రైతుభరోసా సాయాన్ని అందిస్తూ విత్తన రాయితీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను సమకూరుస్తున్నాం. సీఎం నేతృత్వంలో 2019 ఆగస్టు నుంచి 1,20,361 మంది గిరిజనులకు 2,09,615 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 26,287 మందికి 39,272 ఎకరాల డీకేటీ పట్టాలు అందించాం. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా భూములు చదును చేయడం, బోరు బావులు తవ్వడం వంటివి ప్రభుత్వం చేపట్టింది. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన ఉత్పత్తుల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు సేకరించిన అటవీ ఫల సాయంతోపాటు అటవీ ఉత్పత్తులను కూడా జీసీసీ మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రోత్సహిస్తోంది. అటవీ ఫలసాయం సేకరణతోనే గిరిజనులు సరిపెట్టుకోకుండా వ్యవసాయం, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. – శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) -
Hyderabad: గత పదేళ్లలో భారీగా పెరిగిన అడవుల విస్తీర్ణం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం పచ్చదనంతో పరిఢవిల్లుతోంది. రహదారులు, ఉద్యానాలు, ఔటర్ రింగురోడ్డు, ప్రధాన కూడళ్లు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇటీవల కాలంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉద్యమస్థాయిలో చేపట్టిన హరితహారం, అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాన్ని సాధించాయి. పదేళ్ల క్రితం కేవలం 33 చదరపు కిలోమీటర్లున్న అటవీ ప్రాంతం తాజాగా సుమారు 85 చ.కి.మీ వరకు విస్తరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లిన భాగ్యనగరంలో కొంతకాలంగా వాతావరణంలోనూ అనూహ్యమైన పురోగతి కనిపిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జీవ వైవిధ్యంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగమంతటా చెట్లు భారీగా పెరగడం వల్ల వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు తిరిగి తమ ఆవాసాలకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వైపు ఆకాశ హరŠామ్యలతో నలువైపులా మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలోనే మరోవైపు అటవీ ప్రాంతం, పచ్చదనం కూడా విస్తరించుకోవడం విశేషం. హరితహారంలో భాగంగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇందుకోసం పెద్ద ఎత్తున కృషి చేశాయి. హైదరాబాద్ టాప్... రాష్ట్రవ్యాప్తంగా 109 పట్టణ అటవీ ఉద్యానాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.700 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. ఇందులో సుమారు 45 అర్బన్ ఫారెస్టు పార్కులను రూ.400 కోట్లతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఈ పార్కులు వివిధ ప్రాంతాల్లో విస్తరించుకొని ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోల్చితే పచ్చదనంలో హైదరాబాద్ హానగరం టాప్‌లో ఉంది. ఏటా ఆకుపచ్చ విస్తీర్ణం పెరుగుతోంది. గత పదేళ్లలో పచ్చదనం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. తాజాగా సుమారు 85 చదరపు కిలోమీటర్ల వరకు పచ్చదనం విస్తరించుకుంది. 2011లో చదరపు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 85 చదరపు కిలోమీటర్లకు పెరగడం గమనార్హం. అంటే ఈ దశాబ్ద కాలంలో అనూహ్యంగా 150 శాతం వరకు అటవీ ప్రాంతం విస్తరించినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై తదితర ప్రధాన నగరాలతో పోలి్చతే పచ్చదనంలో హైదరాబాద్ నగరం టాప్‌లో ఉంది. గ్రీన్‌సిటీ అవార్డు... పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరాల సరసన చేరింది.నగరానికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు లభించడం విశేషం. అంతర్జాతీయ ఉద్యాన ఉత్పాదకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్) ఈ ఏడాదికి వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డులను ప్రకటించగా ఏకంగా ఆరు అంశాల్లో హైదరాబాద్ ఈ అవార్డును సాధించడం గమనార్హం. దేశంలోనే ఈ అవార్డును గెలుచుకున్న ఏకైక నగరం హైదరాబాద్. కొలంబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో, బ్రెజిల్, కెనడా, అర్జెంటీనా, తదితర 18 దేశాలు ఈ పోటీలో ఉన్నాయి. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్‌లో భారతదేశం నుంచి హైదరాబాద్ అవార్డును సాధించింది. జీవ వైవిధ్యానికి పట్టం... భాగ్యనగరం ఉద్యానాలకు నిలయం. నిజాం నవాబుల కాలంలో వందలాది ఉద్యానవనాలతో, అడవులతో విలసిల్లిసిన హైదబాద్‌లో క్రమంగా పచ్చదనం అంతరించింది. దీంతో అనేక రకాల పక్షులు, జంతువులు, వన్యప్రాణులు ఉనికిని కోల్పోయాయి. తాజాగా చేపట్టిన పచ్చదనం అభివృద్ధి, విస్తరణ వల్ల హైదరాబాద్ జీవవైవిధ్య నగరంగా పూర్వవైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉంది. -
అడవి మీదుగా రింగురోడ్డు.. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఖరారు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉన్న అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం జరగనుంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి కేంద్రం అనుమతించిన 162 కి.మీ. ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికిగాను ఇప్పటికే కొంతభాగానికి భూసేకరణకు వీలుగా గెజిట్ విడుదల కావడంతో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్తర భాగానికి ఉన్న నిడివిలో నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. ఈ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ రోడ్డు అలైన్మెంట్ ఖరారైంది. అయితే ఎక్కువ అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండా, ఓ మూల నుంచి రోడ్డు నిర్మాణానికి వీలుగా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఇందుకోసం 235 ఎకరాల అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం ఉందని తాజాగా తేల్చారు. వన్యప్రాణుల సంచారంపై పరిశీలన.. అటవీ ప్రాంతానికి సంబంధించి ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాల్సి ఉందో తాజాగా ఎన్హెచ్ఏఐ అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు. దీంతో రెండు విభాగాల అధికారులు సంయుక్త సర్వేకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ భారీ వర్షాల వల్ల ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో వానలు తగ్గాక సర్వే చేపట్టి హద్దులు గుర్తించనున్నారు. అటవీ ప్రాంతం మీదుగా రీజినల్ రింగురోడ్డు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగుతున్నందున దాని ప్రభావం వన్యప్రాణులపై ఎంత మేర ఉండనుందో అంచనా వేస్తున్నారు. ఉత్తరభాగం రోడ్డు అలైన్మెంట్లో గజ్వేల్, నర్సాపూర్ ప్రాంతాల్లోనే అటవీ భూములున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు కలిపి 235 ఎకరాల మేర రోడ్డు నిర్మాణానికి వాడనున్నారు. ఆ ప్రాంతాల్లో అడవి రోడ్డుకు ఓవైపు సింహభాగం ఉండనుండగా మరోవైపు కొంత ప్రాంతమే ఉండనుంది. అయినా అటూఇటూ వణ్యప్రాణుల రాకపోకలు ఎలా ఉండనున్నాయనే విషయమై అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో అరుదైన వణ్యప్రాణులు పెద్దగా లేవు. కోతులు, జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్ల లాంటి సాధారణమైన అడవి జంతువులే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వాటిల్లోనూ ఎక్కువ రాకపోకలుండే ప్రాంతాలను గుర్తించి ఆ వివరాలను అటవీ శాఖ అధికారులు ఎన్హెచ్ఏఐకి అందించనున్నారు. ఆయా ప్రాంతాల్లో వాటి రాకపోకలకు వీలుగా ఎకో బ్రిడ్జీలు నిర్మించే అవకాశం ఉంది. సామాజిక అటవీ వృద్ధికి విఘాతం.. రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిస్తున్న ప్రాంతాల్లో దట్టమైన అడవులంటూ లేవు. తక్కువ పరిధిలోనే ఓ మోస్తరు అటవీ ప్రాంతాలుండగా కొన్నిచోట్ల సామాజిక అటవీ ప్రాంతాలను వృద్ధి చేశారు. ఈ పరిధి కూడా తక్కువ ప్రాంతాల్లోనే ఉంది. తాజాగా రింగురోడ్డు నిర్మాణంతో నాలుగైదు ప్రాంతాల్లో ఈ సామాజిక అటవీ ప్రాంతాల వృద్ధికి విఘాతం కలగనుంది. దీంతో వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త ప్రాంతాల్లో అలాంటి అడవులను అభివృద్ధి చేయాల్సి ఉంది. అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను అటవీ శాఖకు అందిస్తారో లేక ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో వాటిని పెంచాల్సి ఉందో అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. -
వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!
ములుగు: కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాట్లు చేసిన ఉచ్చుకు పులి బలైంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన ఐదుగురు వేటగాళ్లు అటవీప్రాంతంలో ఉచ్చులను ఏర్పాటు చేశారు. రెండువారాల క్రితం ఏర్పాటు చేసిన ఉచ్చుకు చిక్కుకొని గేదె మృతి చెందింది. అయినా అటవీ అధికారులు స్పందించలేదు. అదే ఉచ్చుకు తాజాగా పులి బలి అయినట్లుగా సమాచారం. రెండురోజుల క్రితం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులకు పులి కళేబరం కనిపించింది. దీంతో కూపీ లాగిన పోలీసులు వేటగాళ్లను గుర్తించడంతోపాటు వారి నుంచి పులిచర్మం, ఎనిమిది గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో సంచరించిన పులి ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు ఉచ్చులు వేసిన వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించినా అటవీ, పోలీస్ అధికారులు స్పందించలేదు. -
ఫారెస్ట్ ఆఫీసర్లను చితకబాది చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
-
భద్రాద్రి : ఫారెస్ట్ ఆఫీసర్లను కొట్టి.. చెట్టుకు కట్టేసి
సాక్షి, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు చితకబాదడమే కాక చెట్టుకు కట్టేశారు. ఆ వివరాలు.. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూమిని స్వాదినం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని అధికారులను అడ్డుకొవడమే కాక వారిని కొట్టి.. చెట్టుకు కట్టేశారు. చదవండి: నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో -
ఒక్కరోజు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు!
గంభీరావుపేట (సిరిసిల్ల): ఆ ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది. జనసమ్మర్ధంతో ఉండే ఊరు.. నిర్మానుష్యంగా మారింది. ఒక్కసారిగా ఊళ్లో నిశ్శబ్దం ఆవరించింది. కరోనా మహమ్మారి నుంచి ఊరును కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ జనం ఊరు వదిలి వనంబాట పట్టారు. ముందు ఊరంతా కలసి గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి భోజనాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు వివరాలిలా ఉన్నాయి.. లింగన్నపేటలో సుమారు ఆరు వేల జనాభా ఉంటుంది. 1,400 నివాసాలు ఉంటాయి. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతూ గ్రామదేవతలకు పూజలు చేద్దామని, ఒకరోజంతా ఊరు వదిలి అడవుల్లోకి వెళ్లాలని అన్ని కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అందరి సమ్మతం మేరకు ఆదివారం దానిని అమలు చేశారు. దీనికి ముందు రెండురోజులుగా ఊళ్లోని ప్రతీవీధి, రహదారిని శుభ్రం చేశారు. అలాగే తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఊర్లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన గ్రామదేవతల ప్రతిమలకు అంతా కలసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, రోగాలు దరిచేరకుండా కాపాడాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని దేవతలను వేడుకున్నారు. అనంతరం ఉదయం ప్రతీ ఇంటి నుంచి అందరూ ఆహార సామగ్రి, ఇతర వస్తువులు పట్టుకొని పొలాలు, అడవుల్లోకి పయనమయ్యారు. ఎవరికి వారుగా అక్కడ వంటలు చేసుకొని భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మళ్లీ గ్రామంలోకి అడుగుపెట్టారు. లింగన్నపేట వాసులు చేసిన ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. -
నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో
సాక్షి, హైదరాబాద్/జిన్నారం (పటాన్చెరు): ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థ సామాజిక బాధ్యతలో మరో ముందడుగు వేసింది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్–నల్లవెల్లిలో విస్తరించిన 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని హెటిరో డ్రగ్స్ సోమవారం దత్తత తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా అక్కడ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సమీపంలోని నర్సాపూర్ అడవిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఆ మేరకు అడవులను రక్షించేలా ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు భేష్.. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయని హెటిరో డ్రగ్స్ చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో ఎంపీ సంతోష్ కృషి తమను ఆకర్షించిందని, అందుకే సామాజిక బాధ్యతగా అడవిని దత్తత తీసుకుని అభివృద్దికి సంకల్పించినట్టు తెలిపారు. హెటిరో డ్రగ్స్ చొరవను సంతోష్ ఈ సందర్భంగా అభినందించారు. వీరి దారిలోనే మరికొందరు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పర్యావరణ పరిరక్షణకు ముందుకు వస్తున్నారని వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అటవీశాఖ ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలను గురించి హెటిరో ప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. మంబాపూర్ అటవీ ప్రాంతం ప్రాధాన్యత మంబాపూర్ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేయనున్నారు. అలాగే మొత్తం 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని స్థిరీకరించటం, ఆక్రమణలకు గురికాకుండా 25 కి.మీ. పరిధిలో అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేయటం, రక్షిత అటవీ ప్రాంతంలోకి మానవ, పెంపుడు జంతువుల ప్రవేశాన్ని నియంత్రించటం ద్వారా సహజ అడవి పునరుద్ధరణను హెటిరో నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌తో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ విస్తరిస్తున్న టౌన్షిప్లకు ఈ అడవి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే లంగ్ స్పేస్‌గా ఉపయోగపడనుంది. నర్సాపూర్ రోడ్డు నుంచి అడవిలో ప్రవేశించిన తర్వాత 2 కి.మీ. దూరంలో చుక్కగుట్ట కొండ ప్రాంతంలో (సుమారు 630 మీటర్ల ఎత్తు) వ్యూ పాయింట్ ఏర్పాటు, ఎకో ట్రెక్కింగ్, విద్యార్థులకు పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. -
వైరస్ల దాడులకు కారణం ఇదే!
హరివిల్లులో ఏడు రంగుల స్థానంలో ఒక రంగు మాత్రమే ఉంటే? భూమ్మీద తెల్లటి పూలు మాత్రమే పూస్తే? పండ్లు అన్నింటి రుచి ఒకేలా ఉంటే? అబ్బే... ఏం బాగుంటుంది అంటున్నారా? నిజమే. అన్నీ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది! వైవిధ్యం అనేది మనసుకు ఆనందం కలిగిస్తుంది! ప్రయోజనాలూ బోలెడు! కానీ.. ఈ విషయం మనిషికి పూర్తిగా అర్థమైనట్లు లేదు. ఎందుకంటే.. మన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని తెలిసినా... వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ తదితరాల పేరుతో.... అడవులు, నదులు, సరస్సులు, నేలలను నాశనం చేస్తూనే ఉన్నాడు! వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సిద్ధం చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020 చెబుతున్నది ఇదే! కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోట్ల కేసులు.. లక్షల్లో మరణాలు... ఆర్థిక వ్యవస్థ ఛిద్రం.. ఉద్యోగాల కోత. ఇలా ఎన్నెన్నో సమస్యలకు ఒక వైరస్ కారణమైందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ.. కోట్ల సంవత్సరాలపాటు జంతువుల్లో నిక్షేపంగా బతికిన ఈ వైరస్లు ఈ మధ్య కాలంలో మనిషికి ఎందుకు సంక్రమిస్తున్నాయో.. కారణమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? హెచ్1ఎన్1 కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి. స్వైన్‌ఫ్లూ కానివ్వండి అన్నీ జంతువుల నుంచి మనిషికి సోకిన వ్యాధులే. ఇప్పుడు కోవిడ్–19 కూడా. మనిషి ఎప్పుడైతే అటవీ సంపదను తన స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ సమస్య కూడా పెరగడం మొదలైందని అంటారు నిపుణులు. ప్రకృతిని, జీవజాలాన్ని పరిరక్షించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోకపోతే కోవిడ్ –19 తరహా విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020లో స్పష్టం చేసింది. రెండేళ్లకు ఒకసారి విడుదల చేసే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌ను ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి సిద్ధం చేశారు. 1970 నుంచి 2016 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 వేల క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరిసృపాలు సంతతిని పరిశీలిస్తూ సిద్ధం చేసిన ఈ నివేదిక దాదాపు 164 పేజీల నిడివి ఉంది. -
రక్తపాతంతో ‘డ్యామ్’ కట్టాలా ?
సాక్షి, న్యూఢిల్లీ: ‘వాళ్లు అరాచకులు, ఆటవికులు, అభివద్ధి నిరోధకులు, నెత్తిన ఈకలు, మెడలో పూసలేసుకొని తిరిగే అనాగరికులు, ఆ రూపంలో సంచరించే మావోయిస్టులు, చైనాకు అనుబంధంగా పనిచేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థల నిధులు పుచ్చుకొని ఆందోళన చేస్తున్న ఆదివాసులు’ ఇది ప్రభుత్వ భాష. ఈ భాషణంతోని అమాయక ఆదివాస ప్రజలపై పలు సార్లు తుపాకీ గుండ్లను కురిపించి, రక్తపాతం సష్టించింది ప్రభుత్వం. అందులో దాదాపు 50 మంది తిరుగుబాటుదారులు అశువులు బాసారు. ఇంతకు ఆ తిరుగుబాటుదారులు ఎవరు ? వారు దేనిపై తిరుగుబాటు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ? అసలు ఈ గొడవ ఇప్పుడెందుకు ? అరుణాచల్ ప్రదేశ్‌లో 1,600 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ‘దిబాంగ్ డ్యామ్ ప్రాజెక్ట్’ వ్యతిరేకిస్తున్న వారంతా కేంద్రం దృష్టిలో తిరుగుబాటుదారులే. బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లో భాగంగా సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున దిబాంగ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తయిన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్‌ను కేంద్రం ఎప్పటి నుంచో నిర్మించాలనుకుంటోంది. ఇక్కడే జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2,880 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ప్రాజెక్ట్‌లో అంతర్భాగం. బ్రహ్మపుత్రకు ఉపనదిగా వ్యవహరించే దిబాంగ్ నది భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో పుట్టి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తోంది. మిష్మీ హిల్స్ మీదుగా నిజాంఘాట్ వద్ద దిబాంగ్ లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతమంతా జీవ రాసుల ఖజానా. ఉష్ణ మండలం, ఉప ఉష్ణ మండల, సమశీతోష్ణ మండలాల్లో కనిపించే ప్రతి వక్షరాసి ఇక్కడ ఉంది. హిమాలయ పర్వత సానువుల్లో కనిపించే అరుదైన చిరుతపులి (క్లౌడెడ్ లియోపార్డ్), మకాకు కోతి జాతులు, జింకలు, ఎలుగుబంట్లతోపాటు అంతరించిపోతున్న పలు అరుదైన పక్షులకు నెలవు ఈ ప్రాంతం. భూ భౌతిక సంపదతోపాటు జీవరాసులతో కళకళలాడుతున్న ఈ ప్రాంతం ఒక్క భారత్‌లోనే కాకుండా పరిసర దేశాల పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడ భూ ప్రకంపనలు కూడా ఎక్కువే. ఇందుకు కారణాలేమిటో శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ అంచనాలు అందడం లేదు. 2000లోనే ప్రాజెక్ట్‌కు నాంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, 2000 సంవత్సరంలో ఈ దిబాంగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ‘నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), సమగ్ర నివేదికను రూపొందించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం దీన్ని అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లింది. దిబాంగ్ దిగువ ప్రాంతానికి చెందిన అప్పటి ముఖ్యమంత్రి ముకుత్ మీటీ. తన ప్రాంతం అభివద్ధి చెందుతున్నదన్న ఆశతో అంగీకరించారు. 2010 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉండింది. స్థానిక ప్రజల నుంచి అనూహ్యంగా తిరుగుబాటు రావడంతో అది సాధ్యం కాలేదు. 2007లో ప్రజాభిప్రాయ సేకరణ ‘ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్’ ప్రకారం ఇలాంటి ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతి తప్పనిసరి. అందుకు ప్రజామోదం కూడా తప్పనిసరి. 2007, మే నెలలో మొదటి సారి ప్రజాభిప్రాయ సేకరణకు మొదటిసారి పిలుపునిచ్చారు. అప్పటికి అస్సాం–అరుణాచ్ సరిహద్దులో నిర్మిస్తున్న ‘సుభాన్‌సిరి హైడ్రో పవర్ డ్యామ్ ప్రాజెక్ట్’కు వ్యతిరేకంగా ప్రజాందోళన చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి డ్యామ్‌ల వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉందో వివరించడంతోపాటు ప్రస్తుత దిబాంగ్ ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని లోపాలున్నాయో తెలియజేస్తూ స్థానిక పత్రికలు లెక్కలేనన్ని వార్తా కథనాలను రాశాయి. అనేక ఆదివాసీ గ్రామాలతోపాటు దాదాపు 5000 హెక్టార్ల అటవి భూమి మునిగిపోతుందని వెల్లడించాయి. 700 కుబుంబాలు భూములు కోల్పోతారని పేర్కొన్నాయి. 2008లో తొలి సమావేశం ప్రజలు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో 2007, మే నెలలో ఏర్పాటు చేయాలుకున్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం వాయిదా పడింది. 2008, ఫిబ్రవరి నెలలో సమావేశం ఏర్పాటు చేయగా ఇదు–మిష్మీకి చెందిన 1200 మందితోపాటు మొత్తం 12 వేల మంది హాజరయ్యారు. వారిలో 99 శాతం మంది ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాను వెల్లడించారు. అయినప్పటికీ అదే సంవత్సరం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రాజెక్ట్ సైట్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. అప్పుడు ‘ఆల్ ఇదూ మిష్మీ విద్యార్థుల సంఘం, ఇదూ మిష్మీ కల్చరల్ అండ్ లిటరర్ సొసైటీ’ సభ్యులు నిరసన తెలిపారు. విచక్షణా రహితంగా కాల్పులు 2008 నుంచి మౌనం వహిస్తూ వస్తోన్న కేంద్రం ప్రభుత్వం 2011లో ప్రాజెక్ట్ నిర్మాణానికి మళ్లీ పనులు చేపట్టింది. దానికి వ్యతిరేకంగా ప్రజాందోళనలు రాజుకోవడంతో వారి వెనక మావోయిస్టులు ఉన్నారంటూ కేంద్రం బలగాలను రంగంలోకి దించింది. 2011, అక్టోబర్ ఐదవ తేదీన ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ దళాలు ఓ దుర్గాపూజా మండపంలోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరపగా కనీసం పది మంది గాయపడ్డారు. అప్పటి నుంచి ఆందోళనలు జరిపినప్పుడల్లా కాల్పులు అనివార్యమయ్యాయి. మావోలు లేకపోయినప్పటికీ వారున్నారంటూ కేంద్రం ‘సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం’ను ప్రయోగించిందంటూ నాటి ఉద్యమకారులు పలు సందర్భాల్లో వెల్లడించారు. చైనా అనుబంధ సంస్థలు ఆందోళన నిర్వహిస్తున్నాయని కూడా కాంగ్రెస్ నేతలు పలు ప్రకటనలు చేశారు. 2013, మార్చి నాటికి ప్రజల వైఖరిలో మార్పు 2013, మార్చిలో జరిగిన తుది ప్రజా సదస్సు నాటికి ప్రజల్లో మార్పు వచ్చింది. ఆందోళనల కారణంగా అప్పటికే తమ కొడుకులు, బంధువులు కొన్నేళ్లపాటు జైల్లో ఉండాల్సి రావడంతో వారు ప్రాజెక్ట్ నిర్మాణానికి అంగీకరించారు. తగినంత నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశారు. అది తేలకుండానే 2014లో లోక్‌సభ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అదే ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ పాసిఘాట్‌లో మాట్లాడుతూ జల సంరక్షణ, పర్యాటకం, పూల తోటల పెంపకం, చేతి వత్తులను ప్రోత్సహించడం ద్వారా అరుణాచల్ ప్రజలకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. అదేమి జరగలేదు. 1600 కోట్ల రూపాయల ప్రకటన తమ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ అభివద్ధికి కట్టుబడి ఉందని, దిబాంగ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ఆ రాష్ట్రానికి 1600 కోట్ల రూపాయలను కేంద్రం అందజేస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన మూడోరోజే ముందస్తు హెచ్చరికగా ప్రాజెక్ట్ ప్రాంతంలో ఓ మోస్తారు భూప్రకంపనలు వచ్చాయి. -
133 సీట్లలో ‘అటవి హక్కుల’ ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్న 543 స్థానాల్లో 133 స్థానాల్లో ‘అటవి హక్కుల చట్టం’ అమలు తీరు ప్రభావితం చేయనుంది. 2014లో ఈ 133 స్థానాలకు జరిగిన ఎన్నికలను విశ్లేషించి ‘కమ్యూనిస్టు ఫారెస్ట్ రిసోర్స్–లర్నింగ్ అండ్ అడ్వకేసి (సీఎఫ్ఆర్–ఎల్ఏ)’ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్నా ఈ నియోజక వర్గాల్లో అటవి భూమి చట్టం కింద భూములు రావాల్సిన ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తులకు వచ్చిన మెజారిటీ కన్నా ఈ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కనుక వీరు ఈసారి ఎన్నికల ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేయనున్నారు. ఈ చట్టం కింద భూమి హక్కులు లభించని వారందరిని అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడం, దానిపై ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, దాంతో సుప్రీం కోర్టు తన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయడం తదితర పరిణామాలు తెల్సిందే. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అటవి హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేక పోవడం వల్ల ఆదివాసీలకు ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈసారి ఏ రాజకీయ పార్టీ అయితే అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తామంటూ విశ్వసనీయంగా హామీ ఇవ్వగలతో ఆ పార్టీకి ఓటు వేసేందుకు ఈ ఆదివాసీ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని సీఎఫ్ఆర్–ఎల్ఏ తెలియజేసింది. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర అసంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా ఈ విశయాన్ని సూచిస్తున్నాయని ఆ ఎన్జీవో సంస్థ తెలిపింది. అడవిలో నివసిస్తున్న ఆదివాసీలకు అటవిపై హక్కులు 2006లో లభించాయి. దీనివల్ల దేశంలోని దాదాపు 20 కోట్ల మందికి జీవనోపాధి లభించింది. వీరి సంఖ్య మొత్తం బ్రెజిల్ దేశ జనాభాతో సమానం. వారిలో 90 లక్షల మంది (45 శాతం) దళితులు ఉన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అటవి వాసులు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. మొత్తం దేశంలోని ఐదు లక్షల యాభైవేల హెక్టార్లపై (ఢిల్లీ రాష్ట్రమంత విస్తీర్ణం) వివాదాలు చెలరేగాయి. ఈ వివాదాల వల్ల 60 లక్షల మంది అటవి వాసులు ఇక్కట్ల పాలయ్యారని ‘లాండ్ కాన్ల్విక్ట్ వాచ్’ సంస్థ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో 133 సీట్లకుగాను 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 59 శాతం సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 శాతం సీట్లు మాత్రమే వచ్చాయి. 62 శాతం సీట్లలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా అటవి హక్కుల చట్టాన్ని సమగ్రంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొన్నదని స్వచ్ఛంద సంస్థ తెలిపింది. -
నీలగిరి కొండల్లో కార్చిచ్చు
సాక్షి, చెన్నై: తమిళనాడు ఊటీలోని నీలగిరి కొండల్లో కార్చిచ్చు చెలరేగింది. ముదుమలై అటవీ ప్రాంతంలోని మేఘమలై కొండల్లో అగ్రి కీలలు ఎగసిపడుతున్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి దగ్దమవుతుంది. ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో మంటుల ఆర్పేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పది రోజుల కిందట కూడా ముదుములై టైగర్ రిజర్వ్‌లో మంటలు చెలరేగగా 50 ఎకరాల అటవీ ప్రాంతం దగ్దమయింది. ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. -
అటవీ రక్షణకు ఆర్మ్డ్ ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: అటవీ సంపదను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. స్మగ్లింగ్, అటవీ భూముల ఆక్రమణ, వన్యసంపద పరిరక్షణకు అటవీ శాఖతోపాటు పోలీస్ శాఖ కూడా రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితో పోలీస్ ఉన్నతాధికారులు ఆమేరకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. జాయింట్ చెక్‌పోస్టులు.. రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధానంగా అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వధ జరుగుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జాయింట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. ఆటవీ శాఖ–పోలీస్ శాఖ సంయుక్తంగా చెక్‌పోస్టులు నిర్వహించేందుకు ప్రణాళిక తయారుచేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న చెక్‌పోస్టుల్లో నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత ఉండటంతో పోలీస్ శాఖ ద్వారా వాటిని మానిటరింగ్ చేయాలని నిర్ణయించారు. వరంగల్, హైదరాబాద్ పోలీస్ జోన్ పరిధిలో 54 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. జాయింట్ చెక్ పోస్టులు ప్రస్తుతం అటవీ శాఖ నేతృత్వంలో ఉన్న చెక్‌పోస్టుల్లో కేవలం ఇద్దరు లేదా ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. టోల్ విధుల్లో కొన్నిచోట్ల ప్రైవేట్ సిబ్బంది ఉండటంతో స్మగ్లర్లకు అవకాశం కలిసివస్తోంది. అయితే ఇక నుంచి ఆధునీకరించబోతున్న చెక్‌పోస్టుల్లో సాయుధ బలగాల సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. టోల్ వ్యవహారమంతా అటవీ శాఖ పర్యవేక్షించనుండగా, తనిఖీలు చేయడం, స్మగ్లర్లను గుర్తించి అదుపులోకి తీసుకోవడం మాత్రం పోలీస్ శాఖ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రతీ చెక్‌పోస్టుకు ముగ్గురు సాయుధ బలగాల సిబ్బంది కాపలా కాయనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఇంటర్సెప్టార్ వాహనాలను సైతం రంగంలోకి దించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇలా ప్రతి జిల్లాలో జాయింట్ చెక్‌పోస్టుల భద్రత కోసం 35మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా 400మందిని కేటాయించాలని పోలీస్ శాఖ యోచిస్తోంది. స్మగ్లర్లు ఎంతమంది? ఇప్పటివరకు రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలు చేస్తున్న వారు ఎంతమంది? వారి వివరాలు ఏంటన్న దానిపై అటవీ శాఖ వద్ద వివరాలు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్టు తెలిసింది. కనీసం డేటా బేస్ లేకపోవడం ఏంటన్న దానిపై ప్రభుత్వ వర్గాలు అటవీ శాఖ అధికారులను మందలించినట్టు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా డేటా బేస్ సిద్ధం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి గోదావరి నది దాటి రాష్ట్రం మీదుగా కలప స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆ రెండు రాష్ట్రాల అటవీ, పోలీస్ శాఖల నుంచి కూడా స్మగ్లర్ల వివరాలను కోరుతున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు సాక్షితో అభిప్రాయపడ్డారు. దీని ద్వారా అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగించే వారి వివరాలు ఇంటిగ్రేటెడ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. గుర్తించిన స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా పోలీస్ శాఖ ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్టు తెలిసింది. కేవలం స్మగ్లింగ్ మాత్రమే కాకుండా అటవీ భూములను ఆక్రమిస్తున్న వారు, వన్యప్రాణులను వేట పేరుతో వధిస్తున్న వారిపై అటవీ యాక్ట్ కేసులతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ ప్రాంతాలే కీలకం... కాగజ్‌నగర్, జిన్నారం, బెల్లంపల్లి, మంథని, నిర్మల్, ఖానాపూర్, మహదేవపూర్, కాళేశ్వరం, భూపాలపల్లి, ములుగు, వాజేడు, కొత్తగూడెం, పాల్వంచ, ఏటూరునాగారం, నాగర్‌కర్నూల్, నర్సాపూర్ డివిజన్లలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేయడం, ఉన్న వాటిని ఆధునీకరించి సీసీటీవీలు, కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఆయా డివిజన్లలోని అటవీ శాఖ అధికారులతోపాటు స్థానిక సబ్ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు నేరుగా రంగంలోకి దిగేలా ఆదేశాలిస్తున్నట్టు తెలుస్తోంది. అడవుల్లో స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ బృందాలు స్మగ్లర్ల వివరాలను గుర్తించి ఈ బృందాలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థ, ఈ వ్యవస్థను మాని టరింగ్ చేసేందుకు జిల్లా అటవీ శాఖాధికారి, జిల్లా ఎస్పీ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. -
లక్ష మొక్కలు పీకేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తెలంగాణకు హరితహారం’ అటవీప్రాంత జిల్లాల్లో అభాసుపాలవుతోంది. అటవీ భూముల కబ్జాదారుల ప్రతాపానికి పచ్చదనం ఆదిలోనే అంతమవుతోంది. కబ్జాదారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అండగా నిలుస్తుండటంతో అడవుల పునరుద్ధరణ లక్ష్యం ‘మొక్క’ దశలోనే ముగిసిపోతోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ భూముల్లో నాటిన మొక్కల్లో 1,05,618 మొక్కలను జూలైలో కబ్జాదారులు పీకేశారు. 2014 నాటికి కబ్జాకు గురైన అటవీ భూముల జోలికి వెళ్లవద్దని స్వయంగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించడంతో ఈ ప్రాంతాల్లో హరితహారం నిలిచిపోయింది. కొందరు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రకటనలే చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఈ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర అటవీ విభాగాధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) స్వయంగా గత నెల 20న ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కబ్జాకు గురైన అటవీ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంతో కొత్తగా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్వాధీనం చేసుకున్న అటవీ భూములను మళ్లీ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత మూడేళ్లలో నాటిన మొక్కలు, చెట్లను పీకేసి మరీ స్థానికులు కబ్జాలకు పాల్పడుతున్నారని నివేదించారు. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అడ్డంకులు... రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారాన్ని నిర్వహిస్తోంది. 2015–19 మధ్య మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం నిర్దేశించుకోగా అందులో 80 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు, మరో 20 కోట్ల మొక్కలను దట్టమైన అడవుల్లో నాటాలని నిర్ణయించింది. మిగిలిన 130 కోట్ల మొక్కలను మైదాన ప్రాంతాల్లో నాటుతోంది. వేల ఎకరాల్లో కబ్జాకు గురైన భూముల్లో మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రూ. 2,535.7 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చింది. నాటిన మొక్కలను ఎక్కడికక్కడ పీకేస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని, మానవ శ్రమ, ప్రజాధనం భారీగా వృథా అవుతోందని పీసీసీఎఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అటవీ భూముల క్రమబద్ధీకరణ హామీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పీసీసీఎఫ్ విజ్ఞప్తి చేశారు. ఆయన రాసిన లేఖలోని ముఖ్యాంశాలు... ఏడేళ్లలో 50 వేల ఎకరాల అడవులు అన్యాక్రాంతం... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అటవీ భూములను ఆక్రమించిన గ్రామస్తులను వేధించరాదంటూ గత జూన్ 22న అటవీశాఖ ఉన్నతాధికారులు, అటవీ సెక్షన్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి జోగు రామన్న ఆదేశాలు జారీ చేశారు. కానీ 2014 జూన్‌కు ముందు కబ్జాకు గురైన అటవీ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అటవీశాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్–2006) హక్కులు కల్పించింది. ఈ చట్టం కింద 1,86,534 దరఖాస్తులు రాగా అందులో అర్హతగల 93,494 దరఖాస్తులను ఆమోదించి 3,00,092 ఎకరాల భూములను సాగు చేసుకోవడానికి గిరిజనులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన అటవీ భూముల కబ్జాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ వద్ద సమాచారం లేదు. 2008–09లో సైతం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నాటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించడంతో పెద్ద ఎత్తున అడవులను నరికేసి భూములను కబ్జా చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 2007 నుంచి 2014 నాటికి కొత్తగా 58,032 ఎకరాల అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ భూముల్లో మొక్కలు నాటేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటూ సిబ్బందిపై భౌతిక దాడులు చేసేలా స్థానికులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు... ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన గన్మెన్లతో కలసి గత నెల 18న కొత్తగూడెం పరిధిలోని చాటకొండ రిజర్వ్ ఫారెస్ట్‌లో 100 ఎకరాల అటవీ భూముల్లో హరితహారాన్ని అడ్డుకున్నారు. అటవీ సిబ్బందిని బెదిరించి బలవంతంగా అక్కడ్నుంచి వెళ్లగొట్టారు. అవి అటవీ భూములంటూ కలెక్టర్ ఫోన్లో ధ్రువీకరించినా లాభం లేకపోయింది. జూలై 7న బెల్లంపల్లి డివిజన్లో గిరెపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో రాజారాం, వెమనపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెట్లను నరికి మూడోసారి అటవీ భూముల కబ్జాకు ప్రయత్నించారు. పాఖాల్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో అటవీ భూమిని ట్రాక్టర్‌తో చదును చేసే యత్నాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి డి. నాగరాజుపై అశోక్‌నగర్ గ్రామ సర్పంచ్ సాయిలు, గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా హాజీపూర్ రిజర్వు అటవీ ప్రాంతంలోని 10 హెక్టార్లలో నాటిన మొక్కలను గత నెల 5న బెల్యానాయక్ తండావాసులు పీకేశారు. ఏటూరునాగారం అటవీ సంరంక్షణ ప్రాంతంలో గత నెల 5న ఐదు ట్రాక్టర్లతో భూములను చదును చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు వెళ్లిన వరంగల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తోపాటు మరో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను గ్రామస్తులు రెండు గంటలపాటు నిర్బంధించారు. ఈ ప్రాంతంలో ఐదు గ్రామాల ప్రజలు దాదాపు 13 వేల ఎకరాల అటవీ భూములను ఆక్రమించారు. పెద్దపల్లి అటవీ ప్రాంతంలోని 75 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై గత నెల 5న కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మామిడిగూడ అటవీ ప్రాంతంలోని 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై గత నెల 2న టడ్వాల్ మండలం బోటిలింగాల గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. -
మహామాయ
►గరిమెనపెంట భూబాగోతంలో మరో కోణం ►కొత్త రికార్డుల్లో పాత ఎంట్రీలు ►వారసుల నుంచి కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు ►అటవీ భూమిని కాజేసేందుకు నాలుగేళ్లుగా యత్నాలు నెల్లూరు : రికార్డులతోపాటు సర్వే నంబర్లనూ మార్చేశారు. అటవీ భూముల్ని గ్రామకంఠంగా చూపించారు. ఏకంగా 545 ఎకరాలను స్వాహా చేశారు. కానీ.. చివరకు అడ్డంగా దొరికిపోయారు. రాపూరు మండలం గరిమెనపెంట శివారులోని అటవీ భూముల కబ్జా వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూముల కబ్జాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా కొత్త రికార్డులు సృష్టించిన అధికార పార్టీ పెద్దలు అక్కడే దొరికిపోయారు. పక్కా స్కెచ్‌తో.. భూముల్ని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించిన అధికార పార్టీ పెద్దలు మొదట అటవీ శాఖ అధికారుల ద్వారానే వ్యవహారం చక్కదిద్దేందుకు యత్నించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అటవీ శాఖ అధికారిపై చిత్తూరు జిల్లాకు చెందిన ప్రస్తుత మాజీమంత్రితోపాటు అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. సదరు అధికారి ఇందుకు ససేమిరా అనటంతో రూటు మార్చారు. రెవెన్యూ శాఖ వ్యవహారాల్లో తలపండిన మేధావుల్ని, ప్రస్తుత, రిటైర్డ్ తహసీల్దార్లను రంగంలోకి దించారు. రెవెన్యూ అధికారులకు భూ కబ్జా ఫైల్‌ను పంపించారు. స్థానిక ప్రజాప్రతినిధితోపాటు అప్పటి మంత్రితో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డుల గోల్‌మాల్‌కు శ్రీకారం చుట్టారు. అలా మొదలుపెట్టి అడుగడుగునా రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. తొలుత గ్రామ అడంగళ్ పుస్తకంలో ఖాతా నంబర్లు, వివరాలు నమోదు చేశారు. 1968లో 550 ఎకరాలను పట్టాలుగా ఇచ్చినట్టు రికార్డులు సృష్టించే క్రమంలో అడంగళ్‌లో వారి వారసుల పేర్లు, సర్వే నంబర్లు, భూమి వివరాలను తారుమారు చేశారు. అది కూడా పాత అడంగల్ కావటంతో ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారు. అడంగల్‌లోని వివరాలన్నీ పాతవే అయినా అడంగల్ పుస్తకాన్ని ప్రభుత్వ ముద్రణాలయంలో 1985లో ముద్రించారు. నిజానికి అందులో 1985 నుంచి మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. అంతకుముందు 20 ఏళ్ల రికార్డులు నమోదు చేయటం సాధ్యం కాదు. అయినా.. రెవెన్యూ అధి కారులు రాజకీయ ఒత్తిళ్లతో పాత వివరాలను కొత్త పుస్తకంలో నమోదు చేసి విచారణలో బుక్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఇద్దరు తహసీల్దార్ల పాత్ర ఉన్నట్టు తేల్చినా.. ఇప్పటివరకు ఒకరిపై మాత్ర మే చర్యలు తీసుకోవటం గమనార్హం. విజిలెన్స్ విచారణలోనూ బట్టబయలు అధికార పార్టీ నేతలు సాగించిన భూబాగోతంపై రెవెన్యూ శాఖతో పాటు విజిలెన్స్ విభాగం కూడా దర్యాప్తు చేపట్టింది. గరిమెనపెంట అటవీ భూమి వందలాది ఏళ్లక్రితం అప్పటి జమీందార్లు, రాజులు అక్కడి బ్రాహ్మణులకు కేటాయించిన భూదాన మాన్యాలని దర్యాప్తులో తేలింది. 1980 తర్వాత అమల్లోకి వచ్చిన అటవీ, ఇనాం చట్టాల ద్వారా ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి అధికారిక రికార్డులు లేవు. ఈ క్రమంలో సర్వే నంబర్ 75ను సబ్ డివిజన్ చేసి 75/1గా, 75/2గా మార్చారు. 75/1లో 14 ఎకరాల భూమికి పట్టాను కేటా యించారు. 75/2 సర్వే నంబర్ భూమి మొత్తం అటవీ శాఖ పరిధిలోకి రావటంతో దానిని రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా మార్చారు. అంతకుముందే 180 ఎకరాల భూమిని కమ్యూనిటీ జాయింట్ ఫిర్మాంగ్ సొసైటీకి కేటాయించారు. రికార్డుల్లో నమోదు కాకుండా మిగిలిన 550 ఎకరాల భూమిని స్వాహా చేయటానికి అధికార పార్టీ నేతలు ప్రణాళిక రచించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి గతంలో బ్రాహ్మణులకు కేటాయించిన భూమి కావటంతో శనగవరపు అనే ఇంటిపేరుతో ఉన్న కొందరి వివరాలను వారసుల పేరిట.. వారికి తెలియకుండానే రికార్డుల్లో నమోదు చేయించారు. మొదటగా 505 ఎకరాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. రెండో దశలో 45 ఎకరాలను రికార్డుల్లోకి ఎక్కించారు. తద్వారా ఈ అటవీ భూమిని ప్రైవేటు భూమిగా మార్చే యత్నం చేశారు. ఆ భూముల్ని బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు చూపించి రిజిస్ట్రేషన్ చేయించారు. -
పెద్దల్ని తప్పించారు
⇒అటవీ భూముల స్వాహాలో అధికార పార్టీ నేతల బినామీ బాగోతం ⇒ఏడాదిపాటు సాగిన సుదీర్ఘ విచారణ ⇒తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలపై వేటు నెల్లూరు : పెద్దలే గద్దలయ్యారు. 545 ఎకరాల అటవీ భూముని స్వాహా చేశారు. పాత రికార్డులను సేకరించి.. తప్పుడు పత్రాలను సృష్టించి.. బినామీల పేరుతో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు చేయించేశారు. ఏడాది క్రితం వరకు పదవిలో ఉన్న చిత్తూరు జిల్లా అమాత్యులు, జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి అటవీ భూమిని కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారుల్ని వదిలేసిన ప్రభుత్వం పాత్రధారులైన రెవెన్యూ ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. జిల్లాలో కీలక అంశంగా మారిన ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు ఆందోళనలు చేసినా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. సర్వే నంబర్ మార్చేసి.. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలోని సర్వే నంబర్ 43/1లో 1,988.81 ఎకరాల అటవీ భూమి ఉంది. దీనిని రీసర్వే చేసి సర్వే నంబర్ 43/1ను 75/2 నంబర్‌గా మార్చా రు. ఫెయిర్ అడంగల్‌లోనూ భూమి వివరాలు నమోదు చేసి.. అటవీ పోరంబోకుగా రికార్డుల్లో చూపారు. ఆ తర్వాత 2014లో జారీ చేసిన జిల్లా నూతన గెజిట్‌లో భూమి వివరాలను మార్చేశారు. 1,988 ఎకరాలకు బదులుగా 1,329 ఎకరాలు మాత్రమే అటవీ భూమి ఉన్నట్టు చూపించారు. మిగిలిన 659.60 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్టు గాని.. ఇతర వివరాలేవీ రికార్డుల్లో నమోదు చేయలేదు. అందులో 549 ఎకరాలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధి కన్నుపడింది. వేగంగా పావులు కదిపాడు. వెంటనే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, ఆయన కుమారుడి సహకారంతో పక్కా ప్రణాళిక రచించి అమలు పరిచాడు. ఈ క్రమంలో 1915లోని ఇనాం భూముల రికార్డులు, ఇనాం చట్టంలోని లొసుగులు, ఇతర అంశాలను ఆసరాగా చేసుకుని అక్కడ ఆక్రమంగా సాగు చేస్తున్న వారి నుంచి భూములు కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించాడు. వెంటనే 2015లో భూమిని స్వాధీనపర్చుకోవటానికి వీలుగా రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తి చేశాడు. వాస్తవానికి ఆ భూములను రాపూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండగా, తనకు పరపతి ఉన్న వెంకటగిరి సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయంలో 16 మంది బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి బినా మీల పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. దళిత, గిరిజన సంఘాలు లోకాయుక్తకు ఫిర్యాదు చేయటంతో జిల్లా అధికారులు స్పందించి 2016లో విచారణకు తెర తీశారు. వాస్తవానికి అటవీ భూమి కావటంతో భూమి విలువ అతి తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూమిని భూబదలాయింపు కోసం వినియోగించుకుని.. రూ.కోట్లు విలువ చేసే భూమి దక్కించుకోవచ్చు. అలాగే పట్టాదార్ పాస్‌బుక్స్‌పై బ్యాంకుల్లో పంట, ఇతర రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏడాదిగా విచారణ ఈ భూముల వ్యవహారంపై నెల్లూరు జెడ్పీ సీఈఓ రామిరెడ్డి 2016లో విచారణ ప్రారంభించారు. ఆయన ఏసీబీకి పట్టుపడిన అనంతరం గూడూరు ఆర్డీఓ అరుణ్‌బాబు విచారణ నిర్వహించారు. చివరగా ఈనెల 3న ఆర్డీఓ విచారణ జరిపి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. గతంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్ సు«ధాకర్, ఆర్ఐ శరత్, వీఆర్వోలు అంకయ్య, ప్రభాకర్‌రెడ్డిని సస్పెండ్ చేసి కథ ముగించారు. -
31 వేల ఎకరాల అటవీభూమి ఎందుకు?
- రాజధానికి అటవీ భూములపై రాష్ట్రానికి కేంద్రం షాక్ - రాజధాని మాస్టర్ ప్రణాళిక పరిశీలనకు కమిటీ ఏర్పాటు - నిపుణుల కమిటీకి డెహ్రాడూన్ ఏపీసీసీఎఫ్ నాయకత్వం - నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్రం సాక్షి, అమరావతి: కొత్త రాజధాని పేరుతో రాష్ట్ర సర్కారు భూ దాహంపై కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రాజధాని కోసం 31 వేల ఎకరాల అటవీ భూమిని కోరడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడుతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అవసరమైతే రాజధాని కోసం అటవీ భూమిని అటవీయేతర వినియోగానికి అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీని ఆధారంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 31,112 ఎకరాల అటవీ భూమిని రాజధాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలను కేంద్రం విశ్వసించడం లేదు. రైతుల నుంచి ఏకంగా 32 వేల ఎకరాలకుపైగా భూసమీకరణలో తీసుకున్న తరువాత కూడా ఇంకా 31 వేల ఎకరాలకుపైగా అటవీ భూమి రాజధాని కోసం ఎందుకనే ప్రశ్నను కేంద్ర అటవీశాఖ లేవనెత్తింది. దీన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజగోపాల్ ప్రశాంత్ తెలియజేశారు. డెహ్రాడూన్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏపీసీసీఎఫ్) అజయ కుమార్ అధ్యక్షతన నియమించిన కమిటీలో లక్నో ఏపీసీసీఎఫ్ వీకే సింగ్, చంఢీఘర్ ఏపీసీసీఎఫ్ సీడీ సింగ్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ప్రశాంత్ రాజగోపాల్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ లేదా రాజధాని మాస్టర్ ప్రణాళిక అభివృద్ధికి చెందిన వ్యక్తులను సభ్యులుగా నియమించాలని కేంద్ర అటవీ శాఖ సూచించింది. నిపుణుల కమిటీ ఏమి చేస్తుందంటే... ► ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అటవీ విస్తీర్ణం మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు అటవీ (కన్జర్వేషన్) చట్టం 1980 ప్రకారం సాధ్యమా? కాదా? అనే విషయాన్ని పరిశీలిస్తుంది. ► రాజధాని మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్రణాళికను అధ్యయనం చేస్తుంది. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అటవీ భూమి మార్పిడి వివరాలను సవివరంగా అధ్యయనం చేస్తుంది. వీలైనంత మేర అటవీ విస్తీర్ణం మార్పిడిని తగ్గించడంతో పాటు అటవీ భూమి వినియోగం లేకుండా అటవీ ప్రాంతం చుట్టపక్కల ఫారెస్ట్ సెంట్రిక్ మాస్టర్ ప్రణాళిక అభివృద్ధికి సూచనలు చేస్తుంది. ► ఫారెస్ట్ (కన్జర్వేషన్) చట్టం 1980ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు అలాగే అడవుల పరిరక్షణకు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను, నియమ నిబంధనలను పరిగణలోకి తీసుకుని నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పిస్తుంది. -
ఆ జింక ఎక్కడిది?
చౌటుప్పల్: చౌటుప్పల్ గుండ్లబావి గ్రామంలో ఈ నెల 23న దొరికిన జింక ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. గొర్రెల కాపరికి దొరికిన జింక పిల్లని అదే గ్రామానికి చెందిన జెడ్పీటీసీ బుచ్చిరెడ్డి స్థానిక అటవీశాఖ కార్యాలయంలో అప్పగించారు. ఆ సమయంలో కాలికి చిన్న గాయం తప్ప పూర్తిస్థాయి లో అరోగ్యంగా ఉంది. మరుసటి రోజు జింక మృతి చెందింది. జింక దొరికిన గ్రామానికి సమీపంలో అటవీ భూములు కూడా లేవు. ఇటీవల మహదేవ్పూర్ అడవుల్లో దుప్పుల వేట ఘటనకు.. ఈ జింకకు సంబంధాలేమైనా ఉన్నాయోమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
రక్షణ గాలికి!
సాక్షి, మెదక్ : జిల్లాలో అటవీభూముల రక్షణ గాలిలో దీపంలా మారింది. అటవీభూములను సంరక్షించాల్సిన అటవీశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అడవులను సంరక్షించాల్సిన అటవీశాఖ భూముల రక్షణ బాధ్యతలను గాలికి వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటవీభూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూముల సంరక్షణ కోసం ప్రభుత్వం కందకాలు తవ్వాలని స్పష్టంగా ఆదేశించినా అటవీశాఖ అధికారులు అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది రెండు విడతల్లో 352 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 41 కిలోమీటర్ల మేర మాత్రమే కందకాల తవ్వకం పూర్తయ్యింది. ఇంకా 311 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాల్సి ఉంది. కందకాల తవ్వకాల్లో ఇంత జాప్యం జరగడం అటవీభూముల అన్యాక్రాంతానికి దారి తీస్తుంది. జాప్యంతో భూములు అన్యాక్రాంతం? అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వకపోవడంతో అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో పదిహేడింటిలో 56,938 హెక్టార్ల మేర అడవులు ఉన్నాయి. మెదక్ రేంజ్లో 11137 హెక్టార్లు, రామాయంపేటలో 9086 హెక్టార్లు, తూప్రాన్‌లో 13326 హెక్టార్లు, నర్సాపూర్‌లో 11,134 హెక్టార్లు, కౌడిపల్లిలో 6363 హెక్టార్లు, పెద్దశంకరంపేటలో 5890 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ భూములను రక్షించేందుకు ప్రభుత్వం అటవీభూముల చుట్టూ కందకాలు తవ్వించాలని ఆదేశించింది. ఈ మేరకు లక్ష్యం నిర్ధారించి అవసరమైన నిధులను విడుదల చేస్తుంది. అయితే అధికారులు కందకాల తవ్వకాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమాచారం మేరకు గడిచిన రెండేళ్లకు గాను మొత్తం 1123 కిలోమీటర్ల మేర అటవీభూముల చుట్టూ కందకాలు తవ్వాల్సి ఉంది. అయితే అధికారులు 210 కిలోమీటర్లు మాత్రమే కందకాలు తీయించారు. ఇంకా 913 కిలోమీటర్ల కందకాలు అటవీభూముల చుట్టూ తవ్వాల్సి ఉంది. నర్సాపూర్ మండలం కొండాపూర్ విలేజ్, చిన్నచింతకుంట, పెద్దచింతకుంట గ్రామాల అటవీభూముల చుట్టూ కందకాలు తవ్వాల్సి ఉండగా ఆ పనులు జరగడం లేదు. ఘనపూర్ మండలంలో 11 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాల్సి ఉంది. అయితే ఏడు కిలోమీటర్లు మాత్రమే కందకాలు తవ్వారు. గంగాపూర్‌లో కందకాల తవ్వకం జరగడం లేదు. రామాయంపేట, తూప్రాన్, కౌడిపల్లి, పెద్దశంకరంపేటలో సైతం కందకాల తవ్వకాలు జరగడం లేదు. రెవెన్యూ, అటవీశాఖ మధ్య సమన్వయలోపం వల్ల కందకాల తవ్వకాల్లో జాప్యం నెలకొంటోందని అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ తమ భూములు సర్వే చేయించి హద్దులను గుర్తిస్తే ఆ ప్రాంతంలోని రైతులు, గిరిజనులు తమ భూములు అంటూ కందకాల తవ్వకానికి అడ్డుపడుతున్నారు. దీంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్ సర్వే చేయాల్సి వస్తోంది. అయితే అటవీ, రెవెన్యూశాఖ అధికారులు బిజీగా ఉండడం, సమన్వయ లోపంతో జాయింట్ సర్వే జరగడం లేదు. మెదక్, నర్సాపూర్, చిన్నశంకరంపేట మండలాల్లో జాయింట్ సర్వేల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా కందకాల తవ్వకాలు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాం జిల్లాలో లక్ష్యం మేరకు కందకాల తవ్వకాలు జరిగేలా చూస్తున్నాం. జాయింట్ సర్వే, కాంట్రాక్టర్ల కొరత కారణంగా కందకాల తవ్వకాల్లో జాప్యం జరుగుతోంది. ఒక బ్లాక్‌లో కిలోమీటర్ కందకం తవ్వకానికి రూ.1.40 లక్షలు చెల్లిస్తున్నాం. దీనికోసం అధికారులు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. జాయింట్ సర్వేలో జాప్యం వల్ల సైతం కందకాల తవ్వకాల్లో జాప్యం జరుగుతోంది. వీటన్నింటినీ అధిగమించి కందకాల తవ్వకాలను లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం. – పద్మజారాణి, డీఎఫ్ఓ -
అడిగినన్ని అటవీ భూములివ్వం
ఇపుడు తీసుకున్న 13 వేల హెక్టార్లను ఎలా వినియోగిస్తారో చెప్పండి రాజధానికి అటవీ భూములపై సీఆర్డీఏకు కేంద్రం ఝలక్ వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లోని చూపిన భూమిలో అడవులు పెరగవు పలు కొర్రీలతో రాష్ట్ర ప్రతిపాదనలను తిప్పి పంపిన వైనం సాక్షి, అమరావతి: నూతన రాజధాని పేరుతో వేల ఎకరాల రైతుల భూమిని అవసరం లేకపోయినా ప్రైవేట్ బడా సంస్థల కోసం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. వేలాది ఎకరాల అటవీ భూమిని కూడా తీసుకునేందుకు వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సీఆర్డీఏకు ఝలక్ ఇచ్చింది. రాజధానిలో అటవీ భూమికి బదులు ఇతర చోట్ల 32,240 ఎకరాల అటవీ భూమి ఇవ్వాలని, అందుకు అనుమతి కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏడాది క్రితం ప్రతిపాదనలను పంపింది. సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనలపై పలు కొర్రీలను వేస్తూ ఇటీవల కేంద్రం తిరిగి వెనక్కు పంపించింది. రాజధాని రీజియన్ కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏకంగా 13 వేల హెక్టార్ల (32,240 ఎకరాలు) భూమి ఎందుకు అవసరమని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేపిటల్ సిటీ కోసం అవసరమైతే అటవీ భూమిని డీ నోటిఫై చేస్తామని చట్టంలో పేర్కొన్నాం తప్ప కేపిటల్ రీజియన్ కోసం కాదని కేంద్రం తెలిపింది. అయినా కేపిటల్ సిటీ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున భూములను సేకరించినందున మళ్లీ అటవీ భూమి ఎందుకని ప్రశ్నించింది. పదేళ్లలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 32 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగ మార్పిడిని కోరితే ఏపీ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 13 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగం మార్పిడి కోరడం ఏంటని నిలదీసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 13 వేల హెక్టార్ల అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో చూపిన భూమి పూర్తిగా రాళ్లతో నిండి ఉందని, అక్కడ అడవి పెంచడం సాధ్యం కాదంది. అడవి పెంచడానికి యోగ్యమైన భూములతో పాటు అడవి పెంచడానికయ్యే వ్యయాన్ని తొలుత కేంద్రానికి డిపాజిట్ చేయాలని తెలిపింది. కాగా రూ.2,000 కోట్ల మేర కేంద్రానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మేర డిపాజిట్ చేయడం సాధ్యం కాదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆ భూములను ఎలా వినియోగిస్తారో చెప్పండి.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13 వేల హెక్టార్ల అటవీ భూమిలో ఏమి చేపడతారు, ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూమిని వినియోగిస్తారో హెక్టార్ వారీగా మాస్టర్ ప్రణాళికను కూడా పంపించాల్సి ఉంటుందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు మాస్టర్ ప్రణాళికను రూపొందించాల్సిందిగా సీఆర్డీఏను కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో ప్రస్తుత కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే అటవీ ప్రాంతాన్ని ఇతర అవసరాలకు వినియోగించేందుకు అంగీకరించలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కేపిటల్ రీజియన్ అవసరాలకు అటవీ భూమిని తీసుకుని బడా పారిశ్రామిక వేత్తలకు, వాణిజ్య కార్యకలాపాలకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల యత్నాలకు గండిపడినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
పరిశ్రమల ఏర్పాటుకు అటవీ భూములు
ఉంగుటూరు: పశ్చిమగోదావరిజిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సోలార్ పవర్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అటవీ భూములను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రెండు పంటలు పండుతున్నా పరిశ్రమలు లేక ఆదాయంలో వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూముల కొరత సమస్యగా ఉందంటూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి లభిస్తుందని, కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. -
అటవీ భూములను రక్షించండి
- పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదన - ఎన్జీటీలో అమరావతి నిర్మాణంపై విచారణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం సహజ వనరుల వినాశనానికి పాల్పడుతోందని, అటవీ భూములను, నీటి కుంటలనుసైతం వదలడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో రాజధాని నిర్మాణంపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి అమరావతిని ప్రభుత్వం ఎంచుకోవడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కూడా విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 251 ఎకరాల అటవీ భూమిని సేకరించడానికి ప్రయత్నిస్తోందని, అలాగే 497 ఎకరాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన నీటి కుంటల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. వీటిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిత్తడి నేలలు ఉన్న అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే కొండవీటి వాగు, కృష్ణా నది నాశనం అవుతాయన్నారు. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని, రాజధాని నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరారు. విచారణ నేటికి వాయిదా.. ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటి దాకా పిటిషనర్ల్లు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందన తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ‘‘ఏటా మూడు పంటలు పండే ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందనేది స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు ఏంటి?. భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఏ విధంగా చెల్లిస్తారు. కొండవీటి వాగు ప్రవా హ దిశ మార్పు అభ్యంతరాలపై సమాధాన మేమిటి?, 10-15 మీటర్లలో భూగర్భ జలా లు లభించే ప్రాంతంలో అభివృద్ధి పేరిటి చేపడుతున్న ఇసుక మైనింగ్‌పై మీ వివరణ ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటికీ సమాధానం కోరుతూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఇంతకీ ఆర్కే ఎక్కడ ?
-
ఇదీ కటాఫ్ ఏరియా కథ
కటాఫ్ ఏరియా.. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడీ పేరు మార్మోగుతోంది. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్ వారం క్రితం ఇక్కడే జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మడ్ అటవీ ప్రాంతం ఎంతటి దుర్భేద్యమైనదో.. ఏవోబీలోని కటాఫ్ ప్రాంతం అంత దుర్భేద్యమైనది. పక్కా ప్రణాళికతో తొలిసారి ఆ ప్రాంతంలోకి పోలీసు బలగాలు అడుగుపెట్టగలిగాయి. దాంతో కటాఫ్ ఏరియా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడెలా చేరుకోగలిగారంటే.. ఇన్నాళ్లూ దుర్లభంగా ఉన్న కటాఫ్ ప్రాంత ప్రవేశాన్ని పక్కా వ్యూహంతో పోలీసు అధికారులు సుగమం చేసుకున్నారు. కటాఫ్ ఏరియాలోని రామగుడ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆ శిబిరాలకు అవసరమైన సరుకులను తరలిస్తున్న విషయాన్ని కూంబింగ్ దళాలు పసిగట్టాయి. వాటిని తరలిస్తున్న వ్యక్తి(కొరియర్)ని అదుపులోకి తీసుకొని మొత్తం సమాచారం రాబట్టారు. దాన్ని ఆధారం చేసుకుని ఆంధ్ర-ఒడిశా పోలీస్ ఉన్నతాధికారులు పరస్పరం చర్చించుకొని పక్కా వ్యూహం రచించారు. జీపీఎస్ తదితర ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల సాయంతో ముందుకు కదిలారు. టార్గెట్ ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిపివేసి, సెల్ సిగ్నళ్లు నిలిపివేసి కాలినడకనే కటాఫ్ ఏరియాకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు నిద్రలో ఉన్న సమయంలో దాడి ప్రారంభించి ఎన్కౌంటర్ చేశారు. వరుసగా మూడురోజులపాటు జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. కటాఫ్ అంటే 1980 దశకంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బలిమెల జలాశయం నిర్మించారు. అయితే సుమారు 142 గ్రామాలు జలాశయం మధ్యలో ఉండిపోయాయి. అక్కడకు చేరుకోవడం చాలా కష్టం. నావలు లేదా లాంచీల్లోనే ప్రయాణం చేయాలి. గ్రామాలన్నీ నీటి మధ్యలో ఉన్న ఎత్తయిన కొండలపై ఉన్నాయి. వీటిలో సుమారు 55 వేల వరకు జనాభా నివసిస్తున్నారు. ఆ ప్రాంతాన్నే కటాఫ్ ఏరియాగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల సహకారం, ఆ ప్రాంత భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉంటే తప్ప అక్కడికి ప్రవేశించడం దుర్లభం. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్‌జోన్‌గా ఇన్నాళ్లూ ఉపయోగించుకున్నారు. సమాంతర పాలన నుంచి సంక్షోభంలోకి.. నాలుగు డివిజన్లు, మూడు కేంద్ర ప్రాంత్రీయ కమాండ్లు(సీఆర్సీలు), ఎనిమిది వరకు ఏరియా కమిటీలు.. వెరసి పోలీసులను దశాబ్ద కాలంగా ముప్పుతిప్పలు పెట్టిన మావోయిస్టు పార్టీ ఏవోబీ జోన్ కమిటీ ఇప్పుడు కీలక నేతలను కోల్పోయింది. ఏవోబీలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేది. తరువాత పోడు వ్యవసాయం పెరిగింది. దీంతో దట్టమైన అడవులు పలుచబడ్డాయి. గతంలో రోడ్లు వద్దని చెప్పిన గిరిజనం ఇప్పుడు రోడ్లు కావాలని కోరుతున్నారు. దీంతో మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు. వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు యువత తీరులో మార్పు వచ్చింది. మావోయిస్టు ఉద్యమంలో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో మావో ఉద్యమం సంక్షోభంలోకి వెళ్లింది. -
అది ఆర్కే అడ్డా
మల్కన్‌గిరి అటవీ ప్రాంతం మావోయిస్టు కే ంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) అడ్డా లాంటిది. మల్కన్‌గిరి జిల్లాలో 1,430 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. దట్టమైన ఆ రిజర్వు ఫారెస్టును స్థావరంగా చేసుకుని దశాబ్దాల తరబడి అక్కడ నుంచే ఆయన తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్కేకు మూడంచెల భద్రత ఉంటుంది. పది నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టు దళ సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వీరిని దాటుకుని వెళ్లడం పోలీసులకు కత్తిమీద సాములాంటిది. ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడికక్కడే మందుపాతర్లను అమర్చి ఉంటారు. ఒకవేళ పోలీసులు ప్రమాదాన్ని ఊహించి తప్పించుకుని వద్దామన్నా బలిమెల రిజర్వాయరును దాటుకుని రావాల్సి ఉంటుంది. లాంచీల్లో వచ్చేద్దామన్నా ఎగువన ఉన్న కొండపై నుంచి మావోలు కాల్పులు జరపడానికి అనువుగా ఉంటుంది. 2008లో బలిమెల రిజర్వాయరులో కూంబింగుకు వెళ్లి వస్తున్న గ్రేహౌండ్స్ దళాల లాంచీపై రాకెట్ లాంఛర్లతో ఇలాగే దాడి చేసి 38 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో పలుమార్లు జరిగిన ఎన్కౌంటర్లలో కొందరు మావోలు మరణించినా ఆర్కే తప్పించుకోగలగడానికి ఈ పరిస్థితులే కారణం. మావోల కంచుకోట ఏవోబీ ఏవోబీ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది మావోయిస్టులు.. తర్వాత గంజాయి సాగు. ఇక్కడి కొండలు, గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం, కనీస సదుపాయాలకు నోచుకోని గిరిజన తండాలు. అక్కడి వారికి ఉపాధి లేని పరిస్థితులు ఉద్యమానికి ఊపిరి పోశాయి. తూర్పు కనుమల్లోని ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 9 జిల్లాల పరిధిలో విస్తరించిన ఏవోబీ జోన్ ఉద్యమానికి పెట్టని కోట. దీని పరిధిలో ఉన్న ఆంధ్రకు చెందిన తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు.. ఒడిశాకు చెందిన గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు ఆయువుపట్లు. ఈ ప్రాంతాలను విభజించి కార్యకలాపాలు సాగిస్తున్నారు. పట్టున్న ప్రాంతాలు: సీలేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న విశాఖ జిల్లాలోని దుర్గం, జాజిపాలెం, గడ్డిబంద, కాకులగెడ్డ, మల్కన్‌గిరి జిల్లాలోని బిర్సింగి, గొంది, గుమ్మాబ్లాక్, చిత్రకొండ, కలిమెల, బలిమెల, ఎంపర్ల మెట్ట, టెక్ పొదర్, కొరాపుట్ జిల్లాలోని నారాయణపట్న, బందుగాం, చినబురిగి, పెదబురిగి, మంగళపురం బ్లాక్‌లు, విజయనగరం జిల్లా పార్వతీపురం, కొమరాడ, సాలూరు, మక్కువ, విశాఖ జిల్లాలోని జీకేవీధి, చింతపల్లి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మావోలకు మంచి పట్టుంది. కాలినడకే శరణ్యం: ఆంధ్రతోపాటు ఒడిశాలోని చాలా ఏజెన్సీ గ్రామాలకు కాలి నడకే శరణ్యం. ముఖ్యంగా ఒడిశాలోని చిత్రకొండ నుంచి బలిమెల రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న దర్లవాడ, పనసపుట్టు, పంపరుమెట్ట, జనభ, ఆండ్రపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలకు వెళ్లాలంటే చిత్రకొండ నుంచి లాంచీల్లో ప్రయాణం చేయాల్సిందే. ఈ గ్రామాలకు అంబులెన్స్ వంటి అత్యసర సేవలను అసలు ఊహించలేం. వ్యాధులు వస్తే మరణం తప్ప నివారణం లేదు. ఈ వెనుకబాటుతనమే గిరిజనులను మావోయిస్టు ఉద్యమం వైపు నెడుతోంది. వందల మంది గిరిజన యువత మిలిషియా కమిటీల్లో చేరి పనిచేస్తున్నారు. అలాగే చాలా మంది దళాల్లో చేరారు. వారి సాయంతోనే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ గుప్పిట్లో ఉంచుకోగలుగుతున్నారు. ఏవోబీ పరిధి 9 జిల్లాలు ఆంధ్రలో: తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఒడిశాలో: చెందిన గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలు. బలిమెలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే... బలిమెలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దానిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. స్థానికులు చెబుతున్న ఓ కథనం మేరకు.. ఏదైనా పెద్ద ప్రాజెక్టును నిర్మించాలంటే పూర్వకాలంలో బలి ఇవ్వడం పరిపాటి. బలిమెల రిజర్వాయర్ నిర్మించే సమయంలో మహిళలకు అమ్మవారు పూని రిజర్వాయర్‌లో నీరు ఎప్పుడూ పుష్కలంగా ఉండాలంటే నిర్మాణం పూర్తయ్యేవరకూ తనకు నిత్యం బలి ఇమ్మని కోరారని స్థానికులు చెబుతున్నారు. ఆందోళన చెందిన ప్రజలు నిత్యం నరబలి ఇవ్వలేమని, జంతు బలి ఇచ్చేందుకు తమకు సమ్మతమేనని అమ్మవారికి వేడుకున్నారు. చిత్రకొండ ప్రాంతంలోని బలిమెల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యే వరకూ ఇక్కడి గిరిజనులు, మైదాన ప్రాంతంలోని జనం నిత్యం ఎక్కడో ఒక దగ్గర జంతు బలి ఇచ్చేవారని.. అందుకే ఈ రిజర్వాయర్‌కు బలిమెల రిజర్వాయర్ అని పేరు పెట్టినట్టు చెబుతున్నారు. ‘గురుప్రియ’ వంతెన నిర్మాణం జరిగితే.. మావోయిస్టులకు అత్యంత అనుకూలంగా ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి అటవీ ప్రాంతంపై పట్టుకోసం అటువైపు ఉన్న ఒడిశా ప్రభుత్వం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు ఇసుమంతైనా సమాచారం లభించే అవకాశం ఉండదు. ఈ అడవుల్లో మావోయిస్టులు తుపాకుల కర్మాగారంతో పాటు పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌ను ఏళ్ల తరబడి నడుపుతున్నట్టు గతేడాది సెప్టెంబర్ 18న పోలీసులు గుర్తించారు. అనంతరం దానిని నిర్మూలించారు. ఇంతటి పటిష్టమైన మావో సామ్రాజ్యంలోకి ప్రవేశించేందుకు వీలుగా మల్కన్‌గిరి జిల్లాలో బలిమెల రిజర్వాయరుకు సమీపంలో గురుప్రియ నదిపై రూ. 188 కోట్లతో 910 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణంతోపాటు రోడ్ల నిర్మాణాలకు 1982లోనే ఒడిశా సీఎం బిజూ పట్నాయక్ పునాది రాయి వేశారు. ఆ వంతెన నిర్మాణం జరిగితే కటాఫ్ ఏరియాలోని 154 గిరిజన గ్రామాలకు రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. దీంతో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది కేంద్రం, ఒడిశా ప్రభుత్వాల వ్యూహం. ఈ ఎత్తుగడను గమనించిన మావోయిస్టులు గురుప్రియ వంతెన నిర్మాణం జరగకుండా ఎదురు దాడులు చేస్తూ వస్తున్నారు. గతేడాది ఆగస్టు 29న బీఎస్ఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారు. ఈ బ్రిడ్జి కాంట్రాక్టును దక్కించుకున్న గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, కార్మికులను హెచ్చరించడంతో ఆ సంస్థ కాంట్రాక్టును ఉపసంహరించుకుని వెనక్కి వెళ్లిపోయింది. చివరకు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు సరిహద్దు భద్రతా దళాల(బీఎస్ఎఫ్) రక్షణగా ఉంచుతామన్న హామీతో కోల్‌కతాకు చెందిన రాయల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ వంతెన ఈ ఏడాదే పూర్తి కావలసి ఉంది. కానీ మావోయిస్టుల దాడులు, హెచ్చరికలతో ఇప్పటిదాకా 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. -
దోపిడీపై తిరుగుబాటు
మౌలిక వసతులు.. గిట్టుబాటు ధరల విషయంలో దళారుల దోపిడీ.. బాక్సైట్ తవ్వకాలు వంటి అంశాల్లో ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకోకపోవడమే వారిని మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ప్రభుత్వాల తీరుతో దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయి.. అభివృద్ధికి దూరంగా కారడవుల్లో మగ్గిపోయిన గిరిజనులు మావోయిస్టులకు ఆశ్రయమిచ్చేవారు.. క్రమంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దశాబ్దాల క్రితం ఏజెన్సీలో దళారీ వ్యవస్థ ఆధిపత్యం చెలాయించేది. గిరిజనుల పంటలకు మదుపుల పేరుతో అడ్వాన్సులు ఇచ్చి.. పంట ఉత్పత్తులను తమకే అమ్మాలని దళారులు షరతులు పెట్టేవారు. పంట అమ్మే సమయంలో తమకు నచ్చిన రేటు కట్టి గిరిజనులను దోపిడీ చేసేవారు. ఇక దళారులతోపాటు గ్రామాల్లోకి వచ్చే పోలీసుల దౌర్జన్యాలకు, గిరి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారు. ఇవేవీ ప్రభుత్వాల దృష్టికి వెళ్లేవికావు. ఒకవేళ వెళ్లినా చర్యలు ఉండేవి కావు. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు వంటి కనీస సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వాలు గిరి పల్లెలను అసలు పట్టించుకోలేదు. ఫలితంగా విద్య, ఉపాధి అవకాశాలకు దూరమైన గిరిజన యువత మావోయిస్టు ఉద్యమం వైపు మొగ్గు చూపారు. బలిమెల రిజర్వాయర్‌లో ముంపునకు గురైన వేలాది ఎకరాల భూములకు బదులు ప్రభుత్వం ఇచ్చిన అటవీ భూములు పంటల సాగుకు పనికి రాకపోగా.. అందుకు ప్రభుత్వం నుంచీ ఎటువంటి సహకారం లభించలేదు. దీంతో పెద్దగా పెట్టుబడి లేకుండానే వేలాది రూపాయల ఆదాయం సమకూర్చే గంజాయి సాగు వైపు గిరిజనులు మొగ్గుచూపారు. అలాగే బాక్సైట్ తవ్వకాల వల్ల అడవులు నాశనమవుతాయని..గిరిజనుల మనగడకే ముప్పు వస్తుందని గిరిజనులతోపాటు పర్యావరణవేత్తలు చేస్తున్న ఆందోళనలు అరణ్యరోదనగానే మిగిలాయి. ఈ పరిస్థితులన్నింటినీ అవకాశంగా తీసుకున్న మావోయిస్టులు అడవుల్లోకి చొచ్చుకుపోయి.. గిరిజనులతో మమేకమవుతూ.. వారి పక్షాన పోరాటాలు చేస్తూ.. ఏవోబీని బలమైన కోటగా మలచుకున్నారు. -
రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
పోడు భూమిలో మొక్కలు నాటడానికి అధికారులు రావడంతో ఘటన నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స్చ ఖానాపురం : పోడు భూమిని సాగు చేసుకుంటున్న దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని చిలుకమ్మనగర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకమ్మనగర్ గ్రామానికి చెందిన కాసాని ఐలయ్య–కోమల దంపతులు తొమ్మిది సంవత్సరాల క్రితం 2 ఎకరాల పోడు భూమిని కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడానికి గ్రామ శివారులో ఉన్న పోడు భూమి వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న ఐలయ్య–కోమల దంపతులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 9 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఈ భూమిపైనే తమ ఇద్దరు కుమార్తెల జీవితం ఆధారపడి ఉందని వారు అధికారులతో వా పోయారు. కానీ, ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటుతామని చెప్పడంతో ఆందోళనకు గురై న కోమల భూమి వద్ద ఉన్న మోనోక్రోటోపాస్ మందును తాగడానికి ప్రయత్నిస్తుండటంతో పక్కనే ఉన్న భర్త చేయితో కొట్టడంతో కింద పడిపోయింది. అదే మందు డబ్బాను తీసుకుని ఐలయ్య సైతం తాగే ప్రయత్నం చేయడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల రైతులు లాక్కునే క్రమంలో ఒంటిపై పడింది. వెంటనే రైతులు.. ఆ దంపతులను నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో సుధీర్‌ను వివరణ కోరగా మొక్కలు నాటడానికి తమ సిబ్బంది ఎవరూ రాలేదని, మందు తాగిన విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. -
అడవిని తీసుకుని రాతినేలలిస్తారా?
రాజధానికి అటవీభూమి ప్రతిపాదనపై స్పష్టం చేసిన ఎఫ్ఏసీ సాక్షి, హైదరాబాద్: దట్టమైన పచ్చని అడవిని రాజధాని కోసం కావాలంటూ ప్రత్యామ్నాయంగా రాతి నేలలు ప్రతిపాదిస్తారా? రాతి నేలల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి? పర్యావరణ సమతౌల్యం ఎలా ఏర్పడుతుంది? ఏయే అవసరాలకు ఎంతెంత అటవీ భూమి కావాలో ఎందుకు సమర్పించలేదు? గుండుగుత్తగా అటవీభూమి బదలాయించాలని ప్రతి పాదిస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలి? అంటూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సలహా కమిటీ (ఎఫ్ఏసీ) ప్రశ్నల వర్షం కురిపించింది. ఏపీ రాజధాని అమరావతికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 13,267.12 హెక్టార్ల (32,783.76 ఎకరాల) అటవీభూమిని బదలాయించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)/ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఎఫ్ఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘రాజధాని’కి 33,000 ఎకరాలు..అటవీ భూమి కావాలి
కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో అవసరాల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33,057.5 ఎకరాల (13,223 హెక్టార్లు) అటవీ భూమిని సీఆర్డీఏకి బదలాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రెండు జిల్లాల్లోని 27 అటవీ బ్లాకుల్లో ఉన్న ఈ భూములు ఇచ్చినందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు రూ.1,357 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్ వంటి సంస్థల బాధితులకు సత్వర న్యాయం కోసం విజయవాడలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పా టు చేసేందుకు ఆమోదం. ఈ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాయా లి. అగ్రిగోల్డ్‌పై ఇప్పటికే 176 కేసులు నమోదైన నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసి దాన్నుంచే ఫిర్యాదులు స్వీకరించాలి. హైకోర్టు నియమించిన జస్టిస్ సీతాపతి కమిటీ ఆధ్వరంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తుల వేలం ప్రక్రియను ప్రారంభించాలి. మొదటి దశలో ఈ నెల 20, 21 తేదీల్లో వేలం వేయాలి. కేసు విచారణను వేగవంతం చేయాలని సీఐడీకి ఆదేశాలు. ► భూముల డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22బీకి సవరణ. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. ►ఈ నెల 8న ఉగాది పండుగను 13 జిల్లాల్లో వైభవంగా నిర్వహించాలి. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు. ► ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం. ► ఉచిత ఇసుక పథకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక మొబైల్ యాప్‌ను తీసుకురావాలి. ఇసుక అవసరమైన వారు ఈ యాప్ ద్వారా కోరినా లేదా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసినా ఇసుక సరఫరా చేసేలా ఏర్పాటు. ఉపాధి హామీ కూలీల దినసరి వేతనాన్ని రూ.194కు పెంచాలి. ► కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానికి లేఖ రాయాలి. ► పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన వాటి కోసం తెలంగాణ సీఎస్‌కు, ఏపీ సీఎస్‌తో లేఖ రాయించాలి. ప్రైవేటుకు భారీగా భూ కేటాయింపులు నాలుగు జాతీయ విద్యా సంస్థలతోపాటు పలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం భారీగా భూములు కేటాయించింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యా సంస్థలకు 914 ఎకరాలు, నాలుగు పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు 180 ఎకరాలు, హీరో మోటార్ కార్పొరేషన్‌కు 600 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యాసంస్థలకు.. ► వైఎస్సార్ జిల్లా కడప మండలం పుట్లంపల్లెలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ కేంద్రం ఏర్పాటు నిమిత్తం ఉన్నత విద్యా శాఖకు 10.15 ఎకరాలు ఉచితంగా కేటాయించారు. ► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరులో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం సాంకేతిక విద్యాశాఖకు 491.23 ఎకరాలను ఉచితంగా ఇచ్చారు. ► విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎం నిర్మాణానికి 241.50 ఎకరాలను సాంకేతిక విద్యా శాఖకు ఉచితంగా ఇచ్చారు. ► పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడకట్ల, తాడేపల్లిగూడెం, కొండ్రుప్రోలులో 172.08 ఎకరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నిర్మాణానికి గాను నిట్ డెరైక్టర్‌కు ఉచితంగా కేటాయించారు. -
అమరావతి నిర్మాణానికి కొత్త విధానం
కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కొత్త విధానం తీసుకొచ్చామని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణంపై అధ్యయనం చేయకుండా అనుమతులు ఇచ్చారన్న విషయంలో వాస్తవం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి కొత్త పాలసీ తెచ్చామనీ, అటవీ భూముల్లోనూ నివాస, వాణిజ్య సదుపాయాలను నిర్మించేందుకు అనుమతిచ్చామని తెలిపారు. అమరావతి నిర్మాణంపై కేంద్రం ఇచ్చిన మినహాయింపు ఈ కొత్త పాలసీ ఒక్కటేనన్నారు. అనుమతుల విషయంలో జాప్యమేమీ లేదనీ పూర్తి అనుమతులు వస్తాయన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి తక్కువ అటవీ భూములు ఉపయోగించాలనీ, అడవులను పరిరక్షించేలా అమరావతిని డిజైన్ చేయాలని మంత్రి పేర్కొన్నారు. -
రైల్వే లైన్ సర్వే భూముల పరిశీలన
వింజమూరు: నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైనుకు సంబంధించి సర్వే చేసిన అటవీ భూములను రైల్వే-అటవీ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం పరిశీలించారు. వింజమూరు, కాటేపల్లి, డక్కనూరు, రాజోలు తదితర ప్రాంతాల్లో రైల్వేలైన్ కోసం సర్వే చేసిన భూములను కావలి సబ్‌డివిజన్ డీఎఫ్ఓ సీహెచ్ నాగభూషణం, రైల్వే సీనియర్ ఇంజినీరు సీహెచ్ సుబ్బారావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సీహెచ్ నాగభూషణం మాట్లాడుతూ 97.2 హెక్టార్లలో అటవీ భూములు రైల్వే శాఖకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రైల్వే లైను నిడివి 308.7 కిలోమీటర్లు కాగా మన జిల్లాలో 145 కిలోమీటర్లు లైను ఏర్పాటవుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 110 కి.మీ, మిగిలినది గుంటూరు జిల్లాలో ఉందన్నారు. మొత్తం బడ్జెట్లో రూ.800 కోట్లు భూముల నష్ట పరిహారం కోసం కేటాయించారన్నారు. -
అనుమతి గోరంత..ఎత్తుకెళ్లింది కొండంత
► వెలుగుచూసిన బెజవాడ పాపిరెడ్డికాలువ మట్టి కుంభకోణం ► ముడుపుల మత్తులో సోమశిల అధికారులు ► రోడ్డు కాంట్రాక్ట్ కంపెనీ అడ్డగోలు వ్యవహారం ► ఆందోళనలో అన్నదాతలు కాంట్రాక్ట్ కంపెనీ కక్కుర్తి.. అధికారుల నిర్లక్ష్యం కావలి కాలువకు శాపంగా మారింది. కట్టకు పెట్టని గోడలా ఉండాల్సిన సిల్టు రోడ్డు పనులకు తరలుతోంది. మట్టి తరలింపు విషయం తెలిసి రైతులు గగ్గోలుపెడుతున్నారు. కాలువ పటిష్టతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కట్టింది కొంచెం.. తీసుకెళ్లేది భారీగా అన్నట్లుగా 20 వేల క్యూబిక్ మీటర్లకు డబ్బు కట్టి లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని ఇప్పటికే తరలించుకెళ్లినా ఇరిగేషన్ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సంగం: 75 వేల ఎకరాల అధికారిక ఆయకట్టు, 50 వేల ఎకరాల అనధికారిక ఆయకట్టు ఉన్న బెజవాడ పాపిరెడ్డి కాలువ (కావలి కాలువ) స్వార్థపరులకు భోజ్యంగా మారింది. సంగం సమీపంలోని పెన్నానది నుంచి 56 కిలోమీటర్ల దూరం వరకు సాగునీరు, తాగునీరు అందించే బెజవాడ పాపిరెడ్డి కాలువ గట్టు మీద ఉన్న సిల్టు(మట్టి)పై నెల్లూరు-ముంబై రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ దృష్టిపడింది. రోడ్డు నిర్మాణం కోసం లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం కావటంతో సోమశిల అధికారులతో సంప్రదింపులు జరిపారు. సోమశిల అధికారులకు కంపెనీకి మధ్య దళారిగా దగదర్తి మండలానికి చెందిన టీడీపీ నేత వ్యవహరించినట్లు సమాచారం. భారీ ముడుపులు తీసుకుని సోమశిల అధికారులకు కంపెనీకి ఒప్పందం కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా క్యూబిక్ మీటర్ మట్టి, సిల్టుకి రూ.30వంతున కంపెనీ 20 వేల క్యూబిక్ మీటర్లు తీసుకునే విధంగా రూ.6 లక్షలు అధికారికంగా ఇచ్చారు. ఈ అనుమతి కాగితాన్ని ఆయుధంగా మార్చుకుని కాంట్రాక్టు కంపెనీ 6 భారీయంత్రాల సహాయంతో రాత్రి పగ లు తేడా లేకుండా లక్ష క్యూబిక్ మీటర్లకుపైగా మట్టి ని సోమవారానికి తరలించారు. మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్న సోమశిల అధికారులు ఆ చాయలకు కూడా రాకపోవడం కొసమెరుపు. ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో అధికారులు ఉండరన్న ఉద్దేశంతో భారీగా మట్టిని తరలిస్తుంది. ఆందోళనలో అన్నదాతలు బెజవాడ పాపిరెడ్డి కాలువ (కావలి కాలువ) సంగం నుంచి దగదర్తి, బోగోలు, జలదంకి, కావలి మండలాల్లో రైతులకు సాగునీరు, కాలనీవాసులకు తాగునీరు అందిస్తుంది. ఇటీవల ఓ అధికారపార్టీ నేత ఈ కాలువ పనులను అస్తవ్యస్తంగా చేశారు. దీంతో కాలువ కట్టలకు రెయిన్కట్స్ పడుతున్నాయి. దీంతో నే ప్రమాదం జరుగుతుందని భయపడుతుంటే కట్టపై ఉన్న మట్టిని కూడా అమ్ముకోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువపై మట్టినే కాక కట్టలను ైసైతం యంత్రాల సహాయం తో ధ్వంసం చేస్తున్నా సోమశిల అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువపై మట్టిని అమ్ముకుంటే భవిష్యత్‌లో కాలువకు గండిపడితే పూడ్చేందుకు కూడా మట్టి దొరకదని వాపోతున్నారు. ఇప్పటికైనా సోమశిల అధికారులు ముడుపుల మత్తులో నుంచి బయటకు వచ్చి కాలువపై మట్టిని అమ్ముకోవడం మానుకోవాలని రైతులు కోరుతున్నారు. అటవీభూముల్లో సైతం మట్టి తరలింపు కాంట్రాక్టు కంపెనీ రోడ్డు విస్తరణ పనుల కోసం అనుమతి లేకుండానే సంగం కొండ మట్టిని తరలించింది. అనుమతులు లేకుండా ఆ కంపెనీ అటవీశాఖ పరిధిలోని సంగం కొండ మట్టి తరలించడంపై అటవీశాఖ అధికారులు స్పందించి సంఘటన స్థలానికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాలు, టిప్పర్లు సీజ్ చేయబోయారు. ఇంతలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేత నుంచి ఫోన్ రావడంతో కేసులు నమోదు చేయకుండా ఇకపై అనుమతులు లేకుండా అటవీ భూముల్లో మట్టి తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మట్టి అవసరానికి ఆ కంపెనీ సోమశిల అధికారులను తమ బుట్టలో వేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. -
అటవీ భూముల్లో పంటల జోలికి రావద్దు
పేదలు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో పంటలను ధ్వంసం చేయవద్దంటూ వ్యవసాయ కార్మిక సంఘం బుధవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. జిల్లాలోని పెంటకల్లు, తుగ్గలి గ్రామాల్లో సుమారు 70 ఎకరాల్లో 35 మందికి పైగా రైతులు పంట సాగు చేసుకుంటున్నారని.. వారిని రోడ్డున పడేయ్యద్దని కోరారు. ఈ గ్రామాల్లోని రైతులు 40 ఏళ్లుగా ఈ భూముల్లో పంట సాగు చేసుకుంటున్నారని వివరించారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పెంటకల్లు, తుగ్గిలి గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఉమ్మడి పరిశోధన
- అటవీ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం - మెదక్ జిల్లాలో 40 హెక్టార్లలో పరిశోధన కేంద్రం సాక్షి, హైదరాబాద్: అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ గతంలో పట్టాలు జారీ చేసిన భూముల్లో (ఆర్ఓఎఫ్ఆర్) తిరిగి అటవీ సంపదను వృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను సీఎం కేసీఆర్ మంగళవారం ఆమోదించారు. అటవీ సంపద వృద్ధిపై పరిశోధనకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు మెదక్ జిల్లా ములుగు అటవీ ప్రాంతంలో సుమారు 40 హెక్టార్ల భూమిని కేటాయించాలని నిర్ణయించారు. ‘ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టు’ పేరిట అటవీ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా చేపట్టే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి పీకేశర్మ సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. అంతగా సారవంతం లేని ఈ భూములకు నీటిపారుదల సౌకర్యం లేకపోవడం, పంట ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంతో అటవీ సంపదనే వృద్ధి చేయాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. అటవీ భూములపై హక్కులు ఉన్న వ్యక్తులు, సమూహాలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. అటవీ భూములపై ఆధా రపడి వున్న షెడ్యూలు తెగలతో పాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ 2006లో ప్రత్యేక చట్టం రూపొందించారు. 2008 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా 96,238 మందికి (3,13,912 ఎకరాలు), 744 సమూహాల (5,30,082 ఎకరాలు)కు అటవీ భూములపై హక్కులు కల్పించారు. ప్రస్తుతం సీఎం ఆమోదించిన ప్రాజెక్టు ప్రతిపాదనల ప్రకారం ఈ భూముల్లో అట వీశాఖ సహకారంతో ఉద్యానవన శాఖ... అటవీ జాతులు, ఉద్యాన, వ్యవసాయ పంటల సాగుపై పరిశోధనలు నిర్వహిస్తుంది. తద్వారా అటవీ భూములపై ఆధారపడి సాగు చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శులు కె.భూపాల్‌రెడ్డి, ప్రియాంక వ ర్గీస్ పాల్గొన్నారు. -
అటవీ భూములను డీనోటిఫై చేస్తాం
ఆచంట/తాడేపల్లిగూడెం : జిల్లాలోని 16 వేల ఎకరాల అటవీ భూములను డీనోటిఫై చేసి వినియోగంలోకి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఆచంట, తాడేపల్లి గూడెంలో జన్మభూమి-మా ఊరు సభల్లో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. అరుుతే సారవంతమైన భూములు ఉండడంతో జిల్లాలో పరిశ్రమల నెలకొల్పడానికి భూసేకరణ సమస్య ఎదురవుతోందని, దీనిని అధిగమించడానికి అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు నిర్ణరుుంచామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. మంత్రి మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఆయన వెంట ఉన్నారు. సెల్‌ఫోన్ వాడడం కాదు.. మరుగుదొడ్లు నిర్మించుకోండి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేల రూపాయల ఖరీదు చేసే సెల్ఫోన్లు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారని, దానికంటే ముందు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మంత్రి అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. ఆచంటలో జరిగిన జన్మభూమి-మా ఊరు సభలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ్రపభుత్వం రూ.15 వేలు అందిస్తుందని ప్రజలు కూడా సహకరించి ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు రుణమాఫీలో 85 శాతం రైతులకు న్యాయం జరిగిందని, 10 శాతం రైతులు వారు తీసుకున్న రుణాలు దుర్వినియోగం చేయడంతో వారికి మాఫీ వర్తించలేదని, మరో ఐదు శాతం మంది రైతులకు న్యాయం జరగలేదని వారికి న్యాయం చే స్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తున్నామని, డ్వాక్రా సంఘాల వడ్డీ మాఫీకే రూ.1,250 కోట్లు విడుదల చేశామన్నారు. సమావేశంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు పాల్గొన్నారు. -
అటవీ భూముల నజరానా
జగ్గీ వాసుదేవ్‌కు కట్టబెట్టేందుకు సర్కారు సిద్ధం వాటి విలువ సుమారు రూ.వెయ్యికోట్లు సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో కోట్లాది రూపాయల విలువైన అటవీ భూముల్ని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌కు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనపురం ప్రాంతంలోని 400-500 ఎకరాల అటవీ భూమిని ఇందుకు ఎంపిక చేయడం వెనుక మతలబేంటన్న విషయంపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా జగ్గీ వాసుదేవ్‌ను తీసుకొచ్చి ఈ భూములను చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విలువైన భూములు.. ఈ ప్రాంతంలో ఎకరం పొలం విలువ నాలుగు నెలల క్రితం వరకూ రూ.50 నుంచి రూ.60 లక్షలు ఉండేది. తుళ్లూరు రాజధాని ప్రకటన తర్వాత దాదాపు రూ.కోటి నుంచి కొన్నిచోట్ల రెండు కోట్లకూ చేరింది. ఆ ప్రకారం.. ఈషా ఫౌండేషన్‌కు కట్టబెట్టే భూముల విలువ రూ.వెయ్యి కోట్లకు పైమాటే. ఈ ప్రాంతంలో మొత్తం ఆరువేల ఎకరాల అటవీ భూములుండగా అందులో 1,500 ఎకరాల్లో వనసంరక్షణ సమితిలున్నాయి.మూలపాడు, త్రిలోచనపురం, కేతనకొండ, జూపూడి, దొనకొండ గ్రామాలకు చెందిన పేదలు వెదురు, జామాయిల్‌ను ఈ భూముల్లో పెంచి జీవనం సాగిస్తున్నారు. ఈ భూములు జగ్గీవాసుదేవ్ చేతిలోకి వెళితే వారందరి ఉపాధికి గండి పడినట్లే. కేంద్రం అనుమతితో ఈ భూముల్ని డీనోటిఫై చేయాల్సివుంది. కేంద్రంతో దీనిపై సంప్రదించకుండానే జగ్గీవాసుదేవ్‌కు భూములిచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. అడవిపైనే ఆధారపడ్డాం.. 20 సంవత్సరాల నుంచి అడవినే నమ్ముకుని జీవిస్తున్నాం. గతంలో భూములు బాగు చేసుకుని సాగు చేసుకోమన్నారు. వాటిని తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ భూముల్ని బాగు చేసుకుని వెదురు, జామాయిల్ వేశాం. వీటిని తీసేసుకుంటే మేమెక్కడికి వెళ్లాలి. - అనసూర్య, త్రిలోచనపు -
రూ.1000 కోట్ల భూ దందా!
► విద్యాసంస్థల స్థాపన పేరుతో జగ్గీ వాసుదేవ్‌కు నజరానా ► కారుచౌకగా త్రిలోచనాపురం అటవీ భూముల విక్రయానికి సిద్ధం ► ఇషా ఫౌండేషన్‌కు కట్టబెట్టేందుకు యత్నాలు ► ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్న మంత్రి గంటా ► కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావడమే తరువాయి నగర సమీపంలో రూ.1000 కోట్ల భూదందాకు రంగం సిద్ధమైంది. విద్యాసంస్థల స్థాపన పేరుతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు దగ్గరుండి మరీ ఈ తంతు నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : వెయ్యి కోట్ల రూపాయల విలువైన అటవీ భూమిని కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యూహం పన్నారు. ఇందుకు విద్యా సంస్థల స్థాపన పేరు సాకుగా చెబుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూమిని ఇందుకు ఎంచుకున్నారు. చదునైన భూమి కావడం, పచ్చని చెట్ల మధ్య ఉండడం, చల్లని వాతావరణానికి అనుకూలమైన ప్రాంతం కావడంతో ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. నాలుగు రోజుల కిందట పరిశీలన... త్రిలోచనాపురంలోని అటవీ భూములను ఈ నెల 15న మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ బాబు.ఎ, అటవీ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్‌తో పాటు పలువురు రెవెన్యూ, అటవీ అధికారులు, యోగా గురువు జగ్గీ వాసుదేవ్ కలిసి పరిశీలించారు. వాసుదేవ్ ఈ భూమిని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు గంటా ప్రకటించారు. ఆయన ఇషా ఫౌండేషన్ పేరుతో తమిళనాడులోని కోయంబత్తూరులో పలు విద్యా సంస్థలు నడుపుతున్నారు. విద్యా సంస్థలు కొత్త రాజధాని ప్రాంతానికి కావాలని, అందుకు వాసుదేవ్ ముందుకు వచ్చారని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే విజయవాడ పరిసరాల్లో ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీలు ఉన్నాయి. ఇంత మొత్తంలో స్థలం ఇస్తే కాలేజీలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. పైగా ఇషా ఫౌండేషన్ వారు పెడుతున్నది కొత్త కోర్సులేమీ కావు. లా కాలేజీ, ఎంబీఏ, సీఏ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్వయంగా వాసుదేవ్ చెప్పుకొన్నారు. 500 ఎకరాలు అప్పగించేందుకు ప్రతిపాదనలు... ఇక్కడ చదునైన భూమి 400 ఎకరాలు ఉంది. మరో 100 ఎకరాలు కొండ ప్రాంత భూమి కలిపి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రి గంటా శ్రీనివాసరావు అటవీ భూమిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయించే పనిలో ఉండడంతో ఎలాగైనా వాసుదేవ్‌కు ఈ భూమిని అప్పగించేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. అటవీ భూముల్లో అనుమతుల్లేకుండా చెట్లు కొట్టకూడదు. త్రిలోచనాపురం అటవీ ప్రాంతంలో భూమిని మాత్రం పూర్తిస్థాయిలో చెట్లు కొట్టి చదును చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటే అటవీ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. ఎకరా రూ.2 కోట్లు... ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఇబ్రహీంపట్నానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంది. ఇంత విలువైన భూమిని ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనేది సుస్పష్టమని పలువురు పేర్కొంటున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు -డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు త్రిలోచనాపురంలోని అటవీ భూములను ప్రైవేటు వారికి ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదని డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు చెప్పారు. ఇషా ఫౌండేషన్‌కు అటవీ భూములు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. మంత్రి, ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్లారని తెలిపారు. అటవీ భూములు తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. -
అటవీ భూమి ఆక్రమణ
హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో సుమారు 80 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆర్ఎస్ నంబర్ 11లోని ఈ భూమిని ఆక్రమించిన బడాబాబులు రాత్రి సమయాల్లో పొక్లెయిన్‌తో భూమిని చదును చేయించారు. నాలుగు అడుగుల వరలతో మూడు అడుగుల నీటితొట్టెలు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. మామిడి మొక్కలు కూడా నాటారు. ఒకవైపు ఫెన్సింగ్ కూడా పూర్తిచేశారు. మిగిలిన మూడువైపుల గుంతలు తీసి ఫెన్సింగ్ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. పక్షం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. ఆర్ఎస్ నంబరు 11లో 1,460 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో వంద ఎకరాలు గతంలో ఉద్యానశాఖ వన నర్సరీకి కేటాయించగా, మిగిలిన భూమి ఆక్రమణలకు గురైంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలో నిరుపేదలకు కొంత భూమి కేటాయించి బడాబాబుల ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. నిరుపేదల ఆక్రమణలకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆక్రమణలు జరిగిన, మొక్కలు నాటని భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లుగా ప్రకటించారు. అలా ఉన్న భూమి నిరుపేదల ఆధీనంలో ఉండడంతో ఇటీవల ఇద్దరు ఆక్రమణదారులు కొంత సొమ్ము ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇవ్వనివారిని కూడా బెదిరించి మరికొంత భూమి స్వాధీనం చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల బృందం ఈ అటవీ భూములను పరిశీలించగా ఇక్కడ జరుగుతున్న బాగోతం బట్టబయలైంది. గ్రామ వీఆర్వో ఏసుపాదంను ‘సాక్షి’ వివరణ కోరగా నైజాం ప్రభుత్వం నుంచి ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆక్రమణదారులు చెబుతున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారుల హడావుడి ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆక్రమిత స్థలం వద్దకు చేరుకొని ట్రాక్టర్‌తో ఫెన్సింగ్, నీటి తొట్టెలను ధ్వంసం చేశారు. ఆక్రమణలపై మండల తహశీల్దారు కె.గోపాలకృష్ణ వివరణ ఇస్తూ.. మల్లవల్లి గ్రామంలో అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలిసిందన్నారు. గొల్లపల్లికి చెందిన పొట్లూరి గోపాలకృష్ణ, పంతం కామరాజు సుమారు 80 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు గ్రామ రెవెన్యూ అధికారి చెప్పారని వివరించారు. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
దొనకొండను చూడరేం?
ప్రయాణ సౌకర్యాలను బట్టి దొనకొండ ఎంతో అనువైనది. అక్కడ ప్రభుత్వ భూమే మొత్తం 54,483 ఎకరాలతో అనువుగా ఉంది. అటవీభూమి 20,248 ఎకరాలుంది. బీడుగా పడివున్న 10,037 ఎకరాలున్నాయి. ప్రకృతి రమణీయతతో కొండలు! రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు దొనకొండకు మధ్య దూరం ఎక్కువేమీ లేదు. విశాఖ, విజయవాడ, గుంతకల్లు, మద్రాసు, బెంగళూరులకు ఇక్కడ నుంచి రైలు సౌకర్యాలున్నాయి. ప్రస్తుతం నంద్యాల-విజయవాడ మధ్య రైల్వే మార్గం ఉంది. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు నిర్మిస్తున్న రైలుమార్గం మరో 30 కిలోమీటర్లు నిర్మిస్తే ఈ పథకం పూర్తయినట్టే. ఆ పనులు పూర్తయితే హైదరాబాద్ - బెంగళూరులకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ‘ఈ విశ్వ ప్రపంచంలో చరిత్రలేని వస్తువేమున్నది? చరిత్ర రాయికున్నది, రప్పకున్నది. మనుషులకు ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? (అందుకే)రాతికి సంబంధించిన చరిత్ర భూగర్భశాస్త్రంగా పరిణమించింది. రప్పకున్న చరిత్ర వృక్షశాస్త్రంగా వికసించింద’ని మన సుప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధకుడు మల్లంపల్లివారు చెప్పారు. అలాగే శాసనాధారాలు లేని ప్రాంతంలేదు. పాలనకు అనువుగాని మండలాలు, గ్రామాలు, ప్రాంతాలూ ఉండవు. ఒక నాటి అశ్మక జనపదా నికి నేటి బోధన్ చిరు రాజధాని కాదా? 17-18 శతాబ్దాల్లో కర్నూలు చిన్నదైనా హైదరాబాద్ నవాబులకు రాజధానిగా పేరొందలేదా? 14వ శతాబ్దిలో నాటి విశాఖ, విజయనగరం జిల్లాలలోని వీర నారాయణం, గుడివాడ, లక్కవరపు కోట ప్రాంతాలు కలిపి ఏర్పడిన ‘జంతుర్నాడు’కు రాజ ధానిగా ఉన్న ఎలమంచలి చిన్నది కాదా? కందర రాజులకు నరసరావుపేటలోని ‘కపోత కందర పురం’గా పేరుపడిన చేజెర్ల గ్రామం రాజధానిగా లేదా? పూర్వ చాళుక్య రాజధానులుగా జననాథపురం (ద్రాక్షారామం), పెదవేగి కుగ్రామాలు లేవా? పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు విభజనానంతరం పరిశేష రాష్ట్రంలో ఆ పదవి చేపట్టడం న్యూన తగా భావిస్తున్నట్టుంది! ఆ చూపే ప్రకాశం జిల్లా దొనకొండను చూడనివ్వదు! అన్నీ ఉన్నా ‘అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా ఈ రాష్ట్రానికి రాజధాని కొరత! నేటి స్పెక్యులేటివ్ ధనస్వామ్య ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా నడుపుతున్న నాయకుల హయాంలో ఏపీ రాష్ట్ర రాజధాని సమస్య కూడా ’చట్టా వ్యాపారం’లో భాగస్వామి అయిపోయింది! ప్రపంచంలో ఏ దేశంలోగానీ, ఏ రాష్ట్రంలోగానీ భారీ జనాభా సాంద్రతతో కిక్కిరిసిపోయిన పట్టణాలే, ప్రాంతాలే లేదా ప్రదేశాలే ఆ దేశాలకు గానీ, అక్కడి రాష్ట్రాలకు గానీ రాజధానులుగా ఎంపిక కాలేదు. చిన్న పట్టణాలు, లేదా ప్రాంతాలు కూడా రాజధానులై శోభించినవే. అమెరికాలోని న్యూయార్క్ రాజధాని ఆల్బనీ ఒకనాటి చిన్న సిటీ. కాలిఫోర్నియా రాజధాని శాన్ఫ్రాన్సిస్కో పెద్ద నగరం కాదు... పిట్టంత శాక్రమెంట్! అలాగే ఆస్ట్రేలియా రాజధాని ఓ చిన్నపాటి పాలనా కేంద్రం. కానీ ఆస్ట్రేలియా ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలు సిడ్నీ, మెల్బోర్న్! అదీ పాలనాకేంద్రాల వికేంద్రీకరణ అంటే! రెండు ప్రాంతాలకు చేరువగా... ఇలా చూసినపుడు నూతన రాజధాని ఎంపికను ఆర్థిక ‘సామ్రాజ్యాలు’ సృష్టించుకున్న మోతుబరుల కార్పొరేట్ ప్రయోజనాల రీత్యా నిర్ణయించ కూడదు. ప్రైవేట్ భూముల క్రయవిక్రయాల స్పెక్యులేషన్‌కు తావివ్వరాదు. పైగా రాయలసీమవాసులు యావదాంధ్రజాతి ఐక్యత కోసం ఒకసారి కర్నూలును కోల్పోయి, రాజధాని ప్రతిపత్తిని త్యాగంచేశారు. కాబట్టి అటు రాయలసీమకు, ఇటు కోస్తాంధ్రకు అందుబాటులో ఉన్న దొనకొండ పట్టణం రాష్ట్ర రాజధానిగా పరిశీలనార్హమైనదే. ప్రకాశం జిల్లాకు తూర్పున సముద్ర తీరం, కొత్తపట్నం, చీరాల దగ్గర ఓడరేవు, నౌకా కేంద్రాలున్నాయి. పుష్కలంగా ఉన్న భూవసతి దమ్మిడీ ఖర్చు లేకుండా ప్రభుత్వభూమే మొత్తం 54,483 ఎకరాలతో అను వుగా ఉంది. అటవీభూమి 20,248 ఎకరాలుంది. బీడుగా పడివున్న 10,037 ఎకరాలున్నాయి. ప్రకృతి రమణీయతతో కొండలు! రాష్ట్రంలోని వివిధ జిల్లా లకు దొనకొండకు ఉన్న దూరం ఎక్కువేమీ లేదు. జిల్లాలోని పెద్ద పట్టణా లలో దొనకొండ ఒకటి. మైదాన ప్రాంతం. సముద్రమట్టానికి 446 అడుగుల ఎత్తులో ఉంది. వ్యవసాయం, దానిపై ఆధారపడిన అనుబంధ ఉత్పత్తులు ప్రధాన వర్తక, వాణిజ్యాలు. ప్రసిద్ధ వ్యవసాయ క్షేత్రం ఆరవల్లిపాడు దగ్గరే ఉంది. వైశాల్యంతో పోలిస్తే జన సాంద్రత తక్కువ! రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించిన విమానాశ్రయం నిరుపయోగంగా ఉంది. వ్యూహాత్మ కంగా కీలకం కనుక ఇక్కడ ఇంధనం నింపుకునే కేంద్రంగా ఏరోడ్రోమ్‌ను నిర్మించారు. కోస్టల్ కారిడార్ ఏర్పడితే రోడ్డు మార్గం కూడా అందుబాటు లోకి వస్తుంది. అంతా రాజధానిగా భావిస్తున్న గుంటూరుకు ఇది 140 కిలో మీటర్లలోనే ఉంది. దొనకొండకు 10 కి.మీ. దూరంలో జాతీయ రహదారి ఉంది. భూకంప మండలానికి కూడా చాలా దూరంగా ఉన్న పట్టణం దొనకొండ అని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. ఇక వరదలకూ అది దూరమే! అలాంటి దొనకొండ కోస్తాంధ్ర, రాయలసీమల సాంస్కృతిక బంధాలకు ఏపీ నడిబొడ్డుగా ఉంటుందని వివిధ ప్రజా సంఘాలు కూడా భావిస్తున్నాయి. రైల్వే సౌకర్యాల నిలయం విశాఖ, విజయవాడ, గుంతకల్లు, మద్రాసు, బెంగళూరులకు ఇక్కడ నుంచి రైలు సౌకర్యాలున్నాయి. ప్రస్తుతం నంద్యాల - విజయవాడ మధ్య రైల్వే మార్గం ఉంది. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు నిర్మిస్తున్న రైలు మార్గం మరో 30 కిలోమీటర్లు నిర్మిస్తే ఈ పథకం పూర్తయినట్టే. ఆ పనులు పూర్తయితే హైదరాబాద్ - బెంగళూరులకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. విజయవాడ నుంచి చెన్నై, విశాఖలకు కనెక్టివిటీ ఉంది. బనగానపల్లె (కర్నూలు జిల్లా) వరకూ రైలుపట్టాలు నిర్మించారు. రాయలసీమ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలను కలిపే ప్రధాన రైలుమార్గం ఉంది. దొనకొండలోనే స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ కూడా ఉంది. దొనకొండ మీదుగా వెళ్లే ప్రతి రైలుకూ స్టీమ్ లోకో మీటర్ గేజ్ ఉన్నప్పుడు అందుబాటులో ఉండేది. అప్పట్లో రైల్వే ఎస్టాబ్లిష్ మెంట్ దొనకొండ పట్టణ వ్యవస్థకు జీవనాడిగా వర్ధిల్లింది. అలాంటిది మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చడంవల్ల స్టీమ్ ఇంజిన్లకు బదులు డీజిల్ లోకోలు రావడంతో స్టీమ్ లోకో షెడ్డు మూతబడింది. రైల్వే ఉద్యోగులంతా ఇతర రైల్వే డివిజన్లకు వలసపోవడంతో దొనకొండ పట్టణం ప్రధానమైన ఒక ఆర్థిక సౌలభ్యాన్ని కోల్పోవలసివచ్చింది. ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ నిర్మానుష్యంగా ఉండిపో యాయి. రైల్వేస్టేషన్ కోడ్‌లో ఒకప్పుడు ‘డి.కె.డి’గా ప్రసిద్ధి కెక్కిన దొనకొండను అందరం కాపాడుకోవాలి. ఒక ప్రధాన కేంద్రంగా కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సాధించేందుకు ఎంపీలు కృషిచేయాలి. నీరూ సమస్య కాదు మండల కేంద్రమైన దొనకొండకు కేవలం వంద కిలోమీటర్లలోనే ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీజలాలు తేలిగ్గా చేరతాయి. సాగర్ కాలువ ప్రవహించే లక్ష్మీపురం పంచాయతీ దొనకొండ మండలంలోనిదే. అంతేగాదు రెండు సొరంగాల ద్వారా కృష్ణా జలాలను పారించడానికి ఉద్దేశించిన వెలుగొండ ప్రాజెక్టు త్వరలోనే పూర్తికావస్తోంది. అలాగే నీటి సరఫరాను గుండ్లకమ్మ నది ద్వారా కూడా పెంచుకోవచ్చు. దొనకొండకు కృష్ణా నుంచి 10 టీఎంసీల నీరు ఇప్పించడం సాధ్యమే. ఎందుకంటే, దొనకొండ పక్క నుంచే ప్రవహించే దర్శి బ్రాంచి కెనాల్ ఈ నీటిని రాజధానికి చేర్చడం చాలా సులభమని నిపుణుల అంచనా! నాయకులు పిదప ఆలోచనలు మాని కోస్తా, రాయలసీమ ప్రజాబాహుళ్యపు విశాల ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని తద్వారా మిగిలిన రాష్ట్ర గౌరవ, ప్రపత్తులనైనా నిలబెట్టగలరని ఆశిద్దాం! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్ -
‘అడవిదొంగల’పై వేటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అటవీకలప గడప దాటింది.. ప్రభుత్వ క్వార్టర్ ప్రైవేటు పరమైంది.. అటవీ భూమిల్లో అనధికార రోడ్డు వెలసింది. ఈ తతంగానికి సూత్రధారులెవరో కాదు.. సాక్షాత్తూ వన సంరక్షకులే. కంటికి రెప్పలా కాపాడాల్సిన వన సంపదను ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన వైనాన్ని ఆలస్యంగా గుర్తించిన అటవీశాఖ.. ముగ్గురు అధికారులపై వేటు వేసింది. హైదరాబాద్ సౌత్ రేంజ్‌లోని ఇబ్రహీంపట్నం సెక్షన్ పరిధిలోని పలు బ్లాకుల్లో అక్రమంగా కలపను విక్రయించడంతోపాటు వన సంరక్షణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత తొలగించారు. ఇబ్రహీంపట్నంలోని అటవీ అధికారి క్వార్టర్‌ను ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇచ్చారు. అంతేకాక అటవీ భూమిలో కేబు ల్ లైన్లు వేసే క్రమంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారులతో విచారణ చేయించిన అటవీ శాఖ.. వారి నివేదిక ఆధారంగా వేటువేసింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సెక్షన్ ఆఫీసర్ శ్రీవాణి, బీట్ఆఫీసర్ మొయినొద్దీన్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ అధికారి నాగభూషణం ఉత్తర్వులు జారీ చేశారు. రేంజ్ పరిధిలో ఇంతటి అక్రమాలు జరుగుతున్నా పసిగట్టకుండా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఏకంగా హైదరాబాద్ రేంజ్ ఆఫీసర్ రామరాజును అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామరాజు స్థానంలో హైదరాబాద్ నార్త్ రేంజ్ ఆఫీసర్ విజయ్‌కుమార్‌కు అదనపు బాధ్యత లు అప్పగించారు. ఇబ్రహీం పట్నం సెక్షన్ ఆఫీసర్‌గా సాహెబ్‌నగర్ సెక్షన్ ఆఫీసర్ మోహన్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
అటవీభూముల అవపోసన!
రెవెన్యూ అధికారుల తలమునకలు పేదల ఆధీనంలోనే 90శాతం భూమి ఆక్రమణల తొలగింపు సాధ్యమేనా? రాజధాని కోసం ప్రత్యామ్నాయం నివేదికలు సిద్ధం నూజివీడు : రాజధాని ఏర్పాటుపై రాష్ట్రంలో ఎడతెగని చర్చ సాగుతున్న నేపథ్యంలో నూజివీడు డివిజన్లో ఉన్న అటవీభూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకుపైగా అటవీ భూములున్నప్పటికీ దాదాపు 90శాతం పేదల ఆధీనంలోనే ఉన్నాయి. జిల్లాలో ఏ రెవెన్యూ డివిజన్లో లేనివిధంగా నూజివీడు డివిజన్‌లోనే అటవీ భూములున్నాయి. ఎక్కువ మేర నేల అటవీభూమి ఉండడంతో పేదలు, చిన్న, సన్నకారు రైతులు, కొంతమంది బడాబాబులు పండ్లతోటలు, ఇతర పంటలు సాగుచేసుకుంటూ కాస్త ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన ందున రాజధానితో పాటు ఇతర జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ భూములు ఏఏ మండలాల్లో ఎంతెంత మేరకు ఉన్నాయి. అవి ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయి. అటవీశాఖ అధీనంలో ఉన్న విస్తీర్ణమెంత అన్న వివరాలను ఆయా మండలాల తహశీల్దార్ల నుంచి సేకరించి నివేదికను సిద్ధం చేస్తున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 1460ఎకరాల అటవీభూములుండగా రైతులు, పేదలు, బడా వ్యక్తులు ఆక్రమించుకోగా కేవలం 60ఎకరాలు మాత్రమే అటవీశాఖ ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. అలాగే మడిచర్లలో కూడా దాదాపు 14వందల ఎకరాలుండగా అక్కడ కేవలం 80ఎకరాలు మాత్రమే అటవీశాఖ వద్ద ఉంది. నూజివీడు మండలం జంగంగూడెం,దేవరగుంట, సుంకొల్లు, యనమదల, బత్తులవారిగూడెం, హనుమంతులగూడెం, సిద్ధార్ధనగర్ గ్రామాల పరిధిలో అటవీభూములున్నప్పటికీ దాదాపు ఆక్రమణలోనే ఉన్నాయి. ముసునూరు మండలం కాట్రేనిపాడు, చక్కపల్లి, చిల్లబోయినపల్లి, లోపూడి, చాట్రాయి మండలంలో ఆరుగొలనుపేట, పర్వతాపురం, చీపురుగూడెం, సోమవరం, బూరుగగూడెంలలో కలిపి దాదాపు 2వేల ఎకరాల అటవీభూములుండగా దీనిలో 15వందల ఎకరాలు ఆక్రమణలోనే ఉన్నాయి. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో రంగాపురం, నాగులూరు ప్రాంతాలలో కలిపి దాదాపు 6వేల ఎకరాల అటవీ భూమి ఉండగా అదంతా ఆక్రమణలోనే ఉంది. రాజధాని నిర్మాణంతోపాటు ఇతర సంస్థల ఏర్పాటుకు కావాల్సిన స్థలం మైదాన ప్రాంతంలో దొరకని పక్షంలో ప్రత్యామ్నాయం చూడాలనే ఉద్దేశంతోనే అటవీభూముల వివరాలు సేకరిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆక్రమణలను తొలగించడం సాధ్యమేనా? అటవీభూములన్నీ ఆక్రమణలకు గురై ఉన్న నేపథ్యంలో ఆ ఆక్రమణలను తొలగించడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. దాదాపు గత 30ఏళ్లకు పైగా పేదలు, మధ్యతరగతి ప్రజలు అటవీభూములను ఆక్రమించుకుని పండ్లతోటలు సాగుచేసుకుంటున్నారు. మామిడి, కొబ్బరి, పామాయిల్ వంటి పండ్ల తోటలను సాగుచేస్తున్నారు. వేలాది మంది పేద కుటుంబాల వారు ఈ భూములను ఆక్రమించుకుని సాగుచేసుకోవడం ద్వారా ఎంతోకొంత వారి ఆర్థికపరిస్థితి మెరుగైంది. ఈ ఆక్రమణలపర్వంలో సీపీఐ ప్రధానపాత్ర వహించి భూపోరాటాల ద్వారా పేదలకు భూములను పంచింది. పేదప్రజల జీవన విధానంలో ఈ భూములు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వీరందరినీ తొలగించడమనేది సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. -
ఎన్ఐటీనా.. మాకొద్దు: గోవా గ్రామస్థుల నిరసన
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఎన్ఐటీ. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ తమ ప్రాంతంలో వస్తోందంటే ఎవరైనా వద్దంటారా? కానీ, గోవాలోని కున్కోలిమ్ గ్రామస్థులు మాత్రం తమకు ఎన్ఐటీ వద్దంటే వద్దని పట్టుబడుతున్నారు. రాజధాని పనజికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఎన్ఐటీ పెట్టడానికి ప్రతిపాదన రావడంతో ఈ ప్రాంతం వాళ్లు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది పెట్టడం వల్ల అటవీ భూమిని తీవ్రంగా కోల్పోవాల్సి వస్తుందని, అందువల్ల ఇది తమకు వద్దంటే వద్దని నొక్కి చెబుతున్నారు. ఈ విద్యాసంస్థకు ఆరు లక్షల చదరపు మీటర్ల స్థలం కేటాయించారని, దాదాపు ఈ ప్రాంతమంతా అడవులతో నిండి ఉండటమే కాక, అపార జీవవైవిధ్యంతో కూడి ఉంటుందని వాళ్లు వాదిస్తున్నారు. దీన్ని కోల్పోవడం ఏమాత్రం సమంజసం కాదని ఎన్ఐటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ సభ్యుడు ఆస్కార్ మార్టిన్స్ తెలిపారు. భూసేకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గోవాలో ఎన్ఐటీ ఏర్పాటు చేయాలని గత సంవత్సరం తలపెట్టింది. ఉన్నత విద్య కోసం గోవా విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సంస్థ కోసం మొత్తం 12 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించగా, అందులో దాదాపు సగం అటవీ భూమే. కొంత భాగం వ్యవసాయ భూములు కూడా ఉండటంతో స్థానికులు ఎన్ఐటీ ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నారు.