‘నేను అరణ్యంలో సంచరించివచ్చిన ప్రతిసారీ ఆ వృక్షాలకు మించి ఎంతో ఎత్తుకెదిగిన భావన నన్ను చుట్టుముడుతుంది’ అంటాడు అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు హెన్రీ డేవిడ్ థోరో. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, మన కళ్లముందే చిన్నబోతున్న పర్యావరణానికి జీవం పోయడానికి అడవులు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో అతి ముఖ్యమైన అటవీ సంరక్షణ (సవరణ) బిల్లు ఆమోదం పొందటం ఆందోళన కలిగి స్తుంది. నాలుగు దశాబ్దాల క్రితం...అంటే 1980లో ఆమోదం పొందిన అటవీ సంరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. బిల్లు ప్రారంభంలోని లక్ష్య ప్రకటన ఎంతో ఉదాత్తమైనది. భూమండలం వేడెక్కి, పర్యావరణం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్న వర్తమా
నంలో అడవుల విస్తరణ అత్యవసరమని ఆ ప్రకటన తెలిపింది.
2030 నాటికల్లా అదనంగా దాదాపు మూడువందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని పారిస్ ఒడంబడికలో మన దేశం హామీ ఇచ్చిన సంగతిని కూడా ప్రస్తావించింది. ఇవి సాధించాలంటే అటవీ విస్తరణ, అడవులపై ఆధారపడిన వర్గాల జీవికను మెరుగుపరచటం అవసరమని బిల్లు సరిగానే గుర్తించింది. కానీ అటు తర్వాత ప్రతిపాదించిన సవరణలన్నీ అందుకనుగుణంగా లేవు. మణిపుర్‌లో దుండగులు సాగించిన అత్యంత అమానవీయ దురంతాలపై విపక్షాలు ఆగ్రహోదగ్రమై చర్చకు పట్టుబట్టిన పర్యవసానంగా పార్లమెంటు స్తంభించిపోవటంతో ఈ సవరణ బిల్లు బుధవారం మూజువాణి ఓటుతో గట్టెక్కింది. ఈమధ్యకాలంలో అత్యంత ప్రాధాన్యతగల ఫైనాన్స్ బిల్లులే ఆ దోవన ఆమోదం పొందిన సందర్భా లుంటున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది గనుక అది తప్పనిసరి కూడా కావొచ్చు. కానీ అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లుకు అంత తొందరేమొచ్చింది?
దేశంలో 1980లో అటవీ సంరక్షణ చట్టం ఎందుకు తీసుకురావాల్సివచ్చిందో గుర్తుచేసుకోవాలి. అంతకుముందు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలు ఎడాపెడా అడవుల నరికివేతకు అనుమతి చ్చిన పర్యవసానంగా 42 లక్షల హెక్టార్ల అడవులు కోల్పోయామని గ్రహించిన తర్వాత ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. నిజానికి ఆ చట్టం తీసుకొచ్చేనాటికి పర్యావరణంపై ఇప్పుడున్నంత చైతన్యం లేదు. 1985 తర్వాతే అంతర్జాతీయంగా కూడా పర్యావరణ స్పృహ పెరిగింది. ఒకరకంగా అటవీ సంరక్షణ చట్టం అత్యంత కఠినమైనది. అందువల్లే ఆ చట్టం వచ్చాక ఈ నాలుగు దశాబ్దాల్లో కోల్పోయిన అటవీ భూములు 15 లక్షల హెక్టార్ల లోపే. మన భూభాగంలో కేవలం 21 శాతం మాత్రమే అడవులు న్నాయి.
అందులో దట్టమైన అరణ్యాలున్న ప్రాంతం కేవలం 12.37 శాతం. ఈ దట్టమైన అడవులు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోనే ఉన్నాయి. వీటిని ప్రాణప్రదంగా కాపాడుకోవటం, వీలైనంతమేరకు విస్తరించటం ధ్యేయం కావలసిన సందర్భంలో తీసుకొచ్చిన సవరణ బిల్లు అందుకనుగుణంగా లేదు. ప్రభుత్వ రికార్డుల్లో అడవులుగా నమోదైన భూములన్నీ అటవీ భూములకిందికే వస్తాయని 1980 చట్టం చెబుతుండగా, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాన్ని మరింత విస్తరించింది. నిఘంటు అర్థాన్ని సంతుష్టి పరిచేలా ఉండే భూములు సైతం ఆ చట్టం పరిధిలోకొస్తాయని తెలిపింది. తాజా బిల్లు దాన్ని పూర్తిగా మారుస్తోంది. 1980 లేదా ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదైవున్న భూములకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని చెబుతోంది. నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో శతాబ్దాలుగా అడవులుగానే ఉంటున్నా ఇప్పటికీ ప్రభుత్వ రికార్డులకెక్కని భూములున్నాయి.
ముఖ్యంగా గడ్డి భూములు, మడ అడవుల వంటి వాటికి అడవులుగా గుర్తింపులేదు. వాటికి అటవీ సంరక్షణ చట్టం వర్తించదని చెబితే ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు. దేశంలోని అటవీ భూముల్లో 15 శాతం ప్రాంతానికి ఈ సవరణ వల్ల కీడు జరుగుతుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. తాజా బిల్లు దేశభద్రతను ప్రస్తావించి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన అధీన రేఖ, వాస్తవాధీన రేఖ వంటి చోట్ల వంద కిలోమీటర్ల పరిధిలో అటవీభూములుంటే వ్యూహాత్మక అవసరాల కోసం ఆ భూములను ముందస్తు అనుమతి లేకుండానే తీసుకోవచ్చన్న సవరణను ప్రతిపాదించింది.
అధీన రేఖ, వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంతాలు పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన హిమాలయ సానువుల్లో ఉన్నాయి. అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగితే అదెంత ప్రమాదమో వేరే చెప్పనవసరం లేదు. అలాగే తీవ్రవాద కార్యకలాపాల ప్రాంతాలకూ ఈ మాదిరి మినహాయింపే ఉంది. దేశ రక్షణ, భద్రత అత్యంత కీలకమైనవే. వాటినెవరూ కాదనరు. కానీ అందుకు పర్యావరణాన్ని పణంగా పెట్టడం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో మరిచిపోకూడదు.
పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పర్చటానికి అవరోధాలుంటున్న మాట వాస్తవం. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. కానీ పర్యావరణ హాని, అందువల్ల కలిగే విలయంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోనిది కాదు. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి పరిణామాలైనా, ప్రస్తుతం దేశమంతా ముంచెత్తుతున్న వరదలను చూసినా అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యత పరిరక్షణ ఎంత ప్రాణప్రదమో అర్థమవుతుంది. కనుక అవసరా లకూ, ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పుకూ మధ్య సమతూకం ఉండేలా మరింత మెరుగైన ప్రతి పాదనలుండాలి. పార్లమెంటు ఉభయ సభల్లో లోతైన చర్చలు జరిగితే ఇలాంటి సమస్యలు ప్రస్తావనకొచ్చి దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేకపోవటం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment