Forest Plantation
-
అటవీ సంరక్షణ ఇలాగేనా!
‘నేను అరణ్యంలో సంచరించివచ్చిన ప్రతిసారీ ఆ వృక్షాలకు మించి ఎంతో ఎత్తుకెదిగిన భావన నన్ను చుట్టుముడుతుంది’ అంటాడు అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు హెన్రీ డేవిడ్ థోరో. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, మన కళ్లముందే చిన్నబోతున్న పర్యావరణానికి జీవం పోయడానికి అడవులు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో అతి ముఖ్యమైన అటవీ సంరక్షణ (సవరణ) బిల్లు ఆమోదం పొందటం ఆందోళన కలిగి స్తుంది. నాలుగు దశాబ్దాల క్రితం...అంటే 1980లో ఆమోదం పొందిన అటవీ సంరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. బిల్లు ప్రారంభంలోని లక్ష్య ప్రకటన ఎంతో ఉదాత్తమైనది. భూమండలం వేడెక్కి, పర్యావరణం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్న వర్తమా నంలో అడవుల విస్తరణ అత్యవసరమని ఆ ప్రకటన తెలిపింది. 2030 నాటికల్లా అదనంగా దాదాపు మూడువందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని పారిస్ ఒడంబడికలో మన దేశం హామీ ఇచ్చిన సంగతిని కూడా ప్రస్తావించింది. ఇవి సాధించాలంటే అటవీ విస్తరణ, అడవులపై ఆధారపడిన వర్గాల జీవికను మెరుగుపరచటం అవసరమని బిల్లు సరిగానే గుర్తించింది. కానీ అటు తర్వాత ప్రతిపాదించిన సవరణలన్నీ అందుకనుగుణంగా లేవు. మణిపుర్లో దుండగులు సాగించిన అత్యంత అమానవీయ దురంతాలపై విపక్షాలు ఆగ్రహోదగ్రమై చర్చకు పట్టుబట్టిన పర్యవసానంగా పార్లమెంటు స్తంభించిపోవటంతో ఈ సవరణ బిల్లు బుధవారం మూజువాణి ఓటుతో గట్టెక్కింది. ఈమధ్యకాలంలో అత్యంత ప్రాధాన్యతగల ఫైనాన్స్ బిల్లులే ఆ దోవన ఆమోదం పొందిన సందర్భా లుంటున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది గనుక అది తప్పనిసరి కూడా కావొచ్చు. కానీ అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లుకు అంత తొందరేమొచ్చింది? దేశంలో 1980లో అటవీ సంరక్షణ చట్టం ఎందుకు తీసుకురావాల్సివచ్చిందో గుర్తుచేసుకోవాలి. అంతకుముందు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలు ఎడాపెడా అడవుల నరికివేతకు అనుమతి చ్చిన పర్యవసానంగా 42 లక్షల హెక్టార్ల అడవులు కోల్పోయామని గ్రహించిన తర్వాత ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. నిజానికి ఆ చట్టం తీసుకొచ్చేనాటికి పర్యావరణంపై ఇప్పుడున్నంత చైతన్యం లేదు. 1985 తర్వాతే అంతర్జాతీయంగా కూడా పర్యావరణ స్పృహ పెరిగింది. ఒకరకంగా అటవీ సంరక్షణ చట్టం అత్యంత కఠినమైనది. అందువల్లే ఆ చట్టం వచ్చాక ఈ నాలుగు దశాబ్దాల్లో కోల్పోయిన అటవీ భూములు 15 లక్షల హెక్టార్ల లోపే. మన భూభాగంలో కేవలం 21 శాతం మాత్రమే అడవులు న్నాయి. అందులో దట్టమైన అరణ్యాలున్న ప్రాంతం కేవలం 12.37 శాతం. ఈ దట్టమైన అడవులు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోనే ఉన్నాయి. వీటిని ప్రాణప్రదంగా కాపాడుకోవటం, వీలైనంతమేరకు విస్తరించటం ధ్యేయం కావలసిన సందర్భంలో తీసుకొచ్చిన సవరణ బిల్లు అందుకనుగుణంగా లేదు. ప్రభుత్వ రికార్డుల్లో అడవులుగా నమోదైన భూములన్నీ అటవీ భూములకిందికే వస్తాయని 1980 చట్టం చెబుతుండగా, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాన్ని మరింత విస్తరించింది. నిఘంటు అర్థాన్ని సంతుష్టి పరిచేలా ఉండే భూములు సైతం ఆ చట్టం పరిధిలోకొస్తాయని తెలిపింది. తాజా బిల్లు దాన్ని పూర్తిగా మారుస్తోంది. 1980 లేదా ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదైవున్న భూములకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని చెబుతోంది. నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో శతాబ్దాలుగా అడవులుగానే ఉంటున్నా ఇప్పటికీ ప్రభుత్వ రికార్డులకెక్కని భూములున్నాయి. ముఖ్యంగా గడ్డి భూములు, మడ అడవుల వంటి వాటికి అడవులుగా గుర్తింపులేదు. వాటికి అటవీ సంరక్షణ చట్టం వర్తించదని చెబితే ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు. దేశంలోని అటవీ భూముల్లో 15 శాతం ప్రాంతానికి ఈ సవరణ వల్ల కీడు జరుగుతుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. తాజా బిల్లు దేశభద్రతను ప్రస్తావించి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన అధీన రేఖ, వాస్తవాధీన రేఖ వంటి చోట్ల వంద కిలోమీటర్ల పరిధిలో అటవీభూములుంటే వ్యూహాత్మక అవసరాల కోసం ఆ భూములను ముందస్తు అనుమతి లేకుండానే తీసుకోవచ్చన్న సవరణను ప్రతిపాదించింది. అధీన రేఖ, వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంతాలు పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన హిమాలయ సానువుల్లో ఉన్నాయి. అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగితే అదెంత ప్రమాదమో వేరే చెప్పనవసరం లేదు. అలాగే తీవ్రవాద కార్యకలాపాల ప్రాంతాలకూ ఈ మాదిరి మినహాయింపే ఉంది. దేశ రక్షణ, భద్రత అత్యంత కీలకమైనవే. వాటినెవరూ కాదనరు. కానీ అందుకు పర్యావరణాన్ని పణంగా పెట్టడం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో మరిచిపోకూడదు. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పర్చటానికి అవరోధాలుంటున్న మాట వాస్తవం. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. కానీ పర్యావరణ హాని, అందువల్ల కలిగే విలయంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోనిది కాదు. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి పరిణామాలైనా, ప్రస్తుతం దేశమంతా ముంచెత్తుతున్న వరదలను చూసినా అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యత పరిరక్షణ ఎంత ప్రాణప్రదమో అర్థమవుతుంది. కనుక అవసరా లకూ, ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పుకూ మధ్య సమతూకం ఉండేలా మరింత మెరుగైన ప్రతి పాదనలుండాలి. పార్లమెంటు ఉభయ సభల్లో లోతైన చర్చలు జరిగితే ఇలాంటి సమస్యలు ప్రస్తావనకొచ్చి దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేకపోవటం విచారకరం. -
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
ఆమె అడవిగా విస్తరించింది
పురుషుడి చేతిలో భూమి ఉంటే దానిని వ్యాపారం చేయాలని చూస్తాడు. స్త్రీ చేతిలో భూమి ఉంటే అందులో నాలుగు మొక్కలు నాటుదామని చూస్తుంది. నేలపై మొక్క లేదంటే ఆమడ దూరంలో కరువు ఉన్నట్టే. ఆ పైన ఆ నేల ఎడారి కానున్నట్టే. ప్రపంచం ఈ విషయం కనిపెట్టడానికి ముందే 40 ఏళ్ల క్రితం తన ఇంటి వెనుక ఉండే నాలుగున్నర ఎకరాలను అడవిగా మార్చడం మొదలెట్టింది దేవకీ అమ్మ. అందుకే ఆమెను అందరూ ‘అమ్మ చెట్టు’ అని పిలుస్తారు. ఆమె పరిచయం. దుబాయ్ నుంచి 12 ఏళ్ల ముని మనవరాలు కేరళ లో ఉన్న 85 ఏళ్ల దేవకీ అమ్మకు కుతూహలంగా ఫోన్ చేస్తుంది. ‘అవ్వా... నేను నాటిన మొక్క పెద్దదయ్యిందా’ అని అడుగుతుంది. దానికి దేవకీ అమ్మ కావాలనే జవాబు చెప్పదు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్... నువ్వొచ్చి కొత్త మొక్కలు నాటితే కదా’ అంటుంది. ‘వస్తా.. వస్తా... ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావాలని ఉంది’ అంటుంది మునిమనవరాలు. ఆ మునిమనవరాలే కాదు, మనవలు, కడుపున పుట్టినవారు అందరూ దేవకీ అమ్మ కోసం ఒక సంస్కారాన్ని పారంపర్యంగా స్వీకరించారు. అది వారి పూర్వికుల ఇంటి వెనుక ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిలో విత్తనాలు, మొక్కలు నాటడం. అది ఇవాళ్టి పరంపర కాదు. దాదాపు 40 ఏళ్లుగా వస్తోంది. దానిని మొదలెట్టింది దేవకీ అమ్మ. ముత్తుకులం కోడలు దేవకిది అలెప్పికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ముత్తుకులం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ వ్యవసాయం చేస్తారు. ఇంటి దగ్గర మొక్కలు పెంచడం కూడా ఆనవాయితీనే. ‘మా నాన్న వైద్యన్. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు విత్తనాలు, మొక్కలు తెచ్చి నాటేవారు. నేను ఇంట్లో అందరి కంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను నాటమనేవారు. అలా నాకు మొక్కలంటే ఇష్టం ఏర్పడింది’ అంటుంది దేవకీ అమ్మ. ఆమెకు వయసు వచ్చాక అదే ఊళ్లో ఉన్న గోపాలకృష్ణ పిళ్లై అనే ఇంగ్లిష్ టీచర్‌ను వివాహం చేసుకుంది. అత్తగారిది విశాలమైన ఇల్లు. దాని వెనుక దాదాపు నాలుగున్నర ఎకరాల పెరడు ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలందరూ వ్యవసాయ పనులు చేసి సొంత పొలంలో వరి పండించేవారు. ‘నాకు వ్యవసాయం ఇష్టం కనుక అత్తయ్యకు సాయం చేసేదాన్ని’ అంటుంది దేవకీ అమ్మ. 1980లో మారిన కథ 1980లో దేవకీ వెళుతున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కాలు కదల్లేని పరిస్థితి వచ్చి మూడేళ్లు మంచాన ఉండిపోయింది. పొలానికి వెళ్లొద్దని డాక్టర్లు చెప్పారు. ‘నాకేమో పొలం పనులు ఇష్టం. ఏం చేయాలో తోచక పెరట్లో ఒక మొక్క నాటాను. అది పెరిగింది. మరోటి నాటాను. ఆ తర్వాత ఆ నాలుగున్నర ఎకరాల స్థలమే నా నివాసం అయ్యింది. అక్కడ మొక్కలు నాటుతూ వెళ్లాను. నా భర్త ఆ పనిలో నేను ఆనందం పొందుతూ పూర్తిగా కోలుకోవడం చూసి రోజూ తప్పనిసరిగా కొత్త కొత్త మొక్కలు తెచ్చివ్వడం మొదలుపెట్టారు. నా మొక్కల ఇష్టం చూసి బంధువులు, స్నేహితులు ఎవరు మా ఇంటికి వచ్చినా మొక్కలు తీసుకు వచ్చారు. రోజులు గడిచాయి. నాకు తెలియకనే నా పెరడు ఒక అద్భుతమైన అడవిగా మారిపోయింది’ అంటుంది దేవకీ అమ్మ. స్త్రీ పెంచిన అడవి దేవకీ అమ్మ ఆ రోజుల్లోనే సేంద్రియ పద్ధతి లో ఆ అడవిని పెంచింది. ఎరువులు వాడలేదు. పేడనీళ్లే ఎరువు. అడవిలో ఏయే వృక్షాలు ఉంటాయో అవన్నీ ఆమె పెరట్లో ఉన్నాయి. దాదాపు 200 రకాల వృక్షజాతులు ఉన్నాయి. 3000 చెట్లు, మొక్కలు ఉన్నాయి. ‘నేను రోజూ ఈ అడివంతా తిరుగుతాను. చెట్లతో మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. మాకేం చింత లేదు... ఈమె ఉంది కదా అని అనుకుంటాయి’ అంటుంది దేవకీ అమ్మ. చిన్న ఊరి మధ్యలో ఇంటి వెనుక పెద్ద అడవి ఏర్పడటం నిజంగా వింతే. అందుకే వృక్షశాస్త్రం అభ్యసించేవారు తరచూ దేవకీ అమ్మ అడవిని సందర్శిస్తూ ఉంటారు. అధ్యయనం చేస్తూ ఉంటారు. ‘సాధారణంగా చాలామంది అడవికి కంచె వేస్తుంటారు. నేను వేయను. వచ్చే జంతువులన్నీ రానీ. వాలే పక్షులన్నీ వాలనీ. ఈ భూమి అందరిదీ. నేను రోజూ నా కుటుంబం మంచితో పాటు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల మంచిని కోరుతూ ప్రార్థిస్తాను’ అంటుంది దేవకీ అమ్మ. అమ్మ చెట్టు దేవకీ అమ్మకు ఇప్పుడు 85 ఏళ్లు. నిజానికి అడివంతా తిరగలేదు. అయినా సరే కొన్ని అడుగులైతే చెట్ల మధ్య వేసి వస్తుంది. పిల్లలు, మనమలు, మునిమనవలు ఎక్కడ ఉన్నా సెలవల్లో తప్పనిసరి గా వచ్చేస్తారు. అందరూ పండగలాగా అడవిలో కొత్త మొక్కలు నాటుతారు. ఈ నేల బతకాలంటే పచ్చగా ఉండాలని వారందరూ గట్టిగా నమ్ముతారు. ‘మా అమ్మ ప్రోత్సాహంతో నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివాను. మా పిల్లల్లో ఒకరిద్దరు బోటనీ స్టూడెంట్స్‌గా మారారు. ఇదంతా అమ్మ చలవే’ అని దేవకీ అమ్మ కుమార్తె ప్రొఫెసర్ టంకమణి అంటుంది. దేవకీ పెంచిన అడవిలోనే రెండు నీటి చెలమలు కూడా ఉన్నాయి. వాటిలో చేపలు ఆ చెట్ల నీడలతో ఆడుకుంటూ ఉంటాయి. ‘మా ఇంటికి వచ్చి చూసిన వారందరూ ఇలాంటి అడవిని పెంచడానికి తమ ఇళ్లల్లో స్థలాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి’ అంటుంది దేవకీ అమ్మ. జీవం ఎప్పుడూ బతుకునిస్తుంది. జీవం గురించి జీవం పోస్తే స్త్రీకి కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది. ఈ భూమి జీవంతో ఉండాలంటే... ఈ భూమిపై ఉన్నవారు జీవంతో ఉండాలంటే... ఈ భూమిని జీవంతో నింపాలి. అలా నింపే శక్తి చెట్టుకే ఉంది. దేవకీ అమ్మవంటి వారికి ఆ సంగతి తెలుసు. భూమిని నిర్జీవం చేసే కార్యకలాపాలను నియంత్రించుకుంటూ అవసరమైన నేలను మాత్రమే వాడుకుంటూ మిగిలిన నేలను ఎప్పుడూ పచ్చదనంతో నింపుకుంటూ రావాలి మనిషి. దేవకీ అమ్మ వంటి వారు అందుకు ఒక పచ్చటి సందేశంలా నిలుస్తూనే ఉంటారు. అవార్డులు దేవకీ అమ్మ కృషికి, పర్యావరణ ప్రేమకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ‘వృక్షమిత్ర’ పురస్కారం దక్కింది. కేరళ ప్రభుత్వం ‘హరి వ్యక్తి పురస్కారం’తో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ‘నారిశక్తి అవార్డు’ను బహూకరించింది. వీటన్నింటిని మర్యాద కోసం దేవకీ అమ్మ స్వీకరించింది. నిజానికి ఆమెకు ఒక ఉదయం లేచినప్పుడు కొన్ని పక్షులు వచ్చి తన అడవిలో వాలి కువకువలు వినిపించడమే అతి పెద్ద పురస్కారం. అది ఇచ్చే ఆనందం అనుభవించినవారికే తెలుస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్
సాక్షి, సంగారెడ్డి: గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలోని ఖాజీపేట అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి యంగ్ రెబల్ స్టార్ సోమవారం పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను తన తండ్రి దివంగత యూవీఎస్‌రాజు పేరు మీద ప్రభాస్ దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలను అందించడమే కాకుండా, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (నిర్మాతలను నామినేట్ చేసిన శర్వానంద్) కాగా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. ఇక ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మార్చనున్నారు. (ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్) -
ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఒకపక్క వర్షాభావం, మరో పక్క భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతుండం, అన్నార్థులు, అభాగ్యులు అకారణంగా మత్యువాత పడుతుండడం పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు నెత్తి, నోరు మొత్తుకొని చెబుతున్న విషయం విషయం తెల్సిందే. ప్రధానంగా చెట్లను కాపాడుకోలేకపోవడం వల్ల దేశంలో అటవీ ప్రాంతం తగ్గిపోయి కార్బన్‌డై ఆక్సైడ్ పెరిగి భూతాపోన్నతి పెంచడం వల్ల ఈ అకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నానని అంతర్జాతీయ వేదికల ముందు బాకా ఊది మరి చెబుతున్న భారత్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దొంగ లెక్కలూ ఉన్నాయి. భారత్‌లో 2005 నుంచి 2017 సంవత్సరాల మధ్య 2,152 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం (వక్ష సంపద) విస్తరించిందని ‘ది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ గతంలో ఓ డేటాను విడుదల చేసింది. వాస్తవానికి 2001 నుంచి 2018 సంవత్సరాల మధ్య భారత్‌లో 16 లక్షల హెక్టార్లలో వృక్ష సంపద నాశనం అయిందని యూనివర్శిటీ ఆఫ్ మేరిలాండ్, గూగుల్, యూఎస్ జియోలోజికల్ సర్వే, నాసాలు సేకరించిన డేటా, ఛాయా చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా లాభాపేక్ష లేని ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా వెల్లడించింది. భారత్ ప్రభుత్వం దేశంలో వృక్ష సంపద పెరగిందంటే ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ తగ్గిందని చెబుతున్నది ఇందులో ఏది సబబు, ఏది కాదు ? దేశంలో అటవి ప్రాంతం విస్తరించిందని చెబుతున్న అటవీ సర్వే మరోపక్క తరుగుతున్న అటవీ ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకోలేదా? గనులు, వివిధ ప్రాజెక్టుల కారణంగా దేశంలో వక్ష సంపద తగ్గిపోతోందంటూ ప్రజాందోళన పెరుగుతున్న నేపథ్యంలో వక్ష సంపద పెరిగిందనడం వారిని బుజ్జగించడం కోసమా? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అలా ప్రకటించిందా ? ఇక్కడ మరో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏది వాస్తవమో, ఏది అబద్ధమో! ఇట్టే తెలిసిపోతుంది. 2030 సంవత్సరం నాటికల్లా భూవాతావరణంలో 250 టన్నుల నుంచి 300 టన్నుల వరకు కార్బన్‌డై ఆక్సైడ్‌ను తగ్గించేందుకు సరిపడా వృక్ష సంపదను పెంచుతామని, అందుకోసం అటవులను అభివద్ధి చేస్తామని 2015, డిసెంబర్లో పారిస్‌లో పర్యావరణ పరిస్థితులపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో తీర్మానంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. ఇందుకోసం 2030 సంవత్సరం నాటికి 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామంటూ ఉదారంగా హామీ కూడా ఇచ్చింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు కేవలం 89.53 కోట్ల రూపాయలను, 2017–18 ఆర్థిక సంవత్సరానికి 47.8 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పార్లమెంటరీ కమిటీ నివేదికనే వెల్లడించింది. అంటే పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ మూడేళ్ల కాలంటో 136 కోట్లను మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం రానున్న 12 ఏళ్ల కాలంలో 60 వేల కోట్లలో ఎన్నికోట్లను కేటాయించగలదు? ఒకప్పుడు పండుగలకు, పబ్బాలకు, పిల్లలు పుడితే వారి మీద చెట్లను నాటి, వాటిని పిల్లలతో సమానంగా చూసుకునే సంస్కతి ప్రజల్లో ఉండేది. అది అంతరించడంతో చెట్లు నాటేందుకు ఎక్కడికక్కడ ప్రభుత్వాలే ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. అన్నింట్లో అవినీతికి అలవాటుపడ్డ ప్రభుత్వాల వల్ల చెట్లు ఊపిరిపోసుకోవడం లేదు. ఇక అడవులను పెంచడం తమ వల్ల కాదన్న అభిప్రాయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అడవుల పెంపకం బాధ్యతలను కార్పొరేట్లకు ఇవ్వాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై విస్తృతంగా చర్చ జరపాలని కోరుకుంటోంది. -
ఉట్టి చేతులతో ఎలా ?
కుమురం భీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ చేసిన దాడిని మరవకముందే మళ్లీ అదే తరహా ఘటన పొరుగు జిల్లాల్లో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో కొందరు మంగళవారం సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పోడుభూములు, కలప అక్రమ రవాణా సందర్భంగా ఇలాంటివి అనేకం జరిగాయి. అటవీ అధికారులు మహబూబాబాద్, గూడూరు, నర్సంపేట కొత్తగూడ ప్రాంతాల్లో 2004 నుంచి 2015 వరకు 1,206 మందిపై కేసులు నమోదు చేసి 211 మందిపై చార్జ్‌షీట్æ కూడా దాఖలు చేశారు. పదేపదే సంఘటనలు జరుగుతున్నా.. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీస్టేషన్ల ఏర్పాటు, ఆయుధాల కేటాయింపు, అటవీశాఖ రీ–ఆర్గనేజేషన్ వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ,వరంగల్ : అడవుల సంరక్షణకు ఆయుధాలు అనివార్యమని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నా.. ఆచరణరూపం దాల్చడం లేదు. అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరినప్పుడు మాత్రమే ఆయుధాల ప్రస్తావన తెరమీదకు వస్తుండగా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా కారణమేమిటో తెలియదు కానీ అంతగా స్పందన ఉండటం లేదని అధికారులు చెబుతున్నారు. ఆరేళ్ల కిందట చోటుచేసుకున్న వరుస సంఘటనల్లో స్మగ్లర్ల చేతిలో అటవీశాఖ ఉద్యోగులు మృతి చెందిన విషయం విదితమే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులను హతమార్చడం.. అంతకు ముందు నిజామాబాద్‌తో పాటు జిల్లాలోని పెంబి అడవుల్లో బీట్ ఆఫీసర్ సత్యనారాయణను చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పోలీసు, అటవీ, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు సైతం పాల్గొన్నారు. ఆ చర్చలు, సమీక్షల సందర్భంగా అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను నిరోధించడంతో పాటు అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అటవీ సిబ్బంది చేతికి ఆయుధాలు అందుతాయని ఆశించారు. అటకెక్కిన పునర్విభజన డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పని భారం, ఒత్తిడి తగ్గించేందుకు అట వీశాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టేందుకు కమిటీ వేసింది. కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికా రి నర్పట్ సింగ్ అధ్యయనం చేసిన 2011లో పలు ప్రతి పాదనలు సమర్పించారు. ప్రస్తుతం ఒక్కో మండలంలో 1,473 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. దానిని 750 స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గించి, ఒక్కో మండలంలో మూడు నుంచి నాలుగు రేంజ్‌లు, సెక్షన్లు పెంచి తే బీట్ ఆఫీసర్ల పరిధి 25 చదరపు కిలోమీటర్ల నుంచి 15 చదరపు కిలోమీటర్లకు తగ్గుతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌లో... ఉమ్మడి వరంగల్‌లో ఈ ప్రతిపాదనలు అమలైతే భారీ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించారు. అదే జరిగితే ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మండలాలు, రేంజ్‌ల సంఖ్య పెరగాల్సి ఉంది. అటవీశాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మండలాల సంఖ్య మూడు నుంచి ఐదుకు, రేంజ్‌లు 13 నుంచి 16కు పెంచాలని సూచించారు. వరంగల్ ఉత్తరం, వరంగల్ దక్షిణ మండలాలతో పాటు ఒక వన్యప్రాణుల సంరక్షణ డివిజన్లను విభజించి... వరంగల్ ఉత్తరం, ఏటూరునాగారం, వరంగల్ దక్షిణం, నర్సంపేట, మహబూబాబాద్ డివిజన్ల ఏర్పాటుకు సిఫారసు చేశారు. అలాగే, టెరిటోరియల్, వైల్డ్‌లైఫ్ డివిజన్లను ఒక్కటిగా మార్చాలని పేర్కొన్నారు. వరంగల్ ఉత్తర మండలం పరిధిలో ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, మంగపేట, పస్రా, ములుగు, భూపాలపల్లి, పరకాల, మంగపేట రేంజ్‌లకు తోడు నర్సంపేట పరిధిలో కొత్తగూడకు తోడు పాకాల, వరంగల్ పరిధిలో వరంగల్, హన్మకొండ రేంజ్‌లుగా మార్చడంతో పాటు జనగామలో మరొకటి ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికివీటికి తోడు పాతవి మహబూబాబాద్, గూడూరు రేంజ్‌లు పనిచేస్తాయి. అయితే ఈ ప్రతిపాదనలు, సూచనలను అమలుకు నోచుకోలేదు. ఇక ఇప్పటికే స్మగ్లర్ల ధాటికి అడవి తగ్గిపోగా.. మిగిలిన మిగిలిన అడవులను పరిరక్షించడమే కాకుండా తమను తాము రక్షించుకునేందుకు అటవీశాఖ చేసిన ఆయుధాల ప్రతిపాదనకు తోడు ‘అటవీ స్టేషన్ల’ ఏర్పాటు కూడా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. -
డోజర్ ట్రాక్టర్ డ్రైవర్లపై నక్సల్స్ దాడి ?
కొత్తగూడ : మండలంలోని పెద్ద ఎల్లాపూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్టు ప్లాంటేషన్ పనులు చేస్తున్న డోజర్ ట్రాక్టర్ల డ్రైవర్లను న్యూడెమోక్రసీ పుల్లన్న దళం కొట్టినట్లు సోమవారం తెలిసింది. పెద్ద ఎల్లాపురం గ్రామ సమీపంలోని 72 హెక్టార్లలో ప్లాంటేషన్ చేసేందుకు అటవీశాఖ అనుమతి ఇవ్వడంతో నెల రోజులుగా పనులు జరుగుతున్నాయి. ఆ పనులను అడ్డుకునేందుకు గ్రా మస్తులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్లాంటేషన్ పని చేసేందుకు వచ్చిన పొగుళ్లపల్లికి చెందిన ట్రాక్టర్లతో పాటు మరో రెండు ట్రాక్టర్ల వద్దకు వెళ్లిన పుల్లన్న దâ భ్యులు..డ్రైవర్లపై దాడి చేసినట్లు సమాచారం. పెద్ద ఎల్లాపురం గ్రామ సమీపంలో భారీగా పోడు జరిగిందని ఇక్కడి బీట్ అధికారి శ్యాంను సస్పెండ్ చేశారు. అయితే పోడు జరిగిన ప్రదేశంలో ప్లాంటేషన్ చేయించాలనే నిబంధనలకు మేరకు సస్పెండ్ చేసిన బీట్ అధికారికి అదే బాధ్యతలను అప్పగించారు. దీంతో 72 హెక్టార్లలో ప్లాంటేషన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కాగా, ఇందులో ఉన్న పేద, మద్యతరగతి రైతులు ఉం డడం ప్లాంటేషన్ నిలిపివేయాలని ఆందోళన చేసినా పోలీసుల సహకారంతో పను లు చేసేందుకు అటవీ అధికారులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో పుల్లన్న దళ సభ్యులు డ్రైవర్లను కొట్టడం చర్చనీయంశంగా మారింది. ఈ విషయమై ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావును వివరణ కోరగా డ్రైవర్లను కొట్టిన విషయం నిజమేనని, ఏ దళం కొట్టిందని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.