పురుషుడి చేతిలో భూమి ఉంటే దానిని వ్యాపారం చేయాలని చూస్తాడు. స్త్రీ చేతిలో భూమి ఉంటే అందులో నాలుగు మొక్కలు నాటుదామని చూస్తుంది. నేలపై మొక్క లేదంటే ఆమడ దూరంలో కరువు ఉన్నట్టే. ఆ పైన ఆ నేల ఎడారి కానున్నట్టే. ప్రపంచం ఈ విషయం కనిపెట్టడానికి ముందే 40 ఏళ్ల క్రితం తన ఇంటి వెనుక ఉండే నాలుగున్నర ఎకరాలను అడవిగా మార్చడం మొదలెట్టింది దేవకీ అమ్మ. అందుకే ఆమెను అందరూ ‘అమ్మ చెట్టు’ అని పిలుస్తారు. ఆమె పరిచయం.
దుబాయ్ నుంచి 12 ఏళ్ల ముని మనవరాలు కేరళ లో ఉన్న 85 ఏళ్ల దేవకీ అమ్మకు కుతూహలంగా ఫోన్ చేస్తుంది. ‘అవ్వా... నేను నాటిన మొక్క పెద్దదయ్యిందా’ అని అడుగుతుంది. దానికి దేవకీ అమ్మ కావాలనే జవాబు చెప్పదు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్... నువ్వొచ్చి కొత్త మొక్కలు నాటితే కదా’ అంటుంది. ‘వస్తా.. వస్తా... ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావాలని ఉంది’ అంటుంది మునిమనవరాలు. ఆ మునిమనవరాలే కాదు, మనవలు, కడుపున పుట్టినవారు అందరూ దేవకీ అమ్మ కోసం ఒక సంస్కారాన్ని పారంపర్యంగా స్వీకరించారు. అది వారి పూర్వికుల ఇంటి వెనుక ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిలో విత్తనాలు, మొక్కలు నాటడం. అది ఇవాళ్టి పరంపర కాదు. దాదాపు 40 ఏళ్లుగా వస్తోంది. దానిని మొదలెట్టింది దేవకీ అమ్మ.
ముత్తుకులం కోడలు
దేవకిది అలెప్పికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ముత్తుకులం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ వ్యవసాయం చేస్తారు. ఇంటి దగ్గర మొక్కలు పెంచడం కూడా ఆనవాయితీనే. ‘మా నాన్న వైద్యన్. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు విత్తనాలు, మొక్కలు తెచ్చి నాటేవారు. నేను ఇంట్లో అందరి కంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను నాటమనేవారు. అలా నాకు మొక్కలంటే ఇష్టం ఏర్పడింది’ అంటుంది దేవకీ అమ్మ. ఆమెకు వయసు వచ్చాక అదే ఊళ్లో ఉన్న గోపాలకృష్ణ పిళ్లై అనే ఇంగ్లిష్ టీచర్‌ను వివాహం చేసుకుంది. అత్తగారిది విశాలమైన ఇల్లు. దాని వెనుక దాదాపు నాలుగున్నర ఎకరాల పెరడు ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలందరూ వ్యవసాయ పనులు చేసి సొంత పొలంలో వరి పండించేవారు. ‘నాకు వ్యవసాయం ఇష్టం కనుక అత్తయ్యకు సాయం చేసేదాన్ని’ అంటుంది దేవకీ అమ్మ.
1980లో మారిన కథ
1980లో దేవకీ వెళుతున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కాలు కదల్లేని పరిస్థితి వచ్చి మూడేళ్లు మంచాన ఉండిపోయింది. పొలానికి వెళ్లొద్దని డాక్టర్లు చెప్పారు. ‘నాకేమో పొలం పనులు ఇష్టం. ఏం చేయాలో తోచక పెరట్లో ఒక మొక్క నాటాను. అది పెరిగింది. మరోటి నాటాను. ఆ తర్వాత ఆ నాలుగున్నర ఎకరాల స్థలమే నా నివాసం అయ్యింది. అక్కడ మొక్కలు నాటుతూ వెళ్లాను. నా భర్త ఆ పనిలో నేను ఆనందం పొందుతూ పూర్తిగా కోలుకోవడం చూసి రోజూ తప్పనిసరిగా కొత్త కొత్త మొక్కలు తెచ్చివ్వడం మొదలుపెట్టారు. నా మొక్కల ఇష్టం చూసి బంధువులు, స్నేహితులు ఎవరు మా ఇంటికి వచ్చినా మొక్కలు తీసుకు వచ్చారు. రోజులు గడిచాయి. నాకు తెలియకనే నా పెరడు ఒక అద్భుతమైన అడవిగా మారిపోయింది’ అంటుంది దేవకీ అమ్మ.
స్త్రీ పెంచిన అడవి
దేవకీ అమ్మ ఆ రోజుల్లోనే సేంద్రియ పద్ధతి లో ఆ అడవిని పెంచింది. ఎరువులు వాడలేదు. పేడనీళ్లే ఎరువు. అడవిలో ఏయే వృక్షాలు ఉంటాయో అవన్నీ ఆమె పెరట్లో ఉన్నాయి. దాదాపు 200 రకాల వృక్షజాతులు ఉన్నాయి. 3000 చెట్లు, మొక్కలు ఉన్నాయి. ‘నేను రోజూ ఈ అడివంతా తిరుగుతాను. చెట్లతో మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. మాకేం చింత లేదు... ఈమె ఉంది కదా అని అనుకుంటాయి’ అంటుంది దేవకీ అమ్మ. చిన్న ఊరి మధ్యలో ఇంటి వెనుక పెద్ద అడవి ఏర్పడటం నిజంగా వింతే. అందుకే వృక్షశాస్త్రం అభ్యసించేవారు తరచూ దేవకీ అమ్మ అడవిని సందర్శిస్తూ ఉంటారు. అధ్యయనం చేస్తూ ఉంటారు. ‘సాధారణంగా చాలామంది అడవికి కంచె వేస్తుంటారు. నేను వేయను. వచ్చే జంతువులన్నీ రానీ. వాలే పక్షులన్నీ వాలనీ. ఈ భూమి అందరిదీ. నేను రోజూ నా కుటుంబం మంచితో పాటు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల మంచిని కోరుతూ ప్రార్థిస్తాను’ అంటుంది దేవకీ అమ్మ.
అమ్మ చెట్టు
దేవకీ అమ్మకు ఇప్పుడు 85 ఏళ్లు. నిజానికి అడివంతా తిరగలేదు. అయినా సరే కొన్ని అడుగులైతే చెట్ల మధ్య వేసి వస్తుంది. పిల్లలు, మనమలు, మునిమనవలు ఎక్కడ ఉన్నా సెలవల్లో తప్పనిసరి గా వచ్చేస్తారు. అందరూ పండగలాగా అడవిలో కొత్త మొక్కలు నాటుతారు. ఈ నేల బతకాలంటే పచ్చగా ఉండాలని వారందరూ గట్టిగా నమ్ముతారు. ‘మా అమ్మ ప్రోత్సాహంతో నేను ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ చదివాను. మా పిల్లల్లో ఒకరిద్దరు బోటనీ స్టూడెంట్స్‌గా మారారు. ఇదంతా అమ్మ చలవే’ అని దేవకీ అమ్మ కుమార్తె ప్రొఫెసర్ టంకమణి అంటుంది. దేవకీ పెంచిన అడవిలోనే రెండు నీటి చెలమలు కూడా ఉన్నాయి. వాటిలో చేపలు ఆ చెట్ల నీడలతో ఆడుకుంటూ ఉంటాయి. ‘మా ఇంటికి వచ్చి చూసిన వారందరూ ఇలాంటి అడవిని పెంచడానికి తమ ఇళ్లల్లో స్థలాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి’ అంటుంది దేవకీ అమ్మ.
జీవం ఎప్పుడూ బతుకునిస్తుంది. జీవం గురించి జీవం పోస్తే స్త్రీకి కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది. ఈ భూమి జీవంతో ఉండాలంటే... ఈ భూమిపై ఉన్నవారు జీవంతో ఉండాలంటే... ఈ భూమిని జీవంతో నింపాలి. అలా నింపే శక్తి చెట్టుకే ఉంది. దేవకీ అమ్మవంటి వారికి ఆ సంగతి తెలుసు. భూమిని నిర్జీవం చేసే కార్యకలాపాలను నియంత్రించుకుంటూ అవసరమైన నేలను మాత్రమే వాడుకుంటూ మిగిలిన నేలను ఎప్పుడూ పచ్చదనంతో నింపుకుంటూ రావాలి మనిషి. దేవకీ అమ్మ వంటి వారు అందుకు ఒక పచ్చటి సందేశంలా నిలుస్తూనే ఉంటారు.
అవార్డులు
దేవకీ అమ్మ కృషికి, పర్యావరణ ప్రేమకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ‘వృక్షమిత్ర’ పురస్కారం దక్కింది. కేరళ ప్రభుత్వం ‘హరి వ్యక్తి పురస్కారం’తో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ‘నారిశక్తి అవార్డు’ను బహూకరించింది. వీటన్నింటిని మర్యాద కోసం దేవకీ అమ్మ స్వీకరించింది. నిజానికి ఆమెకు ఒక ఉదయం లేచినప్పుడు కొన్ని పక్షులు వచ్చి తన అడవిలో వాలి కువకువలు వినిపించడమే అతి పెద్ద పురస్కారం. అది ఇచ్చే ఆనందం అనుభవించినవారికే తెలుస్తుంది.
– సాక్షి ఫ్యామిలీ
ఆమె అడవిగా విస్తరించింది
Published Thu, Jun 17 2021 1:09 AM | Last Updated on Wed, Mar 2 2022 7:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment