అంతరిక్షంలో క్రాప్స్ పేలోడ్‌లోని అలసంద విత్తనాలకు ఆకులు వచ్చిన దృశ్యం
ఇస్రో పేలోడ్‌లో మొలకెత్తి ఆకులు తొడిగిన అలసందలు
సూళ్లూరుపేట: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానం కోసం ఉద్దేశించిన ప్రయోగంతోపాటు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మాడ్యూల్‌లో ఇస్రో చేపట్టిన ప్రయోగం మలి దశలోనూ విజయవంతమైంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో విత్తనాలు మొలకెత్తగలవా? మొలకెత్తితే పూర్తిస్థాయిలో ఆకుల స్థాయిని సంతరించుకోగలవా? అని తెల్సుకోవడంతోపాటు ఆక్సిజన్, కార్భన్ డయాక్సైడ్ స్థాయిలను కొలిచేందుకు ఈ ప్రయోగం చేపట్టిన విషయంతెల్సిందే.
స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్(స్పేడెక్స్) కోసం నింగిలోకి పంపిన జంట ఉపగ్రహాలతోపాటు కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్)పేరిట ఇస్రో ఓ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెల్సిందే. ఇందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచగా అవి ఇటీవల మొలకెత్తాయి. మొలకెత్తిన విత్తనాలు తాజాగా ఆకులను సంతరించుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఆకులు వచ్చిన సమయంలో మాడ్యూల్‌లో ఆర్ర్థత, ఉష్ణోగ్రత, మట్టిలో తేమ తదితరాలను అందులో అమర్చిన కెమెరా, ఇతర ఉపకరణాలతో కొలిచామని ఇస్రో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో మొక్కల పెంపకానికి సంబంధించిన పరిశోధనలకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడిందని వెల్లడించింది. భవిష్యత్తులో అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చే చెట్ల పెంపకం, ఆ చెట్లు సూక్ష్మ గురత్వాకర్షణ స్థితిలోనూ ఏ మేరకు ఆకులు, ఫలాలను అందివ్వగలవు, ఎంత మేరకు నీరు అవసరం తదతర అంశాలపై శోధనకూ తాజా ప్రయోగం సాయపడిందని ఇస్రో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment