మక్క సాగు భలే బాగు
బయ్యారం: వరికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటల్లో మొక్కజొన్న మొదటిది. రబీలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న
యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం...
అనువైన నేలలు: మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర, ఒండ్రు మట్టి ఉన్న ఇసుక, గరపనేలలు అనుకూలం.
దుక్కి తయారీ: నాగలితో నాలుగు సార్లు దుక్కి దున్నాలి. చివరి దుక్కిలో మాగిన పశువుల ఎరువు కాని కంపోస్టు ఎరువు కాని వేసి దున్నాలి. ఆ తరువాత విత్తనాలను బోదె పద్ధతి, నాగలి సాళ్ళలో తగినంత తేమను చూసుకొని విత్తాలి.
విత్తే కాలం: రబీ మొక్కజొన్నను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తాలి.
విత్తన మోతాదు: ఎకరానికి ఏడు కిలోల విత్తనాలను విత్తుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో 33 వేల మొక్కలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ, సాళ్ళలో మొక్కల మధ్య 20 సెం.మీ ఎడం ఉండేలా, బోదెకు ఒకవైపున 2 లేదా 3 సెం.మీ లోతులో విత్తాలి. పాదుకు 2 లేదా 3 మొక్కలను నాటాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత పాదుకు ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ మందును 5 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.
అంతరపంటలు: మొక్కజొన్నలో అంతరపంటగా కంది, అలసంద, పెసర, సోయాచిక్కుడు వంటి అపరాల పంటలను వేసుకోవచ్చు. 4 లేక 5 సాళ్లు మొక్కజొన్న వేసి ఆ తర్వాత ఒక సాలు పప్పుపంట వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్నకు సహజ శత్రువులైన పరాన్నజీవులు, పరాన్నభుక్తుల సంఖ్యను పెంచుకోవటమే గాక అధిక దిగుబడి, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కూరగాయ పంటలు ముల్లంగి, ఆకుకూరలను వేసుకొని కూడా అధికాదాయం పొందవచ్చు.
ఎరువులు
మొక్కజొన్న సాగుకు రెండు కట్టల యూరియా, కట్టన్నర డీఏపీ, కట్ట పొటాష్ అవసరం. డీఏపీతో పాటు కట్ట పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియాను నాలుగు దఫాలుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. భూమిలో జింకు లోపముంటే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ఏ ఎరువులో కలపకుండా విడిగా వేయాలి.
కలుపునివారణ: మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే విత్తిన 45-50 రోజుల వ్యవధిలో కలుపు మొక్కలు లేకుండా తొలగించాలి. విత్తనాలు విత్తిన మూడు రోజుల వ్యవధిలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి కిలో అట్రాజిన్ మందును 500 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి.
అంతరకృషి: విత్తిన 30రోజులకోసారి, 45- 50 రోజులకు మరో సారి గొర్రుతో గాని, నాగలితో గాని సాళ్ళ మధ్య దున్నాలి. ఈ విధంగా దున్నటం వల్ల కలుపును నివారించటంతో పాటు మొక్కలకు తేమ, గాలి సక్రమంగా అందుతుంది. పంట ఏపుగా పెరుగుతుంది.
తడులు: పంట మొలకెత్తిన నెలరోజుల వరకు (పంట మోకాలు ఎత్తుకు వచ్చేంత వరకు) అవసరాన్ని బట్టి, భూమి స్వభావాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. ఈ దశలో నీటితేమ అధికంగా ఉంటే పంట ఎదుగుల తగ్గే అవకాశం ఉంది.
సస్యరక్షణ చర్యలు
మొక్కజొన్నలో అశించే పలు రకాల పురుగులు, తెగుళ్ళను రైతులు సరైన సమయంలో గుర్తించి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
కాండంతొలిచే పురుగు: మొక్కజొన్న మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల లోపు పైరును ఇది ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది. ఈ గుడ్లలో ఉన్న పురుగులు 5 రోజుల వ్యవధిలో బయటకు వస్తాయి. మొక్కజొన్న అంకురంలోకి చేరి ఎదిగే అంకురాన్ని తింటాయి. ఈ పురుగుల వల్ల మొవ్వు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు ఎకరానికి 3 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఆకు సుడులలో వేయాలి. లేదా లీటర్ నీటిలో 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 0.3 మి.లీ కొరోజాన్ మందును పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు: నెలరోజులు పైబడిన పంటను మొక్కజొన్న నల్లి, పేనుబంక ఆశిస్తాయి. వీటి తల్లిపురుగులు, పిల్లపురుగులు పంటలో ఎదిగే భాగాల నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పసుపురంగుకు మారి గిడసబారుతాయి. ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 1 గ్రా ఎఫిసేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆకుమాడు తెగులు: అకుమాడు తెగులు నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటర్ నీటిలో కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు పర్యాయాలు పిచికారీ చేయాలి.
మొక్క ఎండు తెగులు: ఈ తెగులు నివారణకు 1 మి.లీ ప్రాఫికొనజోల్ మందును లీటర్‌నీటిలో కలిపి పిచికారీ చేయాలి.