కుమురం భీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ చేసిన దాడిని మరవకముందే మళ్లీ అదే తరహా ఘటన పొరుగు జిల్లాల్లో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో కొందరు మంగళవారం సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పోడుభూములు, కలప అక్రమ రవాణా సందర్భంగా ఇలాంటివి అనేకం జరిగాయి. అటవీ అధికారులు మహబూబాబాద్, గూడూరు, నర్సంపేట కొత్తగూడ ప్రాంతాల్లో 2004 నుంచి 2015 వరకు 1,206 మందిపై కేసులు నమోదు చేసి 211 మందిపై చార్జ్‌షీట్æ కూడా దాఖలు చేశారు. పదేపదే సంఘటనలు జరుగుతున్నా.. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీస్టేషన్ల ఏర్పాటు, ఆయుధాల కేటాయింపు, అటవీశాఖ రీ–ఆర్గనేజేషన్ వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ,వరంగల్ : అడవుల సంరక్షణకు ఆయుధాలు అనివార్యమని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నా.. ఆచరణరూపం దాల్చడం లేదు. అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరినప్పుడు మాత్రమే ఆయుధాల ప్రస్తావన తెరమీదకు వస్తుండగా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా కారణమేమిటో తెలియదు కానీ అంతగా స్పందన ఉండటం లేదని అధికారులు చెబుతున్నారు. ఆరేళ్ల కిందట చోటుచేసుకున్న వరుస సంఘటనల్లో స్మగ్లర్ల చేతిలో అటవీశాఖ ఉద్యోగులు మృతి చెందిన విషయం విదితమే.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులను హతమార్చడం.. అంతకు ముందు నిజామాబాద్‌తో పాటు జిల్లాలోని పెంబి అడవుల్లో బీట్ ఆఫీసర్ సత్యనారాయణను చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పోలీసు, అటవీ, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు సైతం పాల్గొన్నారు. ఆ చర్చలు, సమీక్షల సందర్భంగా అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను నిరోధించడంతో పాటు అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అటవీ సిబ్బంది చేతికి ఆయుధాలు అందుతాయని ఆశించారు.
అటకెక్కిన పునర్విభజన
డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పని భారం, ఒత్తిడి తగ్గించేందుకు అట వీశాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టేందుకు కమిటీ వేసింది. కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికా రి నర్పట్ సింగ్ అధ్యయనం చేసిన 2011లో పలు ప్రతి పాదనలు సమర్పించారు. ప్రస్తుతం ఒక్కో మండలంలో 1,473 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. దానిని 750 స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గించి, ఒక్కో మండలంలో మూడు నుంచి నాలుగు రేంజ్‌లు, సెక్షన్‌లు పెంచి తే బీట్ ఆఫీసర్ల పరిధి 25 చదరపు కిలోమీటర్ల నుంచి 15 చదరపు కిలోమీటర్లకు తగ్గుతుందని తెలిపారు.
ఉమ్మడి వరంగల్‌లో...
ఉమ్మడి వరంగల్‌లో ఈ ప్రతిపాదనలు అమలైతే భారీ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించారు. అదే జరిగితే ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మండలాలు, రేంజ్‌ల సంఖ్య పెరగాల్సి ఉంది. అటవీశాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మండలాల సంఖ్య మూడు నుంచి ఐదుకు, రేంజ్‌లు 13 నుంచి 16కు పెంచాలని సూచించారు. వరంగల్ ఉత్తరం, వరంగల్ దక్షిణ మండలాలతో పాటు ఒక వన్యప్రాణుల సంరక్షణ డివిజన్లను విభజించి... వరంగల్ ఉత్తరం, ఏటూరునాగారం, వరంగల్ దక్షిణం, నర్సంపేట, మహబూబాబాద్ డివిజన్ల ఏర్పాటుకు సిఫారసు చేశారు.
అలాగే, టెరిటోరియల్, వైల్డ్‌లైఫ్ డివిజన్లను ఒక్కటిగా మార్చాలని పేర్కొన్నారు. వరంగల్ ఉత్తర మండలం పరిధిలో ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, మంగపేట, పస్రా, ములుగు, భూపాలపల్లి, పరకాల, మంగపేట రేంజ్‌లకు తోడు నర్సంపేట పరిధిలో కొత్తగూడకు తోడు పాకాల, వరంగల్ పరిధిలో వరంగల్, హన్మకొండ రేంజ్‌లుగా మార్చడంతో పాటు జనగామలో మరొకటి ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికివీటికి తోడు పాతవి మహబూబాబాద్, గూడూరు రేంజ్‌లు పనిచేస్తాయి. అయితే ఈ ప్రతిపాదనలు, సూచనలను అమలుకు నోచుకోలేదు. ఇక ఇప్పటికే స్మగ్లర్ల ధాటికి అడవి తగ్గిపోగా.. మిగిలిన మిగిలిన అడవులను పరిరక్షించడమే కాకుండా తమను తాము రక్షించుకునేందుకు అటవీశాఖ చేసిన ఆయుధాల ప్రతిపాదనకు తోడు ‘అటవీ స్టేషన్ల’ ఏర్పాటు కూడా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment