సాక్షి, సంగారెడ్డి: గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలోని ఖాజీపేట అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి యంగ్ రెబల్ స్టార్ సోమవారం పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను తన తండ్రి దివంగత యూవీఎస్‌రాజు పేరు మీద ప్రభాస్ దత్తత తీసుకున్నారు.
ఇందుకోసం రెండు కోట్ల రూపాయలను అందించడమే కాకుండా, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (నిర్మాతలను నామినేట్ చేసిన శర్వానంద్)
కాగా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. ఇక ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మార్చనున్నారు. (ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్)
Comments
Please login to add a commentAdd a comment