
ప్రపంచమంతా ఒక రకమైన అనిశ్చితిలో రోజులు వెళ్లదీస్తున్న వర్తమానంలో మరో మారణకాండకు పథకం పన్ని, అమలుచేసి కశ్మీర్ సమస్యను మళ్లీ తెరపైకి తేవాలనుకున్న పాకిస్తాన్‌కు మన దేశం నుంచి గట్టి హెచ్చరికే వెళ్లింది. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేయటంతో సహా తీసుకున్న చర్యలు సహజంగానే పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేశాయి. అటారీ సరిహద్దు మూత, దౌత్యసంబంధాలకు పరిమితుల విధింపు, పాకిస్తాన్ పౌరులకు భారత్‌లో ప్రవేశం నిషేధం వంటి నిర్ణయాలు దీనికి అదనం.
నిజానికి సింధూ నదీజలాల ఒప్పందం నిలిపివేతను పాకిస్తాన్ ఊహించలేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్యా యుద్ధం వచ్చిన సందర్భాల్లో... ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు లేదా పుల్వామాలో మన జవాన్లను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నప్పుడు కూడా మన దేశం ఆ ఒప్పందం నిలిపివేత గురించి మాట్లాడలేదు. సింధూ నదీజలాలపై పాకిస్తాన్ సాగురంగం 80 శాతం వరకూ ఆధారపడి వుంటుంది.
పైగా ప్రపంచంలో తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొనే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. సింధు, జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్ నదులకు సంబంధించిన సమస్త సమాచారమూ కూడా ఈ ఒప్పందంలో ఇమిడివున్న వేళ మన దేశ నిర్ణయం పాకిస్తాన్‌కు శరాఘాతమే అవుతుంది. భారత్ చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ సైతం చర్యలు తీసుకున్నా అది పరువు కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే.
ఎలా చూసినా పాకిస్తాన్ ఒక రకంగా ఒంటరి బతుకు బతుకుతోంది. అమెరికాకు అఫ్గాన్ పెను సమస్యగా కనబడినంత కాలమూ అది పాకిస్తాన్ సాయం తీసుకోక తప్పేది కాదు. అందుకోసం పాక్ తరఫున మాట్లాడటం, అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలొస్తున్నా అమాయ కత్వం నటించటం అప్పట్లో అమెరికాకు అలవాటు. ఉగ్రవాదులకు అండదండలందిస్తున్నట్టు ఆధారాలున్నా ఏనాడూ పాక్‌కు ఆర్థిక సాయం ఆగకుండా చూసిన ఘనత అమెరికాది.
2021లో అఫ్గాన్ నుంచి బతుకుజీవుడా అనుకుంటూ నిష్క్రమించాక అమెరికాకు పాకిస్తాన్‌పై మునుపటి ప్రేమ, వాత్సల్యాలు తగ్గుముఖం పట్టాయి. పర్యవసానంగా అప్పు దొరక్క పాక్ ఇబ్బంది పడుతోంది. గల్ఫ్ దేశాలు కూడా గతంలో మాదిరి కాసుల వర్షం కురిపించటం లేదు. చైనా సరేసరి. అదెంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) పాకిస్తాన్‌లో నత్తనడ కన సాగటం, నిర్మాణ పనులకు ఎదురవుతున్న ఆటంకాలు చైనాకు ఆగ్రహం కలిగిస్తున్నాయి.
గత కొన్నే ళ్లుగా కశ్మీర్ విషయంలో పాక్‌ను సమర్థించటం మొదలెట్టిన తుర్కియే హఠాత్తుగా గత ఏడాది స్వరం మార్చింది. గల్ఫ్ దేశాలు సైతం పాకిస్తాన్ తీరు మారనంత కాలమూ తాము మద్దతు నీయటం కష్టమేనని భావిస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా ఇలా ఏకాకిగా మారుతున్న సమ యంలో పహల్గామ్‌లో బరితెగించి ఉన్మాదులను ప్రోత్సహించటం వల్ల మరింతగా నష్టపోతానని పాకిస్తాన్ గ్రహించలేకపోయింది.
అంతర్జాతీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలు చివరకు యుద్ధానికి దారి తీయొచ్చని చాలామంది జోస్యం చెబుతుండగా నిజంగా ఆ పరిస్థితే వస్తే భౌగోళికంగా తమ అవసరాల కోసమైనా అమెరికా, చైనాలు తన కోసం అర్రులు చాస్తాయన్న అభిప్రాయం పాకిస్తాన్‌కు ఏదోమూల వున్నట్టు కనబడుతోంది. అందుకే పహల్గామ్ దుస్సాహసానికి పూనుకుంది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పహల్గామ్‌కు ప్రతీకారం ఉండి తీరుతుందని ప్రకటిస్తున్నారు. 2016లో ఉరిలో ఉగ్రవాదుల మారణకాండ తర్వాత, 2019లో పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి అనంతరం మన దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రశిబిరాలపై సర్జికల్ దాడులను నిర్వహించాయి. అందు వల్ల వచ్చిన లాభనష్టాలేమిటన్న మాట అలావుంచి ఉగ్రదాడులు తగ్గివుండొచ్చుగానీ ఆగింది లేదు. పౌరుల్లో ఆత్మస్థైర్యం నింపటానికి ప్రతి చర్యలు అవసరమే. అవి కొనసాగవలసిందే.
కానీ అక్కడితో అంతా అయిందనుకోవటంలోనే వుంది సమస్యంతా! ఒకప్పుడు కశ్మీర్‌లో అధికార గణాంకాల ప్రకారం 7,000 మంది ఉగ్రవాదులుండేవారు. కానీ వారి సంఖ్య ప్రస్తుతం 76 మాత్రమేనని గత నెలలో విడుదలైన గణాంకాలు చెబుతున్నాయి. అందులో 59 మంది బయటివారు కాగా, కేవలం 17 మంది మాత్రమే స్థానికులు. ఉగ్రదాడుల్లో మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కశ్మీర్‌ను గత 35 యేళ్లుగా ఉగ్రవాద భూతం పట్టిపీడిస్తోంది. తొలినాళ్లలో ఏడాదికి ఇంచుమించు వేయిమంది బలయ్యేవారు. 2001 సంవత్సరంలో ఉగ్రవాదులు ఏకంగా 4,011 మందిని పొట్టన బెట్టుకున్నారు. కానీ నిరుడు ఆ సంఖ్య 127.
కొందరు ప్రతీకారేచ్ఛను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక చర్య తీసుకునే ముందు ఎన్నో బేరీజు వేసుకోవాల్సి వుంటుంది. అది యుద్ధంగా మారిన పక్షంలో... మనవైపు గట్టిగా నిలబడే వారెవరు, వ్యూహాత్మకంగా ఎదురయ్యే సమస్యలేమిటి, దళాల సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యాల్లో మన స్థానం ఏమిటి అనేవి చూసుకోవాలి. ఇదే అదనుగా కొన్ని రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థులపై దాడులు, బెదిరింపులు మొదలయ్యాయి.
మొన్నటికి మొన్న పహల్గామ్‌లో కశ్మీరీ పౌరులు ప్రాణాలకు తెగించి అనేకమందిని కాపాడిన వైనం ఇలాంటి వారికి తెలిసి వుండక పోవచ్చు. ఉగ్రవాద బెడద తగ్గటంలో స్థానికులు అందిస్తున్న సహకారమేమిటో వారికి అర్థంకాకపోయి వుండొచ్చు. మన పౌరుల్ని మనమే మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేర్చినట్టే అవుతుంది. నిజానికి వారు కోరుకునేది ఈ విద్వేషాన్నే! ఒకపక్క ఉగ్రవాదం అంతానికి దేశమంతా ఒక్కటై నిలబడాలని ప్రధాని పిలుపునిస్తుంటే తద్భిన్నంగా ప్రవర్తించటం విజ్ఞత అనిపించుకోదు.