Indus river
-
మరింత అగ్గి రాజేసేలా.. పాక్ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
తీరుమార్చుకోని పాకిస్థాన్ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్ ఓడలపై భారత్ నిషేధం విధించింది. పాకిస్థాన్ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. -
జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాంతిస్థాపనే లక్ష్యంగా సిమ్లా ఒప్పందం
పహల్గాంలో హేయమైన ఉగ్రదాడి తర్వాత సింధూ నదీజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించాక అందుకు ప్రతీకార నిర్ణయంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడో దేశం జోక్యం చేసుకోవద్దనే ప్రధాన అజెండాగా రూపుదిద్దుకున్న సిమ్లా ఒప్పందం నుంచి పక్కకు జరుగుతున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో దశాబ్దాలుగా రావణకాష్టంగా రగలిపోతున్న కశీ్మర్ అంశంలో ఇకపై అమెరికా వంటి సంపన్న దేశాలు పెద్దమనిషిలా దూరిపోయి అంశాన్ని మరింత జఠిలం చేసే ప్రమాదముందనే సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సిమ్లా ఒప్పందంలో ఏమేం అంశాలు ఉన్నాయి?. వాటి ప్రాధాన్యత ఏమిటి? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 1972లో సాకారం.. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా విమోచన పొందడంలో భారత ప్రమేయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారత్‌పైకి పాకిస్తాన్ దాడికి తెగించడం తదనంతర పరిణామాలతో 1971 యుద్ధం జరిగింది. 1971లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం ముగిశాక శాంతిస్థాపనే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు మొగ్గుచూపాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకుని, సాధారణ పరిస్థితులు నెలకొనడమే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు పచ్చజెండా ఊపాయి. పొరుగుదేశ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నియంత్రణ రేఖను ఇష్టమొచి్చనట్లు ఏకపక్షంగా మార్చకూడదనే కట్టుబాటుతో ఈ ఒప్పందం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పట్టణంలో 1972 జూలై రెండో తేదీన నాటి భారత ప్రధాని ఇందిరా గాం«దీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జులి్ఫ కర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే శాంతిస్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఇరుదేశాలు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా ఈ ఒప్పందం పేరొందింది. ఇకపై పొరుగుదేశాలుగా పరస్పర సహకారం, సామరస్యంతో మెలుగుతామని ఆనాడు ఇరుదేశాలు ప్రతినబూనాయి. ఒప్పందంలో ఏమేం ఉన్నాయి? భవిష్యత్తులో సరిహద్దుసహా మరే అంశంలోనైనా మనస్పర్థలు తలెత్తినా, వివాదాలు చెలరేగినా మూడో దేశానికి లేదా అంతర్జాతీయ సంఘంలో ఫిర్యాదుచేయకుండా రెండు దేశాలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నారు. మూడో దేశం జోక్యాన్ని ఈ ఒప్పందం నివారిస్తోంది. 1971లో యుద్ధం సమయంలో సరిహద్దు దాటి ముందుకు చొచ్చుకురావడం, మరి కొన్ని చోట్ల భూభాగాన్ని కోల్పోవడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం తమ అ«దీనంలోని భూభాగాలను తమవిగా పేర్కొంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ దానినే నియంత్రణ రేఖగా ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ని యంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చడానికి వీలులేదు. యుద్ధం వేళ చాలా మంది పాకిస్తానీ సైనికులను భారత బలగాలు బంధించాయి. ఈ ఒప్పందంలో భాగంగా వారందరినీ విడిచిపెట్టారు. పాకిస్తాన్ సైతం బంగ్లాదేశ్ సాధించిన సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించింది. బంగ్లాదేశ్‌తోనూ పర స్పర గౌరవం పాదుకొల్పడమే లక్ష్యంగా ఈ అంశాన్నీ సిమ్లా ఒప్పందంలో చేర్చారు. ఒప్పందం ప్రభావం ఎంత ? ఈ ఒప్పందం కారణంగా తదనంతరకాలంలో ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు వచి్చన ప్రతిసారీ ఈ రెండు దేశాలే సమస్యలను పరిష్కరించుకున్నాయిగానీ మరే ఇతర దేశాన్ని మధ్యవర్తిగా ఆహ్వానించలేదు. చర్చలు రెండు దేశాల మధ్యే పరిమితం కావడంతో వేగంగా సంప్రతింపులు సాధ్యమయ్యాయి. మెరుగైన పరిష్కారం సాధ్యమైంది. కశ్మీర్లో నియంత్రణ రేఖనే వాస్తవా«దీన రేఖగా అప్పటి నుంచి కొనసాగింది. దీంతో ఆనాటి నుంచి ఎలాంటి సరిహద్దు ఆక్రమణ ఘటనలు జరగలేదు. ఇలా ఈ ఒప్పందం భూభాగాల వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించింది. దౌత్యపరంగా సంబంధాల కొనసాగింపునకు ఈ ఒప్పందం సుసాధ్యం చేసింది. ఇరుదేశాల మధ్య విశ్వాసం పెంచే ప్రయత్నాలు ఈ ఒప్పందం కారణంగానే జరిగాయి. అయితే ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం వంటివి తరచూ ఉల్లంఘనకు గురవడం ఒక్కటే ఈ ఒప్పందం మనుగడకు సవాల్‌గా నిలిచింది. తాజాగా పాకిస్తాన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే కశీ్మర్ అంశంపై పాక్ అనుకూల దేశాలు మధ్యవర్తులుగా బయల్దేరే ప్రమాదముంది. అప్పుడు కశీ్మర్ మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన అంశం అనే భారత వాదన అంతర్జాతీయ వేదికలపై కాస్తంత బలహీనపడే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నీటి మళ్లింపు.. పాక్‌పై యుద్ధ ప్రకటనే
ఇస్లామాబాద్: సింధూ నది జలాల ఒప్పందాన్ని లెక్కచేయకుండా నీటి మళ్లింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా అది తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం భారత్‌పై ఆంక్షలు ప్రకటించింది. భారతదేశ విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. ఇండియాతో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు కీలకమైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో గురువారం నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది. పలువురు మంత్రులతోపాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలపై చర్చించారు. భారత్‌పైనా అదే తరహా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్ఎస్సీ భేటీ అనంతరం పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. కేవలం సిమ్లా ఒప్పందమే కాకుండా మిగతా ఒప్పందాలనూ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయాలు → ఇండియాతో ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు సిమ్లా ఒప్పందం సైతం నిలిపివేత. → వాఘా బోర్డర్ పోస్టు తక్షణమే మూసివేత. రాకపోకలు పూర్తిగా రద్దు. → ఈ సరిహద్దు గుండా బయటకు వెళ్లినవారు 30లోగా తిరిగిరావాలి. → సార్క్ వీసా మినహాయింపు పథకం(ఎస్‌వీఈఎస్) కింద భారతీయులకు ఇచ్చిన అన్ని రకాల వీసాలు వెంటనే రద్దు. సిక్కు యాత్రికులకు మాత్రం మినహాయింపు. → ఎస్‌వీఈఎస్ పథకం కింద పాకిస్తాన్లో ఉన్న భారతీయులు 48 గంటల్లోకి బయటకు వెళ్లిపోవాలి. → పాక్‌లో ఉన్న భారతీయ త్రివిధ దళాల సభ్యులు ఏప్రిల్ 30 లోగా వెనక్కి వెళ్లిపోవాలి. భారత హైకమిషన్‌లోని ఈ పోస్టులు రద్దు. → భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న భారత సహాయక సిబ్బంది సైతం స్వదేశానికి వెళ్లిపోవాలి. → ఇండియన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, సిబ్బంది సంఖ్య 30కి పరిమితం. ఇది ఈ నెల 30వ తేదీ నుంచి అమల్లోకి. → పాక్ గగనతలంపై ప్రయాణించేందుకు భారత విమానాలు అనుమతి లేదు. ఈ నిర్ణయం ఇది తక్షణమే అమలు. → సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణం. 24 కోట్ల మంది పాక్ పౌరులకు ఈ జలాలు జీవనాధారం. → ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో, ఎక్కడున్నా అంతం చేయాల్సిందే. శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ పాక్ సార్వ¿ౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన రీతిలో బదులిస్తాం. → రాజకీయ ఎజెండా కోసం పాక్‌పై నిందలు వేయడం భారత్ మానుకోవాలి. ఇలాంటి నిందలు శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు. -
ఐక్యత వర్తమాన అవసరం
ప్రపంచమంతా ఒక రకమైన అనిశ్చితిలో రోజులు వెళ్లదీస్తున్న వర్తమానంలో మరో మారణకాండకు పథకం పన్ని, అమలుచేసి కశ్మీర్ సమస్యను మళ్లీ తెరపైకి తేవాలనుకున్న పాకిస్తాన్‌కు మన దేశం నుంచి గట్టి హెచ్చరికే వెళ్లింది. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేయటంతో సహా తీసుకున్న చర్యలు సహజంగానే పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేశాయి. అటారీ సరిహద్దు మూత, దౌత్యసంబంధాలకు పరిమితుల విధింపు, పాకిస్తాన్ పౌరులకు భారత్‌లో ప్రవేశం నిషేధం వంటి నిర్ణయాలు దీనికి అదనం. నిజానికి సింధూ నదీజలాల ఒప్పందం నిలిపివేతను పాకిస్తాన్ ఊహించలేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్యా యుద్ధం వచ్చిన సందర్భాల్లో... ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు లేదా పుల్వామాలో మన జవాన్లను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నప్పుడు కూడా మన దేశం ఆ ఒప్పందం నిలిపివేత గురించి మాట్లాడలేదు. సింధూ నదీజలాలపై పాకిస్తాన్ సాగురంగం 80 శాతం వరకూ ఆధారపడి వుంటుంది. పైగా ప్రపంచంలో తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొనే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. సింధు, జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్ నదులకు సంబంధించిన సమస్త సమాచారమూ కూడా ఈ ఒప్పందంలో ఇమిడివున్న వేళ మన దేశ నిర్ణయం పాకిస్తాన్‌కు శరాఘాతమే అవుతుంది. భారత్ చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ సైతం చర్యలు తీసుకున్నా అది పరువు కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. ఎలా చూసినా పాకిస్తాన్ ఒక రకంగా ఒంటరి బతుకు బతుకుతోంది. అమెరికాకు అఫ్గాన్ పెను సమస్యగా కనబడినంత కాలమూ అది పాకిస్తాన్ సాయం తీసుకోక తప్పేది కాదు. అందుకోసం పాక్ తరఫున మాట్లాడటం, అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలొస్తున్నా అమాయ కత్వం నటించటం అప్పట్లో అమెరికాకు అలవాటు. ఉగ్రవాదులకు అండదండలందిస్తున్నట్టు ఆధారాలున్నా ఏనాడూ పాక్‌కు ఆర్థిక సాయం ఆగకుండా చూసిన ఘనత అమెరికాది. 2021లో అఫ్గాన్ నుంచి బతుకుజీవుడా అనుకుంటూ నిష్క్రమించాక అమెరికాకు పాకిస్తాన్‌పై మునుపటి ప్రేమ, వాత్సల్యాలు తగ్గుముఖం పట్టాయి. పర్యవసానంగా అప్పు దొరక్క పాక్ ఇబ్బంది పడుతోంది. గల్ఫ్ దేశాలు కూడా గతంలో మాదిరి కాసుల వర్షం కురిపించటం లేదు. చైనా సరేసరి. అదెంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) పాకిస్తాన్లో నత్తనడ కన సాగటం, నిర్మాణ పనులకు ఎదురవుతున్న ఆటంకాలు చైనాకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. గత కొన్నే ళ్లుగా కశ్మీర్ విషయంలో పాక్‌ను సమర్థించటం మొదలెట్టిన తుర్కియే హఠాత్తుగా గత ఏడాది స్వరం మార్చింది. గల్ఫ్ దేశాలు సైతం పాకిస్తాన్ తీరు మారనంత కాలమూ తాము మద్దతు నీయటం కష్టమేనని భావిస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా ఇలా ఏకాకిగా మారుతున్న సమ యంలో పహల్గామ్లో బరితెగించి ఉన్మాదులను ప్రోత్సహించటం వల్ల మరింతగా నష్టపోతానని పాకిస్తాన్ గ్రహించలేకపోయింది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలు చివరకు యుద్ధానికి దారి తీయొచ్చని చాలామంది జోస్యం చెబుతుండగా నిజంగా ఆ పరిస్థితే వస్తే భౌగోళికంగా తమ అవసరాల కోసమైనా అమెరికా, చైనాలు తన కోసం అర్రులు చాస్తాయన్న అభిప్రాయం పాకిస్తాన్‌కు ఏదోమూల వున్నట్టు కనబడుతోంది. అందుకే పహల్గామ్ దుస్సాహసానికి పూనుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పహల్గామ్కు ప్రతీకారం ఉండి తీరుతుందని ప్రకటిస్తున్నారు. 2016లో ఉరిలో ఉగ్రవాదుల మారణకాండ తర్వాత, 2019లో పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి అనంతరం మన దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రశిబిరాలపై సర్జికల్ దాడులను నిర్వహించాయి. అందు వల్ల వచ్చిన లాభనష్టాలేమిటన్న మాట అలావుంచి ఉగ్రదాడులు తగ్గివుండొచ్చుగానీ ఆగింది లేదు. పౌరుల్లో ఆత్మస్థైర్యం నింపటానికి ప్రతి చర్యలు అవసరమే. అవి కొనసాగవలసిందే. కానీ అక్కడితో అంతా అయిందనుకోవటంలోనే వుంది సమస్యంతా! ఒకప్పుడు కశ్మీర్లో అధికార గణాంకాల ప్రకారం 7,000 మంది ఉగ్రవాదులుండేవారు. కానీ వారి సంఖ్య ప్రస్తుతం 76 మాత్రమేనని గత నెలలో విడుదలైన గణాంకాలు చెబుతున్నాయి. అందులో 59 మంది బయటివారు కాగా, కేవలం 17 మంది మాత్రమే స్థానికులు. ఉగ్రదాడుల్లో మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కశ్మీర్‌ను గత 35 యేళ్లుగా ఉగ్రవాద భూతం పట్టిపీడిస్తోంది. తొలినాళ్లలో ఏడాదికి ఇంచుమించు వేయిమంది బలయ్యేవారు. 2001 సంవత్సరంలో ఉగ్రవాదులు ఏకంగా 4,011 మందిని పొట్టన బెట్టుకున్నారు. కానీ నిరుడు ఆ సంఖ్య 127. కొందరు ప్రతీకారేచ్ఛను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక చర్య తీసుకునే ముందు ఎన్నో బేరీజు వేసుకోవాల్సి వుంటుంది. అది యుద్ధంగా మారిన పక్షంలో... మనవైపు గట్టిగా నిలబడే వారెవరు, వ్యూహాత్మకంగా ఎదురయ్యే సమస్యలేమిటి, దళాల సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యాల్లో మన స్థానం ఏమిటి అనేవి చూసుకోవాలి. ఇదే అదనుగా కొన్ని రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థులపై దాడులు, బెదిరింపులు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న పహల్గామ్లో కశ్మీరీ పౌరులు ప్రాణాలకు తెగించి అనేకమందిని కాపాడిన వైనం ఇలాంటి వారికి తెలిసి వుండక పోవచ్చు. ఉగ్రవాద బెడద తగ్గటంలో స్థానికులు అందిస్తున్న సహకారమేమిటో వారికి అర్థంకాకపోయి వుండొచ్చు. మన పౌరుల్ని మనమే మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేర్చినట్టే అవుతుంది. నిజానికి వారు కోరుకునేది ఈ విద్వేషాన్నే! ఒకపక్క ఉగ్రవాదం అంతానికి దేశమంతా ఒక్కటై నిలబడాలని ప్రధాని పిలుపునిస్తుంటే తద్భిన్నంగా ప్రవర్తించటం విజ్ఞత అనిపించుకోదు. -
పాకిస్తాన్లో మరో ఘోర ప్రమాదం
ఇస్లామాబాద్: ఘోర రైలు ప్రమాదం జరిగి 50 మంది మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సింధు నదిలో వ్యాన్ పడిపోవడంతో 17 మంది దుర్మరణం పాలయ్యారు. సింధు నదిలో ప్రవాహం ఉధృతి ఉండడంతో మృతదేహాలు వెలికితీయడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఘటన ఆ దేశంలోని పానిబా ప్రాంతంలో జరిగింది. ఓ కుటుంబానికి చెందిన వారంతా వ్యాన్ అద్దెకు తీసుకుంటూ టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్తాన్ చిలాస్‌కు చెందిన ఓ కుటుంబం వ్యాన్‌ను అద్దెకు తీసుకుంది. డ్రైవర్‌తో సహా మొత్తం 17 మందితో కూడిన వ్యాన్ చిలాస్ నుంచి రావల్పిండికి బయల్దేరింది. మార్గమధ్యలో కోహిస్తాన్ జిల్లాలోని పానిబా ప్రాంతానికి చేరుకోగానే వ్యాన్ అదుపు తప్పి సింధు నదిలోకి పడిపోయింది. డ్రైవర్‌తో సహా అందరూ మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వ్యాన్‌లో మృతదేహాలు కనిపించలేదు. ఆ ప్రవాహానికి మృతదేహాలు కొట్టుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఒక మహిళ మృతదేహం మాత్రమే లభించినట్లు కోహిస్తాన్ పోలీస్ ఆరీఫ్ జావేద్ తెలిపారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సింధూ నది : ప్రాజెక్టుల నిర్మాణం ఆపేది లేదు
విద్యుత్ అవసరాల కోసమే..! 1180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కశ్మీరీల వ్యవసాయానికి ఊతం తీరనున్న తాగు నీటి కొరత వాషింగ్టన్ : సింధూ నదీ జలాల విషయంలోనూ, జమ్మూ కశ్మీర్లో కొత్తగా నిర్మిస్తున్న రెండు హైడ్రో ప్రాజెక్టులపై వెనకంజ వేసేది లేదని భారత్ స్పష్టం చేసింది. కొంతకాలంగా సింధూ నదీ జలాలపై ఇరు దేశాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. నదీ జలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్‌ను ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ముఖ్య అధికారులతో వరల్డ్ బ్యాంక్ ఈ నెల 14, 15 తేదీల్లో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో భారత్ తాము చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాలు లేవని.. వాటిని కట్టి తీరుతామని ప్రకటించింది. ఈ చర్చల్లో భారత్ తరఫున కేంద్ర జలవనరుల ప్రధాన కార్యదర్ధి అమర్జిత్ సింగ్, దీపక్ మిట్టల్ పాల్గొన్నారు. పాకిస్తాన్ తరఫున వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, వాటర్ అండ్ పవర్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ యూసఫ్ నసీమ్ ఖాన్, విదేశాంగ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. చర్చల సందర్భంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు 1960లో జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం గురించి వివరిస్తూ.. కశ్మీర్లో కొత్తగా నిర్మించే ప్రాజెక్టులు (కిషన్ గంగా, రాట్లే) అందుకు విరుద్ధం అని చెప్పారు. సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఇరు దేశాల ప్రతినిధులకు సూచించారు. పాకిస్తాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. 1960 ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. నాటి ఒప్పందాలను పక్కనబెట్టి జీలం, చీనాబ్ నదుల మీద ప్రాజెక్టులు నిర్మిస్తోందని.. ఇవి పూర్తయితే.. పాకిస్తాన్‌ను నీళ్లు రావని చెప్పారు. పాక్ ప్రతినిధుల ఆరోపణలకు భారత ప్రతినిధులు దీటుగా సమాధానమిచ్చారు. భారత్ ఎక్కడా 1960 ఒప్పందాలను ఉల్లఘించలేదని స్పష్టం చేశారు. మా భూభాగంలో ప్రవహించే నదుల్లో.. అది కూడా కేవలం విద్యుత్ అవసరాలకు మాత్రమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల మాకు 1180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని.. అది జమ్మూ కశ్మీర్ ప్రజలకు, వ్యవసాయానికి ఉపయోగ పడుతుందని.. దీపక్ మిట్టల్ పేర్కొన్నారు.