గత మూడేళ్లుగా దేనిపైన అయినా ఏకాభిప్రాయం మాట అటుంచి, పరస్పరం చర్చించుకోవటానికి కూడా సిద్ధపడని భారత్, పాకిస్తాన్‌ల మధ్య చర్చలు జరగటం కీలకమైన పరిణామం. గత వారం ఈ రెండు దేశాలకూ చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) సమావేశమై 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధీన రేఖ (ఎల్‌ఓసీ) వద్ద, ఇతర సెక్టార్లలోనూ కచ్చితంగా పాటించాలని అంగీకారానికి వచ్చారు. పరస్పర లాభదాయకమైన ప్రయోజనాల కోసం సరిహద్దుల పొడవునా సుస్థిర శాంతి నెలకొల్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్య సమితి, అమెరికా హర్షం వ్యక్తం చేశాయి. కాల్పుల విరమణ ఒప్పందం నిజానికి హాస్యాస్పదమైన అంశంగా మిగిలిపోయింది. దాన్ని పాటించిన సందర్భాలకంటే ఉల్లంఘించటమే అధికం. అసలు అలాంటి ఒప్పందం వుందన్న సంగతిని ఎవరైనా మర్చిపోతారేమోనన్నట్టు ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి దాని దుమ్ము దులపటం, గంభీరంగా దాన్ని గురించి మాట్లాడుకోవటం...ఏదో రకమైన అంగీకారం కుదిరినట్టు ప్రకటించటం, సంతకాల తడి ఆరకముందే సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లటం రివాజైంది. అయితే దీనికి 2018లో బ్రేక్ పడింది. అంతక్రితం థాయ్‌లాండ్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కూ, అప్పటి పాకిస్తాన్ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ నాసిర్‌ఖాన్ జంజువాకూ మధ్య సంభాషణలయ్యాక తర్వాత రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగాలని నిర్ణయించారు. కానీ ఆ ఏడాది జనవరి 3న సాంబ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చిచంపటంతో మొదలుపెట్టి కాల్పుల విరమణ ఉల్లంఘనలు విపరీతంగా పెరిగాయి. ఇవి ఆ ఏడాది మే నెలవరకూ సాగుతూనే వున్నాయి. ఆ నెలలో మళ్లీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందంపై అంగీకారం కుదిరింది. జూన్ నెలలో అంతా ప్రశాంతంగానే వున్నట్టు కనబడినా, ఆ నెల చివరిలో మళ్లీ పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అటుపై ఆ ఏడాదంతా అడపా దడపా సరిహద్దుల్లో కాల్పుల మోత తప్పలేదు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో 43మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తర్వాత మన వైమానిక దళం సరిహద్దుల ఆవల పాక్ భూభాగంలో వున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అనేకమంది ఉగ్రవాదులను హతమార్చింది.
ఇలా వరస దాడులు, ప్రతిదాడుల పరంపరతో నిలిచిపోయిన చర్చలు ఉరుము లేని పిడుగులా హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చాయన్నది అంతుచిక్కని ప్రశ్నే. ఇవి కేవలం డీజీఎంఓ స్థాయి చర్చలేనని సరిపెట్టుకోవటానికి లేదు. పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అక్కడి సైన్యం చెప్పుచేతల్లో నడుస్తుంది. కనుక ఆ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడిందంటే అది సైన్యం నిర్ణయం మేరకు జరిగిందని అర్థం. మన ప్రభుత్వం కూడా అందుకు సుముఖత తెలిపిందంటే వైఖరిని కొంత సడలించుకుందని భావించవచ్చు. చాన్నాళ్లపాటు లోపాయికారీగా రెండు దేశాల దూతల మధ్యా పరస్పరం సుదీర్ఘమైన చర్చలు జరిగితేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇప్పుడు కుదిరిన అవగాహనలో కశ్మీర్ అంశం లేకపోవటం సైతం అందరికీ ఆశ్చర్యం కలిగించేదే. ‘సమస్యలకు దారితీస్తున్న... శాంతిని భగ్నం చేస్తున్న కీలకమైన అంశాలను గుర్తించి వాటిని పరిష్కరించు కునేందుకు ఇరు దేశాలూ పాటుపడతాయ’న్న మాటైతే అవగాహనలో వుంది. ఇందులో పరోక్షంగా ప్రస్తావనకొచ్చింది కశ్మీర్ అంశమేనని పాక్ మీడియా భాష్యం చెబుతోంది. జనవరి నెలలో జరిగిన ఒక ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తేనే భారత్‌తో చర్చలుంటాయని చెప్పారు. కానీ నెల తిరిగేసరికి ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన అవగాహనలో దాని మాటే లేకపోవటం చూస్తే ఎవరి ఒత్తిడితో ఈ చర్చలు జరిగాయన్న ప్రశ్న తలెత్తుతుంది. అమెరికాలో బైడెన్ ఏలుబడి వచ్చాక ఆ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందా లేక పాకిస్తాన్ సైన్యమే తన ఆలోచన మార్చుకుందా అన్నది తెలియాల్సివుంది. గత నెల మొదట్లో పాకిస్తాన్ సైనిక దళాల చీఫ్ జనరల్ బజ్వా ఇరుగుపొరుగుతో మర్యాదగా మెలగటం, శాంతియుత సహజీవనానికి సిద్ధపడటం తమ విధానమని చెప్పినప్పుడే కొందరిలో ఆ ప్రకటన ఆసక్తి కలిగించింది.
ఏదేమైనా ఘర్షణకు బదులు చర్చించుకోవటం, సదవగాహన ఏర్పర్చుకోవటం ఎప్పుడూ మంచిదే. నవాజ్ షరీఫ్ ఏలుబడిలోనూ, అంతకుముందూ పౌర ప్రభుత్వాలు మన దేశంతో చర్చలకు సిద్ధపడినప్పుడల్లా పాకిస్తాన్ సైన్యం ఏదోవిధంగా వాటిని వమ్ము చేసేందుకు ప్రయత్నించేది. ఎల్‌ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటం, సరిహద్దుల్లో చొరబాట్లను ప్రోత్స హించి ఉగ్రదాడులు జరిగేలా చూడటం వంటివి చేసేది. ఇప్పుడు అందుకు భిన్నంగా తానే చర్చలకు సరేననటం మంచిదే. అయితే ఇదింకా విస్తరిస్తుందా, ద్వైపాక్షిక చర్చలకు కూడా చోటిస్తుందా అన్నది చూడాల్సివుంది. ఎల్‌ఓసీ ప్రశాంతంగా వుండటం, సరిహద్దు గ్రామాల ప్రజలు తమ రోజువారీ పనులు నిర్భయంగా చేసుకునే అవకాశం రావటం హర్షించదగ్గదే. ఈ శాంతియుత పరిస్థితులు ఎన్నాళ్లు కొనసాగుతాయన్నది పాకిస్తాన్ చిత్తశుద్ధిపై ఆధారపడివుంటుంది. ఆ చిత్తశుద్ధి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు దారితీస్తుందని, అందువల్ల రెండు దేశాలూ ఎంతగానో లాభపడొచ్చని పాకిస్తాన్ గుర్తిస్తే మంచిది.
పాక్ తీరు మారిందా?
Published Tue, Mar 2 2021 1:13 AM | Last Updated on Tue, Mar 2 2021 4:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment