దౌత్య విజయం | Sakshi Editorial On India Diplomatic Victory Over Pakistan | Sakshi
Sakshi News home page

దౌత్య విజయం

Published Fri, May 3 2019 12:32 AM | Last Updated on Fri, May 3 2019 12:32 AM

Sakshi Editorial On India Diplomatic Victory Over Pakistan

మన దేశం ఐక్యరాజ్యసమితిలో ఎడతెగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. పాకిస్తాన్‌ సైన్యం చెప్పుచేతల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు సన్నిహితుడైన జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా సమితి ప్రకటించింది. భారత్‌ ప్రయత్నాలకు పదేళ్లనుంచి మోకాలడ్డుతున్న చైనా తన వైఖరి మార్చుకోవడంతో ఇది సాధ్యమైంది. సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతున్న వేళ వెలువడిన ఈ నిర్ణయం సహజంగానే బీజేపీకి సంతోషాన్నిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ఆ పార్టీ ట్వీటర్‌ ద్వారా ప్రకటించింది. ఆ వెంటనే మసూద్‌ అజర్‌ వ్యవహారంపై బీజేపీ–విపక్షాల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ఈ పదేళ్లలో రెండుసార్లు– 2008లో ముంబైపై ఉగ్రవాది దాడి జరిగాక, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు మన దేశం అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాలను భద్రతామండలికి అనుబంధంగా ఉన్న 1267 ఆంక్షల కమిటీలో ప్రతిపాదించింది. ఆ రెండుసార్లూ చైనాకు ‘సాంకేతిక కారణాలు’ అడ్డొ చ్చాయి. 2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు తీర్మానం తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించడానికి చైనా ఈ సాకే చెప్పింది. ఇలా మోకాలడ్డిన ప్రతిసారీ ఆ వ్యవహారాన్ని పరి శీలించడానికి తనకు ‘మరింత సమయం’ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ ‘సాంకేతిక కార  ణాలు’, ఇతర అభ్యంతరాలతో సంబంధం లేకుండా జైష్‌ సంస్థ తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఈమధ్య కశ్మీర్‌లోని పుల్వామాలో 43మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాద దాడి తన ఘనతేనని ఆ సంస్థ ప్రకటించుకుంది. దాన్నే ప్రస్తావిస్తూ మొన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో మన దేశం మరోసారి తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు సైతం చైనా యధాప్రకారం అడ్డుకుంది. ఆ రెండుసార్లూ ‘సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడిన అనంతరం నిర్ణయిస్తామ’ని చెప్పి తప్పించుకుంది. కానీ తాజాగా తీర్మానం ప్రవేశపెట్టిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో చైనా దారికి రాక తప్పలేదు. పాత తీర్మానాలకూ, ప్రస్తుత తీర్మానానికీ వ్యత్యాసం ఉండటం వల్లే అంగీకరించానని, ‘ఆయా దేశాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నానని ఆ దేశం చెబుతోంది. 

మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం దౌత్యపరంగా ఘన విజయమన డంలో సందేహమేమీ లేదు. అలాగని అందువల్ల ఏదో ఒరుగుతుందని చెప్పడం కూడా తొందర పాటే అవుతుంది. ఇప్పటికైతే ఈ చర్య పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టింది. దాన్ని ఒంటరిని చేసింది. అది ఇన్నేళ్లుగా మసూద్‌ అజర్‌ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడ నటానికి ఆధారాలేమీ లేవని దబాయిస్తూ వస్తోంది. పఠాన్‌కోట్, పుల్వామా దాడుల్లో అతగాడి ప్రమేయం ఉన్నదని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు అందించాలని మన దేశాన్ని సవాలు చేస్తోంది. ఇచ్చిన సాక్ష్యాధారాలు చాలవంటున్నది. అదేం చెప్పినా చైనా సమర్థిస్తూనే ఉంది. కానీ ఈసారి అది కుదరలేదు. ఇందుకు అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లు ఒక కారణమైతే, మన దేశం ఓపిగ్గా సాగించిన దౌత్య కృషి మరో కారణం. చైనాతో మన దౌత్యవేత్తలు పలుమార్లు చర్చిం చారు. దాని వైఖరిలోని లోపాలను ఎత్తిచూపారు. ఇది సత్ఫలితాన్నిచ్చిందని తాజా పరిణామం తెలియజెబుతోంది. 

మౌలికంగా ఐక్యరాజ్యసమితి చర్య ప్రతీకాత్మకమైనది. పాకిస్తాన్‌ మనస్ఫూర్తిగా సహకరించి మసూద్‌ కార్యకలాపాలన్నీ స్తంభింపజేస్తేనే, అతడి సంస్థపై కఠిన చర్యలు ప్రారంభిస్తేనే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ పాక్‌ గత చరిత్ర తెలిసినవారెవరూ అది ఆ పని చేస్తుందని విశ్వసిం చరు. ఇప్పటికీ ఆ దేశంలో రహస్యంగా ఆశ్రయం పొందుతున్న నేరగాడు దావూద్‌ ఇబ్రహీం, బహిరంగంగా ఉంటున్న జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ వంటివారే ఇందుకు రుజువు. వారిద్దరూ పదేళ్లుగా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. సయీద్‌ను అప్ప గించినా, హతమార్చినా కోటి డాలర్లు ఇస్తానని అమెరికా 2012లో ప్రకటించింది కూడా. దావూద్‌ తమ వద్ద లేడని పాక్‌ ఇప్పటికీ బుకాయిస్తోంది. సయీద్‌ తరచు స్థానిక పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తున్నాడు. మసూద్‌ జీవితం వారికి భిన్నంగా ఉంటుందని అనుకోనవసరం లేదు. మహా అయితే ఫలానా ఉగ్రదాడి తమ ఘనతేనని ఇకపై అతడు చెప్పుకోవడం మానేయొచ్చు. వాస్తవానికి భద్రతామండలికి అనుబంధంగా 1999లో ఏర్పడిన 1267 ఆంక్షల కమిటీ అల్‌ కాయిదాపై ఆంక్షలు విధించడానికి ఉద్దేశించింది. అల్‌ కాయిదాకు సహకరిస్తున్నారనుకునే వ్యక్తులనూ, సంస్థలనూ అనంతరకాలంలో దాని పరిధిలోకి తెచ్చారు. ఫలానా వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలు ఉగ్ర వాదానికి ఊతమిస్తున్నాయని ఏ దేశమైనా తీర్మానం ప్రతిపాదిస్తే అది ఏకగ్రీవ ఆమోదం పొందాలి. అప్పుడు మాత్రమే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా, ఉగ్రసంస్థలుగా పరిగణించడం సాధ్యపడు తుంది. అలా ప్రకటించిన సంస్థల, వ్యక్తుల ఆస్తులు ప్రపంచంలో ఏమూలనున్నా స్తంభింపజేస్తారు. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడిన వ్యక్తులను ఏ దేశమూ తమ గడ్డపైకి అడుగుపెట్టనీయదు. మసూద్‌కు న్యూయార్క్, లండన్‌ వంటిచోట ఆస్తులేమీ లేవు. బ్యాంకు ఖాతాలు కూడా లేవు. పైగా అతడు పాకిస్తాన్‌ దాటి బయటికెళ్లే రకం కాదు. కనుక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడటం వల్ల అతగాడికి వచ్చే నష్టమేమీ లేదు. అయితే ఇదే అదునుగా మన దేశం కశ్మీర్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి అక్కడ ఉద్రిక్తతలు ఉపశమించడానికి తగిన చర్యలన్నీ తీసుకోవాలి. మసూద్‌ విషయంలో పాక్‌పై మున్ముందు కూడా అమెరికా ఒత్తిడి తీసుకొచ్చేలా చేస్తే కశ్మీర్‌లో ఉగ్ర వాద చర్యలు కాస్తయినా తగ్గే అవకాశం ఉండొచ్చు. కేవలం నామమాత్ర ప్రకటన చేసి, ఆ తర్వాత పట్టించుకోనట్టయితే పెద్దగా ఫలితం ఉండదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement