అటవీభూముల అవపోసన! | Forest land right ahead! | Sakshi
Sakshi News home page

అటవీభూముల అవపోసన!

Published Thu, Jun 19 2014 1:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

Forest land right ahead!

  • రెవెన్యూ అధికారుల తలమునకలు
  •  పేదల ఆధీనంలోనే 90శాతం భూమి
  •  ఆక్రమణల తొలగింపు సాధ్యమేనా?
  •  రాజధాని కోసం ప్రత్యామ్నాయం
  •  నివేదికలు సిద్ధం  
  • నూజివీడు : రాజధాని ఏర్పాటుపై రాష్ట్రంలో ఎడతెగని చర్చ సాగుతున్న నేపథ్యంలో నూజివీడు డివిజన్లో ఉన్న అటవీభూముల వివరాలను  రెవెన్యూ అధికారులు సేకరించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకుపైగా అటవీ భూములున్నప్పటికీ దాదాపు 90శాతం  పేదల ఆధీనంలోనే ఉన్నాయి.

    జిల్లాలో ఏ రెవెన్యూ డివిజన్లో లేనివిధంగా నూజివీడు డివిజన్లోనే అటవీ భూములున్నాయి.  ఎక్కువ మేర నేల అటవీభూమి ఉండడంతో పేదలు, చిన్న, సన్నకారు రైతులు, కొంతమంది బడాబాబులు  పండ్లతోటలు, ఇతర పంటలు సాగుచేసుకుంటూ కాస్త ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన ందున రాజధానితో పాటు ఇతర జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ భూములు ఏఏ మండలాల్లో ఎంతెంత మేరకు ఉన్నాయి.

    అవి ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయి. అటవీశాఖ అధీనంలో ఉన్న విస్తీర్ణమెంత అన్న వివరాలను ఆయా మండలాల తహశీల్దార్ల నుంచి సేకరించి నివేదికను సిద్ధం చేస్తున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 1460ఎకరాల అటవీభూములుండగా రైతులు, పేదలు, బడా వ్యక్తులు ఆక్రమించుకోగా కేవలం 60ఎకరాలు మాత్రమే అటవీశాఖ ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. అలాగే మడిచర్లలో కూడా దాదాపు 14వందల ఎకరాలుండగా అక్కడ కేవలం 80ఎకరాలు మాత్రమే అటవీశాఖ వద్ద ఉంది.

    నూజివీడు మండలం జంగంగూడెం,దేవరగుంట, సుంకొల్లు, యనమదల, బత్తులవారిగూడెం, హనుమంతులగూడెం, సిద్ధార్ధనగర్ గ్రామాల పరిధిలో అటవీభూములున్నప్పటికీ దాదాపు ఆక్రమణలోనే ఉన్నాయి. ముసునూరు మండలం కాట్రేనిపాడు, చక్కపల్లి, చిల్లబోయినపల్లి, లోపూడి, చాట్రాయి మండలంలో  ఆరుగొలనుపేట,  పర్వతాపురం, చీపురుగూడెం, సోమవరం, బూరుగగూడెంలలో  కలిపి దాదాపు 2వేల ఎకరాల  అటవీభూములుండగా దీనిలో 15వందల ఎకరాలు   ఆక్రమణలోనే ఉన్నాయి.

    మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో రంగాపురం, నాగులూరు ప్రాంతాలలో కలిపి దాదాపు 6వేల ఎకరాల అటవీ భూమి ఉండగా అదంతా ఆక్రమణలోనే ఉంది. రాజధాని నిర్మాణంతోపాటు ఇతర సంస్థల ఏర్పాటుకు కావాల్సిన స్థలం మైదాన ప్రాంతంలో దొరకని పక్షంలో ప్రత్యామ్నాయం చూడాలనే ఉద్దేశంతోనే అటవీభూముల  వివరాలు సేకరిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
     
    ఆక్రమణలను తొలగించడం సాధ్యమేనా?
     
    అటవీభూములన్నీ ఆక్రమణలకు గురై ఉన్న నేపథ్యంలో ఆ ఆక్రమణలను తొలగించడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. దాదాపు గత 30ఏళ్లకు పైగా పేదలు, మధ్యతరగతి ప్రజలు   అటవీభూములను ఆక్రమించుకుని పండ్లతోటలు సాగుచేసుకుంటున్నారు. మామిడి, కొబ్బరి, పామాయిల్ వంటి పండ్ల తోటలను సాగుచేస్తున్నారు.

    వేలాది మంది పేద కుటుంబాల వారు ఈ భూములను ఆక్రమించుకుని సాగుచేసుకోవడం ద్వారా ఎంతోకొంత వారి ఆర్థికపరిస్థితి మెరుగైంది. ఈ ఆక్రమణలపర్వంలో సీపీఐ ప్రధానపాత్ర వహించి భూపోరాటాల ద్వారా పేదలకు భూములను పంచింది. పేదప్రజల జీవన విధానంలో ఈ భూములు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వీరందరినీ తొలగించడమనేది సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement