- సీఎం చంద్రబాబు, మంత్రులపై రాజధాని ప్రాంత రైతుల ఆగ్రహం
- పెనుమాకలో సామాజిక ప్రభావ అంచనా సదస్సును వ్యతిరేకించిన రైతులు
- రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సదస్సును వాయిదా వేసిన అధికారులు
మంగళగిరి (గుంటూరు) : తమ ఆస్తులు, భూములు దాచుకుంటూ రాజధాని కోసం రైతులు త్యాగం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు పిలుపునివ్వడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో రాజధాని నగర భూసేకరణ సామాజిక ప్రభావం అంచనా కోసం మండల పరిషత్ పాఠశాలలో గ్రామ సభ నిర్వహించారు.
ఈ గ్రామ సభకు హాజరైన రైతులు మాట్లాడుతూ.. రాజధాని భూ సేకరణకు మేము భూములు ఇవ్వలేదని, మా భూములను మాస్టర్ ప్లాన్‌లో ఎలా చేర్చారని అధికారులను ప్రశ్నించారు. పేద రైతుల భూములను లాక్కుని విదేశీ సంస్థలకు కట్టబెట్టి సంపాదించుకుంటూ సీఎం చంద్రబాబు, మంత్రులు త్యాగం రాగం ఆలపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతు బిడ్డలకు మంత్రి నారాయణ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించవచ్చు కదా అంటూ అధికారులను ప్రశ్నించారు.
ఒక ఎకరం భూమిలో ఒక కుటుంబంలోని నలుగురు,ముగ్గురు కలిసి ఏడాదికి మూడు పంటలు సాగు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నామని, రాజధాని పేరుతో మా కుటుంబాలను రోడ్డున పడేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీఆర్‌డీఐ అధికారులు.. తాము సామాజిక ప్రభావం అంచనా కొరకు సర్యే నిర్వహించే ఈపిటిఆర్ సంస్థను పరిచయం చేసి వారికి సహకరించాలని కోరడానికి మాత్రమే వచ్చామన్నారు.
ఈ పిటిఆర్ ప్రతినిధులు మీ ఇళ్ళకు వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. అయితే గ్రామ సభ జరిగినట్లు రైతులు సంతకాలు చేయాలని కోరగా.. తాము ఎలాంటి సంతకాలు చేయమంటూ రైతులు మూకుమ్మడిగా సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదేమిలేక అధికారులు ఈపిటిఆర్ ప్రతినిధులు సదస్సును వాయిదా వేసి వెనుతిరిగారు.
'మేము త్యాగం చేస్తే.. మీరు ఆస్తులు పెంచుకుంటారా?'
Published Tue, May 3 2016 4:42 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement