కోట్ల విలువైన భూములిచ్చాం.. అన్యాయం చేయొద్దు! | Bhumuliccam crore .. Do not do injustice! | Sakshi
Sakshi News home page

కోట్ల విలువైన భూములిచ్చాం.. అన్యాయం చేయొద్దు!

Published Fri, Apr 8 2016 3:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Bhumuliccam crore .. Do not do injustice!

సర్కారుకు రైతుల మొర
మంత్రి ముంగిట మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతుల ఆవేదన

ప్లాట్ల కేటాయింపులో లోపాలపై అభ్యంతరాలు

 

విజయవాడ బ్యూరో : కోట్ల విలువైన భూములిచ్చిన తమకు అన్యాయం చేయొద్దంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. గురువారం విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతుల సమావేశంలో సర్కారు తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ సమక్షంలో వారు పలు అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న లోపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవి వారి మాటల్లోనే..

 

ప్రభుత్వానికో రూలు.. మాకో రూలా
రాజధాని కోసం భూములు త్యాగాలు చేసిన రైతులకు ఒక రూలు, ప్రభుత్వానికి అనుకూలంగా మరో రూలు అమలు చేయడం సరికాదు. కమర్షియల్ ప్లాట్లలో ప్రభుత్వం 18 అంతస్తులు నిర్మించుకునే అవకాశం పెట్టుకుని, అదే రైతులకైతే 11 అంతస్తుల వరకే అనుమతించడం దారుణం. రాజధాని అంతటా ప్రభుత్వానికి, రైతులకు ఒకే తరహా పాలసీ ఉండాలి. భూములు ఇచ్చిన రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి వాటి ద్వారా బ్యాంకుల్లో ఎకరాకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. కేటాయించే ప్లాట్లలో నిర్మించే ఇంటి ప్లాన్ ఫీజును మినహాయించాలి.      - శివరామకృష్ణయ్య, మందడం రైతు

 

వాస్తు ప్రకారమే ఇవ్వాలి...
రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చే ప్లాట్లు నార్త్ ఈస్ట్ వాస్తు ప్రకారం కేటాయించాలి. రాజధాని నిర్మాణమే వాస్తు ప్రకారం చేపట్టినప్పుడు భూములు ఇచ్చిన రైతులకు వాస్తు ప్రకారం ప్లాట్లు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టే. అవసరమైతే రైతులు వారిలో వారు తమ ప్లాట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలి. ఏ రెవెన్యూ గ్రామంలోని రైతులకు ఆ గ్రామంలోనే ప్లాట్లు కేటాయించాలనే నిబంధన కచ్చితంగా పాటించాలి.  - రవీంద్రబాబు, రైతు

 

ఆరోగ్య సేవల్లో దీర్ఘకాలిక రోగాలకు మందులివ్వాలి
భూములిచ్చిన రైతులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించాలి. శస్త్రచికిత్సలే కాకుండా దీర్ఘకాలిక రోగాలకు మందులను అందించేలా వైద్య సేవల్లో నిబంధనలు సడలించాలి. ప్లాట్లలో నిర్మాణాల విషయంలో ప్రభుత్వానికి ఒకలా, రైతులకు మరోలా నిబంధనలు ఉండటం సరికాదు.  - రమేష్, కృష్ణాయపాలెం

 

సకాలంలో ప్లాట్లు కేటాయిస్తారా
రాజధాని ప్రాంతంలో అందరికీ ప్లాట్లు సకాలంలో కేటాయిస్తారా అనే అనుమానం కలుగుతోంది. భూములివ్వని రైతులు కోర్టుకు వెళ్లారు. వాటి విషయం తేలేవరకు ప్రభుత్వం వేచిచూస్తే భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం కలుగుతుంది. అలా కాకుండా భూములిచ్చిన రైతులకు వీలైనంత త్వరగా ప్లాట్లు కేటాయించాలి. మా ప్రాంతంలో 200 మీటర్ల రోడ్డు వేయకుండా ఆపేశారు. దాన్ని పూర్తి చేయాలి.    - శ్రీధర్, పెనుమాక రైతు

 

ఫారెస్ట్, అసైన్డ్ భూములపై స్పష్టత లేదు
ఫారెస్ట్, అసైన్డ్ భూముల విషయంలో స్పష్టత లేదు. తుళ్లూరు మండలంలో ఫారెస్టు భూములకు క్లియరెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్‌కు సహకరిస్తున్నారు. మా గ్రామంలో భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. తుళ్లూరుపై ఉన్న శ్రద్ధ, మా ప్రాంతంపై ఎందుకు లేదు? - సురేంద్రబాబు, నీరుకొండ రైతు

 

ఎస్సీల భూములకు చెక్కులు ఇవ్వలేదు
రాజధాని ప్రాంతంలో ఎస్సీల భూములకు కౌలు చెక్కులు ఇంతవరకు ఇవ్వలేదు. తక్షణం కౌలు చెక్కులు ఇవ్వాలి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులకు సీఆర్‌డీఏ అధికారులు చెప్పడం లేదు. మాకు కూడా వివరాలు అందించాలి. దీనివల్ల ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో సీఆర్‌డీఏ అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లాలి.       - పి.రత్నకుమారి, మంగళగిరి ఎంపీపీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement