ఏకే 47 లేకుండానే రైతుల ఎన్‌కౌంటర్ | AK-47 without the farmers' encounter | Sakshi
Sakshi News home page

ఏకే 47 లేకుండానే రైతుల ఎన్‌కౌంటర్

Published Fri, Apr 10 2015 1:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఏకే 47 లేకుండానే రైతుల ఎన్‌కౌంటర్ - Sakshi

ఏకే 47 లేకుండానే రైతుల ఎన్‌కౌంటర్

  • ఏపీ సీఎం బాబుపై నిప్పులు చెరిగిన మేధాపాట్కర్
  •  రాజధాని పేరుతో ప్రభుత్వం రైతుల భూములను కబ్జా చేస్తోంది
  •  భూసమీకరణను ఇంతటితో నిలిపేయాలని ప్రధానికి లేఖ రాస్తా
  •  రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటన
  • సాక్షి  విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకే 47లు లేకుండానే రాజధాని గ్రామాల్లోని రైతులు, రైతుకూలీలను ఎన్‌కౌంటర్ చేస్తున్నారని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత మేధాపాట్కర్ నిప్పులు చెరిగారు. తన చర్యలద్వారా చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి రాగానే చట్టాలన్నీ మారుస్తూ పోతున్నారని, ఇక రాజ్యాంగం మాత్రమే మిగిలిం దని ఆమె ఎద్దేవా చేశారు.

    భూసేకరణ చట్టం లో మార్పులకోసం జారీ చేసిన రెండో ఆర్డినెన్స్‌కు నిరసనగా మే 5న ఢిల్లీలో 300 సంఘాలతో భారీఎత్తున ‘‘భూ అధికార్ ఆందోళన్’ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రాయపూడిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాజధాని నిర్మాణ నేపథ్యంలో దేశం దృష్టి మొత్తం ఈ ప్రాంతంపై ఉందని, బాబు పాలన లో ఏం జరుగుతోందని అందరూ గమనిస్తున్నారన్నారు.

    రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించారని ప్రభుత్వం చెబుతోందని, ఇక్కడ రైతులు మాత్రం ప్రభుత్వం తమను బెదిరించి.. ఒత్తిడి తెచ్చి భూముల అప్పగింతకు అంగీకార పత్రా లు తీసుకున్నట్లు చెప్పారని ఆమె తెలిపారు. ఈ పత్రాలకు చట్టప్రకారం ఏమాత్రం విలువ లేదన్నారు. సీఆర్‌డీఏతో ఒప్పందం, పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుంటేనే చట్టప్రకారం చెల్లుబాటవుతుందన్నారు. రాజధానిప్రాంత రైతులెవరూ ఇకమీదట ఎలాంటి పత్రాలమీద సంతకాలు కానీ, వేలిముద్రలు కానీ వేయొద్దని ఆమె సూచించారు.

    ప్రభుత్వం తమను పెడుతున్న బాధలను వివరించడానికి ఈ ప్రాంతానికి చెందిన రైతులు, రైతుకూలీలు ఢిల్లీకి వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. సీఆర్‌డీఏ చట్టవిరుద్ధంగా ఉందని, రాజధాని రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీగా మారిన దీన్ని జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక అంగీకరించబోదన్నా రు.

    విజయవాడ-గుంటూరు మధ్య 120 రకాల పంటలు పండే భూముల్ని బాబు ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటోందన్నారు. కాగా మేధాపాట్కర్ వెంట రిటైర్డ్ ఐఏఎస్ దేవసహాయం, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు నాయకులు ఉండవల్లి బాలాజీరెడ్డి, మల్లెల హరీంద్రనాథ్ చౌదరి, హక్కుల నాయకురాలు సంధ్య, మనోరమ, శ్రీ వాణి,  సీహెచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
     
    ప్రజాభీష్టానికి విరుద్ధం...

    భూసమీకరణ రాజధాని నిర్మాణంకోసం జరుగుతున్న ప్రక్రియగా లేదని మేధాపాట్కర్ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, చండీగఢ్ లాంటి కొత్త రాజధానుల నిర్మాణం ఇలా జరగలేదన్నారు. ప్రధాని మోదీ 2013 భూసేకరణ చట్టాన్ని సవరించాలని చూస్తుంటే, సీఎం చంద్రబాబు సహాయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణం చివరకు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోతోందన్నారు. రాజధాని జోన్‌లో మరో 100 గ్రామాలను కలుపుతారంటున్నారని, ఇలాగే ముందుకుపోతే బాబుకు ఇబ్బందులు తప్పవని అన్నారు. బాబు సింగపూర్ భాగస్వాముల ప్రయోజనం కోసమే విశాఖలోని భోగాపురం, మంగళగిరిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు కడతామని చెబుతున్నారన్నారు.
     
    భూ రాజకీయాన్ని బాబు ఇంతటితో ఆపాలి

    బాబు భూసమీకరణ రాజకీయాన్ని ఇంతటితో ఆపితే మంచిదని, తాను మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవాలనే విషయం గుర్తుంచుకోవాలని ఆమె హితవు చెప్పారు. బాబు ఇప్పటికైనా ప్రజ లకు అబద్ధాలు చెప్పడం మాని వ్యవసాయానికి పనికిరాని ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకోవాలని సూచించారు. భూసమీకరణపై రాజకీయ పార్టీలు పార్టీ లెటర్‌హెడ్‌లపై తమ విధానాన్ని రాతపూర్వకంగా చెప్పాలన్నారు. భూసమీకరణ ప్రక్రియను ఇంతటితో ఆపేయాలని తమ సంస్థ తరఫున ప్రధానికి లేఖ రాస్తామన్నారు. బాధితులకు అండగా ఈ పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకెళతామన్నారు. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement