రైతులపై ఉక్కుపాదం!
- భూ సమీకరణ ప్రాంతాల్లో ఆంక్షలకు సర్కారు సిద్ధం
- సభలు, సమావేశాలపై ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ త్వరలో ఉత్తర్వులు
- ఆందోళనకారులు సంఘటితం కాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు
- ప్రతిపక్ష పార్టీలు, రైతుసంఘాలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా నిరోధించే ఎత్తుగడ
- ఆంక్షల చట్రంలో తుళ్లూరు, మంగళగిరి మండలాల రైతులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం సర్కారు తలపెట్టిన భూ సమీకరణ అంకంలో రైతులపై ఆంక్షల పర్వం మొదలు కానుంది. ఆంక్షల చట్రంలో ఇరికించైనా సరే ఆందోళన బాట పడుతున్న రైతులు సంఘటితం కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తుల్ని మొదలుపెట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రాంతాలకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు ఒకరకంగా ప్రజాస్వామ్య విలువలకే తిలోదకాలివ్వబోతోంది. రైతులు భూ సమీకరణకు సహకరిస్తే సరే.. లేకుంటే బలవంతంగా భూములు లాక్కుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలైన గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో రైతులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించనుంది. రైతులు ఒకచోట సమావేశమవ్వాలన్నా, సభలు నిర్వహించుకోవాలన్నా.. ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, సంబంధిత తహశీల్దారు నుంచి తగిన అనుమతి పొందాలని పేర్కొంటూ రెవెన్యూ శాఖ ఒకటీ రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాజధాని నిర్మాణం సంకల్పించిన ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కల్పించడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమన్న అంశాల సాకుగా రైతులెవరూ బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేకుండా ఆదేశాలు ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తేనున్నారు.
నిరసనల నేపథ్యంలోనే..
తుళ్లూరు మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు గానూ 14 గ్రామాల్లో, మంగళగిరి మండలంలో మూడు గ్రామాల్లో భూ సమీకరణకు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో రైతులు సమావేశాలు నిర్వహించుకుని తమ భూములు ఇచ్చేది లేదని తీర్మానాలు చేశారు. మందడం, మల్కాపురం, వెలగపూడి, ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం, లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. కార్యాచరణ కోసం సన్నద్ధమవుతున్నారు.
మందడం, ఉద్దండ్రాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాలలో రైతులు ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుని భూములు ఇవ్వరాదని తీర్మానాలు చేసుకున్నారు. భూ సమీకరణపై గ్రామాల్లో అధికారుల సమావేశాల సందర్భంగా కొన్నిచోట్ల రైతులు తమ శవాలపై రాజధాని నిర్మించాలని, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న భూముల్ని ఇచ్చేదిలేదని తేల్చి చెబుతున్నారు. ఇదే క్రమంలో మహిళలు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఉద్యమం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. మంగళగిరి మండలంలో నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో భూ సమీకరణకు ప్రతిపాదించగా.. ఇప్పటికే నిడమర్రు పంచాయతీ భూ సమీకరణకు వ్యతిరేకమని తీర్మానం చేసింది.
కురగల్లులో రైతుల్ని చైతన్య పరిచేందుకు రైతు సంఘాలు మూడుసార్లు సమావేశాలు నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాల్లోనూ రైతులు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని మరీ తమ నిరసన తెలుపుతున్నారు. భూ సమీకరణకు ప్రతిపాదించిన 17 గ్రామాల్లో ఇకపై ఎలాంటి పంటలు ఉండవని కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల చేసిన ప్రకటన రైతుల్లో మరింత గుబులు రేకెత్తించింది. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. టీడీపీ వైపు నుంచి ప్రభుత్వానికి ఒత్తిళ్ళు అధికమవుతున్నాయి. మిత్రపక్షమైన బీజేపీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దృష్య్టా రైతులపై నిషేధాజ్ఞలు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రేపు రాజధాని సలహా కమిటీ సమావేశం
ఇలావుండగా శనివారం హైదరాబాద్‌లో రాజధాని సలహా కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో భూ సమీకరణకు ఆయా గ్రామాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. అలాగే తుళ్లూరు, మంగళగిరి మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తమ కమిటీలో చోటు కల్పించే అంశం పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.
రైతు హక్కుల పరిరక్షణ కమిటీ
పార్టీపరంగా ఏర్పాటు చేసిన జగన్
ఏపీ రాజధాని నిర్మాణం పేరిట అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను, రైతులకు అన్యాయం చేసే కార్యక్రమాలను, భూ దందాలను ఎదుర్కొనడంతో పాటుగా రైతుల పక్షాన నిలిచేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పరంగా రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎనిమిది మందితో కూడిన ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, అంబటి రాంబాబు, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, గొట్టిపాటి రవికుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించనుందని పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘రాజధాని’ రైతులకు పన్ను పోటు!: స్పందించని కేంద్రం
రాజధాని కోసం భూములిస్తే అభివృద్ధి చేసి వాటా ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. ఈ ఒప్పందాలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పరిధిలోకి రానున్నందున రైతుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. భూ సమీకరణ కచ్చితంగా వ్యాపారం కిందకే వస్తుందని, తర్వాతా వచ్చే ప్రతిపైసాపై నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పూలింగ్‌లో భూములను తీసుకుంటామని చెబుతున్న ప్రభుత్వం.. ఆదాయపు పన్ను విషయం గోప్యంగా ఉంచింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 17 గ్రామాల రైతుల నుంచి 30 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.