Medhapatkar
-
రాజధానిలో ఉల్లంఘనలు నిజమే
సాక్షి, అమరావతి : ‘రాజధాని అమరావతి ప్రాజెక్ట్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. స్థానిక ప్రజల జీవనోపాధితో పాటు పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ఇటువంటి ప్రాజెక్ట్‌లో మేం భాగస్వాములం కాలేం’ అని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. సుమారు రూ.5,005 కోట్ల విలువైన అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.2,100 కోట్ల (300 మిలియన్ డాలర్లు) రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు వెబ్సైట్లో వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు రుణం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా బుధవారం వరకు వెబ్సైట్లో కనిపించగా, గురువారం ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది. మేథాపాట్కర్ హర్షం రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్మాదా బచావో ఆందోళన సమితి కార్యకర్త మేథాపాట్కర్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అనుమోలు గాంధీ, మల్లెల శేషగిరిరావు వంటి మేధావులు మొదటి నుంచీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏటా నాలుగైదు పంటలు పండే భూముల్లో, అందునా నదీ పరీవాహక ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని వారంతా తప్పుపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకుకే అనేకసార్లు లేఖలు రాశారు. కృష్ణా నది వరదలతో సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత సారవంతమైన భూముల నుంచి రాజధాని నిర్మాణానికి 20 వేల మంది రైతులను బలవంతంగా తరలించడాన్ని వీరు తప్పుపట్టారు. దీనిపై బాధిత రైతులు 2017లో ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న బ్యాంక్ ప్రతినిధులు అనేకమార్లు రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరిపారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించడంపై మేథాపాట్కర్ స్పందిస్తూ.. దీనిని ప్రజావిజయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని చేయడంతోపాటు స్థానికుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంక్ వైదొలగడాన్ని ఆమె స్వాగతించారు. -
మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు: మేధాపాట్కర్
చాదర్‌ఘాట్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్యాన్ని పారిస్తున్నాడని, ఆయన మామ ఎన్టీఆర్ మద్య నిషేధం విధిస్తే, ఈయన సాకులు చెప్పి నిషేధాన్ని ఎత్తివేసి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని సామాజిక వేత్త మేధాపాట్కర్ అన్నారు. శుక్రవారం మద్యపానం, మత్తు పదార్థాల నిషేధంపై ఓల్డ్ మలక్‌పేటలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బీహార్ తరహాలో అన్ని రాష్ట్రాలు మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం కారణంగా జరిగినవేనన్నారు. మద్య నిషేధంపై అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. అనంతరం లిటిల్ ఏంజిల్స్ స్కూల్ పదవ తర గతి విద్యార్థులకు మద్యపాన నిషేధంపై పుస్తకాలను అందచేశారు. మద్య నిషేధంపై దేశవ్యాప్త ఉద్యమం సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మద్య రహిత సమాజం కోసం ఉద్యమిస్తేనే స్వచ్చ భారత్ రూపుదిద్దుకుంటుందని మేధా పాట్కర్ అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ మద్యపానం వల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. తెలంగాణలో మద్యపానాన్ని నిషేధించాలని కోరారు. నాయకులే మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నందున చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అనంతరం పలువురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో రామకృష్ణరాజు, శ్రీనివాస్ రెడ్డి,మాజి ఎంపీ సునీల్, సంధ్యా, నగేష్ ముదిరాజ్, ప్రసాద్, మీరా, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అన్నా, మేధాలకు లేఖలు!
పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ భూ సమీకరణపై వివరణ ఇవ్వాలని నిర్ణయం హైదరాబాద్: పైకి గంభీరమైన ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ.. రాజధాని కోసం ప్రభుత్వం భూములు సమీకరించడాన్ని తప్పుబడుతున్న సామాజిక ఉద్యమ నేతలు అన్నా హజారే, మేధాపాట్కర్ లాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఈ ఉద్యమకారులు జరిపిన అనేక పోరాటాలను తాను సమర్థించగా.. ఇప్పుడు ప్రభుత్వ వైఖరిపై వారినుంచే అభ్యంతరాలు వ్యక్తం కావడం బాబును ఇరకాటంలో పడేసింది. రాజధాని ప్రాంతంలో మేధాపాట్కర్ ఇప్పటికే పర్యటించడం, అన్నా హజారే నేరుగా తనకే లేఖ రాయడం వంటి అంశాలపై శుక్రవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చర్చించారు. చివరకు రాజధాని కోసం రైతులందరూ ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారని పేర్కొంటూ వారిద్దరికీ లేఖలు రాయాలనే నిర్ణయానికొచ్చారు. అయితే ఈ లేఖలను పార్టీ పరంగా రాయాలా? లేక ప్రభుత్వ పరంగానా? అన్న అంశంపై చర్చించారు. చివరకు ప్రభుత్వ పరంగా రాయడమే మంచిదన్న నిర్ణయానికొచ్చారు. శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలు కిమిడి కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రభుత్వ సలహాదారులు సి. కుటుంబరావు, పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులతో బాబు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ఉద్యమకారులెవరూ మాట్లాడలేదన్న అంశం ప్రస్తావనకు రాగా అలాంటి విషయాలేవీ లేఖలో ప్రస్తావించకపోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదిలావుండగా ఏపీ రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ రెండో తేదీన నిర్వహించాలా? లేక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదో తేదీన నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న అంశాలపై చర్చించినా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పునర్నిర్మాణ, పునరంకిత, సంకల్ప దినోత్సవం.. తదితరాల్లో ఏ పేరుతో నిర్వహిస్తే బావుంటుందనే అంశంపైనా చర్చించారు. ఆ భూముల్ని జగ్గీ పరిశీలించారు... జగ్గీ వాసుదేవ్‌కు భూముల కేటాయింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆయన కేవలం భూములను పరిశీలించి వెళ్లారని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలపై వివరణ ఇవ్వాల్సిందిగా నేతలు, అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని బాబు ఈ సందర్భంగా అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయమై ఏం జరిగిందీ వివరాలు సేకరించాల్సిందిగా సూచించారు. -
ఏకే 47 లేకుండానే రైతుల ఎన్కౌంటర్
ఏపీ సీఎం బాబుపై నిప్పులు చెరిగిన మేధాపాట్కర్ రాజధాని పేరుతో ప్రభుత్వం రైతుల భూములను కబ్జా చేస్తోంది భూసమీకరణను ఇంతటితో నిలిపేయాలని ప్రధానికి లేఖ రాస్తా రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటన సాక్షి విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకే 47లు లేకుండానే రాజధాని గ్రామాల్లోని రైతులు, రైతుకూలీలను ఎన్కౌంటర్ చేస్తున్నారని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత మేధాపాట్కర్ నిప్పులు చెరిగారు. తన చర్యలద్వారా చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి రాగానే చట్టాలన్నీ మారుస్తూ పోతున్నారని, ఇక రాజ్యాంగం మాత్రమే మిగిలిం దని ఆమె ఎద్దేవా చేశారు. భూసేకరణ చట్టం లో మార్పులకోసం జారీ చేసిన రెండో ఆర్డినెన్స్‌కు నిరసనగా మే 5న ఢిల్లీలో 300 సంఘాలతో భారీఎత్తున ‘‘భూ అధికార్ ఆందోళన్’ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రాయపూడిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాజధాని నిర్మాణ నేపథ్యంలో దేశం దృష్టి మొత్తం ఈ ప్రాంతంపై ఉందని, బాబు పాలన లో ఏం జరుగుతోందని అందరూ గమనిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించారని ప్రభుత్వం చెబుతోందని, ఇక్కడ రైతులు మాత్రం ప్రభుత్వం తమను బెదిరించి.. ఒత్తిడి తెచ్చి భూముల అప్పగింతకు అంగీకార పత్రా లు తీసుకున్నట్లు చెప్పారని ఆమె తెలిపారు. ఈ పత్రాలకు చట్టప్రకారం ఏమాత్రం విలువ లేదన్నారు. సీఆర్డీఏతో ఒప్పందం, పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుంటేనే చట్టప్రకారం చెల్లుబాటవుతుందన్నారు. రాజధానిప్రాంత రైతులెవరూ ఇకమీదట ఎలాంటి పత్రాలమీద సంతకాలు కానీ, వేలిముద్రలు కానీ వేయొద్దని ఆమె సూచించారు. ప్రభుత్వం తమను పెడుతున్న బాధలను వివరించడానికి ఈ ప్రాంతానికి చెందిన రైతులు, రైతుకూలీలు ఢిల్లీకి వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. సీఆర్డీఏ చట్టవిరుద్ధంగా ఉందని, రాజధాని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మారిన దీన్ని జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక అంగీకరించబోదన్నా రు. విజయవాడ-గుంటూరు మధ్య 120 రకాల పంటలు పండే భూముల్ని బాబు ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటోందన్నారు. కాగా మేధాపాట్కర్ వెంట రిటైర్డ్ ఐఏఎస్ దేవసహాయం, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు నాయకులు ఉండవల్లి బాలాజీరెడ్డి, మల్లెల హరీంద్రనాథ్ చౌదరి, హక్కుల నాయకురాలు సంధ్య, మనోరమ, శ్రీ వాణి, సీహెచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజాభీష్టానికి విరుద్ధం... భూసమీకరణ రాజధాని నిర్మాణంకోసం జరుగుతున్న ప్రక్రియగా లేదని మేధాపాట్కర్ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, చండీగఢ్ లాంటి కొత్త రాజధానుల నిర్మాణం ఇలా జరగలేదన్నారు. ప్రధాని మోదీ 2013 భూసేకరణ చట్టాన్ని సవరించాలని చూస్తుంటే, సీఎం చంద్రబాబు సహాయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణం చివరకు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోతోందన్నారు. రాజధాని జోన్లో మరో 100 గ్రామాలను కలుపుతారంటున్నారని, ఇలాగే ముందుకుపోతే బాబుకు ఇబ్బందులు తప్పవని అన్నారు. బాబు సింగపూర్ భాగస్వాముల ప్రయోజనం కోసమే విశాఖలోని భోగాపురం, మంగళగిరిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు కడతామని చెబుతున్నారన్నారు. భూ రాజకీయాన్ని బాబు ఇంతటితో ఆపాలి బాబు భూసమీకరణ రాజకీయాన్ని ఇంతటితో ఆపితే మంచిదని, తాను మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవాలనే విషయం గుర్తుంచుకోవాలని ఆమె హితవు చెప్పారు. బాబు ఇప్పటికైనా ప్రజ లకు అబద్ధాలు చెప్పడం మాని వ్యవసాయానికి పనికిరాని ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకోవాలని సూచించారు. భూసమీకరణపై రాజకీయ పార్టీలు పార్టీ లెటర్హెడ్లపై తమ విధానాన్ని రాతపూర్వకంగా చెప్పాలన్నారు. భూసమీకరణ ప్రక్రియను ఇంతటితో ఆపేయాలని తమ సంస్థ తరఫున ప్రధానికి లేఖ రాస్తామన్నారు. బాధితులకు అండగా ఈ పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకెళతామన్నారు. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. -
రాజధాని పేరిట రైతులను శిక్షిస్తున్న బాబు
జంతర్ మంతర్ ధర్నాలో మేధా పాట్కర్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట రైతులకు సీఎం చంద్రబాబు శిక్ష విధిస్తున్నారని సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ ధ్వజమెత్తారు. జీవనోపాధినిస్తున్న భూములు లాక్కుంటూ రైతులకు ఉరివేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్నా హజారే నిర్వహించిన ధర్నాలో మంగళవారం ఆమె మాట్లాడారు. నిర్బంధ భూసేకరణకు తెచ్చిన ఆర్డినెన్సును ఆమోదించనివ్వబోమని చెప్పారు. ఆర్డినెన్సుతో వచ్చే అనర్థాలను వివరిస్తున్న నేపథ్యంలో ఏపీలో భూసేకరణ తీరును ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. పేద రైతుల సారవంతమైన వేలాది ఎకరాల భూముల్లో రాజధాని కోసం బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలను కోవడం అన్యాయమే కాదని, అపరాధమూ అవుతుందన్నారు. ఇలాంటి వారిని పార్లమెంటు ఏమీ చేయలేకపోయినా ప్రజా పార్లమెంటులో శిక్ష విధించాలని కోరారు.