మాట్లాడుతున్న మేధాపాట్కర్
చాదర్‌ఘాట్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్యాన్ని పారిస్తున్నాడని, ఆయన మామ ఎన్టీఆర్ మద్య నిషేధం విధిస్తే, ఈయన సాకులు చెప్పి నిషేధాన్ని ఎత్తివేసి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని సామాజిక వేత్త మేధాపాట్కర్ అన్నారు. శుక్రవారం మద్యపానం, మత్తు పదార్థాల నిషేధంపై ఓల్డ్ మలక్‌పేటలో పాదయాత్ర నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బీహార్ తరహాలో అన్ని రాష్ట్రాలు మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం కారణంగా జరిగినవేనన్నారు. మద్య నిషేధంపై అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. అనంతరం లిటిల్ ఏంజిల్స్ స్కూల్ పదవ తర గతి విద్యార్థులకు మద్యపాన నిషేధంపై పుస్తకాలను అందచేశారు.
మద్య నిషేధంపై దేశవ్యాప్త ఉద్యమం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మద్య రహిత సమాజం కోసం ఉద్యమిస్తేనే స్వచ్చ భారత్ రూపుదిద్దుకుంటుందని మేధా పాట్కర్ అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ మద్యపానం వల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. తెలంగాణలో మద్యపానాన్ని నిషేధించాలని కోరారు.
నాయకులే మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నందున చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అనంతరం పలువురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో రామకృష్ణరాజు, శ్రీనివాస్ రెడ్డి,మాజి ఎంపీ సునీల్, సంధ్యా, నగేష్ ముదిరాజ్, ప్రసాద్, మీరా, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.