కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
పది రోజుల్లో నాణ్యమైన మద్యం.. రూ.99కే క్వార్టర్
ఐవీఆర్‌ఎస్ ద్వారా ఉద్యోగుల పనితీరుపై త్వరలో సర్వే
కర్నూలు (సెంట్రల్): నాణ్యమైన మద్యాన్ని మరో పది రోజుల్లో అందుబాటులోకి తెచ్చి రూ.99కే క్వార్టర్ బాటిల్ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు భర్తలు మద్యం తాగకుండా భార్యలే చర్యలు తీసుకోవాలని, రూ.100 కోట్లతో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మద్యం షాపుల కేటాయింపులో శెట్టి బలిజలు, ఈడిగ, గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు.
మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమాడలో పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. రూ.2.83 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజా వేదికలో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణలు చేశారు.
వలంటీర్లు లేకుండానే ఒక్క రోజులోనే నూటికి నూరు శాతం పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వలంటీర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాయలసీమను గీన్ ఎనర్జీ ప్రాజెక్టుగా తీర్చిదిద్ది 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని, అయితే ఎక్కడ ఇవ్వాలో అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌లో 2,650 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయబోతున్నామని, ఇక్కడ దాదాపు రూ.1,200 కోట్ల పెట్టబడులతో 50 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కర్నూలు–బళ్లారి రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
గత ఐదేళ్లలో ఉద్యోగులు పనిచేయలేదు...
మీరంతా 95 నాటి సీబీఎన్‌ను చూస్తారని, తాను పరుగెత్తుతూ మిమ్మల్ని పరిగెత్తిస్తానని అధికారులనుద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ఉన్నతాధికారులు ఏమీ పనిచేయలేదని, వారి పనితీరు తెలుసుకునేందుకు త్వరలో ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు రూ.2 లక్షల ఆరోగ్య బీమా పరిధిలోకి వర్తిస్తారని, మిగిలిన వారికిమాత్రమే ఆరోగ్యశ్రీని ప్రస్తుతం ఉన్నట్లు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
బుడగ జంగాలకు ఎస్సీ రిజర్వేషన్‌పై నియమించిన వన్ మ్యాన్ కమిటీ నివేదికను కేంద్రానికి పంపినట్లు చెప్పారు. మదాసి/మదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ల జారీ, బోయల సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. పుచ్చకాయల మాడ నుంచి హోసూరు, పత్తికొండ, మద్దికెరకు రోడ్లు వేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు సీఎంకు మొర పెట్టుకోగా అవి మాత్రం అడగవద్దని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. తన భర్త ఏమీ పని చేయడంలేదని, ఏమైనా పెన్షన్ ఇవ్వాలని ఓ మహిళ కోరగా.. ముందు ఆయనతో పనిచేయించుకోవాలని సీఎం సూచించారు.
ముందు రోజు నుంచే ఆంక్షలు
సీఎం చంద్రబాబు పర్యటనకు ఒక్క రోజే ముందే పోలీస్ ఆంక్షలు అమలయ్యాయి. సీఎం మధా్నహ్నం గ్రామానికి చేరుకోగా మంగళవారం ఉదయం నుంచే ప్రజలను ఇళ్ల ఉంచి బయటకు రానివ్వలేదు. పొలం పనుల కోసం వెళ్లిన వారిని గ్రామంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆధార్ కార్డు చూపాలంటూ ఇబ్బందులకు గురి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment