తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి! | Chandrababu Naidu Govt Liquor Door Delivery In AP, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!

Published Wed, Nov 20 2024 11:42 AM | Last Updated on Wed, Nov 20 2024 1:07 PM

Chandrababu Govt Liquor Door Delivery in AP

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్‌ డెలివరీ కూడా మొదలుపెట్టారు.  విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్‌ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి.

 ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. 

ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్‌ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్‌ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. 

సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్‌షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్‌పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్‌ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్‌ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. 

ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్‌ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. 
విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్‌ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. 

షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్‌ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్‌ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్‌షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది.

 వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు  సోషల్  మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్‌షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్  షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. 

రిజిస్ట్రేషన్‌ ఫీజులు, లైసెన్స్‌ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.

మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ‍ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్‌లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు  పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. 

అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు  ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? 

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement