2018 నాటికి రాజధాని తొలిదశ
- మన్మథ నామ ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 1 నుంచి కౌలు రైతులు, రైతుకూలీలకు రూ.2,500
- ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.2 వేల సాయం
- విజయవాడ, గుంటూరులను కలుపుతూ రాజధాని నగరం
- ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి సీఎం రాజకీయ ప్రసంగం, విమర్శలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సంబంధించి మొదటి దశ నిర్మాణం పనులను 2018 జూన్ 2వ తేదీ లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతాంగాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రభుత్వం శనివారం అధికారికంగా నిర్వహించిన మన్మథ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటీ,సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాజధాని గ్రామాల్లోని కౌలు రైతులు, రైతు కూలీలకు నెలకు రూ.2,500 చొప్పున ప్రభుత్వ సాయాన్ని అందజేస్తామన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.2 వేల చొప్పున ప్రభుత్వ సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరహాలో నాలుగు పట్టణాలను అభివృద్ధి చే స్తామన్నారు. గుంటూరు-విజయవాడ నగరాలను కలుపుతూ నూతన రాజధాని నగరం అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని జోన్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా మొదటి ప్రాధాన్యం రైతులకేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరువు ప్రసక్తే ఉండకూడదన్న ఆలోచనతో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద నీటిని కృష్ణాడెల్టాకు అందించాలని చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్షం అర్థంలేని ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో దారుణమైన మాటలతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. ‘రాజధానిని కొందరు అడవుల్లోకి, మరికొందరు సొంతూళ్లకు తీసుకెళ్లాలనుకున్నారు. రాజధాని అంటే ఎమ్మార్వో ఆఫీసనుకున్నారో ఏమో... ఎవరెన్ని చెప్పినా వినకుండా గుంటూరు, విజయవాడ ప్రాంతమే రాజధానికి అనుకూలమని ప్రకటన చేశాం. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూసేందుకే ల్యాండ్‌పూలింగ్‌ను అమలు చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
గుడివాడ, సత్తెనపల్లి, నూజివీడులను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు
కోర్ కేపిటల్ పనులకు సమాంతరంగా గుంటూరు, విజయవాడ నగరాలను కలుపుతూ నూతన నగర నిర్మాణం జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. గుడివాడ, సత్తెనపల్లి, నూజివీడులను కలుపుతూ ఔటర్ రింగ్‌రోడ్ నిర్మించి రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. విశాఖ, తిరుపతిలను మహానగరాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కుల,మత రాజకీయాలకు అతీతంగా హంస, ఉగాది పురస్కార గ్రహీతలను ఎంపిక చేసినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అర్హత కలిగి, అవకాశం లభించని మిగతా వారికి వచ్చే ఏడాది పురస్కారం అందజేస్తామన్నారు.
కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, హోంమంత్రి చినరాజప్ప, మంత్రులు మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
సభికుల సహనాన్ని పరీక్షించిన బాబు ప్రసంగం
ఉగాది వేడుకల్లో సుదీర్ఘంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎంతసేపటికీ ప్రసంగాన్ని ముగించకపోగా చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పడంతోపాటు మిమ్మల్ని వదలాలని లేదని చెబుతూ సభికులు, ఆహూతుల సహనాన్ని సీఎం పరీక్షించారు. గంటన్నర ఆలస్యంగా రావటంతోపాటు గంటన్నరకుపైగా సీఎం ప్రసంగం కొనసాగటంతో అవార్డులు తీసుకోవడానికి వచ్చిన వృద్ధ కళాకారులు ఇబ్బందులు పడ్డారు. సభ ఆలస్యంగా ప్రారంభమవడంతో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. వేడుకలకు భారీ సంఖ్యలో జనం వస్తారని టీడీపీ నేతలు చెప్పినా చాలా కుర్చీలు ఖాళీగా మిగిలిపోయాయి.