20 తర్వాత భూ సేకరణ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని కోసం భూములను ఈ నెల 20 తర్వాత నుంచి భూ సేకరణ చట్టం ద్వారా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అప్పటి వరకూ సమీకరణ విధానంలోనే భూములు తీసుకోవాలని తీర్మానించారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాజధాని సలహా కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానికి ఇంకా 2,200 ఎకరాలు అవసరం ఉందని, రైతులు భూ సమీకరణకు అంగీకరించకపోతే చట్టం ప్రకారం సేకరించాలని నిర్ణయించారు.
రాజ దాని నిర్మాణం పనులు అక్టోబర్ 22 తరువాత చేపట్టాలని, ఉపాధి, ఆర్థిక ప్రగతి అంశాలకు అమరావతి రాజధానిలో ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు తగిన స్థలం కేటాయించాలని, నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం సూచించారు. సమర్థవంతమైన రవాణా వ్యవస్థ రూపొందించేందుకు అత్యుత్తమ కన్సల్టెంట్స్‌ను సంప్రదించాలన్నారు.
ప్రతి శుక్రవారం సమీక్ష..: రాజధాని సలహా కమిటీ సభ్యులు ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీలుగా ఇక నుంచి ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రాజధాని అంశాలపై సమీక్షిస్తామని సీఎం చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలో 22వేల మంది కూలీలకు ఉపాధికి క్లీన్ అండ్ గ్రీన్ పనులు అప్పగించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని, ప్రత్తిపాటి, నారాయణ, అధికారులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం నుంచి గోదావరి జిల్లాల్లో విలీనమైన మండలాల్లోని 333 టీచర్ పోస్టులను 30 రోజుల్లో భర్తీ చేస్తామని సీఎం చెప్పారు.