రైతుల అభ్యంతరాలు పరిగణనలోకి...
- వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుని వారికి తెలియజేస్తాం
- ‘రాజధాని భూసమీకరణ’పై హైకోర్టుకు ఏపీ సర్కారు నివేదన
- నిర్ణయం చెప్పేందుకు సీఆర్‌డీఏకు రెండు వారాల గడువిచ్చిన కోర్టు
- భూసమీకరణ నుంచి తమ భూముల్ని మినహాయించాలన్న
- పలువురు రైతుల పిటిషన్‌పై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) చట్టం కింద చేస్తున్న భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్)పై పిటిషనర్లు(రైతులు) వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై తగిన నిర్ణయం తీసుకున్నాక.. దానిని వీలైనంత త్వరగా వారికి తెలియచేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. దీంతో హైకోర్టు.. పిటిషనర్ల అభ్యంతరాలపై సీఆర్‌డీఏ తన నిర్ణయాన్ని తెలియచేసేందుకు వీలుగా ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సీఆర్‌డీఏ చట్టం కింద చేస్తున్న భూసమీకరణ నుంచి తమ భూములను మినహాయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు భీమిరెడ్డి శివరామిరెడ్డి, మరో 31 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిని ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి గురువారం మరోసారి విచారించారు.
ఈ పిటిషన్ విచారణకు రాగానే.. ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఆర్‌డీఏ చట్టం కింద చేపట్టిన భూసమీకరణపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ప్రభుత్వం తగిన నిర్ణయం వెలువరించడం లేదన్నదే పిటిషనర్ల ప్రధాన వాదనని వివరించారు. వారి అభ్యంతరాలను సీఆర్‌డీఏ పరిగణనలోకి తీసుకుని, వాటిపై తగిన నిర్ణయం తీసుకుని, దాన్ని పిటిషనర్లకు తెలియచేస్తామని ఆయన నివేదించారు. దీంతో న్యాయమూర్తి.. సీఆర్‌డీఏ తన నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియచేసేందుకు వీలుగా విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
సీఆర్‌డీఏ చట్ట నిబంధనలను తూచా తప్పక పాటిస్తున్నాం: అదనపు ఏజీ
ఇదిలా ఉండగా.. ల్యాండ్ పూలింగ్ గురించి వాస్తవాలను వివరించకుండా తమను చీకట్లో ఉంచి, ప్రభుత్వం తమ నుంచి.. భూములిచ్చే లా అంగీకారం తీసుకుందంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన రైతు బొర్రా హనుమంతరావు దాఖలు చేసిన పిటిషన్ కూడా గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ.రాఘవయ్య వాదనలు వినిపిస్తూ.. భూములివ్వడం వల్ల వచ్చే లాభనష్టాలను వివరించకుండానే ప్రభుత్వం భూసమీకరణ చేస్తోందన్నారు. తెలుగు భాషలోనూ ఫారాలివ్వలేదని, ఫలితంగా భూములివ్వడం వల్ల కలిగే లాభనష్టాలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని కోర్టుకు వివరించారు.
పిటిషనర్ పొరుగునున్న రైతు భూసమీకరణకు తన భూమినిచ్చేందుకు అంగీకారం తెలిపారని, అయితే పిటిషనర్ మాత్రం అంగీకారం ఇవ్వలేదని, అయినప్పటికీ సీఆర్‌డీఏ పిటిషనర్ భూమిని స్వాధీనం చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏ ఉద్దేశంతో సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చారో, దానికి వ్యతిరేకంగా అధికారులు భూసమీకరణ చేస్తున్నారని ఆయన విన్నవించారు. ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్ వాదనలో వాస్తవం లేదని, భూసమీకరణకు సంబంధించి సీఆర్‌డీఏ చట్ట నిబంధనలను తూచా తప్పక అమలు చేస్తున్నామని తెలిపారు.
భూసమీకరణకోసం రైతుతో ఒప్పందం చేసుకుంటే తప్ప, సీఆర్‌డీఏ అతని భూమి జోలికి వెళ్లట్లేదన్నారు. దీంతో న్యాయమూర్తి.. ఈ ప్రకటనను రికార్డ్ చేయమంటారా..? అని ప్రశ్నించగా... చేసుకోవచ్చునని అదనపు ఏజీ జవాబిచ్చారు. దీంతో అదనపు ఏజీ ప్రకటనను న్యాయమూర్తి రికార్డ్ చేస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో కూడా తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.