నీళ్లు నమిలిన మంత్రి | Government Bill CRDA niladisina pics | Sakshi
Sakshi News home page

నీళ్లు నమిలిన మంత్రి

Published Tue, Dec 23 2014 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

నీళ్లు నమిలిన మంత్రి - Sakshi

నీళ్లు నమిలిన మంత్రి

  • సీఆర్‌డీఏ బిల్లుపై సర్కారును నిలదీసిన జగన్
  • సమాధానం చెప్పలేక అవస్థలు పడిన మున్సిపల్ శాఖ మంత్రి
  • సాక్షి, హైదరాబాద్: రైతులు, రైతుకూలీల ప్రయోజనాలను ఏమాత్రం ప్రస్తావించకుండా సభలో ప్రవేశపెట్టిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుపై విపక్షం లేవనెత్తిన సందేహాలకు సర్కారు సమాధానం చెప్పలేకపోయింది. సాక్షాత్తూ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రే ప్రతిపక్షం అనుమానాలను నివృత్తి చేయలేకపోయారు.

    రైతు ప్రయోజనాలు ఏంటో చెప్పకుండా బిల్లు ఏమిటని సూటిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. దీంతో మంత్రిని కాపాడేందుకు అధికారపక్షం ఏకమై విపక్షాలపై విరుచుకుపడింది. సీఆర్‌డీఏ బిల్లును మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం సభలో ప్రవేశపెట్టారు. రాజధాని కోసం చేపడుతున్న ల్యాండ్ పూలింగ్‌కు అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావించారు. భూనిర్వాసితులకు ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. సీఆర్‌డీఏ బిల్లులో లేని అంశాలను ఏకరవు పెట్టారు. ఈ దశలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు.
     
    ఏ ఒక్కటీ బిల్లులో లేదు

    సీఆర్‌డీఏపై 120 పేజీల డాక్యుమెంట్‌ను క్షుణ్ణం గా చదివామని, సభలో మంత్రి చెబుతున్న ఏ ఒక్క అంశమూ బిల్లులో లేదని జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పడంలో నిజ మెంతని ప్రశ్నించారు. ఏ పేజీలోనైనా రైతులకు 1,200 గజాలు ఇస్తామని బిల్లులో చెప్పారా? కౌలు రైతులకు, రైతులకు, కూలీలకు ఇచ్చేదే ఏమిటనేది పేర్కొన్నారా? అని సూటిగా ప్రశ్నిం చారు.

    ఈ ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం చెప్పలేకపోగా తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్ష నేత డిమాండ్ చేయడంతో మంత్రి నారాయణ తడుముకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా బిల్లు ప్రవేశపెడతామని, ఆమోదం పొందిన తర్వాత రూల్స్ పొందుపరుస్తామని తెలిపారు. దీనికి జగన్ అభ్యంతరం తెలిపారు.
     
    ఆహా... ఓహో...

    ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుంటూ... బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ రూల్స్ సభకు తెలియజేయాల్సిన అవసరం లేదన్నారు. 32 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి చట్టాలు ఎన్నో చేశానని, తమకే బిల్లు లు ప్రవేశపెట్టడం తెలియదంటే ఎలా? అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నిబంధనలు చదువుకొని రావాలన్నారు. దీంతో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంపై  వ్యంగ్యోక్తులు విసిరారు. ‘‘చంద్రబాబు ఇన్ళేళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారంటే ‘ఓహో...’ అనుకున్నాం.

    దేశ నాయకులకే పాఠా లు చెప్పారంటే ‘ఓహో...ఓహో...’ అనుకున్నాం. ప్రపంచ నేతలకే క్లాసులు ఇచ్చారంటే ‘ఓహో...ఓహో...ఓహోహో...’ అనుకున్నాం. కానీ రైతులు, కూలీల విషయాన్ని ప్రస్తావించకుండా బిల్లు పెట్టడం ఆయనకే చెల్లుతుంది. హిట్లర్ మాది రిగా చేస్తానని చెబుతున్నారు. రైతులకు ఏమిస్తారో? ఎంతిస్తారో? చెప్పకుండా బిల్లు ప్రవేశపెడితే ఆమోదించేది ఎలా? ఏమీ చెప్పకుండా బిల్లు పెట్టి, దాన్ని ఆమోదించుకుని, ఆ తర్వాత రూల్స్ పెడతామంటే ఎందుకు ఒప్పుకోవాలి?’’అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement