- ఉండవల్లి, పెనుమాక రైతుల వినూత్న పోరాటం
తాడేపల్లి: రాజధాని ఏర్పాటు కోసం ప్రభుత్వం పంట భూములను సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నా సీఎం చంద్రబాబునాయుడు మొండిగా వ్యవహరిస్తుండటంతో గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు గురువారం సరికొత్త తరహా నిరసన చేపట్టారు. తమ పొలిమేరలో ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరే కిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. తొలుత అధికారులతో తమ వైఖరి చెప్పినా స్పందించకపోవడంతో, 1001 ఉత్తరాల ద్వారా సీఎంకు తమ అభిప్రాయూన్ని తెలియజేశారు.
అయినా ఫలితం లేకపోవడంతో ఒకవైపు ఉండవల్లి రైతులు, మరోవైపు పెనుమాక రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటుచేశారు. ‘స్వాగతం-సుస్వాగ తం, ల్యాండ్ పూలింగ్‌కు మా భూములు ఇవ్వలేం, అధికారులు, నాయకులు, కమిటీ మెంబర్స్, మాకు సహకరించాలని ప్రార్థన. (మల్టీక్రాప్స్) ఇక్కడ మొత్తం చిన్న సన్నకారు రైతులు. సిటీకి అతి సమీపంలో ఉండడంవల్ల అపార్టుమెంట్లు, దేవాలయాలతో అన్ని విధాలా అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతం. అందువల్ల మేము మీకు భూములు ఇవ్వలేం’ అంటూ ఐరన్ బోర్డులపై రాశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... తాము భూములు ఇచ్చేందుకు వ్యతిరేకం అని చెప్పినా ఒకరిద్దరు తెలుగుదేశం కార్యకర్తలతో అనుకూలమంటూ మీడియా ప్రచారం నిర్వహిస్తున్నారనీ, వీటన్నింటినీ తిప్పికోట్టేందుకే ఈ విధమైన బోర్డు ఏర్పాటు చేశామనీ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ భూములను మినహాయించాలని కోరారు. బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తే చావడానికి సిద్ధమని హెచ్చరించారు.