Crop land
-
AP: ఆగస్టు 15 నుంచి డిజిటల్ క్రాప్ సర్వే
సాక్షి, అమరావతి: డిజిటల్ క్రాప్ సర్వే (కేంద్ర ప్రాయోజిత పథకం) పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలను ఎంపిక చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజ తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సహా ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ ఆహూజ మాట్లాడుతూ ఈ ప్రక్రియ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మ్యాచింగ్ గ్రాంట్‌గా 40 శాతం నిధులు సమకూరుస్తోందన్నారు. కేంద్రం తన వంతుగా రూ.47.59 కోట్లు కేటాయించిందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రతి రైతుకు యూనిక్ ఐడీ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా రైతులకు సంబంధించిన సమాచార సేకరణ, నిర్వహణతోపాటు ప్రతి రైతుకూ యూనిక్ ఐడీలను ఇవ్వాల్సి ఉంటుందని ఆహూజ తెలిపారు. అలాగే యూనిఫైడ్ ఫార్మర్ సరీ్వస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్‌ఎస్‌ఐ)ను అందుబాటులోకి తేవాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం, ఆయా రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే వివిధ పంటలను మరింత కచ్చితత్వంతో అంచనా వేయొచ్చన్నారు. ఆగస్టు 15 నుంచి డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభిస్తామని చెప్పారు. సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ సర్వే మంచి నిర్ణయమన్నారు. డిజిటల్ క్రాప్ సర్వేపై వివిధ సందేహాల నివృత్తికి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడతారన్నారు. ఈ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. దీని అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి -
పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి
పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడికి దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో గురువారం జరిగింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు విరుచుకు పడింది. వరి, బీన్స్, రాగి పంటలతో పాటు విద్యుత్తు మోటార్లను గజరాజులు నాశనం చేశాయి. ఏనుగుల దాడితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఏనుగుల దాడులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ నెల 10వ తేదీన రామాపురం గ్రామాలలో గాయపడిన ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా, రెచ్చిపోయిన గజరాజు ట్రాకర్లపై తిరగబడింది. దీంతో ఏనుగు ధాటికి స్థానికులు పరుగులు తీశారు. -
ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా బోర్డులు..
ఉండవల్లి, పెనుమాక రైతుల వినూత్న పోరాటం తాడేపల్లి: రాజధాని ఏర్పాటు కోసం ప్రభుత్వం పంట భూములను సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నా సీఎం చంద్రబాబునాయుడు మొండిగా వ్యవహరిస్తుండటంతో గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు గురువారం సరికొత్త తరహా నిరసన చేపట్టారు. తమ పొలిమేరలో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరే కిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. తొలుత అధికారులతో తమ వైఖరి చెప్పినా స్పందించకపోవడంతో, 1001 ఉత్తరాల ద్వారా సీఎంకు తమ అభిప్రాయూన్ని తెలియజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఒకవైపు ఉండవల్లి రైతులు, మరోవైపు పెనుమాక రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటుచేశారు. ‘స్వాగతం-సుస్వాగ తం, ల్యాండ్ పూలింగ్‌కు మా భూములు ఇవ్వలేం, అధికారులు, నాయకులు, కమిటీ మెంబర్స్, మాకు సహకరించాలని ప్రార్థన. (మల్టీక్రాప్స్) ఇక్కడ మొత్తం చిన్న సన్నకారు రైతులు. సిటీకి అతి సమీపంలో ఉండడంవల్ల అపార్టుమెంట్లు, దేవాలయాలతో అన్ని విధాలా అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతం. అందువల్ల మేము మీకు భూములు ఇవ్వలేం’ అంటూ ఐరన్ బోర్డులపై రాశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... తాము భూములు ఇచ్చేందుకు వ్యతిరేకం అని చెప్పినా ఒకరిద్దరు తెలుగుదేశం కార్యకర్తలతో అనుకూలమంటూ మీడియా ప్రచారం నిర్వహిస్తున్నారనీ, వీటన్నింటినీ తిప్పికోట్టేందుకే ఈ విధమైన బోర్డు ఏర్పాటు చేశామనీ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ భూములను మినహాయించాలని కోరారు. బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తే చావడానికి సిద్ధమని హెచ్చరించారు. -
కౌలు రైతు కన్నీటి సాగు
కౌలు రైతులకు ఏటా కన్నీటి సేద్యం తప్పడం లేదు. జిల్లాలో 70 శాతం పంట భూములు సాగు చేసేది వీరే. అయినా ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందాల్సిన రాయితీలు, రుణాలు వారి దరిచేరవు. ఇందుకు కారణం వేరే వారి భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడమే. సాగుకు అందరి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా వీరే. పెట్టుబడితో పాటు కౌలు కింద ముందే డబ్బు చెల్లించాలి. ఇంత కష్టపడిన వారిని రైతులుగా గుర్తించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినా దిగువ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కౌలు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. చీరాల : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రెవెన్యూ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా వేలాది మంది రైతులు కౌలుదారులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ఈ ఏడాది కేవలం 8 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారిలో మూడోవంతు మందికి ఎటువంటి రుణం మంజూరు కాలేదు. జిల్లాలో 2 లక్షలపైగా కౌలు రైతులున్నారు. జిల్లాలో సాగవుతున్న 5.7 లక్షల హెక్టార్లలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 35 వేల మంది కౌలు రైతులు గుర్తింపుకార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 8 వేల మందికే మంజూరు చేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు ఏ రాయితీని, బ్యాంకు రుణాలను పొందలేకపోతున్నారు. దీనికి తోడు రైతులకు అవగాహన లేకపోవడం కూడా గుర్తింపుకార్డు పొందలేకపోవడానికి కారణమవుతోంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కౌలు రైతులను కన్నీటి కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు నామమాత్రంగా కూడా చేయడంలేదు. రైతు సంఘాల నాయకులు గట్టిగా అడిగితే కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లోకి వెళ్లి వారు ఎంత భూమిని కౌలుకు తీసుకున్నారో ఆ ప్రకారం కార్డుల్ని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఆ ప్రక్రియ సాగడం లేదు. స్థానిక నేతలు చెప్పిన వారికి, సర్వే నంబర్లు చెప్పినవారికి కార్డులు అందుతున్నాయి. అలాంటి వాటిలో కౌలు చేసిన భూమికి, కార్డులో ఉన్న విస్తీర్ణానికి పొంతన ఉండడంలేదు. ఎరువులు, విత్తనాలు, రుణాలు, వ్యవసాయ పనిముట్లు, పంటల బీమా, నష్టపరిహారం ఇలా కౌలుదారుడికి ప్రభుత్వం నుంచి పొందే ఏ లబ్ధికైనా గుర్తింపుకార్డులు అవసరం. ఏటా కౌలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య అంతా కలిపి 35 వేలకు మించి ఉండదు. దీనికి కారణం రైతులకు కార్డులు అందచేయడంలో అధికారులు రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టడమే. పైగా కార్డులిచ్చినా వాస్తవంగా రైతులు సాగు చేస్తున్న భూమికి, గ్రామస్థాయి అధికారులు నమోదు చేస్తున్న విస్తీర్ణానికి సంబంధం ఉండడం లేదు. ఐదు ఎకరాలు కౌలు చేస్తున్న వారికి పదిసెంట్లు కౌలు చేస్తున్నట్లుగా కౌలు కార్డులిచ్చిన సంఘటనలున్నాయి. సర్కారు తీరుతో మరింత అవస్థలు... ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. ఫలితంగా కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో కౌలు రైతులు తమకు ఇచ్చిన గుర్తింపు కార్డు ద్వారా బ్యాంకు నుంచి రుణసౌకర్యం పొందేవారు. అయితే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి దానిని పూర్తిచేయకపోవడంతో బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదు. అటు రుణమాఫీ కాక, ఇటు పెట్టుబడికి రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులు వ్యవసాయ పెట్టుబడులతో పాటు అదనంగా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు రుణాలు అందకపోవడంతో కౌలుదారులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వందకు రెండు నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. చివరకు వడ్డీ తడిసి మోపెడవుతోంది.