
న్యూఢిల్లీ, సాక్షి:ఉచితాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు ప్రజలను పరాన్న జీవులుగా మార్చేస్తున్నాయని మండిపడింది.
పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగష్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ప్రజలు ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది.
‘‘ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇలాంటి వ్యక్తులను(ఉచితాలను అందుకుంటున్న వాళ్లను) సమాజ పురోగతిలో భాగం చేయకుండా.. పరాన్నజీవుల తరగతిని మనం సృష్టించడం లేదా?. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడం వల్ల.. పని చేసేందుకు జనం ఇష్టపడడం లేదు. ఎలాంటి పనులు చేయకుండానే ఉచితంగా రేషన్ వాళ్లకు అందజేస్తున్నారు’’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
అయితే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ అంశం పరిశీలనకు కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆటార్నీ జనరల్‌ను ఆదేశించిన బెంచ్.. పిటిషన్ విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. ఉచితాల(freebies)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో 81 కోట్ల మంది ఉచితంగా రేషన్, సబ్సిడీల కింద రేషన్ అందుకుంటున్నారనే విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ‘‘ఇలా ఎంత కాలం ఉచితాలు ఇస్తూ పోతారు? వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేమా?’’ అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆనాడు వ్యాఖ్యానించింది.
‘సుప్రీం’కే వెళ్లండి: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉచితాల హామీలు ఓటర్లపై గుప్పించాయి. అయితే ఇది అవినీతి చర్యల కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఓ పిటిషన్ వేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.
ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఉచితాలు ప్రకటించడం అవినీతి కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి ధింగ్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు లంచం ఎర వేశాయి. ఈ వ్యవహారంపై ఈసీని దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా.. ఓటర్ల వివరాలను సేకరించడం, వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే.. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీం కోర్టులో ఇదే తరహా పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని ఆయనకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment