31 వేల ఎకరాల అటవీభూమి ఎందుకు?
- రాజధానికి అటవీ భూములపై రాష్ట్రానికి కేంద్రం షాక్
- రాజధాని మాస్టర్ ప్రణాళిక పరిశీలనకు కమిటీ ఏర్పాటు
- నిపుణుల కమిటీకి డెహ్రాడూన్ ఏపీసీసీఎఫ్ నాయకత్వం
- నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్రం
సాక్షి, అమరావతి: కొత్త రాజధాని పేరుతో రాష్ట్ర సర్కారు భూ దాహంపై కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రాజధాని కోసం 31 వేల ఎకరాల అటవీ భూమిని కోరడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడుతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అవసరమైతే రాజధాని కోసం అటవీ భూమిని అటవీయేతర వినియోగానికి అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీని ఆధారంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 31,112 ఎకరాల అటవీ భూమిని రాజధాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలను కేంద్రం విశ్వసించడం లేదు.
రైతుల నుంచి ఏకంగా 32 వేల ఎకరాలకుపైగా భూసమీకరణలో తీసుకున్న తరువాత కూడా ఇంకా 31 వేల ఎకరాలకుపైగా అటవీ భూమి రాజధాని కోసం ఎందుకనే ప్రశ్నను కేంద్ర అటవీశాఖ లేవనెత్తింది. దీన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజగోపాల్ ప్రశాంత్ తెలియజేశారు. డెహ్రాడూన్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏపీసీసీఎఫ్) అజయ కుమార్ అధ్యక్షతన నియమించిన కమిటీలో లక్నో ఏపీసీసీఎఫ్ వీకే సింగ్, చంఢీఘర్ ఏపీసీసీఎఫ్ సీడీ సింగ్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ప్రశాంత్ రాజగోపాల్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ లేదా రాజధాని మాస్టర్ ప్రణాళిక అభివృద్ధికి చెందిన వ్యక్తులను సభ్యులుగా నియమించాలని కేంద్ర అటవీ శాఖ సూచించింది.
నిపుణుల కమిటీ ఏమి చేస్తుందంటే...
► ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అటవీ విస్తీర్ణం మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు అటవీ (కన్జర్వేషన్) చట్టం 1980 ప్రకారం సాధ్యమా? కాదా? అనే విషయాన్ని పరిశీలిస్తుంది.
► రాజధాని మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్రణాళికను అధ్యయనం చేస్తుంది.
► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అటవీ భూమి మార్పిడి వివరాలను సవివరంగా అధ్యయనం చేస్తుంది. వీలైనంత మేర అటవీ విస్తీర్ణం మార్పిడిని తగ్గించడంతో పాటు అటవీ భూమి వినియోగం లేకుండా అటవీ ప్రాంతం చుట్టపక్కల ఫారెస్ట్ సెంట్రిక్ మాస్టర్ ప్రణాళిక అభివృద్ధికి సూచనలు చేస్తుంది.
► ఫారెస్ట్ (కన్జర్వేషన్) చట్టం 1980ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు అలాగే అడవుల పరిరక్షణకు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను, నియమ నిబంధనలను పరిగణలోకి తీసుకుని నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పిస్తుంది.