అటవీకలప గడప దాటింది.. ప్రభుత్వ క్వార్టర్ ప్రైవేటు పరమైంది.. అటవీ భూమిల్లో అనధికార రోడ్డు వెలసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అటవీకలప గడప దాటింది.. ప్రభుత్వ క్వార్టర్ ప్రైవేటు పరమైంది.. అటవీ భూమిల్లో అనధికార రోడ్డు వెలసింది. ఈ తతంగానికి సూత్రధారులెవరో కాదు.. సాక్షాత్తూ వన సంరక్షకులే. కంటికి రెప్పలా కాపాడాల్సిన వన సంపదను ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన వైనాన్ని ఆలస్యంగా గుర్తించిన అటవీశాఖ.. ముగ్గురు అధికారులపై వేటు వేసింది. హైదరాబాద్ సౌత్ రేంజ్‌లోని ఇబ్రహీంపట్నం సెక్షన్ పరిధిలోని పలు బ్లాకుల్లో అక్రమంగా కలపను విక్రయించడంతోపాటు వన సంరక్షణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత తొలగించారు.
ఇబ్రహీంపట్నంలోని అటవీ అధికారి క్వార్టర్‌ను ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇచ్చారు. అంతేకాక అటవీ భూమిలో కేబు ల్ లైన్లు వేసే క్రమంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారులతో విచారణ చేయించిన అటవీ శాఖ.. వారి నివేదిక ఆధారంగా వేటువేసింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సెక్షన్ ఆఫీసర్ శ్రీవాణి, బీట్‌ఆఫీసర్ మొయినొద్దీన్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ అధికారి నాగభూషణం ఉత్తర్వులు జారీ చేశారు.
రేంజ్ పరిధిలో ఇంతటి అక్రమాలు జరుగుతున్నా పసిగట్టకుండా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఏకంగా హైదరాబాద్ రేంజ్ ఆఫీసర్ రామరాజును అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామరాజు స్థానంలో హైదరాబాద్ నార్త్ రేంజ్ ఆఫీసర్ విజయ్‌కుమార్‌కు అదనపు బాధ్యత లు అప్పగించారు. ఇబ్రహీం పట్నం సెక్షన్ ఆఫీసర్‌గా సాహెబ్‌నగర్ సెక్షన్ ఆఫీసర్ మోహన్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.