పెద్దల్ని తప్పించారు
⇒అటవీ భూముల స్వాహాలో అధికార పార్టీ నేతల బినామీ బాగోతం
⇒ఏడాదిపాటు సాగిన సుదీర్ఘ విచారణ
⇒తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలపై వేటు
నెల్లూరు : పెద్దలే గద్దలయ్యారు. 545 ఎకరాల అటవీ భూముని స్వాహా చేశారు. పాత రికార్డులను సేకరించి.. తప్పుడు పత్రాలను సృష్టించి.. బినామీల పేరుతో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు చేయించేశారు. ఏడాది క్రితం వరకు పదవిలో ఉన్న చిత్తూరు జిల్లా అమాత్యులు, జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి అటవీ భూమిని కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారుల్ని వదిలేసిన ప్రభుత్వం పాత్రధారులైన రెవెన్యూ ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. జిల్లాలో కీలక అంశంగా మారిన ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు ఆందోళనలు చేసినా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
సర్వే నంబర్ మార్చేసి..
వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలోని సర్వే నంబర్ 43/1లో 1,988.81 ఎకరాల అటవీ భూమి ఉంది. దీనిని రీసర్వే చేసి సర్వే నంబర్ 43/1ను 75/2 నంబర్‌గా మార్చా రు. ఫెయిర్ అడంగల్‌లోనూ భూమి వివరాలు నమోదు చేసి.. అటవీ పోరంబోకుగా రికార్డుల్లో చూపారు. ఆ తర్వాత 2014లో జారీ చేసిన జిల్లా నూతన గెజిట్‌లో భూమి వివరాలను మార్చేశారు. 1,988 ఎకరాలకు బదులుగా 1,329 ఎకరాలు మాత్రమే అటవీ భూమి ఉన్నట్టు చూపించారు. మిగిలిన 659.60 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్టు గాని.. ఇతర వివరాలేవీ రికార్డుల్లో నమోదు చేయలేదు. అందులో 549 ఎకరాలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధి కన్నుపడింది. వేగంగా పావులు కదిపాడు. వెంటనే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, ఆయన కుమారుడి సహకారంతో పక్కా ప్రణాళిక రచించి అమలు పరిచాడు. ఈ క్రమంలో 1915లోని ఇనాం భూముల రికార్డులు, ఇనాం చట్టంలోని లొసుగులు, ఇతర అంశాలను ఆసరాగా చేసుకుని అక్కడ ఆక్రమంగా సాగు చేస్తున్న వారి నుంచి భూములు కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించాడు. వెంటనే 2015లో భూమిని స్వాధీనపర్చుకోవటానికి వీలుగా రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తి చేశాడు.
వాస్తవానికి ఆ భూములను రాపూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండగా, తనకు పరపతి ఉన్న వెంకటగిరి సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయంలో 16 మంది బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి బినా మీల పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. దళిత, గిరిజన సంఘాలు లోకాయుక్తకు ఫిర్యాదు చేయటంతో జిల్లా అధికారులు స్పందించి 2016లో విచారణకు తెర తీశారు. వాస్తవానికి అటవీ భూమి కావటంతో భూమి విలువ అతి తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూమిని భూబదలాయింపు కోసం వినియోగించుకుని.. రూ.కోట్లు విలువ చేసే భూమి దక్కించుకోవచ్చు. అలాగే పట్టాదార్ పాస్‌బుక్స్‌పై బ్యాంకుల్లో పంట, ఇతర రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఏడాదిగా విచారణ
ఈ భూముల వ్యవహారంపై నెల్లూరు జెడ్పీ సీఈఓ రామిరెడ్డి 2016లో విచారణ ప్రారంభించారు. ఆయన ఏసీబీకి పట్టుపడిన అనంతరం గూడూరు ఆర్డీఓ అరుణ్‌బాబు విచారణ నిర్వహించారు. చివరగా ఈనెల 3న ఆర్డీఓ విచారణ జరిపి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. గతంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్ సు«ధాకర్, ఆర్‌ఐ శరత్, వీఆర్వోలు అంకయ్య, ప్రభాకర్‌రెడ్డిని సస్పెండ్ చేసి కథ ముగించారు.