అడ్డగోలుగా అటవీ భూముల ఆక్రమణ
నిమ్మ, జామాయిల్ మొక్కల సాగు
ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలూ సృష్టి
అటవీ, రెవెన్యూ శాఖల జాయింట్ సర్వేలో నిగ్గుతేలిన నిజాలు
అదుపులోకి పావులూరు భాస్కర్‌నాయుడు.. రిమాండ్ విధింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అటవీ భూములంటే ఆ టీడీపీ నేతకు సొంత ఆస్తి కింద లెక్క. సుమారు పదెకరాలకు పైగా ఆక్రమించేసి ఏకంగా జామాయిలు చెట్లును పెంచాడు. ఇదేమని అడిగిన ఆ శాఖ అధికారులను బెదిరించడం.. చట్టంలో ఉన్న లొసుగులను అనుకూలంగా మార్చుకుని అధికారులను కోర్టులు చుట్టూ తిప్పడం ఆ నేతకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడితని ఆగడాలకు చెక్‌పడడంతో కటకటాలపాలయ్యాడు. వివరాలివీ..
తిరుపతి జిల్లా డక్కిలి మండలం డీఉప్పరపల్లి (గొల్లపల్లి) గ్రామానికి చెందిన పావులూరు భాస్కర్‌నాయుడు టీడీపీ నేతగా చలామణి అవుతున్నాడు. గ్రామంలోని సర్వే నెంబరు 59లో సుమారు పదెకరాలకు పైగా అటవీ భూమిని అక్రమించాడు. అందులో జామాయిల్ మొక్కలను పెంచి ఒక దఫా కటింగ్ చేసి సొమ్ము చేసుకున్నాడు. మళ్లీ గత ఏడాది జూలైలో కటింగ్ చేసేందుకు ఆయన ప్రయత్నించగా అధికారులు అడ్డగించి నోటీసులిచ్చారు.
అయితే, వాటిని తీసుకునేందుకు భాస్కర్‌నాయుడు నిరాకరించాడు. మరోవైపు.. ఇదే గ్రామంలో మరికొంతమందితో కలిసి అటవీభూమిని రాత్రిపూట ఆక్రమించి నిమ్మ మొక్కలను సాగుచేశాడు. దీంతో అటవీశాఖ అధికారులు అతనిపై భూ ఆక్రమణ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ, అటవీ శాఖాధికారులు ఈయన సాగుచేస్తున్న భూముల్లో ఇటీవల ఉమ్మడి సర్వే నిర్వహించారు. అవన్నీ అటవీశాఖ పరిధిలోకే వస్తాయని తేల్చి నివేదికను జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
అదుపులో భాస్కర్‌నాయుడు..
దీంతో.. తిరుపతి జిల్లా డీఎఫ్‌ఓ వికాస్, సబ్ డీఎఫ్‌ఓ నాగభూషణం ఆదేశాలు మేరకు వెంకటగిరి ఇన్‌చార్జి రేంజ్ లోకేష్, బాలాయపల్లి డీఆర్వో సుభాషిణి ఆధ్వర్యంలో వెంకటగిరి రేంజ్, టాస్క్‌ఫోర్స్‌కు చెందిన సుమారు 25 మంది శుక్రవారం రాత్రి డీ.ఉప్పరపల్లిలో ఉన్న భాస్కర్‌నాయుడును అదుపులోకి తీసుకుని వెంకటగిరిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు.
ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతనిపై అటవీశాఖకు సంబంధించిన కేసులు నమోదై ఉండడంతో ప్రస్తుతం అటవీశాఖ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేశారు.
2007లోనే అటవీ భూములను రిజిస్ట్రేషన్..
నిజానికి.. భాస్కర్‌నాయుడుకు ముందునుంచి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడం.. ఆ భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. 2007లో డీ.ఉప్పరపల్లిలోని 32 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఆ భూములకు సంబంధించి ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు సృష్టించాడు.
వాటిని నెల్లూరుకు చెందిన పామూరు నిరంజన్‌రెడ్డి, కృష్ణపట్నం సులోచనలకు తన కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరుతో విక్రయించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది. అంతేగాక.. ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు, తహసీల్దార్ పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫోర్జరీ వంటి విషయాలు వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు డక్కిలి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
వైఎస్సార్‌సీపీ నేతపై అక్రమ కేసు..
ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పావులూరు భాస్కర్‌నాయుడు అటవీ భూముల్లో జామాయిల్ చెట్లను నరికి అక్రమంగా తరలించగా.. ఇప్పుడా పార్టీ అధికారంలోకి రాగానే డీ.ఉప్పరపల్లికే చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు బొల్లినేని భాస్కర్‌నాయుడే చెట్లు నరికినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో డక్కిలి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment