bhaskar naidu
-
రిటైర్ట్ డీఎస్పీ భూమి కబ్జాకు టీడీపీ నేతల కుట్ర
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి మండలం శ్రీనివాసపురానికి చెందిన తన భూమిని కాజేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారని, అందులో నిర్మాణంలో ఉన్న దుకాణాన్ని 50 మంది రౌడీలతో వచ్చి అర్ధరాత్రి కూల్చివేశారని రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్‌నాయుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం భాస్కర్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసపురానికి చెందిన తాను 2012లో జిలకర సూర్యనారాయణ వద్ద సర్వే నంబర్ 255/1బిలో 21 సెంట్లను కొనుగోలు చేశానని తెలిపారు. అయితే, అప్పటి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ బినామీ పాండురంగ మొదలియార్ నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడని తెలిపారు. ఆ భూమిపై 1974లో ఒక కేసు, 1991లో రెండు కేసులు, 2013లో ఒక కేసు కోర్టులో వేశారని, ఆ కేసుల్లో తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని భాస్కర్‌నాయుడు తెలిపారు. ఆపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, అతని తమ్ముడు చాణక్య హైకోర్టులో తప్పుడు పత్రాలతో స్టేటస్కో తెచ్చారన్నారు. అధికారులను తప్పుదోవ పట్టించి ఇదే సర్వే నంబర్‌పై తప్పుడు పట్టాను పొందడంతో వీరితో పాటు అప్పటి ఇనాం డీటీ వరప్రసాద్, ఆర్డీవో బాబయ్యపై చిత్తూరు 2టౌన్లో క్రిమినల్ కేసులు సైతం నమోదైనట్టు తెలిపారు. అర్థరాత్రి అక్రమంగా కూల్చివేత కాగా.. ఆ స్థలంలో దుకాణం నిర్మాణాన్ని చేపట్టగా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, అతని తమ్ముడు చాణక్య, విజయ్ (విజ్జు) నిర్మాణాల వద్దకు వచ్చారని భాస్కర్‌నాయుడు తెలిపారు. ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగడంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు పత్రాలను పరిశీలించి ఆ భూమి తనదేనని తేల్చిచెప్పారన్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి పాల్పడినట్టు బాధితుడు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 50 మంది రౌడీలతో సంజయ్, చాణక్య, విజయ్ ఆ స్థలంలో నిర్మాణాన్ని అక్రమంగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డయల్ 100కు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకోకుండా వారికే వత్తాసు పలికారని ఆరోపించారు. కాగా, జరిగిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ చిన్న గోవింద్ తెలిపారు.‘టీడీపీ వాడినైనా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు’తాను డీఎస్పీగా పనిచేస్తున్నప్పటికీ మొదటినుంచీ తాను టీడీపీకి మద్దతుదారుడిగా ఉన్నానని రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్‌నాయుడు చెప్పారు. టీడీపీ అంటే ఎంతో అభిమానం అని.. పసుపు చొక్కా వేసుకోకపోయినా టీడీపీ కోసం పనిచేసినట్టు తెలిపారు. 1992 నుంచి టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న తనకు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, చాణక్య, విజయ్ మంచి బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాను ప్రహరీ నిర్మాణం, దుకాణ నిర్మాణం, త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్లు పొందానని, అప్పటి అధికార పార్టీ నాయకులు ఏనాడూ తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. టీడీపీ మద్దతుదారుడిగా ఉన్నప్పటికీ తన భూమిని టీడీపీ నాయకులే కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. తనకు ప్రభుత్వం, అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
వైఎస్సార్ సీపీలోకి ముల్లంగి సోదరులు
అనంతపురం , రాయదుర్గం: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఎల్బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్ నాయుడు, లింగదహాళ్ సర్పంచ్ లింగప్పలు వైఎస్సార్సీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చంద్రబాబు ఏపీ ప్రజలను వంచించాడని విమర్శించారు. తన సామాజిక వర్గం వారు కూడా తలదించుకునేలా చేశాడని దుయ్యబట్టారు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని అంటున్నారని, అయితే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మంత్రి పదవులు ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. బాబు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, కమీషన్ల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను కర్ణాటకలోని బీజేపీ అభ్యర్థులకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే రుజువు చేస్తానని సవాల్ విసిరారు. ఒక వైపు బీజేపీకి డబ్బు పంపి, మరోవైపు రాష్ట్రం ముక్కలు కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిగ్గు, లజ్జా లేదా అని ప్రశ్నించారు. రాయదుర్గం నియోజకవర్గంలో అవినీతి కాలవ ప్రవహిస్తోందన్నారు. మంత్రి కాలవ కు చిత్తశుద్ధి వుంటే కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన తమ ముఖ్యమంత్రితో మాట్లాడి అప్పర్ భద్ర నుండి పరశురాంపుర మీదుగా ఖర్చు లేకుండా బీటీపీకి నీరు తెస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి దొంగల , దగాకోరు, దుర్మార్గుల పార్టీలో ఉండలేక , ముల్లంగి సోదరుల లాంటివారు చాలా మంది మనపార్టీలోకి చేరుతున్నారన్నారు. చంద్రబాబుకు సీఎం లక్షణాలు లేవు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిప్పు అంటాడు, 40 ఏళ్ల సీనియర్ అంటాడు , చివరకు ప్రజల వద్దకు వెళ్లి నన్ను కాపాడుకోండి అని వేడుకుంటున్నాడంటే ఆయన వెన్నులో జగన్ భయం ఎలా ఉందో తెలుసుకోవచ్చన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. బీజేపీకి వైఎస్సార్సీపీ సపోర్ట్ చేస్తుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వందకోట్లు సంపాదించారని టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తనతో స్వయంగా చెప్పాడంటే ఇక ఏ తరహాలో అవినీతి , అక్రమాలు జరిగాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ గెలుపునకు కృషి అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య మాట్లాడుతూ చంద్రబాబుఎన్నికల్లో ఇచ్చిన ఒక్కహామి నెరవేర్చలేదని.. ఇలాంటి నయవంచన పాలన నుండి విముక్తి పొందాలంటే ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైఎస్సార్సీపీ గెలుపునకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆదాయం కోసం అడ్డదారులు అనంతపురం అర్బన్ సమన్వయకర్త, మాజీ ఎంపీ అనంత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ ఆదాయం కోసం అడ్డదార్లు తొక్కుతున్న టీడీపీ నాయకులు... జగన్‌ను దుర్మార్గుడు అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జిల్లాలోనే కాదు, రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో ఇసుక, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకోలేదా అని ప్రశ్నించారు. హంద్రీ నీవా కాలువలు వెడల్పు చేయకుండా బీటీపీ, పేరూరు ప్రాజెక్టులకు నీరు తెస్తామని చెప్పడం వెనుక మంత్రులు కమీషన్లు దండుకుంటారనేది కఠోరమైన వాస్తవమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి , ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, గుమ్మనూరు జయరాములు, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం, నియోజకవర్గాల సమన్వయకర్తలు వై. వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి, అనిల్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కుమారుడు భీమరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజినేయులు, కదలిక ఇమాం, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు ఉసేన్ పీరా , రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, ఎస్టీ, ఎస్సీ , బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు భోజరాజు నాయక్, బీటీపీ గోవిందు, ఎన్టీ సిద్దప్ప పాల్గొన్నారు. భారీ బైక్ ర్యాలీ బొమ్మనహాళ్: ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కరనాయుడు, లింగదహాళ్ సర్పంచ్ లింగన్నల చేరిక సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దాదాపు 3 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు. బొమ్మనహాళ్ నుంచి ఉంతకల్లు క్రాస్, దేవగిరి క్రాస్, ఉద్దేహాళ్, రంగాపురం క్యాంప్, ఉప్పరహాళ్ క్రాస్ గ్రామాల మీదుగా ఎల్బీ నగర్ వద్ద వేదిక వరకు ర్యాలీ సాగింది. -
తిరుమలలో ఆరడుగుల నాగుపాము
తిరుమలలో వన్యప్రాణుల బెడత పెరిగింది. ఒకవైపు చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన పడుతోంటే.. మరో వైపు.. నాగు పాములు, కొండ చిలువలు.. జనావాసాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం ఆరు అడుగుల నాగుపాము అటవీశివారు ప్రాంతం నుండి బాలాజీనగర్ చివరి సంధు వద్ద రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు పామును చూసి పరుగులు తీసారు. సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ మజ్దూర్ భాస్కర్‌నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి పామును పట్టుకున్నాడు. దీంతో జనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత నాగుపామును అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. -
రైతుల నుంచి ఆధార్ నంబర్లు సేకరించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో భాస్కర్‌నాయుడు గుంటూరు రూరల్ : గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో రైతుల నుంచి ఆధార్ నంబర్ల సేకరణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని గుంటూరు ఆర్డీవో భాస్కర్‌నాయుడు అన్నారు. గుంటూరు తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాల తహశీల్దార్లు, వీఆర్వోలకు వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి పాస్‌పుస్తకాల దరఖాస్తులకు సంబంధించి ఆధార్ నంబర్ కచ్చితంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రతి రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్, సెట్ కాన్ఫరెన్స్‌లో మండలాల వారీగా ఆధార్ నంబర్ల నమోదు వివరాలను క్షుణ్ణంగా తెలియజేయాలన్నారు. గ్రామాల్లో రైతులకు పాస్ పుస్తకాల మంజూరు ఈ పాస్‌పుస్తకాల దరఖాస్తు గురించి వివరంగా తెలియజేసి దరఖాస్తులు చేసిన వాటిని త్వరితగతిన పరిశీలించాల్సిందిగా తెలియజేశారు. ప్రభుత్వ స్థలాల వివరాలను ఆన్లైన్లో నమోదు చెయ్యాల్సిన ప్రక్రియ కూడా వేగవంతం చేయ్యాల్సిందిగా సూచించారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రతి రైతులకు ఆధాన్ నంబర్లు అనుసంధానం చేయ్యాల్సిందిగా ఆదేశించారు. పాస్‌పుస్తకాలకు సంబంధించిన ఖాతా నంబర్లను కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారా నమోదు చెయ్యాల్సిందిగా తెలిపారు. ఆర్ఎస్ఆర్, అడంగళ్ కాపీలను కూడా ఆన్లైన్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది ప్రజలకు తెలియని వాటిపై అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో గుంటూరు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, డిప్యూటీ తహశీల్దార్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.