అనంతపురం , రాయదుర్గం: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్ నాయుడు, లింగదహాళ్ సర్పంచ్ లింగప్పలు వైఎస్సార్‌సీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చంద్రబాబు ఏపీ ప్రజలను వంచించాడని విమర్శించారు. తన సామాజిక వర్గం వారు కూడా తలదించుకునేలా చేశాడని దుయ్యబట్టారు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని అంటున్నారని, అయితే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మంత్రి పదవులు ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. బాబు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, కమీషన్ల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను కర్ణాటకలోని బీజేపీ అభ్యర్థులకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే రుజువు చేస్తానని సవాల్ విసిరారు. ఒక వైపు బీజేపీకి డబ్బు పంపి, మరోవైపు రాష్ట్రం ముక్కలు కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిగ్గు, లజ్జా లేదా అని ప్రశ్నించారు. రాయదుర్గం నియోజకవర్గంలో అవినీతి కాలవ ప్రవహిస్తోందన్నారు. మంత్రి కాలవ కు చిత్తశుద్ధి వుంటే కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన తమ ముఖ్యమంత్రితో మాట్లాడి అప్పర్ భద్ర నుండి పరశురాంపుర మీదుగా ఖర్చు లేకుండా బీటీపీకి నీరు తెస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి దొంగల , దగాకోరు, దుర్మార్గుల పార్టీలో ఉండలేక , ముల్లంగి సోదరుల లాంటివారు చాలా మంది మనపార్టీలోకి చేరుతున్నారన్నారు.
చంద్రబాబుకు సీఎం లక్షణాలు లేవు
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిప్పు అంటాడు, 40 ఏళ్ల సీనియర్ అంటాడు , చివరకు ప్రజల వద్దకు వెళ్లి నన్ను కాపాడుకోండి అని వేడుకుంటున్నాడంటే ఆయన వెన్నులో జగన్ భయం ఎలా ఉందో తెలుసుకోవచ్చన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. బీజేపీకి వైఎస్సార్‌సీపీ సపోర్ట్ చేస్తుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వందకోట్లు సంపాదించారని టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తనతో స్వయంగా చెప్పాడంటే ఇక ఏ తరహాలో అవినీతి , అక్రమాలు జరిగాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
వైఎస్సార్‌సీపీ గెలుపునకు కృషి
అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య మాట్లాడుతూ చంద్రబాబుఎన్నికల్లో ఇచ్చిన ఒక్కహామి నెరవేర్చలేదని.. ఇలాంటి నయవంచన పాలన నుండి విముక్తి పొందాలంటే ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైఎస్సార్‌సీపీ గెలుపునకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఆదాయం కోసం అడ్డదారులు
అనంతపురం అర్బన్ సమన్వయకర్త, మాజీ ఎంపీ అనంత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ ఆదాయం కోసం అడ్డదార్లు తొక్కుతున్న టీడీపీ నాయకులు... జగన్‌ను దుర్మార్గుడు అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జిల్లాలోనే కాదు, రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో ఇసుక, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకోలేదా అని ప్రశ్నించారు. హంద్రీ నీవా కాలువలు వెడల్పు చేయకుండా బీటీపీ, పేరూరు ప్రాజెక్టులకు నీరు తెస్తామని చెప్పడం వెనుక మంత్రులు కమీషన్లు దండుకుంటారనేది కఠోరమైన వాస్తవమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి , ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, గుమ్మనూరు జయరాములు, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం, నియోజకవర్గాల సమన్వయకర్తలు వై. వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి, అనిల్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కుమారుడు భీమరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజినేయులు, కదలిక ఇమాం, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు ఉసేన్ పీరా , రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, ఎస్టీ, ఎస్సీ , బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు భోజరాజు నాయక్, బీటీపీ గోవిందు, ఎన్టీ సిద్దప్ప పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ
బొమ్మనహాళ్: ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కరనాయుడు, లింగదహాళ్ సర్పంచ్ లింగన్నల చేరిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దాదాపు 3 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు. బొమ్మనహాళ్ నుంచి ఉంతకల్లు క్రాస్, దేవగిరి క్రాస్, ఉద్దేహాళ్, రంగాపురం క్యాంప్, ఉప్పరహాళ్ క్రాస్ గ్రామాల మీదుగా ఎల్‌బీ నగర్ వద్ద వేదిక వరకు ర్యాలీ సాగింది.
Comments
Please login to add a commentAdd a comment