ఏపీలో 1,500 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ | Covid Care Center With 1500 Beds Is Being Set Up In Anantapur | Sakshi
Sakshi News home page

ఏపీలో 1,500 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌

Published Sun, Jul 19 2020 9:11 AM | Last Updated on Sun, Jul 19 2020 10:11 PM

Covid Care Center With 1500 Beds Is Being Set Up In Anantapur - Sakshi

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓ భారీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కరోనాకు పుట్టినిల్లుగా ఉన్న చైనాలోని వుహాన్‌ నగరంలో కేవలం ఆరు రోజుల్లోనే వేల పడకల సామర్థ్యం గల ఆస్పత్రిని నిర్మించారు. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం 1,500 పడకల సామర్థ్యంతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను అనంతపురం నగర శివారులోని రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఏర్పాటు చేస్తోంది. కేవలం రోజుల వ్యవధిలోనే ఈ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడ్డ వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో చికిత్సలు అందుకునేలా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

సాక్షి, అనంతపురం అర్బన్‌: కరోనా పాజిటివ్‌ వ్యక్తుల ఆరోగ్య సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రాప్తాడు సమీపంలోని రామినేపల్లి వద్ద ఉన్న పౌర సరఫరాల సంస్థ గోదాము (వేర్‌హౌస్‌)లోని 12 బ్లాక్‌ల్లో 1,500 పడకలతో ఒక భారీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మొత్తం 12 బ్లాక్‌లకు గాను మహిళలకు  ప్రత్యేకంగా రెండు బ్లాక్‌లను కేటాయించారు. కోవిడ్‌ బాధితులకు సేవలు అందించే వైద్యులు, స్టాఫ్‌ నర్సులతో పాటు అక్కడే విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఉండేందుకు పురుషులు, మహిళలకు వేర్వేరుగా అన్ని వసతులతో కూడిన షెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.  ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.8.50 కోట్లు వెచ్చిస్తుండడం గమనార్హం.  

రామినేపల్లి వద్ద ఉన్న పౌరసరఫరాల శాఖ గోదాములు 

అతి పెద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా..  
ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఇటీవల ఢిల్లీలో ఏర్పాటైంది. సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా పిలుస్తున్న ఈ సెంటర్‌లో 200 ఎన్‌క్లోజర్లలో 50 బెడ్ల చొప్పున మొత్తం 10 వేల పడకలు ఉన్నాయి. కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. చెత్తాచెదారాన్ని డంప్‌ చేసే స్థలాన్ని చదును చేసి ఈ సెంటర్‌ను నిర్మించారు. ఆ స్థాయిలో కాకున్నా.. అదే తరహాలో అతి పెద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రామినేపల్లి వద్ద ఉన్న గోదాముల్లోని ఒక్కో బ్లాకుకు 125 పడకలు చొప్పున 12 బ్లాకుల్లో 1,500 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పేషంట్ల కోసం రెండు బ్లాక్‌లు ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. రోగుల కోసం ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్స్‌ మొత్తం 180 నిర్మిస్తున్నారు.  (గ్రామాలకు వైభవం)

నూతనంగా వేసిన రోడ్డు
రెండు ల్యాబ్‌లు ఏర్పాటు.. 
12 బ్లాక్‌లకు సంబంధించి రెండు క్లినికల్‌ ల్యా»ొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈసీజీ, ఎక్స్‌రే లకు ప్రత్యేక గదులతో పాటు రక్త పరీక్షలకు ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నారు. కేర్‌ సెంటర్‌కు పేషంట్‌ చేరుకోగానే సైన్‌బోర్డులో వివరాలు నమోదు చేస్తారు. ఆ వెంటనే ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తారు. ప్రతి పడకకూ ఓ నంబర్‌ కేటాయిస్తున్నారు. ల్యాబ్‌లో పరీక్షలు పూర్తి అయిన తర్వాత పేషంట్‌కు పడక కేటాయిస్తూ వారి సామగ్రి ఉంచుకునేందుకు ఓ ట్రంక్‌ పెట్టెను ఇస్తారు. పరుపు, దిండు, కుర్చీ, బకెట్, మగ్‌ కూడా ఇస్తారు. పేషంట్ల సౌకర్యం కోసం వాల్‌ మౌంట్‌ ఫ్యాన్లు, ఫెడస్టల్‌ ఫ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పేషంట్లు నడిచేందుకు వీలుగా ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు.
 
వంట తయారు చేసి పెడతారు.. 
ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పేషంట్లకు భోజనం అందించేందుకు ప్రత్యేకంగా వంట గదినే ఇక్కడ ఏర్పాటు చేశారు. పేషంట్లు భోజనం చేసేందుకు వీలుగా హాల్‌ బయట టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్‌బేసిన్‌లను ఏర్పాటు చేశారు. సెంటర్‌లో విద్యుత్, నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం రెండు బోర్లను వేయించారు. ఒక సంప్‌ నిర్మాణం చేపట్టారు. అన్ని బ్లాకులకు పూర్తిస్థాయిలో పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవంతరాలు తలెత్తకుండా నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను కేర్‌ సెంటర్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయిస్తున్నారు. (కడప ఉక్కుపై దిగ్గజ కంపెనీల ఆసక్తి)


కోవిడ్‌ సెంటర్‌లో ముమ్మరంగా  జరుగుతున్న పనులు

త్వరలో అందుబాటులోకి.. 
కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పేషంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులతో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాం. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఉండేందుకూ ప్రత్యేకంగా షెడ్‌లు ఏర్పాటు చేయిస్తున్నాం. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.  – ఎ.సిరి, జాయింట్‌ కలెక్టర్‌ (వీడబ్ల్యూఎస్‌డీ) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement