సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకిందతాండ పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారు పార్వతి భాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండకిందతాండ పంచాయతీకి గిరిజన మహిళ పార్వతి భాయ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైంది. కొండకిందతాండలో ఆలయ నిర్మాణానికి పార్వతీభాయ్ ముందుకు రావటంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కాగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఆదివారం సాయంత్రంతో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డులకి ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ పదవులకు 13 వేలకు పైగా నామినేషన్లు.. వార్డు పదవులకి 35 వేలకి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment