సాక్షి, అనంతపురం : ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బెంబేలెత్తుతున్న టీడీపీ నాయకులు ఓటర్లకు తాయిలాలు ఎరవేస్తున్నారు. ఎక్కడికక్కడ చీరలు, మద్యం, డబ్బు పంచుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ ఎత్తున డబ్బు పంపిణీ చేపట్టారు. ఎంత చేసినా ప్రజలు మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిసి చివరకు పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆదివారం రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 31 జెడ్పీటీసీ స్థానాలు, 438 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రచార పర్వం ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ప్రజలు ఆదరిస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు విజయంపై ధీమాతో ఉన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉండడంతో మెజార్టీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
వీటన్నింటికీ విశ్లేషించుకుంటున్న టీడీపీ నేతలు గ్రామాల్లో భయాందోళనలు రేకెత్తించి పోలింగ్ శాతం తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. గుంతకల్లు, పెనుకొండ, రొద్దం, మడకశిర, అమరాపురం, హిందూపురం, లేపాక్షి మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మిగిలిన మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఏకపక్షంగా ఓటింగ్ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే రానున్న సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో నేతలు శర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్ ఆదివారం కావడంతో ప్రతి ఇంటికీ చికెన్ ఎర వేస్తున్నారు. మద్యాన్ని కూడా శనివారం రాత్రికే భారీగా పంపిణీ చేశారు. ‘ఎవరెన్ని చేసినా.. మేం ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తాం’ అని గ్రామీణులు తెగేసి చెబుతున్నారు.
నేడే ప్రాదేశిక తొలి సమరం
Published Sun, Apr 6 2014 3:49 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement