Majority of positions
-
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 40 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 57 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 55 స్థానాల్లో 55 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 33 వైఎస్సార్సీపీ గెలుపు. టీడీపీ ఒకటి, సీపీఎం ఒకచోట గెలిచింది. విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 28 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 62 స్థానాల్లో 60 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. ఒకటి టీడీపీ, ఇతరులు మరో చోట గెలిచారు. చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 46 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 20 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ కైవసం. -
కారు జోరు
ఉద్యమ ఖిల్లాలో కారు వేగంగా దూసుకెళ్లింది. పురపాలక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను నమోదు చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంచనాలను తలకిందులు చేసింది. మోడీ హవాతో పుంజుకున్న బీజేపీ సైతం బోణీ కొట్టింది. ఫలితంగా కాంగ్రెస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలన్నీ ఈసారి చెల్లాచెదురయ్యాయి. జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఆరు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యత చాటుకుంది. మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. మరో చోట రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా నిలదొక్కుకున్నాయి. ఒక చోట బీజేపీ తమ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్ పుంజుకోవటంతో పాటు బీజేపీ సత్తా చాటడంతో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రెండు కార్పొరేషన్లతో పాటు నాలుగు మున్సిపాలిటీలు, అయిదు నగర పంచాయతీల్లో స్పష్టమైన ఆధిక్యతను చాటుకోవటంలో మూడు పార్టీలు విఫలమయ్యాయి. ఎనిమిది పట్టణాల్లో మేజిక్ ఫిగర్‌కు సరిపడే మెజారిటీ స్థానాలు ఏ పార్టీ దక్కించు కోలేకపోయింది. జమ్మికుంట, హుస్నాబాద్ నగర పంచాయతీలను టీఆర్ఎస్ కైవశం చేసుకోగా, జగిత్యాల మున్సిపాలిటీని అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మిగతా ఎనిమిది చోట్ల హంగ్ ఫలితాల కారణంగా ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక ఉత్కంఠ రేపటం ఖాయమైంది. ఉద్యమ ప్రభావంతో పాటు తెలంగాణ తెచ్చిన క్రెడిట్‌ను టీఆర్ఎస్ ఖాతాలో వేసేందుకు పట్టణ ఓటర్లు మొగ్గు చూపారు. అందుకే జిల్లా మొత్తంలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. - మొత్తం 326 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 121 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగరేసింది. 111 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 25 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ 11 సీట్లకు పరిమితమైంది. మిగతా 58 స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. - టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, విద్యాసాగర్‌రావు, కేటీఆర్ తమ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికలను సవాలుగా స్వీకరించటంతో ఫలితాలు గులాబీ గుప్పిట్లో చేరాయి. కరీంనగర్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, మెట్పల్లి పట్టణాల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవశం చేసుకుంది. - ముఖ్య నేతల మధ్య గ్రూపు తగాదాలు, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి. అన్నీ తానై అన్నట్లుగా అభ్యర్థుల ఎంపికలో చక్రం తిప్పిన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పుర ఫలితాలు షాక్ ఇచ్చాయి. - టిక్కెట్ల కేటాయింపులో మిగతా నేతలతో పెరిగిన విభేదాలు కరీంనగర్లో పార్టీ ఓట్లకు గండి కొట్టాయి. - తెలంగాణ ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని, అభివృద్ధి పనులన్నీ తమ హయాంలోనే జరిగాయని కాంగ్రెస్ చేపట్టిన ప్రచారానికి నగరాల్లో ఆశించిన స్పందన లభించలేదు. - రామగుండం కార్పొరేషన్‌తో పాటు మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి పట్టు ఉన్న జగిత్యాల, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు ప్రాబల్యమున్న కోరుట్ట పట్టణాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. - పుర ఫలితాల్లో టీడీపీ పత్తా లేకుండా పోయింది. ఒక్కచోట కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది. కనీసం పరువు నిలబెట్టుకునే సంఖ్యలో వార్డులు, డివిజన్లను సాధించుకోలేపోయింది. పార్టీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత సెగ్మెంట్ జగిత్యాలలో 5 వార్డులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దపల్లిలో 3 వార్డులకు పరిమితమైంది. తెలంగాణపై అనుసరించిన ద్వంద్వ వైఖరితోనే ఆ పార్టీ చావుదెబ్బ తింది. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని విచిత్ర పరిస్థితిని చవిచూశారు. చివరకు బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుతో కొన్ని చోట్ల అభ్యర్థులను పోటీకి దింపినప్పటికీ.. ఫలితాల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. - పొత్తులో భాగంగా టీడీపీకి ఊపిరి పోసేందుకు ప్రయత్నించిన బీజేపీ జిల్లాలో బోణి కొట్టింది. టీడీపీతో పోలిస్తే రెండింతలకు మించి 25 స్థానాలు గెలుచుకుంది. ఎక్కువ దృష్టి కేంద్రీకరించిన వేములవాడలో అత్యధికంగా తొమ్మిది వార్డులను గెలుచుకొని నగర పంచాయతీకి గురి పెట్టింది. - కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రాబల్యమున్న ఎంఐఎంకు ఈ సారి ఫలితాలు షాక్‌కు గురి చేశాయి. జిల్లా కేంద్రంలో ఆ పార్టీకి కేవలం రెండు డివిజన్లు దక్కాయి. ఏకంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు పోటీ చేసిన డివిజన్లలోనూ ఓటమి తప్పించుకోలేకపోయింది. జిల్లాలో తొలిసారిగా 22 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపిన వైఎస్సార్సీపీ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. -
ఫలితాలకు ‘ముందు’జాగ్రత్త
ప్రభుత్వ ఏర్పాటుపై టీఆర్ఎస్ నేతల ధీమా రేపు హైదరాబాద్‌లో సమావేశం హాజరుకానున్న అధినేత కేసీఆర్ వరంగల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుతో జోరుమీదున్న టీఆర్ఎస్ ఫలితాలకు ముందే తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. తొలి నుంచి ప్రచారంలో ప్రత్యర్థులపై మాటల తూటాలతో దూసుకుపోయిన ఆ పార్టీ కౌం టింగ్‌కు ముందే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమా ఉన్నందున అవసరమైన వ్యూహం ఖరా రు చేసేందుకు 9వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరవుతున్నా రు. పోటీచేసిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా తప్పకుండా రావాలని అధినేత కే.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారు. ఎన్నికలపై సమీక్ష ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో పోటీచేసిన అభ్యర్థులకు నియోజకవర్గ స్థాయిలో వచ్చిన స్పందన, తొలి నుంచి చేపట్టిన ప్రచారం, పోలింగ్ తీరుతెన్నులు, జరిగిన పొరపాట్లు, పార్టీ వ్యతిరేకులు తదితర అంశాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. ప్రతికూల, సానుకూల అంశాలను చర్చించి పార్టీ పరంగా సమీకరించిన సమాచారాన్ని పోల్చి జయపజయాలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గెలుపొందే అభ్యర్థులు తక్షణం అందుబాటులో ఉండేవిధంగా సూచించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు తమదేనన్న ధీమాతో ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కలిసికట్టుగా ఉండాలనే అంశాన్ని వివరించనున్నట్లు సమాచారం. ఇక మునిసిపల్, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి చైర్మన్ స్థానాలు కైవసం చేసుకునే విధంగా పావులు కదలపాలని సూచిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటు అధికారంలోకి వస్తే మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై, ముఖ్యంగా దళిత సీఎం అంశం చర్చనీయాం శంగా మారిన నేపథ్యంలో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే అంశం ఈ సమావేశంలో చర్చించి విమర్శలకు తెరదించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఇక ఎంపీ స్థానాలపై ఆధారపడి కేంద్రంలో ఏకూటమితో ముందుకు సాగాలనేది నిర్ణయించే అవకాశం ఉంది. ఏమైనా కౌంటింగ్ రోజు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని అధినేత నొక్కిచెప్పనున్నారు. ఇప్పటికే కొందరు పోటీ చేసిన అభ్యర్థులు హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లు సమాచారం. -
ఎవరి ధీమా..వారిదే
పెరగని పోలింగ్ శాతం అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ తలలు పట్టుకున్న పార్టీలు సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక సంగ్రామంలో కీలక ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు లెక్కల్లో పడ్డాయి. కూడికలు, తీసివేతలు మొదలుపెట్టాయి. పోలింగ్ సరళి తమకే అనుకూలమంటూ ఎవరికి వారు పైకి అంచనాలు వేస్తున్నా.. లోపల మాత్రం దిగులుతో భీతిల్లుతున్నారు. పార్టీల వారీగా పరిశీలిస్తే.. ఎంఐఎం ఈసారి తమ స్థానాలను ‘పది’ వరకు పెంచుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్లినా.. తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న యాకుత్‌పురా, నాంపల్లి నియోకజవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నట్టు పరిశీలకులు అంచనా వేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో ఎంఐఎం పరిస్థితి పూర్తి సానుకూలంగానే ఉందని, ఆ పార్టీ ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న యోచన ఈ ఎన్నికల్లో పనిచేసే అంశం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చర్చోపచర్చలు గత ఎన్నికల్లో నగరంలో మెజారిటీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ మారు గందరగోళంగానే మారిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్, గోషామహల్ స్థానాలకు ప్రాతినిథ్యం వహించిన దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ ఈమారు ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. ఖైరతాబాద్‌లో దానం, ఆయన అనుచరులు వైఎస్సార్, టీడీపీ,బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. గోషామహల్లో ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్, అంబర్‌పేట అభ్యర్థి హన్మంతరావులే ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడిచేయడంతో కేసులు నమోదయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులంతా ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో కొత్త ఆశలు.. పోలింగ్ తీరు పరిశీలించిన తర్వాత ఫలితాలు తమకు పూర్తి అనుకూలంగా ఉంటాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో ప్రస్తుతం బీజేపీకి ఒక్క స్థానమే ఉండగా, ఆ సంఖ్యను భారీ ఎత్తున పెంచుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదిపింది. టీడీపీతో పొత్తు అంశం వివాదాస్పదంగా మారినా.. తమకు ఒక ఎంపీతో పాటు ఐదుకు మించి శాసనసభా స్థానాలను గెలుస్తాన్న ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మాత్రం హైదరాబాద్ నగరంపై పెద్దగా ఆశలు పెట్టుకోకపోగా, శివారు ప్రాంతాల ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారన్న ధీమాతో ఉన్నారు. ‘గులాబీ దళం’లో హుషారు నగరంలో పెద్దగా ఉనికి లేని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బుధవారం నాటి పోలింగ్ తీరు గులాబీ నేతల్లో హుషారును నింపింది. గ్రేటర్ పరిధిలో పలు సీట్లు గెలుచుకోవటంతో పాటు నగరంలో ఒక ఎంపీ స్థానాన్ని సైతం సాధిస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో జోష్.. ఒక లోక్‌సభ స్థానంతో పాటు ఏడు శాసనసభ నియోకజవర్గాల్లో తమకు అనుకూల ఫలితం వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో స్థిరపడ్డ వారితో పాటు మైనారిటీలు తమకు అండగా నిలబడ్డారని, దీంతో పార్టీ నగరంలో బలమైన శక్తిగా ఎదగటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. -
నేడే ప్రాదేశిక తొలి సమరం
సాక్షి, అనంతపురం : ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బెంబేలెత్తుతున్న టీడీపీ నాయకులు ఓటర్లకు తాయిలాలు ఎరవేస్తున్నారు. ఎక్కడికక్కడ చీరలు, మద్యం, డబ్బు పంచుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ ఎత్తున డబ్బు పంపిణీ చేపట్టారు. ఎంత చేసినా ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిసి చివరకు పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆదివారం రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 31 జెడ్పీటీసీ స్థానాలు, 438 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రచార పర్వం ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రజలు ఆదరిస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు విజయంపై ధీమాతో ఉన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉండడంతో మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగురవేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వీటన్నింటికీ విశ్లేషించుకుంటున్న టీడీపీ నేతలు గ్రామాల్లో భయాందోళనలు రేకెత్తించి పోలింగ్ శాతం తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. గుంతకల్లు, పెనుకొండ, రొద్దం, మడకశిర, అమరాపురం, హిందూపురం, లేపాక్షి మండలాల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మిగిలిన మండలాల్లో వైఎస్ఆర్సీపీకి ఏకపక్షంగా ఓటింగ్ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే రానున్న సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో నేతలు శర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్ ఆదివారం కావడంతో ప్రతి ఇంటికీ చికెన్ ఎర వేస్తున్నారు. మద్యాన్ని కూడా శనివారం రాత్రికే భారీగా పంపిణీ చేశారు. ‘ఎవరెన్ని చేసినా.. మేం ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తాం’ అని గ్రామీణులు తెగేసి చెబుతున్నారు.