- పెరగని పోలింగ్ శాతం
- అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ
- తలలు పట్టుకున్న పార్టీలు
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక సంగ్రామంలో కీలక ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు లెక్కల్లో పడ్డాయి. కూడికలు, తీసివేతలు మొదలుపెట్టాయి. పోలింగ్ సరళి తమకే అనుకూలమంటూ ఎవరికి వారు పైకి అంచనాలు వేస్తున్నా.. లోపల మాత్రం దిగులుతో భీతిల్లుతున్నారు. పార్టీల వారీగా పరిశీలిస్తే.. ఎంఐఎం ఈసారి తమ స్థానాలను ‘పది’ వరకు పెంచుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్లినా.. తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న యాకుత్‌పురా, నాంపల్లి నియోకజవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నట్టు పరిశీలకులు అంచనా వేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో ఎంఐఎం పరిస్థితి పూర్తి సానుకూలంగానే ఉందని, ఆ పార్టీ ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న యోచన ఈ ఎన్నికల్లో పనిచేసే అంశం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చర్చోపచర్చలు
గత ఎన్నికల్లో నగరంలో మెజారిటీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ మారు గందరగోళంగానే మారిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్, గోషామహల్ స్థానాలకు ప్రాతినిథ్యం వహించిన దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ ఈమారు ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. ఖైరతాబాద్‌లో దానం, ఆయన అనుచరులు వైఎస్సార్, టీడీపీ,బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. గోషామహల్‌లో ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్, అంబర్‌పేట అభ్యర్థి హన్మంతరావులే ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడిచేయడంతో కేసులు నమోదయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులంతా ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీలో కొత్త ఆశలు..
పోలింగ్ తీరు పరిశీలించిన తర్వాత ఫలితాలు తమకు పూర్తి అనుకూలంగా ఉంటాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో ప్రస్తుతం బీజేపీకి ఒక్క స్థానమే ఉండగా, ఆ సంఖ్యను భారీ ఎత్తున పెంచుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదిపింది. టీడీపీతో పొత్తు అంశం వివాదాస్పదంగా మారినా.. తమకు ఒక ఎంపీతో పాటు ఐదుకు మించి శాసనసభా స్థానాలను గెలుస్తాన్న ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మాత్రం హైదరాబాద్ నగరంపై పెద్దగా ఆశలు పెట్టుకోకపోగా, శివారు ప్రాంతాల ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారన్న ధీమాతో ఉన్నారు.
‘గులాబీ దళం’లో హుషారు
నగరంలో పెద్దగా ఉనికి లేని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బుధవారం నాటి పోలింగ్ తీరు గులాబీ నేతల్లో హుషారును నింపింది. గ్రేటర్ పరిధిలో పలు సీట్లు గెలుచుకోవటంతో పాటు నగరంలో ఒక ఎంపీ స్థానాన్ని సైతం సాధిస్తామని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీలో జోష్..
ఒక లోక్‌సభ స్థానంతో పాటు ఏడు శాసనసభ నియోకజవర్గాల్లో తమకు అనుకూల ఫలితం వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో స్థిరపడ్డ వారితో పాటు మైనారిటీలు తమకు అండగా నిలబడ్డారని, దీంతో పార్టీ నగరంలో బలమైన శక్తిగా ఎదగటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.