విపత్తు నిర్వహణలో మహిళలు
అంతర్జాతీయంగా వారి ప్రోత్సాహాన్ని పెంచాలి
- ఏఎంసీడీఆర్‌ఆర్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
- పట్టణీకరణతో పర్యావరణానికి చేటు జరగొద్దు
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించేందుకు రూపొందిస్తున్న కార్యక్రమాల్లో అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారమిక్కడ జరిగిన ఆసియన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఏఎంసీడీఆర్‌ఆర్) సదస్సును మోదీ ప్రారంభించారు. విపత్తుల ద్వారా జరిగే నష్ట పరిహారం విషయంలో పేదలతో మొదలుపెట్టి చిన్న, మధ్యతరహా వ్యాపారులు, బహుళజాతి కంపెనీలు, రాష్ట్రాల వరకు అందరికీ సరైన న్యాయం జరిగేలా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఇందుకోసం మోదీ పదిసూత్రాల ప్రణాళికను సూచించారు. అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలు నష్ట నివారణ నిర్వహణలో భాగం పంచుకోవాలని.. ఈ విభాగంలో మహిళా నాయకత్వాన్ని, భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రోత్సహించాలన్నారు. ఏ రకమైన విపత్తు వచ్చినా ఎక్కువగా నష్టపోతున్నది మహిళలేనన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఆపద సమయాల్లో మొబైల్, సామాజిక మాధ్యమాల వినియోగంపైనా దృష్టిపెట్టాలి’ అని అన్నారు. హిందూ మహాసముద్రం సునామీ హెచ్చరిక వ్యవస్థ పూర్తిగా అమల్లోకి వచ్చిదన్న మోదీ.. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లోనూ దీని పని మొదలైందన్నారు. భారత సముద్ర సమాచార సేవా కేంద్రం ఎప్పటికప్పుడు సునామీ బులెటిన్లు విడుదల చేస్తుందన్నారు.
ఇదే వ్యవస్థ తుపాను విషయంలోనూ ముందస్తు హెచ్చరికలు చేస్తుందన్నారు. తుపాను నష్టాన్ని తగ్గించే విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను ప్రపంచమంతా గుర్తించిందన్నారు. విపత్తుల నష్టం తగ్గించడంలో పర్యావరణ మార్పులు చాలా కీలకంగా పనిచేస్తాయన్న మోదీ.. పారిస్ ఒప్పందం సరైన సమయంలో జరిగిన సరైన ఒప్పందమన్నారు. పట్టణీకరణను సరిగా నిర్వహించకపోవటం వల్ల ప్రకృతి విపత్తులు, దుర్ఘటనలు పెచ్చుమీరే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా అడుగేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 61 ఆసియా, పసిఫిక్ దేశాలు పాల్గొన్నాయి.
ఒకేసారి ఎన్నికలు వారికీ ఇష్టమే: మోదీ
పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటంపై రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా అనుకూలంగానే ఉన్నప్పటికి ప్రజల్లోకి వెళ్లేటప్పటికి స్పష్టంగా చెప్పలేకపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టులతో నిర్వహించిన దీపావళి మిలన్‌లో మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం బలవంతంగా ఈ విధానాన్ని అమల్లోకి తేలేదని.. దీనిపై చర్చ జరగాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తిస్తోందన్నారు. ఈ విషయంపై మీడియా ఏమైనా చేస్తే బాగుంటుందన్నారు.