రాజకీయ పార్టీలు అన్నాక... రకరకాల సంస్థాగత ఏర్పాట్లు ఉంటాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా అధినేత/ అధినాయకురాలి చరిష్మా పైనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దానికి భిన్నం. సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, ఎవరి స్థాయిలో వారు పూర్తి అంకితభావంతో పనిచేయడం, నిరంతరం ఏదో కార్యక్రమాలతో ప్రజలతో టచ్‌లో ఉండటం, సూక్షస్థాయి ప్రణాళికలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అండదండలు... మొత్తం మీద బీజేపీ ఓ బడా కార్పొరేట్ కంపెనీలా ఎక్కడా ఎలాంటి పొరపాట్లను తావివ్వకుండా ఎన్నికల మేనేజ్‌మెంట్ చేస్తుంది. అమిత్ షా అధ్యక్షుడిగా పనిచేసిన ఐదున్నరేళ్ల కాలంలో (జులై 9, 2014 నుంచి జనవరి 20, 2020 వరకు) ఈ కార్పొరేటీకరణను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ పార్టీ నిర్మాణం... వారి బలాలేమిటో చూద్దాం.
సోషల్ మీడియానే ఆయుధం
18 కోట్ల పైచిలుకు సభ్యులతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఆధునిక సాంకేతికను జోడించి, సోషల్ మీడియాను సంపూర్ణంగా వాడుకుంటూ బీజేపీ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రధానిగా మోదీ చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి... తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడం దాకా ఒక క్రమపద్ధతిలో కాషాయదళం సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేస్తుంది. 18 కోట్ల మంది సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో బీజేపీ దగ్గర డేటాబేస్ ఉంది. వృత్తులు, ఆసక్తుల ఆధారంగా వీరిని విభజించింది. దీని కోసం సాఫ్ట్‌వేర్‌ను వాడింది. క్షేత్రస్థాయిలో వీరిని క్రియాశీలం చేసింది.
బూత్ స్థాయిలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వారికి దిశానిర్దేశం జరుగుతుంది. మండల స్థాయిలో వీరికి క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలను... ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కార్యకర్తలకు వివరిస్తారు. వారు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పైకి తెలుస్తుంటాయి. దాంతో ఆ బూత్ స్థాయిలో దిద్దుబాటు చర్యలు, అదనపు శ్రమ పెట్టడం... వంటివి స్థానిక బాధ్యులు చేస్తుంటారు.
బీజేపీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు... ఇలా ప్రతి ఒక్కరికి వారు పోషించాల్సిన నిర్దిష్ట పాత్ర ఉంటుంది. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను బీజేపీ అభివృద్ధి చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరును మానవవనరుల విభాగం (హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్) అంచనా వేసినట్లే... చాలా పక్కాగా ఈ ఏర్పాటు ఉంటుంది.
8,000 మంది చురుకైన పూర్తి సమయపు కార్యకర్తలను... ‘పూర్ణకాలిక్ విస్తారక్స్ (పూర్తి సమయం కేటాయించి పార్టీని విస్తరించడం వీరి ముఖ్య విధి)’ను కమలదళం నియమించింది. దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున వీరు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.. పార్టీ విస్తరణకు పాటుపడతారు. పైనుంచి వచ్చే ఆదేశాలను సమర్థమంతంగా కిందికి తీసుకెళతారు. అసెంబ్లీ ఎన్నికలను పురష్కరించుకొని... 800 విస్తారక్‌లను ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే మోహరించింది. ఉత్తరాఖండ్‌కు 120 మందిని, గోవా, పంజాబ్‌లకు వందేసి మంది విస్తారక్‌లను పంపింది. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని చూసి ఈ విస్తారక్‌ల విధానాన్ని అందిపుచ్చుకుంది బీజేపీ.
ప్రతి పేజీకో... పన్నా ప్రముఖ్
దేశంలోని 10 లక్షల పైచిలుకు పోలింగ్ బూత్‌లలో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఒక ఇంచార్జి (పన్నా ప్రముఖ్)ను నియమించే కార్యాన్ని బీజేపీ చేపట్టింది. ఓటరు జాబితాలోని ఒక్కో పేజీలో 30 మంది వరకు ఓటర్లు ఉంటారు. పన్నా ప్రముఖ్ ఈ 30 ఓటర్లను లేదా తన పరిధిలోని ఐదారు కుటుంబాలను కలిసి బీజేపీకి ఓట్లు అభ్యర్థిస్తారు. తమ ప్రభుత్వాలు చేసిన పనులను వివరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఐదుగురు చొప్పున ‘పన్నా సమితు’లను వేయాలని బీజేపీ నిర్ణయించింది.
సంక్షేమ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్, నోట్ల రద్దు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, కోవిడ్ కాలంలో అదనపు రేషన్, ఆయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణం... తదితర అంశాలను ప్రజల్లోకి ఈ పన్నా సమితులు, పన్నా ప్రముఖ్‌లు తీసుకెళతారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... 2021లోనే బీజేపీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వీలుగా... దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న తరుణాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను చేపట్టింది. అలాగే సీఎం, పీఎంగా మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘సేవా హి సంఘటన్’ క్యాంపెయిన్‌ను చేపట్టింది. అలాగే ఎన్నికలు సమీపించిన తరుణంలో కొద్దిరోజుల కిందట జన ఆశీర్వాద్ యాత్రలు చేపట్టింది.
ఎన్నికలు వచ్చినపుడే ఇతర రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. సోషల్ మీడియాలో భావజాల వ్యాప్తి, బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించడం, కార్యకర్తలకు శిక్షణ... నిరంతరం కొనసాగుతాయి. నిబద్ధత, అంకితభావం కలిగిన కార్యకర్తలు బీజేపీ బలం. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్, అమలు పక్కాగా ఉంటుంది. ఈ లక్షణాలు వీరికి ఆర్‌ఎస్‌ఎస్ నుంచి అబ్బాయి. సంస్థ కోసం సర్వస్వాన్ని త్యజించి, భవబంధాలను తెంచుకొని పూర్తిస్థాయిలో దేశమంతా కలిగతిరిగే నాయకులు, ప్రచారక్‌లు ఎందరో బీజేపీకి ఉన్నారు. ఈ రకమైన నిర్మాణంతో బీజేపీ... భారత రాజకీయ యవనికపై అత్యంత బలమైన పునాదులు కలిగిన పార్టీగా ఎదిగింది. వరుసగా రెండుమార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది.
– నేషనల్ డెస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment