Training programs
-
'పాలిటెక్నిక్' లో నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దాటని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్లో పాలిటెక్నిక్ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్ఐటీలు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్ విద్యార్థులకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్వర్క్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీ ల్, ఎఫ్ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్ ఎన్ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణసాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్ అమలు చేస్తోంది. అకడమిక్ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. కళాశాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్ స్థాయి వరకు మల్టీ లెవల్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడేరు, చీపురుపల్లి, శ్రీకాకుళం, అద్దంకి, శ్రీశైలం, చోడవరం వంటి మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది. రూ.8.60 లక్షల వేతనంతో.. మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్ కంపెనీ. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది. – ఎన్.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం‘రెడీ టూ వర్క్’ లక్ష్యంతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్మెంట్లు రెట్టింపయ్యాయి. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
లక్షలాది మందిని చేర్చుకోవడం లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా కరోనాతోపాటు వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తున్న సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపై టీఆర్ఎస్ దృష్టిసారించింది. జూన్ లేదా జూలైలో ప్రారంభించి అక్టోబర్‌లోగా పూర్తి చేయాలనే యోచనలో ఉంది. లక్షలాది మంది కార్యకర్తలను చేర్చుకోవడం లక్ష్యంగా చేపడుతున్న శిక్షణ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో చేపట్టాలని భావిస్తోంది. పార్టీ కొత్త జిల్లా కార్యాలయాలు వేదికగా జరిగే శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయ బాధ్యతలు చూసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున చురుకైన నేతలను గుర్తించాలని ఆదేశించింది. వనపర్తి వంటి ఒకటి రెండు జిల్లాల్లో ఇప్పటికే సమన్వయకర్తల నియామకం పూర్తికాగా, మిగతా జిల్లాల్లో నెలాఖరులోగా నియమించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే సమన్వయకర్తల జాబితాలను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. 65 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్ఎస్లో కనీసం 40 లక్షల మందిని లక్ష్యంగా చేసుకుని శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ఉంటుందని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రస్థాయిలో శిక్షణ కార్యకలాపాల షెడ్యూల్, సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన వక్తలుగా భావజాల వ్యాప్తికి కృషి చేసిన వారితోపాటు పార్టీ ప్రస్థానం, ప్రభుత్వ కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన కలిగిన వారిని ‘రిసోర్స్ పర్సన్లు’గా ఎంపిక చేసే పనిని కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే వరంగల్, సిద్దిపేట తదితర చోట్ల జిల్లా కార్యాలయాలు ప్రారంభం కాగా, మిగతా జిల్లాల్లోనూ త్వరలో ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శిక్షణ అంశాలు, మెటీరియల్‌పై కసరత్తు కార్యకర్తలకు ఏయే అంశాలపై శిక్షణ ఇవ్వాలి, అందుకు అవసరమైన మెటీరియల్ తదితరాలపై కేసీఆర్ నిర్దిష్ట సూచనలు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ పాత్ర, అధికారంలో ఉన్న రెండు పర్యాయాల్లో రంగాల వారీగా సాధించిన అభివృద్ధి వంటి అంశాలు శిక్షణలో అంతర్భాగంగా ఉంటాయి. వీటితోపాటు రాజ్యాంగం మౌలిక అంశాలు, జాతీయ రాజకీయాలు, స్వాతంత్య్రానంతరం పాలనలో జాతీయ పార్టీలు విఫలమైన తీరు, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా వంటి అనేక అంశాలు అందరికీ సులభంగా అర్థమయ్యేరీతిలో వివరించేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లు తదితర వాటికి రూపకల్పన చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలు, ఆరోపణలు, వాటిని తిప్పికొట్టాల్సిన తీరు తదితరాలు కూడా శిక్షణలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. శిక్షణ షెడ్యూల్, ఇతర వివరాలను త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించే అవకాశముంది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రతీది పక్కాగా
రాజకీయ పార్టీలు అన్నాక... రకరకాల సంస్థాగత ఏర్పాట్లు ఉంటాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా అధినేత/ అధినాయకురాలి చరిష్మా పైనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దానికి భిన్నం. సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, ఎవరి స్థాయిలో వారు పూర్తి అంకితభావంతో పనిచేయడం, నిరంతరం ఏదో కార్యక్రమాలతో ప్రజలతో టచ్‌లో ఉండటం, సూక్షస్థాయి ప్రణాళికలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అండదండలు... మొత్తం మీద బీజేపీ ఓ బడా కార్పొరేట్ కంపెనీలా ఎక్కడా ఎలాంటి పొరపాట్లను తావివ్వకుండా ఎన్నికల మేనేజ్మెంట్ చేస్తుంది. అమిత్ షా అధ్యక్షుడిగా పనిచేసిన ఐదున్నరేళ్ల కాలంలో (జులై 9, 2014 నుంచి జనవరి 20, 2020 వరకు) ఈ కార్పొరేటీకరణను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ పార్టీ నిర్మాణం... వారి బలాలేమిటో చూద్దాం. సోషల్ మీడియానే ఆయుధం 18 కోట్ల పైచిలుకు సభ్యులతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఆధునిక సాంకేతికను జోడించి, సోషల్ మీడియాను సంపూర్ణంగా వాడుకుంటూ బీజేపీ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రధానిగా మోదీ చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి... తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడం దాకా ఒక క్రమపద్ధతిలో కాషాయదళం సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేస్తుంది. 18 కోట్ల మంది సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో బీజేపీ దగ్గర డేటాబేస్ ఉంది. వృత్తులు, ఆసక్తుల ఆధారంగా వీరిని విభజించింది. దీని కోసం సాఫ్ట్‌వేర్‌ను వాడింది. క్షేత్రస్థాయిలో వీరిని క్రియాశీలం చేసింది. బూత్ స్థాయిలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వారికి దిశానిర్దేశం జరుగుతుంది. మండల స్థాయిలో వీరికి క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలను... ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కార్యకర్తలకు వివరిస్తారు. వారు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పైకి తెలుస్తుంటాయి. దాంతో ఆ బూత్ స్థాయిలో దిద్దుబాటు చర్యలు, అదనపు శ్రమ పెట్టడం... వంటివి స్థానిక బాధ్యులు చేస్తుంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు... ఇలా ప్రతి ఒక్కరికి వారు పోషించాల్సిన నిర్దిష్ట పాత్ర ఉంటుంది. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను బీజేపీ అభివృద్ధి చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరును మానవవనరుల విభాగం (హెచ్ఆర్ డిపార్ట్మెంట్) అంచనా వేసినట్లే... చాలా పక్కాగా ఈ ఏర్పాటు ఉంటుంది. 8,000 మంది చురుకైన పూర్తి సమయపు కార్యకర్తలను... ‘పూర్ణకాలిక్ విస్తారక్స్ (పూర్తి సమయం కేటాయించి పార్టీని విస్తరించడం వీరి ముఖ్య విధి)’ను కమలదళం నియమించింది. దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున వీరు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.. పార్టీ విస్తరణకు పాటుపడతారు. పైనుంచి వచ్చే ఆదేశాలను సమర్థమంతంగా కిందికి తీసుకెళతారు. అసెంబ్లీ ఎన్నికలను పురష్కరించుకొని... 800 విస్తారక్‌లను ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే మోహరించింది. ఉత్తరాఖండ్‌కు 120 మందిని, గోవా, పంజాబ్‌లకు వందేసి మంది విస్తారక్‌లను పంపింది. ఆర్ఎస్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని చూసి ఈ విస్తారక్ల విధానాన్ని అందిపుచ్చుకుంది బీజేపీ. ప్రతి పేజీకో... పన్నా ప్రముఖ్ దేశంలోని 10 లక్షల పైచిలుకు పోలింగ్ బూత్‌లలో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఒక ఇంచార్జి (పన్నా ప్రముఖ్)ను నియమించే కార్యాన్ని బీజేపీ చేపట్టింది. ఓటరు జాబితాలోని ఒక్కో పేజీలో 30 మంది వరకు ఓటర్లు ఉంటారు. పన్నా ప్రముఖ్ ఈ 30 ఓటర్లను లేదా తన పరిధిలోని ఐదారు కుటుంబాలను కలిసి బీజేపీకి ఓట్లు అభ్యర్థిస్తారు. తమ ప్రభుత్వాలు చేసిన పనులను వివరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఐదుగురు చొప్పున ‘పన్నా సమితు’లను వేయాలని బీజేపీ నిర్ణయించింది. సంక్షేమ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్, నోట్ల రద్దు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, కోవిడ్ కాలంలో అదనపు రేషన్, ఆయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణం... తదితర అంశాలను ప్రజల్లోకి ఈ పన్నా సమితులు, పన్నా ప్రముఖ్‌లు తీసుకెళతారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... 2021లోనే బీజేపీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వీలుగా... దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న తరుణాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను చేపట్టింది. అలాగే సీఎం, పీఎంగా మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘సేవా హి సంఘటన్’ క్యాంపెయిన్‌ను చేపట్టింది. అలాగే ఎన్నికలు సమీపించిన తరుణంలో కొద్దిరోజుల కిందట జన ఆశీర్వాద్ యాత్రలు చేపట్టింది. ఎన్నికలు వచ్చినపుడే ఇతర రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. సోషల్ మీడియాలో భావజాల వ్యాప్తి, బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించడం, కార్యకర్తలకు శిక్షణ... నిరంతరం కొనసాగుతాయి. నిబద్ధత, అంకితభావం కలిగిన కార్యకర్తలు బీజేపీ బలం. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్, అమలు పక్కాగా ఉంటుంది. ఈ లక్షణాలు వీరికి ఆర్ఎస్ఎస్ నుంచి అబ్బాయి. సంస్థ కోసం సర్వస్వాన్ని త్యజించి, భవబంధాలను తెంచుకొని పూర్తిస్థాయిలో దేశమంతా కలిగతిరిగే నాయకులు, ప్రచారక్‌లు ఎందరో బీజేపీకి ఉన్నారు. ఈ రకమైన నిర్మాణంతో బీజేపీ... భారత రాజకీయ యవనికపై అత్యంత బలమైన పునాదులు కలిగిన పార్టీగా ఎదిగింది. వరుసగా రెండుమార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
స్మార్ట్‌గా నేర్చుకున్నారు
నీటి కొలనులో నుంచి పైకి ఉద్భవిస్తున్నట్లున్న నిండు చంద్రుడి పెయింటింగ్ పౌర్ణమిని డ్రాయింగ్ రూమ్‌లోకి తెచ్చినట్లుంది. ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్న రాధాకృష్ణుల చిత్రం... ఎన్నెన్నో ప్రశ్నలతో మనసును ఊపిరాడనివ్వదు. జుట్టు ముడిచుట్టిన ఆదివాసీ మహిళ చిత్రం... ఆధునికత ఫ్యాషన్ రీతులను ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. వీటితోపాటు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఆ ఇంటి గోడల మీద వచ్చి వాలాయి. అడవిలో ఎగురుతున్న జింక ఈ ఇంట్లోకి తొంగి చూడడానికి వచ్చినట్లుంది ఓ చిత్రం. వీటి పక్కనే ఒక హృదయాకారంలో ‘ఐ లవ్ యూ అమ్మా’ అనే అక్షరాలు ఆ పెయింటింగ్‌ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఈసీఐఎల్ సమీపంలోని సాయినాథపురంలోని ప్రశంస, అభిజ్ఞల ఇల్లు ఇది. ఈ బొమ్మలు వేసిన పిల్లలు అచ్చంగా పిల్లల్లాగా, స్వచ్ఛతకు ప్రతీకల్లా ఉన్నారు. ప్రశంస తొమ్మిదవ తరగతి, అభిజ్ఞ ఏడవ తరగతి. వీళ్లకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు టెక్నాలజీ. నిజమే! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తే ఈ పిల్లలిద్దరూ ఆ విరామాన్ని పెయింటింగ్ శిక్షణకు ఉపయోగించుకున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి భయపడే కోవిడ్ కాలంలో వాళ్లకు బొమ్మలు వేయడం నేర్పించడానికి ఏ గురువు కూడా ఇంటికి వచ్చే సాహసం చేయలేరు. ఏ గురువు కూడా తమ ఇంటికి శిష్యులను స్వాగతించే పరిస్థితి కూడా కాదు. అలాంటప్పుడు యూ ట్యూబ్ చూస్తూ పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. రోజుకొక పెయింటింగ్ వీడియో చూస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ పూర్తి స్థాయి చిత్రకారులైపోయారు. ఏ చిత్రానికి ఏ తరహా రంగులు వాడాలో, ఎంత మోతాదులో మిశ్రమాలను కలుపుకోవాలో కూడా నేర్చుకున్నారు. లాక్డౌన్ కాలం పిల్లల బాల్యాన్ని హరించిందని, స్తబ్దుగా మార్చేసిందని ఆందోళన పడుతుంటాం. కానీ కాలం అందరికీ సమానమే. ఎవరికైనా రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయోగపెట్టుకునే వాళ్లు, నిరర్ధకంగా గడిపేసే వాళ్లూ ఉన్నట్లే... ఈ అక్కాచెల్లెళ్లు లాక్డౌన్ కాలంలో చిత్రకారిణులుగా నైపుణ్యం సాధించారు. తోటి పిల్లలకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రశంస, అభిజ్ఞ ఫోన్ చేతికి వచ్చింది! ‘‘నేను పదవ సంవత్సరం నుంచి బొమ్మలేస్తున్నాను. స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్లలో పాల్గొన్నాను కూడా. లాక్డౌన్లో రోజంతా ఇంట్లోనే ఉండేవాళ్లం. బోర్ కొట్టేది. ఆన్లైన్ క్లాసుల కోసమని అమ్మానాన్న వాళ్ల స్మార్ట్ ఫోన్లు నాకు చెల్లికి ఇచ్చేశారు. క్లాస్‌లు అయిపోయిన తర్వాత నేను యూ ట్యూబ్ సెర్చ్ చేస్తూంటే పెయింటింగ్ క్లాసుల వీడియోలు కనిపించాయి. అప్పటి నుంచి రోజూ వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకునేదాన్ని. అక్రిలిక్ కలర్స్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్‌లో ఏ పెయింటింగ్‌కి ఏది వాడాలో వచ్చేసింది. ఈ ఏడాది కాలంగా నేను వందకు పైగా బొమ్మలు వేశాను. మధుబని, రంగోలి ఆర్ట్‌లు, రవీంద్రనాథ్ టాగూర్, స్వామి వివేకానంద పోట్రయిట్‌లు వేశాను. పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా లక్ష్యం. టెన్త్ క్లాస్ తర్వాత పెయింటింగ్ కోసం ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ చేస్తాను’’. -
హెచ్1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ
వాషింగ్టన్: దేశీయ కంపెనీల్లో నిపుణుల కొరత తీర్చేందుకు హెచ్1–బీ వీసా ఫీజు డబ్బుతో అమెరికన్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ తెలిపారు. వివిధ కంపెనీలే అమెరికన్లకు శిక్షణ ఇచ్చేలా ట్రంప్ యంత్రాంగం ‘ఇండస్ట్రీ–రికగ్నైజ్డ్ అప్రెంటిస్‌షిప్ సిస్టం’ అనే విధానం తెచ్చింది. హెచ్1బీ వీసా ఫీజు డబ్బు సుమారు రూ.688 కోట్లను కార్మిక శాఖ 30 రకాల అప్రెంటిస్ షిప్ గ్రాంట్‌గా అందజేసిందన్నారు. ఈ ఫీజును విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ, కృతిమ మేథ రంగాల్లో అమెరికన్ నిపుణులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారుల వల్లే ‘హెచ్1బీ’ జాప్యం అమెరికా వలస విభాగం విధానాల కారణంగా హెచ్1–బీ జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సుసాన్ ఎలెన్ లోఫ్గ్రెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులు ఒకసారి పంపిన వివరాలనే మళ్లీపంపాలని అడుగుతున్నారని, అనవసరమైన సమాచారం కావాలంటున్నారన్నారు. హెచ్1బీ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన ఘటనలు 2016తో పోలిస్తే 20 శాతం పెరిగాయని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్కెటా చెప్పారు. -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సోమవారం రెండవ విడత శిక్షణ, పునశ్చరణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భన్వర్‌లాల్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులకు పలు సలహా లు, సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఏఆర్ఓలు ఎలా అప్రమత్తం గా ఉండాలో వివరించారు. రిటర్నింగ్ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాల్లో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు. ఈటీపీబీఎస్ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్‌లమీద క్యూఆర్ కోడ్ వంటివి స్కాన్ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు. ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్ ట్రైనర్లు వివరించారు. సువిధ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేశారు. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవీఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్ కుమార్ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి శిక్షలు విధిస్తుందని భన్వర్ లాల్ హెచ్చరించారు. -
మట్టికి జైకొట్టి..
ఓల్డు మళ్లా గోల్డు అయింది.. మట్టి పాత్రల వినియోగం జనంలో మళ్లీ పెరిగింది.. దీంతో కుమ్మరి కొలిమిలు కళకళలాడుతున్నాయి.. అటు ప్రభుత్వమూ మట్టిపాత్రల వాడకం, కులవృత్తులకు ప్రోత్సాహాన్నిస్తుండటంతో మార్కెట్లో మట్టి పాత్రలు సందడి చేస్తున్నాయి. మట్టి పాత్రల్లో వండిన ఆహారం..పోషక విలువల గురించి ఈమధ్య అవగాహన పెరిగింది. దీంతో జనం వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకువస్తున్నారు. జిల్లాకు 30 మంది చొప్పున.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 30 మంది చొప్పున ఎంపిక చేసి వారికి హైదరాబాద్‌లోని రామానంద తీర్థ చేతి వృత్తుల సంస్థలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల మంది కుమ్మరులకు శిక్షణ అందించారు. మెషీన్ ద్వారా మట్టి పాత్రల తయారీపై శిక్షణ పొందినవారు జనం అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల పాత్రలను తయారు చేస్తున్నారు. వారికి కావాల్సిన డిజైన్లలో రూపొందించి.. మార్కెటింగ్ చేస్తున్నారు. సురాయిలు, రంజన్లు, కుండలు, గ్లాసులు, వాటర్‌బాటిళ్లు, దీపపు ప్రమిదలు, బిర్యానీ పాత్రల వంటివి వేలాది ఆకృతుల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటి ధర సైజు, నాణ్యతను బట్టి రూ.20 మొదలుకుని రూ.1,000 వరకు ఉంటున్నాయి. దేశీయ సంప్రదాయ పాత్రలు కావడంతో జనం కూడా వీటి వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ తరహా శిక్షణ కోసం గతంలో అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. మెషీన్ల ద్వారా మట్టి పాత్రలు తయారు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాయితీ కల్పిస్తున్నాం.. చేతి వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాలలో స్టాల్స్‌తో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అటు ఉపాధినీ కల్పిస్తున్నాం. పర్యావరణానికి మేలు చేసే మట్టి పాత్రల తయారీలో ప్రభుత్వం తరఫున శిక్షణ పూర్తి చేసిన వారికి రూ.2 లక్షల విలువైన తయారీ, అమ్మకాల యూనిట్‌ను రాయితీతో ఇస్తున్నాం.. అలోక్ కుమార్, బీసీ సహకార ఆర్థిక సంస్థ, కార్యనిర్వాహక డైరెక్టర్ మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి వృత్తి శిక్షణ పొందిన వారు ఉపాధి దిశగా ముందుకు సాగడానికి ప్రభుత్వం వాటికి మార్కెటింగ్తోపాటు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. కోల్‌కతా, గుజరాత్ నుంచి వచ్చే మట్టి పాత్రల రేటు ఎక్కువగా ఉంటోంది. వాటి తయారీలో కొంత మేరకు రసాయనాలు వాడతారు. వీటి ద్వారా వాటి ఫినిషింగ్‌లో తేడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ తయారు చేసే మట్టి పాత్రలు సహజసిద్ధమైన మట్టితో తయారవుతాయి. నడికుడి జయంత్‌రావు రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్ అధ్యక్షుడు -
నాలుగో వంతు ఆర్వోలు ఫెయిల్ !
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం నిర్వహించిన సర్టిఫైడ్ శిక్షణ కార్యక్రమానికి హాజరై, పరీక్ష రాసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఆర్వో)ల్లో నాలుగో వంతుకు పైగా అధికారులు ఫెయిలయ్యారు. మూడో వంతుకు పైగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు(ఏఆర్వో)లు సైతం ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ఏర్పా ట్లు, నిర్వహణ అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం గత నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు ఆర్వోలు, ఏఆర్వోల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరై పరీక్ష రాసిన 119 మంది రిటర్నింగ్ అధికారుల్లో 29 మంది, 251 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల్లో 90 మంది ఫెయిలయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రిట ర్నింగ్ అధికారులదే. వారి పరిధిలో ఉండి సహాయకులుగా ఏఆర్వోలు పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున 119 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు 251 ఏఆర్వోలను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఆర్వోలు, ఏఆర్వోలు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఎన్నికల సంఘం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండోసారి పరీక్ష నిర్వహణ ఎన్నికల కోడ్ అమలు, సెక్టోరల్ అధికారుల నియామకం, నామినేషన్ల స్వీకరణ/ పరిశీలన/ ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్/ కౌంటింగ్ పాసుల జారీ తదితర అంశాలపై స్టేట్ లెవల్ మాస్టర్ ట్రైనర్ల (ఎస్ఎల్ఎంటీ)తో ఆర్వోలు, ఏఆర్వోలకు ఎన్నికల సంఘం శిక్షణ నిర్వహించింది. శిక్షణ అనంతరం అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే ప్రశ్నపత్రంతో రెండు పార్టులతో పరీక్ష నిర్వహించింది. బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో నిర్వహించిన ఈ పరీక్షలో నాలుగో వంతు ఆర్వోలు, మూడో వంతు ఏఆర్వోలు విఫలమయ్యారు. ఫెయిలైన ఆర్వోలు, ఏఆర్వోలకు ఎన్నికల సంఘం ఆదేశాలతో గురువారం మరోసారి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఎస్ఎల్ఎంటీలతో మళ్లీ శిక్షణ నిర్వహించి రెండోసారి పరీక్ష నిర్వహించారు. రెండోసారి విఫలమైన ఆర్వో, ఏఆర్వోలను తప్పించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం అధికారవర్గాలు తెలిపాయి. నిర్మల్ జిల్లా ఆర్వోలందరూ ఫెయిల్ అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోని 15 మంది ఆర్వోల్లో ఐదుగురు, 33 మంది ఏఆర్‌వోల్లో 21 మంది, నిర్మల్ జిల్లాలోని ముగ్గురికి ముగ్గురు ఆర్వోలు, ఆరుగురు ఏఆర్‌వోల్లో నలుగురు ఫెయిలయ్యారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురిలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలోని ఐదుగురిలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లా లో ఇద్దరిలో ఒక ఆర్వో ఫెయిలయ్యారు. -
మండల సమితుల శిక్షణకు సీఎం
► ఒకట్రెండు చోట్లకు వెళ్లే అవకాశం.. ఖరారు కాని పర్యటన ► నేటితో ముగియనున్న సమితుల ఏర్పాటు.. రేపట్నుంచి శిక్షణ ► ఇప్పటివరకు 8,640 గ్రామ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: మండల రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో జరిగే శిక్షణా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా హాజరుకానున్నారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ఐదు రోజులపాటు ఇవి జరగనున్నాయి. ఒకట్రెండు కార్యక్రమాలకు సీఎం హాజరవుతారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే మండలం, తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. రైతు సమన్వయ సమితుల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలకుగాను శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 8,640 సమితులు ఏర్పాటైనట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. మండల రైతు సమాఖ్యలు ఎన్ని ఏర్పాటయ్యాయన్న సమాచారం ఇంకా సేకరించలేదు. వాస్తవంగా గ్రామ, మండల, జిల్లా రైతు సమితులన్నీ 9వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ, మండల సమితులు మాత్రమే అనుకున్న ప్రకా రం పూర్తవుతున్నాయి. జిల్లా రైతు సమన్వయ సమితులు మాత్రం ఈనెల 14 నాటికి ఏర్పా టుకావొచ్చని అధికారులు చెబుతున్నారు. పోచారం సుడిగాలి పర్యటనలు మండల రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో జరిగే శిక్షణ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు రోజుకు ఐదు చొప్పున 25 మండల రైతు సమితుల శిక్షణలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అందుకు ఆయన హెలీకాప్టర్‌లో వెళ్లనున్నారు.ఇందులో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఆయనతోపాటు వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్ కూడా వెళ్తారని సమాచారం. ఇప్పటికే మండల రైతు సమన్వయ సమితి శిక్షణల కోసం వ్యవసాయశాఖ ఒక్కో మండలానికి రూ.50 వేల చొప్పున విడుదల చేసింది. ఖర్చు ఎక్కువైతే బిల్లులు పెట్టుకునే వెసులుబాటు కల్పించింది. మండల రైతు శిక్షణలకు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేడు హైదరాబాద్‌లో 200 మందికి శిక్షణ మండల రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు వ్యవసాయాధికారులను ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు చొప్పున దాదాపు 200 మందికి శనివారం హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీరు వెళ్లి మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. వారు గ్రామ రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇస్తారు. శనివారంనాటి కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొంటారు. నేడు హైదరాబాద్‌లో 200 మందికి శిక్షణ మండల రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు వ్యవసాయాధికారులను ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు చొప్పున దాదాపు 200 మందికి శనివారం హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీరు వెళ్లి మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. వారు గ్రామ రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇస్తారు. శనివారంనాటి కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొంటారు. -
సాక్షి మైత్రి ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ
గుంటూరు : సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బుధవారం నుంచి వచ్చే నెల 9 వరకు చిలకలూరిపేటలోని న్యూ ఏంజెల్స్ బ్యూటీ క్లినిక్ ఎన్ఆర్టీ సెంటర్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది. మంగళవారం వరకు అభ్యర్థుల నుంచి శిక్షణకు రిజిస్ట్రేషన్స స్వీకరిస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు : బేబి ఫ్యాబ్రిక్, అంబ్రెల్లా ఫ్రాక్స్, శారీ పెట్టీకోట్, డ్రెస్ పెట్టీకోట్, ప్లెయిన్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్, సింగిల్ కటోరి బ్లౌజ్, స్మాకింగ్ ప్యాచ్ బ్లౌజ్, కాలర్ బ్లౌజ్, ప్యాటర్న బ్లౌజ్, నెక్ డిజైన్స, స్లీవ్ డిజైన్స, కుర్తీ, సల్వార్, సెమి పటియాల, చుడిదార్, కలీస్ డ్రెస్, లాంగ్ టాప్, మెథడ్ ఆఫ్ కటింగ్, మెథడ్ ఆఫ్ స్టిచింగ్ చేర్పిస్తారు. వివరాలకు ఫోన్ నెంబరు 9666372301లో సంప్రదించాలి. శిక్షణకు వచ్చే వారు తమ వెంట పెద్ద స్కేల్, టేప్, కత్తెర, మార్కర్, దారం రీలు, సూదులు, క్లాత్, (2మీ), న్యూస్ పేపర్సు, నోట్‌బుక్స్ పెన్ వెంట తెచ్చుకోవాలి. శిక్షణలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. -
త్వరలో రోడ్డుపైకి షీ ఆటోలు
మహిళలకు శిక్షణ ఇస్తున్న పీపుల్ వెల్ఫేర్ సొసైటీ మధురానగర్ : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అయోధ్యనగర్‌కు చెందిన పీపుల్ వెల్ఫేర్ సొసైటీ తన వంతు బాధ్యతగా పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నగర పాలక సంస్థతో కలిసి నిర్వహిస్తున్న షీ ఆటో శిక్షణ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదటి బ్యాచ్‌లో 20 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆటో డ్రైవింగ్‌తో పాటు మహిళలకు ఆపదకాలంలో ఉపయోగపడేందుకు కరాటేను కూడా నేర్పిస్తున్నారు. షీ ఆటో శిక్షణతోపాటు మహిళలకు స్వయం ఉపాధిని అందించేందుకు అవసరమైన ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, కార్ డ్రైవింగ్లలో శిక్షణ ఇవ్వనున్నామని నిర్వాహకులు వివరించారు. అవకాశాలు అందిపుచ్చుకోవాలి షీ ఆటో శిక్షణ కార్యక్రమాన్ని నగర పాలక సంస్థతో కలిసి నిర్వహిస్తున్నాం. ఆటోలలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దోపిడీల నివారణకు షీఆటోలు దోహదపడతాయి. రాత్రి పూట స్వీయ రక్షణ కోసం కరాటేను నేర్పిస్తున్నాం. అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా షీ ఆటోలు తయారు చేయించి వారికి శిక్షణానంతరం సబ్సిడీపై అందజేందుకు కృషి చేస్తున్నాం. మహిళలు పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలి. - నందిగామ శ్రీలక్ష్మి, పీపుల్స్ వెల్పేర్ సొసైటీ -
మూత‘బడి’
ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఏటా కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. అందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంతృప్తి పర్చడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో నిబంధనల ప్రకారం రేషనలైజేషన్ ద్వారా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలకు మూసివేత గండం తప్పడం లేదు. ఇలా సంవత్సరాల తరబడి చరిత్ర ఉన్న పాఠశాలలు ఎత్తివేసే ప్రమాదం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులే చెపుతున్నారు. పొంచి ఉన్న రేషనలైజేషన్ గండం... తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట పాఠశాల నిర్వహించడం ఎందుకు ? అందుకోసం ఉపాధ్యాయులను, నిధులను కేటాయించి ప్రయోజనం ఏమిటి..? అని ప్రభుత్వం ఆలోచించింది. దీంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల జాబితాను తయారు చేసి పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2013-14 విద్యాసంవత్సరంలో విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు 9, 1 నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 297, ప్రాథమికోన్నత పాఠశాలు 4, 21నుంచి 40 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 862, ప్రాథమికోన్నత పాఠశాలలు 37 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక 75 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 12 ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వం ఇటీవల సూచన ప్రాయంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 20 మంది లోపు విద్యార్థులు ఉన్న పీఎస్‌లు, 6,7 తరగతులు కలిపి 40 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీఎప్లు, 75 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న హైస్కూళ్లు, సక్సెస్ స్కూళ్లను మూసివేయనున్నట్లు తెలిసింది. ఇదే అమలైతే జిల్లాలో సుమారు 600 ప్రభుత్వ పాఠశాలకు మూసివేత గండం ఉండే ప్రమాదం నెలకొంది. ఉపాధ్యాయుల్లో ఆందోళన... రేషనలైజేషన్ గండంతో జిల్లాలో పలు పాఠశాలలు మూసివేతకు దగ్గరలో ఉండటంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో అందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర వంటి పట్టణాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు అయా ప్రాంతాలకు హెచ్ఆర్ఏ ఉండటం, రవాణా ఇబ్బందులు లేకపోవడంతో సాధ్యమైనంత వరకు ఆ పాఠశాలల్లోనే ఉండాలని పలువురు ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు. అయితే పలు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి బదిలీ తప్పదని ఆందోళన చెందుతున్నారు. కొద్దొగొప్పో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను బతిమిలాడి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు స్థానిక అధికారుల సహకారంతో రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు రేషనలైజేషన్ ద్వారా మరో 800 ఉపాధ్యాయుల పోస్టులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి: డీఈవో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోబోమని డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం డైస్ ప్రకారం జాబితాను తయారు చేశామని, ప్రస్తుత పరిస్థితి చూసి విద్యార్థుల సంఖ్యలో తప్పులుంటే సరిదిద్ది పంపాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. -
‘గ్లేజ్’ గేమ్
మరో గొలుసుకట్టు వ్యాపారం * మోసం చేసిందని పలువురి ఆందోళన * పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కరీంనగర్ క్రైం : ఢిల్లీ కేంద్రంగా గ్లేజ్ ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీల పేరుతో కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లిలో ఓ కార్యాలయం ప్రారంభించారు. వీటిలో ఉద్యోగాలున్నాయని పలువురు విద్యార్థులను ఆకర్షించారు. వీరిని నగరంలోని వావిలాలపల్లిలో ఓ కాంప్లెక్స్‌లో వసతి కల్పించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్లేమా కంపెనీ ఉత్పత్తులను విక్రయించాలని చెప్పి ప్రతీ ఒక్కరికి ఓ కిట్ అందించారు. దీనికి గాను ఒక్కొక్కరి వద్ద రూ.7,800 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌తోపాటు పలు జిల్లాల నుంచి 2,500 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. మొదట జాయిన్ అయిన వారు... వారి కింద ఎంత మంది జాయిన్ అవుతారో ఆ ప్రకారం పైనున్న వారికి వివిధ హోదాలు కల్పించారు. పైస్థాయిలో ఉన్నవారికి పెద్దమొత్తంలో కమీషన్లు వస్తున్నాయని నమ్మించి పలువురిని చేర్పించారు. చైన్ సిస్టమ్ అని చెప్పకుండానే సదరు వ్యక్తుల కింద ఎంత మంది చేరితే అంత హోదా పెరిగి కమీషన్ పెరుగుతుందనేలా సృష్టించారు. ఇలా 8 నెలలుగా వీరికి శిక్షణ సాగింది. ఇప్పటివరకు చాలామందికి ఎలాంటి సొమ్ము చెల్లించలేదు. వివిధ రకాల శిక్షణ అంటూ తమను తిప్పించుకుని ఎలాంటి వేతనాలు ఇవ్వకపోవడంతో కంపెనీ తమను మోసం చేసిందని కొందరు ఆరోపించారు. తమ నుంచి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉత్పత్తుల అమ్మకాలకు పంపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో మొదట చేరిన వారు తమకు వేలల్లో వేతనాలు వస్తున్నాయని, కంపెనీలో ఎలాంటి మోసం లేదని పేర్కొనడం గమనార్హం. తమకు తెలియకుండానే చైన్ సిస్టమ్‌లో ఇరికించారని వరంగల్ జిల్లా గూడూరు మండలం అపారిపల్లికి చెందిన గోవర్ధన్, శ్రీకాంత్ ఆరోపించారు. తమకు ఇచ్చిన కిట్ అమ్ముకుంటే తాము పెట్టిన డబ్బులు తిరిగివస్తాయని చెప్పారని, కానీ, ఆ ఉత్పత్తులను ఎవరూ కొనడం లేదని తెలిపారు. ఒక్కో సబ్బు రూ.48, షాంపూ రూ.145 ఉందని... ఇలాంటి వాటిని ఎవరు కొంటారని వాపోయారు. శనివారం నగరంలోని వావిలాలపల్లిలో విద్యార్థులు నివాసముంటున్న కాంప్లెక్స్‌లో కొందరు నిరసన వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. సమాచారమందుకున్న త్రీటౌన్ సీఐ స్వామి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రధాన కార్యాలయం తీగలగుట్టపల్లిలో ఉండడంతో బాధితులను రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమకు వేతనాలతో మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి కంపెనీ మోసం చేసిందని గోవర్ధన్, శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.