ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఏటా కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. అందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంతృప్తి పర్చడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో నిబంధనల ప్రకారం రేషనలైజేషన్ ద్వారా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలకు మూసివేత గండం తప్పడం లేదు. ఇలా సంవత్సరాల తరబడి చరిత్ర ఉన్న పాఠశాలలు ఎత్తివేసే ప్రమాదం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులే చెపుతున్నారు.
పొంచి ఉన్న రేషనలైజేషన్ గండం...
తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట పాఠశాల నిర్వహించడం ఎందుకు ? అందుకోసం ఉపాధ్యాయులను, నిధులను కేటాయించి ప్రయోజనం ఏమిటి..? అని ప్రభుత్వం ఆలోచించింది. దీంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల జాబితాను తయారు చేసి పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2013-14 విద్యాసంవత్సరంలో విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు 9, 1 నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 297, ప్రాథమికోన్నత పాఠశాలు 4, 21నుంచి 40 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 862, ప్రాథమికోన్నత పాఠశాలలు 37 ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇక 75 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 12 ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వం ఇటీవల సూచన ప్రాయంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 20 మంది లోపు విద్యార్థులు ఉన్న పీఎస్‌లు, 6,7 తరగతులు కలిపి 40 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీఎప్‌లు, 75 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న హైస్కూళ్లు, సక్సెస్ స్కూళ్లను మూసివేయనున్నట్లు తెలిసింది. ఇదే అమలైతే జిల్లాలో సుమారు 600 ప్రభుత్వ పాఠశాలకు మూసివేత గండం ఉండే ప్రమాదం నెలకొంది.
ఉపాధ్యాయుల్లో ఆందోళన...
రేషనలైజేషన్ గండంతో జిల్లాలో పలు పాఠశాలలు మూసివేతకు దగ్గరలో ఉండటంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో అందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర వంటి పట్టణాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు అయా ప్రాంతాలకు హెచ్‌ఆర్‌ఏ ఉండటం, రవాణా ఇబ్బందులు లేకపోవడంతో సాధ్యమైనంత వరకు ఆ పాఠశాలల్లోనే ఉండాలని పలువురు ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు.
అయితే పలు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి బదిలీ తప్పదని ఆందోళన చెందుతున్నారు. కొద్దొగొప్పో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను బతిమిలాడి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు స్థానిక అధికారుల సహకారంతో రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు రేషనలైజేషన్ ద్వారా మరో 800 ఉపాధ్యాయుల పోస్టులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది.
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి: డీఈవో
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోబోమని డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం డైస్ ప్రకారం జాబితాను తయారు చేశామని, ప్రస్తుత పరిస్థితి చూసి విద్యార్థుల సంఖ్యలో తప్పులుంటే సరిదిద్ది పంపాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
మూత‘బడి’
Published Wed, Sep 17 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
Advertisement
Advertisement