ఖమ్మం : నెలనెలా వేతనాలు తీసుకుంటూ పాఠశాలలకు డుమ్మా కొడుతున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల భరతం పట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సక్రమంగా బడికి వెళ్లడం లేదని తరచూ ఫిర్యాదులు రావడం, దీనిపై స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఉపాధ్యాయుల హాజరుపై అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారని సమాచారం. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు శాతం ప్రతిరోజు ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన విద్యాశాఖ...
‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని.. ప్రభుత్వ పాఠశాలలు అంటే చులకనేమీ కాదు.. ఇక్కడ కూడా అర్హత గల ఉపాధ్యాయులే ఉన్నారు.. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు’ అని కలెక్టర్ ఇలంబరితి ఇటీవల విద్యాశాఖ అధికారుల సమావేశంలో, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలోనూ ప్రస్తావించారు. సెలవులో ఉంటే హాజరుపట్టికలో ఉదయమే సీఎల్ పెట్టాలని, సాయంత్రం వరకు సెలవు పత్రాన్ని చూపిస్తూ ఉంచడం నేరమని హెచ్చరించారు.
దీంతోపాటు ఇటీవల డీఈవోతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయుల హాజరు విషయంపై ప్రత్యేక శ్రద ్ధ పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ అధికారులు.. బడికి వెళ్లకుండా హాజరు వేయించుకుంటున్న ఉపాధ్యాయుల గుట్టు రట్టు చేసేలా కసరత్తు చేస్తున్నారు.
ఆన్‌లైనల్‌లో హాజరు నమోదు...
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు వివరాలు ప్రతిరోజు సేకరించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆన్‌లైన్ ద్వారా స్కూల్ కాంప్లెక్స్‌లకు హాజరు నమోదు వివరాలు చేరవేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మండల విద్యాశాఖ, ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు సాయంత్రానికి హాజరు వివరాలు వస్తాయి. దీనిపై నిజనిర్ధారణ చేసేందుకు కూడా కట్టుదిట్టమైన ప్రణాళికతో విద్యాశాఖ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రతిరోజు సేకరించిన హాజరు పట్టికతోపాటు, ప్రతినెలా ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసి.. ఉపాధ్యాయుల హాజరు వివరాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల ద్వారా సేకరించిన వివరాలతో సరిచూస్తారు. దీంతో పాఠశాలకు రాకుండా హాజరు వేయించుకున్న ఉపాధ్యాయుడు, అందుకు సహకరించిన ఇతర ఉపాధ్యాయుల గుట్ట రట్టు అయ్యే అవకాశం ఉంది.
స్కూల్ విజిట్ రిపోర్టులో హాజరుకు ప్రత్యేక కాలం...
స్కూల్ కాంప్లెక్స్ అధికారి, ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవోలతోపాటు, సర్వశిక్ష అభియాన్ అధికారులు తరుచూ చేసే స్కూల్ విజిట్‌లో కూడా ఉపాధ్యాయుల హాజరు విషయంపై ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి విద్యార్థులను, తల్లిదండ్రులను, ఇతర సిబ్బంది ద్వారా వివరాలు సేకరించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటి వకరు పాఠశాల సందర్శన సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, బడి బయట ఉన్నవారి సంఖ్య, పాఠశాలకు మంజూరైన నిధుల వినియోగం, టాయిలెట్స్, తాగునీటి వసతి, కంప్యూటర్ల పనితీరు, విద్యుత్ సౌకర్యం, బోధనోపకరణాల వినియోగం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిన తీరుపై పరిశీలించేవారు.
ఇక ఇప్పుడు ప్రత్యేకంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, వారిలో క్రమం తప్పకుండా హాజరయ్యే ఉపాధ్యాయులు, తరుచూ సెలవు పెట్టే ఉపాధ్యాయుల వివరాలను సేకరించేలా ఫార్మాట్ తయారు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు చెపుతున్నారు.
బడిదొంగల ఆటకట్టు !
Published Thu, Sep 11 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement