ప్రశాంతంగా టెట్
- పేపర్-1కు 87.10 శాతం,పేపర్-2కు 91.83 శాతం హాజరు
- నిజామాబాద్ జిల్లాలో అత్యధికం,రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప హాజరు
- నేడు ‘కీ’ విడుదల చేయనున్న విద్యా శాఖ
- {పశ్నలు తేలిగ్గా ఉన్నాయంటున్న అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా శాఖ ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. పేపర్-1పరీక్షకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు. పేపర్-2 పరీక్షకు 2,74,339 మందికి గాను 2,51,924 మంది(91.83 శాతం) హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక హాజరు శాతం, రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప హాజరు శాతం నమోదైంది. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అరగంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పిన అధికారులు ముందుగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి కూడా అనుమతించలేదు. దీంతో మండుటెండలో పరీక్ష కేంద్రం బయటే నిల్చోవాల్సి వచ్చిందని కొందరు అభ్యర్థులు, వారి వెంట వచ్చిన వారు వాపోయారు. ప్రైవేటు పాఠశాలల బంద్ కారణంగా టెట్‌ను వాయిదా వేసిన విద్యా శాఖ ఈసారి పరీక్ష కేంద్రాలను అభ్యర్థుల నివాస ప్రాంతాలకు దూరంగా కేటాయించడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించడంతో ఆయా కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందుల వసతులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటున్నారు. అలాగే, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించని అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సారి ప్రశ్నలు చాలా తేలిగ్గా వచ్చాయని, ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని పరీక్షలు రాసి వచ్చిన అభ్యర్థులు పేర్కొన్నారు. కాగా, సోమవారం ప్రశ్నపత్రం కీని విద్యా శాఖ విడుదల చేయనుంది.